Previous Page Next Page 
సీతాచరితం పేజి 27


    భగీరథుడు ఆ కార్యానికి పూనుకున్నాడు. అతడు విసగలేదు. వేసారలేదు. నిరాశ చెందలేదు. ప్రయత్నాన్ని ఆపలేదు. కృషిని కొనసాగించాడు. విజయం సాధించేదాకా వదల్లేదు.


    అప్పటికి నిరంతరం క్రమబద్ధంగా పారే జలప్రవాహం ఉండి ఉండదు. అలాంటి ప్రవాహం హిమాలయాల వరకే పరిమితం అయిఉంటుంది. హిమవన్న గాల అతి ఉన్నతాలు. అందుకే దాన్ని ఆకాశం అని అంటారు. అలాంటి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసి మైదానాలకు తెచ్చి ఉంటాడు. భగీరథుడు గంగ దిగి రావడాన్ని చాల సుందరంగా చెప్పాడు. బంగారు రథంలో భగీరథుడు వెళ్తున్నాడు. వెనుక మెల్లగా పారుతూ గంగ వస్తున్నది.


    గంగకు ఒక క్రమబద్ధ ప్రవాహాన్ని ఏర్పరచి, దాన్ని పంటపొలాలకు అందించాడు భగీరథుడు అయిఉండాలి. నాగరకత మరో మలుపు తిరగడానికి గంగ కారణం. గంగను క్రమబద్ధం చేయడానికి భగీరథుడు కారణం.


    కాబట్టి భగీరథుడు నాగరకతా నిర్మాణంలో యుగకర్తలాంటివాడు.


    ఈనాటి ప్రాజెక్టుల నిర్మాణమే మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. గంగను తెచ్చిన భగీరథుడు ఎంత అద్భుతంగా కనిపించి ఉంటాడు! అతణ్ణి ప్రజలు ఎంత కొనియాడి ఉంటారు.


    నాగరకత ఒకనాటిదికాదు. మానవుడు పుట్టిన్నాటినుంచీ నేటివరకు నిరంతరం ప్రవహిస్తున్న స్రోతస్విని. నాగరికత ఏ ఒక్కరి యత్నం వల్ల పరిఢవిల్లేదికాదు. దీనికి ప్రతితరం, ప్రతిదశ, ప్రతియుగం ఉపకరిస్తుంది.


    రాతికాలంనాడు ఆయుధాలు కనుకొని ఉండక ఉండినట్లయితే మనం రాకెట్లయుగంలో ఉండేవాళ్లం కాదు. అలాగే మనం కలగంటున్న గంగా-కావేరి ప్రాజెక్టుకు, పరోక్షంగా భగీరథుని కృషి ఎంత ఉందో ఎలా చెప్పగలం?

    
    కుమార సంభవం:


    హిమవంతుని రెండవ కూతురు ఉమ. శివుడామెను పెండ్లాడాడు. ఉమాశంకరులు వందల సంవత్సరాలు సంభోగించారు. అందుకు దేవతలు అదిరిపోయ్యారు. వారు శివుని దగ్గరకు వచ్చారు. ఉమకు పుట్టబోయే బిడ్డను లోకం భరించలేదు. కాబట్టి యోగం అవలంబించవలసిందని శివుని ప్రార్థించారు. శివుడు తపస్సు ప్రారంభించాడు. శివుని రేతస్సు స్ఖలించింది. అది భూమండలమంతా నిండిపోయింది. అగ్నిని శివుని రేతస్సులో ప్రవేశించమని దేవతలు కోరారు. అగ్ని అలాగే ప్రవేశించాడు. అప్పుడది రెల్లుగడ్డి అయింది.


    దేవతలు సంభోగం వారించినందులకు ఉమకు కోపం వచ్చింది. సంతానంకోరి సాగిస్తున్న సంభోగాన్ని వారించారు. కాబట్టి 'దేవతలకు సంతానం కలుగకుండుగాక' అని శపించింది. ఆమెకూడా తపస్సు చేయడానికి వెళ్లిపోయింది.


    దేవతలకు ఒక మంచి సేనాని కావల్సివచ్చింది. వారు అగ్ని దగ్గరకు వెళ్లారు. అతడు ధరించిన శివరేతస్సును గంగలో విడవమన్నారు. గంగ స్త్రీ రూపం ధరించింది. అగ్నిదేవుడు శివరేతస్సును ఆమెలో విడిచాడు. దాన్ని ఆమె భరించలేకపోయింది. హిమవత్పర్వతం మీద ఉంచింది. అక్కడవున్న రెల్లుగడ్డిలో శివరేతస్సు వలన కుమారస్వామి జన్మించాడు.

    
    సాగరమథనం:


    దితి కొడుకులు దైత్యులు. వారు బలవంతులు. ఆ దితి కొడుకులు దేవతలు. వారు బుద్దిజీవులు. ఒకసారి ఉభయులు కలిసి ఆలోచించారు. మానవునికి కలిగే వ్యాధులు, వార్ధక్యం, మరణం, లేకుండా చేయాలనుకున్నారు. పాలసముద్రాన్ని మధించదలిచారు. అందులోంచి అమృతాన్ని సాధించాలనుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు. వాసుకిని తాడుగా చేశారు. మథించసాగారు. అలా కొన్ని వేల సంవత్సరాలు మథించారు. అప్పుడు వాసుకి విషం కక్కింది. ఆ  విషం మహాఘోరంగా వుంది. మనుషుల్ని, దేవతలను నాశనం చేసేట్లు వుంది. దేవతలు శివుణ్ణి శరణుజొచ్చారు. అతడు ఆ ఘోరమైన హాలాహలాన్ని మింగాడు. దాన్ని గొంతులోనే నిలిపాడు. అందువల్ల అతడు గరళకంఠుడైనాడు.


    దేవాసురులు మళ్లీ మథించసాగారు. అలా కొంతకాలం జరిగింది. అప్పుడు మంగర పర్వతం పాతాళానికి మునిగింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. అతడు కూర్మరూపుడైనాడు. పర్వతాన్ని వీపునదాల్చాడు.


    దేవాసురులు మళ్లీ మథించసాగారు. అప్పుడు దండకమండలధారియైన థన్వంతరి జన్మించాడు. ఆ తర్వాత అప్సరసలు పుట్టారు. తర్వాత కౌస్తుభం, అమృతం పుట్టాయి. అమృతకోసం దేవదానవులకు యుద్ధం జరిగింది. విష్ణువు మోహిని రూపం ధరించాడు. అమృతాన్ని హరించాడు. ఆ విధంగా అమృతం దేవతలకు మాత్రమే దక్కింది.


    వ్యాథులను, మరణాన్ని జయించడానికి మానవుడు కలకాలంగా ప్రయత్నిస్తున్నాడు. కొంతలో కొంత విజయం సాధిస్తున్నాడు కూడ.


    ఒక ప్రయత్నం విజయవంతం కావడానికి ముఖ్యంగా రెండురకాలైన బలాలు అవసరమవుతాయి. ఒకటి బుద్ధిబలం, రెండవది దేహబలం. ఈ రెండింటిలో ఏది లేకున్నా ఫలితాన్ని సాధించలేం.


    దేవతలు బుద్ధి జీవులు. అసురులు దేహబలం కలవారు. వీరిద్దరు కలిసి ఒక కార్యం సాధించడానికి నిశ్చయించుకున్నారు. దాన్ని సాధించారు. ఫలితం న్యాయంగా ఉభయులకు సరిసమానంగా లభించాలి. కాని అలాజరగలేదు. బుద్ధిజీవులు తమ చాకచక్యంతో ఫలితాన్ని కాజేశారు. అసురులకు దక్కింది ఏమిలేదు. వారు చేసిన శ్రమ వృధా అయింది. దీన్నే మనం నేటి ఉత్పత్తి విధానానికి సంక్రమింపజేసి చూద్దాం. సమాజంలో సంపద సృష్టికి శ్రామికులు సంపన్నులు అవసరం. ఈ రెంటిలో ఏదిలేకున్నా సంపద సృష్టి జరగదు. దేవదానవులవలె శ్రామికులు సంపన్నులు సమాజానికి సంపద సృష్టిస్తున్నారు. ఐతే దేవతలు అమృతాన్ని కాజేసినట్లే ఈ సంపద సృష్టి వల్ల వచ్చే ఫలితాన్ని సంపన్నులే కాజేస్తున్నారు. శ్రామికులకు శ్రమ ఫలితం దక్కించడానికి ఇప్పుడు ఒక మహోద్యమం నడుస్తున్నది.


    శ్రామికునికి శ్రమ ఫలితం దక్కిననాడే నిజమైన శ్రేయోరాజ్యం ఏర్పడుతుంది.


    మరొక విషయం - మానవుని జీవితం సుఖశాంతులతో విలసిల్లాలని అనేకదేశాలలో, అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి ఫలిస్తున్నాయి కూడా.  కాని ఆ ఫలితాన్ని ఖరీదు చేయగల శక్తి వున్నవాడే అనుభవించగల్గుతున్నాడు. శక్తిహీనుడు చచ్చి ఊరుకుంటున్నాడు. మానవ సంక్షేమానికి జరిగే పరిశోధన ఫలితాలు వర్గాలతో నిమిత్తం లేకుండా అందరికి అందినవాడే నిజమైన మానవతా సమాజం అవతరిస్తుంది.

    
    అహల్య:


    విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ప్రయాణం సాగించాడు. వారు మిధిలానగరం సమీపించారు. అక్కడ వారికొక ఆశ్రమం కనిపించింది. దీని గురించి రాముడు అడిగాడు. విశ్వామిత్రుడు ఆ కథ ఇలా చెప్పాడు.


    ఇది గౌతముని ఆశ్రమం. అతని భార్య అహల్య. ఆమె జగదేకసుందరి. గౌతముడు అహల్యతో చాలకాలం సంసారం చేశాడు. ఈ ఆశ్రమంలోనే తపస్సు చేశాడు. ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేడు. ఆ సమయం కనిపెట్టి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు గౌతముని రూపం ధరించాడు. అహల్య దగ్గరకు వచ్చాడు. నీతో నాకు సంగమం కావాలని కోరాడు. అహల్య అతన్ని చూచింది. కనిపెట్టింది. ఇంద్రుడే అని తెల్సుకుంది. ఆమెకు ఇంద్రుని మీదనే కుతూహలం కల్గింది. సమ్మతించింది.

 Previous Page Next Page