Previous Page Next Page 
సీతాచరితం పేజి 28


    ఇంద్రుడు అహల్యతో రమించాడు. ఆశ్రమం దాటి వెళ్లిపోతున్నాడు. అప్పుడు గౌతముడు ఎదురైనాడు. మనిషి వేషంలో ఇంద్రుని కనిపెట్టాడు. జరిగింది గ్రహించాను "చేయరాని పని చేశావు వెధవా! వృషణ హీనుడనై పో!" అని శపించాడు. ఇంద్రుని వృషణాలు డుళ్లిపోయాయి.


    ఇంద్రుని శపించాడు ఐనా గౌతమునికి కోపం తగ్గలేదు. అహల్య దగ్గరికి వెళ్లాడు. "దౌర్భాగ్యురాలా! అకార్యం చేశావు. కాబట్టి తిండిలేక గాలిమేస్తూ బూడిదలో పడి తపస్సు చేస్తుండు" అని శపించి, "రామునికి అతిథి సత్కారం చేసినప్పుడు పరిశుద్ధమవుతావు. అప్పటిదాకా నిన్ను కల్సుకోను" అని శాపాంతం కూడ చెప్పి హిమాలయం మీదికి వెళ్లిపోయాడు.


    విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఈ కథ చెప్పాడు. వారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లాడు. అక్కడ వారికి అహల్య కనిపించింది. ఆమె మంచు కప్పిన చంద్రప్రభలా వుంది. నీటి మధ్యన ప్రకాశించే సూర్యునిలా వుంది. రామలక్ష్మణులు అహల్య పాదాలంటి మొక్కారు. అహల్య రామునిపాదాలంటి పూజించింది. అంతటితో శాపాంతం అయింది. గౌతముడక్కడికి వచ్చేశాడు. అహల్య గౌతములు రాముణ్ణి ఉచితరీతిని పూజించారు.


    అహల్య అనే విషయం బాలకాండలో చెప్పబడలేదు. రామునిపాదం తాకగానే బండ స్త్రీగా మారిందనే, ప్రచారంలో ఉన్న కథ ఈ కాండలో లేదు. అంటే రామకథను గురించి ప్రచారంలో ఉన్న అనేక అద్భుతాలు వాల్మీకి రామాయణంలో లేవనే విషయం స్పష్టమవుతుంది. ఈ చిన్న అహల్య కథలో ఎంతో అంతమాత్రంచేత అహల్య నేరం చేసింది కాలేదు.


    ఒక దురాలోచన కార్యరూపం ధరించినపుడు అది నేరం అవుతుంది. దురాలోచన లేని కార్యం సంపూర్ణం నేరం కాబోదు. దురాలోచనతో కూడుకున్న పనియొక్క ఫలితం నేరమవుతుంది. అహల్యకు ఇంద్రునిమీద మనస్సయింది. ఇంద్రుడు వచ్చాడు. ఆమె అతనితో రమించింది. ఇక్కడ నేరం సంపూర్ణమైంది. అంటే దురాలోచన వుంది. ఆ కార్యం జరిగింది.


    ఈ జరిగిన అకార్యానికి ఇద్దరు బాధ్యులు. ఒకడు ఇంద్రుడు, రెండవది అహల్య. వీరిద్దరికి శిక్ష విధించాల్సిన అవసరం వున్నది. శిక్ష ఎప్పుడు విధించగలం? నేరం రుజువైనప్పుడు. ఇంద్రుడు-అహల్య ఇద్దరు గౌతమునికి పట్టుబడ్డారు. వారిద్దరికి శిక్ష విధించాలి.


    ఇంద్రుడు వృషాణాలుండటం వల్ల నేరం చేయగలిగాడు. కాబట్టి అతన్ని వృషణహీనున్ని చేశాడు. రెండవది అహల్య. ఆమెకు శిక్ష విధించాలి.


    "వినాగర్భం నవర్ణేషు, నత్యాజ్యా గమనాత్ స్త్రియః"


    అన్నాడు యాజ్ఞవల్కుడు. సవర్ణులతో సంగమం జరిపిన స్త్రీ గర్భవతి కాకుంటే వదిలి వేయరాదంటున్నాడు.


    ఇంద్రుడు, గౌతముడు ఒకే వర్ణం కలవారు. అంటే బ్రాహ్మణులు, కాబట్టి వదలివేయరాదంటున్నారు. అహల్య గర్భవతి అయింది లేనిది ఎలా తెల్సు? అంటే దేవతలకు సంతానం కలుగురాదని ఉమ శాపం పెట్టింది. అందువల్ల ఇంద్రునికి గర్భం చేసే శక్తిలేదు. అందువల్ల ఆమెను వదలివేయడానికి వీలులేదు. ఇక చేయవల్సిందేమంటే శిక్ష విధించడమే. ఈ శిక్షకూడ యజ్ఞవల్క్యుడు చెప్పాడు.


    "భూమౌచ భస్మశయనం, దానం భోగ విసర్జితమ్".


    భూమిమీద బూడిదలో పడుకోవడం, దానధర్మాలు, విసర్జించడం శిక్షగా చెప్పాడు.


    గౌతముడు అహల్యకు సరిగ్గా ఆ శిక్షనే విధించాడు. ఇకబోతే శిక్షకు కాలపరిమితి వుండటం అవసరం. అవధిలేని శిక్షను శిక్షాస్మృతి అంగీకరించదు. గౌతముడు విధించిన శిక్షాకాలం రాముడు వచ్చేంతవరకు. అంటే అంతకాలం ఆమె శిక్షలో వుందని అర్థం.


    రాముడు వచ్చాడు. అంటే శిక్షాకాలం పూర్తయిందన్నమాట. నేరస్తుణ్ణి శిక్షిస్తారు. అతని శిక్షాకాలం అయిపోతే అతడు మామూలు మనిషవుతాడు. అతనికి మళ్లీ అన్ని హక్కులూ వచ్చేస్తాయి. అలాగే అహల్యకు శిక్షాకాలం ముగిసింది. కాబట్టి ఆమె మామూలు మనిషయింది. అప్పుడు గౌతముడు వచ్చాడు. ఆమెను పరిగ్రహించాడు.


    ఒకనితో సంభోగించిన పెండ్లాన్ని మళ్లీ పరిగ్రహించడం, ఈనాడు మనకు విడ్డూరంగా తోచవచ్చు. ఉత్తర రామాయణం కథ అంతా ఈమాట మీదేగా నడిచింది. ఐతే అది గౌతమునినాటి ఆచారం.


    మనం ఆచారాలను పరిశీలించేప్పుడు అవి ఏనాటివో, ఆనాటి పరిస్థితుల్లో వాటిని పరిశీలించాలి. అందాక ఎందుకూ? మొన్నటిదాక పదిమందిని కన్నతల్లిని అదృష్టవంతురాలు అన్నారు. ఈనాటి విషయం మనందరికి తెల్సిందే. ఆచారాలు ఆయా కాలాలను బట్టి అలా మారుతుంటాయి.

    
    సీతమ్మ పెండ్లి:


    విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడా గౌతముని ఆశ్రమం నుంచి బయలుదేరారు. మిధిలానగరం చేరుకున్నారు. మిధిలకు ప్రభువు జనకుడు. అతడు విశ్వామిత్రునికి స్వాగతం పలికారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనకునికి పరిచయం చేశాడు. పురోహితుడు శతానందుడు. అతడు అహల్య కొడుకు. అతడు రామ లక్ష్మణులను స్తుతించాడు.


    ఆ రాత్రి రామ లక్ష్మణులు సుఖంగా గడిపారు. తెల్లవారి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను శివధనుస్సు చూపించమన్నాడు. అప్పుడు జనకుడు శివధనుస్సును గురించిన కథ చెప్పాడు :-


    "పూర్వం దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి శివుణ్ణి పిలువలేదు. తనను పిలవనందుకు శివునికి కోపం వచ్చింది. అతడు ఉగ్రుడు అయినాడు. అతడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఈ విల్లును చేతబట్టి దేవతలను హతమారుస్తానన్నాడు. దేవతలు శివుని ప్రార్థించారు. శాంతించమన్నారు. శివుడు అనుగ్రహించాడు. శాంతించాడు. అప్పుడు ఈ ధనుస్సును దేవతలకు ఇచ్చాడు. దేవతలు దేనిని దేవరాతునికి ఇచ్చారు. దేవరాతుడు మాకు పూర్వీకుడు. ఆ విధంగా ఈ ధనుస్సు వంశానుక్రమంగా మాకు సంక్రమించింది.


    "ఒకసారి నేను భూమి దున్నుతున్నాను. నాగటిచాటున నాకు ఒక కన్య లభించింది. ఆమెకు "సీత" అని నామకరణం చేశాను. కన్నకూతురులా ఆమెను పెంచాను. ఆమె పెరిగి పెద్దదైంది. ఇప్పుడామెకు పెళ్లి చేయాలనుకున్నాను. ఒక మహావీరునికిచ్చి చేయాలని నా సంకల్పం. కాబట్టి శివధనుస్సును ఎక్కుపెట్టినవారికి సీతనిస్తానని చాటింపు వేయించాను. ఎందరో రాజులు వచ్చారు. ప్రయత్నించారు. ఎక్కుపెట్టలేకపోయారు. ఓడిపోయారు.


     జనకుడు కథ చెప్పాడు. ధనస్సు తేవలసిందని ఆజ్ఞాపించాడు. బలవంతులయిన అయిదువేలమంది బయలుదేరారు. ధనస్సు ఉన్న పెట్టెను లాక్కుని వచ్చారు. రాముడు దాన్ని చూచాడు. "ఈ ధనస్సును ఎక్కుపెట్టమంటారా?" అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు. విశ్వామిత్రుడు సమ్మతించాడు.


    విశ్వామిత్రుడి అనుమతి తీసుకున్నాడు రాముడు. ముందుకు అడుగువేశాడు. శివధనస్సును అవలీలగా లేవనెత్తాడు. దానిని ఎత్తిపట్టాడు. బాణం సంధించాడు. బాణం సంధించి ధనస్సును మధ్యకు విరిచాడు.


    అక్కడ కూడిన వేలమంది జనులు ఆశ్చర్యపడిచూశారు. ధనస్సు విరిగిన ధ్వని పిడుగులు పడ్డట్లుంది. పర్వతాలు బద్దలయినట్లయింది. భూమి వణికింది.

 Previous Page Next Page