Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 27

ఒక్కసారిగా కంపించింది స్వప్న. "దయ్యాలూ, పిశాచాలూ అనకు! నాకు భయం" అంది హీన స్వరంతో.
"సారీ! జీపుని ఇక్కడ వదిలేసి నడిచి వెళ్ళడం తప్ప మనకు వేరే మార్గం లేదు. జీపులో ఉన్న సామానులు అందరం తలొకటీ మొయ్యాలి" అన్నాడు సందీప్.
ఏదో బండ బూతుమాట ఒకటి అన్నాడు భూతాలరాజు.
వీపుకి తగిలించుకోవడానికి వీలుగా వుండే కేన్వాస్ సంచులు మూడు ఉన్నాయి. జీపులో ఉన్న సామానులలో అత్యవసరమైన వాటిని మాత్రం వాటిలో సర్ది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంచీని తగిలించుకున్నారు.
అన్నిటిలోకీ బరువైన సంచీని తన భుజాన వేసుకున్నాడు భూతాలరాజు.
అది చూసి, "తెలివైనవాడు!" అన్నాడు సందీప్ స్వప్నతో.
"ఏం ?"
"అది ఆహారపు పదార్థాలున్న సంచీ, ఆకలేస్తే బొక్కుతూ ఉండొచ్చు. పైగా, మనం ఒక్కొక్క రోజూ భోజనాలు పూర్తిచెసినప్పుడల్లా ఆ సంచీ బరువు తగ్గుతూ ఉంటుంది. అదయి ఉంటుంది ప్లాను!"
"ఉండు! ఉండు!" అంది స్వప్న, కనుబొమలు ముడేసి ఆలోచిస్తూ. "ఈ జోకు కూడా కాపీదే! చిన్నప్పుడు ఈసప్ కథలు చదివి ఉంటావ్! అవునా?"
విషాదంగా మొహం పెట్టాడు సందీప్. "ఇలా నేను ప్రతి జోకునీ మీరు ఖండ ఖండాలుగా చీల్చి చెండాడేస్తూ ఉంటే మీతో మాట్లాడడం కష్టమే!"
"మాట్లాడమని ఇక్కడెవరూ బతిమాలి భంగపడటం లేదు."
"ఎంత వద్దనుకున్నా మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ఇదేం మాయో! బహుశా ఆకాశంలో ఉన్న శక్తి ఏదో నన్ను ప్రేరేపిస్తోందనుకుంటాను." అని సరదాగా కన్ను గీటాడు సందీప్.
చిరునవ్వు పెదిమల కింద తొక్కి పెడుతూ, యధాలాపంగా ఆకాశంవైపు చూసింది స్వప్న, వెంటనే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
ఆమె ప్రవర్తన గమనించి సందీప్ కూడా చూశాడు.
బూజు బూజుగా ఉన్న కాంతితో, ఆకాశంలో కనబడుతోంది తోకచుక్క.

                                             ముసలబ్బాయ్

భూతాలరాజులో ఇదివరకు అంతర్గతంగా ఉన్న వికారం ఇప్పుడు ఉధృతంగా బయటపడుతోంది. అతనికి యాభై అయిదేళ్ళకు తక్కువ ఉండవు. హఠాత్తుగా, పాతికేళ్ళ కుర్రాడిలా ప్రవర్తించడం మొదలెట్టాడు అతను. ఏదో ఒక కారణం కల్పించుకుని స్వప్నని తాకడం, వెకిలిగా నవ్వడం ప్రారంభించాడు.
ఒళ్ళు మండుతోంది స్వప్నకి. చూసి, చూసి ఇంక ఉండబట్టలేక సందీప్ తో అన్నది. "ఈ అడవిలో దురదగుంట ఆకులూ, ముళ్ళచెట్లూ చాలా ఎక్కువ ఉన్నట్లున్నాయ్!" అని భూతాలరాజువైపు అసహ్యంగా చూసి, "వాటి ఆకులో, ముళ్ళోగానీ మాటిమాటికీ గుచ్చుకుంటున్నాయ్! ఒళ్ళు భగభగ మండిపోతోంది" అంది.
సందీప్ వెగటుగా భూతాలరాజు వైపు చూశాడు. "ఏయ్ ముసలబ్బాయ్! పళ్లెలా ఉంది? వెకిలి వేషాలేశావంటే కాళ్ళూ చేతులూ కట్టి ఎండుగడ్డిలో పడేసి తగలబెట్టెయ్యగలను జాగ్రత్త!" అన్నాడు.
"ఈ అమ్మాయి నన్ను అకారణంగా అపార్థం చేసుకుంటోంది" అని భారీ డైలాగు ఒకటి వల్లించి, దూరంగా జరిగి కూర్చున్నాడు రాజు.
కానీ అతని వాలకం మారలేదు. గంట గంటకూ అతని చేష్టలు మరీ వికృతంగా దుర్భరంగా అవుతూ ఉండడం గమనిస్తూనే ఉన్నాడు సందీప్. కోపాన్ని నిగ్రహించుకోవడం కష్టమనిపిస్తోంది అతనికి.
పొద్దువాలి, కొంచెం చల్లబడుతూ ఉండగా, 'ఇక్కడ మజిలీ చేద్దాం ఇవాళ్టికి" అన్నాడు. అక్కడ దట్టమైన చెట్ల మధ్య కొంతమేర బయలు ప్రదేశంలా ఉంది. ఒక వైపున కొండమీద నుంచీ చిన్న జలపాతం పడుతోంది. సరస్సులా నిలిచాయి నీళ్ళు.
దిగులుగా కూర్చుంది స్వప్న. ఆమె మొహం వాడిపోయి ఉంది. నిద్రలేమి వల్ల కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.
ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు చీకటి పడుతున్నకొద్దీ మనసు కొంచెం దిగులుగా అవుతుంది చాలామందికి. అడవిలో, ముక్కూ, మొహం తెలియని మొగాళ్ళతో ప్రయాణం చేస్తున్న స్వప్న మానసికస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగాడు సందీప్. జాలి వేసింది అతనికి.

 Previous Page Next Page