"చెప్పండి" విసుగును దాచుకుంటూ అన్నాడు డి.యస్.పి. విశాల్.
"నేను భరద్వాజగారింట్లో వుంటాను. ఆయన పెంపుడు కొడుకుని."
"ఏ భరద్వాజ?"
"అక్షయ గ్రూప్ చైర్ మెన్."
విశాల్ ఆ మాట వినగానే కాస్త ఎలర్ట్ అయ్యాడు. కొంచెం ముందుకి వంగడం కన్నా తన అనుభూతిలోని మార్పుని మరో రకంగా బయటికి తెలియనివ్వలేదతను.
"ఆఁ.... చెప్పండి."
"సార్ అపాయంలో వున్నారని నా అనుమానం."
"చూడండి మిష్టర్....""హబీబ్ నా పేరు."
"మిస్టర్ హబీబ్.... మా డిపార్ట్ మెంట్ లో అనుమానాలకి తావు ఎక్కువే అయినా కావలసినంత పునాది లేందే మేమా కాలాన్ని వృధా చేయడం మంచిది అనుకోము."
"ఇది కేవలం అనుమానం కాదు సర్. నా నమ్మకం."
"మీరెవరన్నారు?"
"వాళ్ళింట్లోని ఓ వ్యక్తిని. నన్ను భరద్వాజగారే పెంచారు."
సాలోచనగా అతనివంక చూశాడు విశాల్. తరువాత ఫోన్ పైకి తన చెయ్యి పోనివ్వడం గుర్తించాడు హబీబ్.
"ఎవరికి ఫోన్?"
"మీ....సర్ కి."
"నేను మీ దగ్గరికి వచ్చిన విషయం ఆయనకి తెలీదు."
విశాల్ కనుబొమలు పైకి లేచాయి.
"ఓ....ఐసీ....ఆయన కెందుకని తెలీదో?" ఎంత వద్దనుకున్నా అతని గొంతులో వ్యంగ్యం ధ్వనించింది.
"అసలు తను అపాయంలో వున్నానన్న అనుమానం ఆయనకి లేదుగనుక నేను చెప్పలేదు."
"ఓ.కే. మిస్టర్....పూర్తిగా వివరాలు చెప్పండి."
హబీబ్ చెప్పాడు, తాను ఏ రకంగా ఆ ఇల్లు చేరిందీ, భరద్వాజ తనను ఏ రకంగా పెంచిందీ, శృతి ఎవరైనదీ అంతా చెప్పాడు.
"నాకు మొదటే అనుమానం కారాక్సిడెంట్ తో వచ్చింది సార్" అన్నాడు చివర్న.
"ఆపకుండా జరిగిందంతా చెప్పు!"
మళ్ళీ విశాల్ గొంతులో కాస్త విసుగు ధ్వనించింది.
కార్లో భరద్వాజ బయలుదేరాల్సింది, శ్రీధరం, చౌదరి ఎలా వెళ్ళిందీ. ఎలా ఏక్సిడెంటయిందీ, చౌదరి మరణం, శ్రీధరం ఆసుపత్రి పాలుకావడం అంతా చెప్పాడు హబీబ్.
"ఆరోజే నాకు అనుమానం వచ్చింది సర్. ఇంతకు ముందు మీ డిపార్ట్ మెంట్ కి చెందిన మదన్ కుమార్ గంగూలీ గారితో ప్రేమలో పడి భరద్వాజగారికి ఇష్టంలేకపోవడంతో పెద్ద గొడవ జరిగింది. మదన్ గారు డైవోర్సీ కావడం, ఆయన బాక్ గ్రౌండ్ సార్ కి నచ్చకపోవడం అందుకు కారణాలు. దాన్ని తనమీద ఆయన చేసే అజమాయిషీ అనుకుంది శృతి. తిరిగి ఈ మధ్య అక్షయలోనే పనిచేస్తున్న 'సాగర్'తో తిరుగుతున్నట్టు నాకు ఖరాఖండీగా తెలుసు. ఆరోజు__"
"సాగర్__అదే సాగరే అన్నావూ_"
ఏకవచనంలోకి దిగిపోయాడు విశాల్ ఇదంతా సోదిలా అనిపించడంతో.
"అతనితో తిరుగుతున్నట్టు నీకెలా తెలుసు__?" అని కాస్త వత్తి.
"ఖరాఖండీగా" అన్నాడు విశాల్.
"రెండుసార్లు అనుకోకుండా చూశాను వారిని. అఫ్ కోర్స్__ఇప్పుడు నాకది ఋజువైపోయింది, మొన్న రెస్ట్ తీసుకుంటున్న సార్ ని వదిలి శృతి బయటికి వెళ్ళింది" ఆరోజు తనని బలవంతంగా ఎలా శృతి మార్కెట్ కి పంపిందీ, తరువాత తాను తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడం తాను ఇల్లంతా చూడ్డం చెప్పి ఆగాడు హబీబ్.
"అయితే?" విశాల్ కాస్త కుతూహలంగా ప్రశ్నించాడు.
హబీబ్ గొంతు సర్దుకున్నాడు.
"నేను వచ్చేసరికి మెయిన్ తలుపు తెరిచి వుంది."
"శృతి తలుపు లాక్ చేసి వుండకపోవచ్చుగా?"
"భరద్వాజ గాఢంగా నిద్రపోతున్నారు."
"ఆయన స్పీలిమ్గ్ పిల్స్ వాడతారుగా."
"డే టైమ్ లో కాదు__పోన్లెండి. అదొదిలేయండి_ ఆయన తల అసహజంగా వుంది. దిండు ఒకటి ప్రక్కన పడి వుంది."
"నిద్రలో దిండు చేయి తగిలి పడివుండవచ్చు."
"ఇదంతా ఒక ఎత్తు."
"అయితే_"
"ఇది నాకు మంచం ప్రక్కనే దొరికింది" కర్చీఫ్ అందించాడు.
"సాగర్ తో ఆయనకు ఇంట్లో పనులుండవ్. పైగా ఎవరయినా ఆఫీస్ వాళ్ళు వచ్చినా ఆఫీసు గదిలో మాట్లాడుకుంటారు. అందుకని సాగర్ ఆ రోజు ఆ టైమ్ కి మా యింటికి రావలసిన అవసరము ఏమిటి?"
"ఇది శృతి చేతి నుండి జారి వుండవచ్చు"
"ఎంబ్రాయిడరీలో తన పేరు తర్వాత తేదీ కూడా వేసింది సార్ ఆమె. యిది సంవత్సరం క్రితంది. ఒక్క సంవత్సరము పాటు ఆమె దాన్ని సాగర్ కు యివ్వకుండా తన దగ్గరే దాచుకుంటుందంటారా?"
* * * *
అంకిత సాగర్ ఇంటి ముందు ఆగేసరికి సరిగ్గా ఏడయింది సమయం.
ఆటోని పంపేసి లోపలికి అడుగుపెట్టి వాకిలి తలుపు దగ్గరే ఆగిపోయింది. తలుపుకు తాళం వ్రేళ్ళాడుతోంది. ఆమె విజయవాడ నుండి తిరిగి వచ్చి రెండు రోజులయ్యింది. అంత హఠాత్ గా దాదాపు రెండు నెలల తర్వాత ఆమె సాగర్ ఇంటికి రావటానికి కారణం_ ఆరోజు సాయంత్రం ఆఫీసుకు ఆమెకు ఓ ఫోన్ కాల్ రావడం.
ఫోన్ ఎత్తగానే ఓ గొంతు_ "మీ స్నేహితుడు సాగర్ కోరి ప్రమాదంలో యిరుక్కుంటున్నాడు. రక్షించుకోగలిగితే రక్షించుకోండి" అంది.
లీలగా సంగీతం విన్పిస్తోంది రేడియోలో నుండి.
అంకిత ఫోన్ క్రెడిల్ చేసింది.... కనీసం 'ఎవరు మాట్లాడేది' అని కూడా అడక్కుండా సాగర్ ప్రమాదం అన్న మాటలు వినగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.