అయితే ఇందుకు సత్యనారాయణరెడ్డి ఒప్పుకోలేదు. ఒకేసారి అర్ధరూపాయి పెంచమని అడగడం దారుణమన్నాడు. గత అయిదేళ్ళుగా రూపాయే తీసుకుంటున్నామని, అయితే ఆ కూలీ ఎందుకూ చాలడం లేదని, రాత్రిళ్ళు పస్తులుంటున్నామని, అర్ధరూపాయి పెంచమని కూలీలు కాళ్ళా వేళ్ళాపడ్డారు.
అయినా సత్యనారాయణరెడ్డి ఒప్పుకోలేదు.
దీంతో కూలీలంతా ముభావంగా వెళ్ళిపోయారు ఇంటికి. హరిజనవాడలో ఆ రాత్రి అందరూ ఒక దగ్గర చేరారు. కూలీ పెరగదన్న నిరాశ వాళ్ళను కుంగదీసింది. వచ్చే సంవత్సరం ఇంకాస్త గట్టిగా కూలీ పెంచమని అడగాలని పెద్దలంతా నిర్ణయించారు.
అయితే అందుకు ఒక్క జయ మాత్రం ఒప్పుకోలేదు...
"జయ ఎవరు?" కీర్తి కథ మధ్యలో అడిగింది.
ఆమె మాల పిల్ల. పాతికేళ్ళుంటాయి. చామనఛాయతో ఆకర్షణీయంగా వుంటుంది. కాటుక పెట్టకపోయినా ఆమె కళ్ళు విశాలంగా వుంటాయి. నవ్వకపోయినా ఆమె పెదవులు నవ్వుతున్నట్టే ఉంటాయి. ఆమె ముక్కు కొనదేలి ఉండకపోయినా చూడడానికి చక్కగా ఉంటుంది. ఆమె గుండెలు పెద్దవి కాకపోయినా రెచ్చగొడుతున్నట్టు ఉంటాయి.
తాము అయిదేళ్లుగా రెడ్డి ఇచ్చిన కూలీనే పుచ్చుకుంటున్నామని, ఇచ్చే రూపాయి ఎందుకూ సరిపోవడంలేదని, బియ్యం బస్తా రేటు బాగా పెరిగింది కాబట్టి రూపాయిన్నర ఇవ్వవచ్చని, ఆ కూలీని ఈ సంవత్సరం నుంచే ఇప్పించుకోవాలని ఆమె పట్టుపట్టింది.
ఆమె చెప్పిందంతా నిజమే కాబట్టి మాల పెద్దలూ ఏమీ చెప్పలేకపోయారు.
"మరింక ఏం చేద్దాం?" ఓ మాల పెద్ద ప్రశ్నించాడు.
7
హరిజనవాడలో జయ అంటే అందరికీ చాలా ఇష్టం. ముక్కు సూటిగా వెళ్ళే మనిషి. ఎక్కడ బాధవుంటే అక్కడ ఆమె ప్రత్యక్షం. ఇతరుల బాధను కూడా తన బాధలాగే అనుకుని సహాయం చేస్తుంది. అందునా నిప్పులాంటి మనిషి. భర్త తాగుబోతు వెధవ కావడంతో కాపురానికి వెళ్ళిన ఆర్నెల్లకే తిరిగి పుట్టింటికి చేరుకుంది. అయినా చిల్లర వేషాలు వేసే రకంకాదు. చాలా నిజాయితీతో నిర్భయంగా వ్యవహరించే జయంటే వాళ్ళందరికీ గౌరవం.
"పనుల్లోకి పోకుండా వుందాం" చెప్పింది జయ.
"ఆఁ" ఆ మాలపెద్ద నోరు తెరిచాడు.
"అంతే. మన కూలీ పెంచేవరకు ఎవరూ పనుల్లోకి పోవద్దు" యువకులంతా ముక్తకంఠంతో అన్నారు.
"రెడ్డితో విరోధమా!" పెద్దలు వెనక్కు అడుగేస్తున్నారు.
"విరోధమని ఎందుకనుకోవాలి. ఇంతకాలం మనం కూలీ పెంచమని అడగలేదే. అన్ని ధరలు పెరిగాయి. ఉప్పు, చింతపండు దగ్గర్నుంచి అన్నీ రేట్లు ఎక్కాయి. అందుకే అర్థ రూపాయి పెంచమంటున్నాం. ఆ కూలీ ఇచ్చేవరకూ పనుల్లోకి పోకూడదంటున్నాం" అంది జయ.
"అంటే స్ట్రయికే అన్నమాట" సినిమాలతో, టౌన్ తో పరిచయమున్నవాడు అన్నాడు.
"కానీ రెడ్డికి ఎదురుతిరగడం అంత మంచిది కాదు. ఆయనకేం డబ్బున్న మారాజు. మనల్ని ఏమైనా చేస్తాడు" పెద్దలకింకా ధైర్యం చిక్కడం లేదు.
"అదికాదు పెద్దయ్యా! మనమేమీ పంటలో భాగం అడగడంలేదు. మెత్తితీసి వడ్లు కొలవమనడం లేదు. మన కష్టానికి కూలీ అడుగుతున్నాం. కష్టపడేటోళ్ళం కడుపుకైనా తినాలి కదా!"
జయ చెప్పిందాంట్లోనూ వ్యతిరేకించాల్సింది అమీ కనపడడంలేదు వాళ్ళకు. నిజమే కదా! కడుపు మార్చుకుని ఎన్ని రోజులు కష్టం చేస్తారు.
"అయితే సరే జయమ్మా! నువ్వు చెప్పినట్టే వింటాం. మాకు రెడ్డితో మాట్లాడాలంటేనే ఏదో జంకుగా వుంటుంది. కాబట్టి మా అందరి తరపున నువ్వే రెడ్డితో మాట్లాడు. నువు చెప్పినట్టు చేస్తాం" అని మా పెద్దలంతా జయను ముందుకు తోశారు.
కూలీ పెంచేవరకు కూలీలు పనుల్లోకి రారంట అనే విషయం క్షణంలో తెలిసిపోయింది సత్యనారాయణరెడ్డికి. ఆయన అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు.
తన ఇన్ని రోజుల ఆధిపత్యానికి తెర పడిందన్న విషయం మింగుడు పడలేదు. తనను చూస్తూనే అదిరిపోయే అలగా జనం ఒక్కటై తనపై యుద్ధం ప్రకటించడం సహించలేకపోయాడు. ఆయనకు పంతం పెరిగింది.
మరుసటి రోజు మాల పెద్దలతోపాటు జయ కూడా సత్యనారాయణరెడ్డి ఇంటికెళ్ళింది.
సిల్క్ బట్టల్లో హుందాగా, ఒకింత గంభీరంగా చావిడిలోని పేము కుర్చీలో కూర్చున్న సత్యనారాయణరెడ్డిని చూడగానే వాళ్ళకు భయం పట్టుకుంది.
జయ మాత్రం తొణకలేదు. బెణకలేదు.
తాము కూలీ పెంచమని అడగడానికి వచ్చామని చెప్పింది.
"అంతా నిర్ణయాలు తీసుకునే వచ్చిన మీతో నేనేం మాట్లాడేది?" సత్యనారాయణరెడ్డి కోపాన్ని లోపలే అణచుకుని అన్నాడు.
"మీరు అంతవరకు రానివ్వరనే నమ్మకంతోనే వచ్చాం. అది చివరి బాణం" అంది జయ.
"అయితే ముందు పనులకు వంగండి. ఆ తరువాత కూలీ విషయం మాట్లాడదాం" అన్నాడు సత్యనారాయణరెడ్డి.
"ఇప్పుడే కూలీ తేలాలి. ఆ తరువాతే పని. ఇప్పుడు పనులైపోతే మరో ఆరు నెలల వరకు మాకు పనుండదు. ఇప్పుడు కష్టపడితేనే అంతవరకు గ్రాసం. రూపాయి కూలీకే పనిచేస్తే కనీసం మూడు నెలలు మేం పస్తులతో మాడి చావాలి. అందుకే మా కూలీ పెంచండి" అని స్పష్టం చేసింది జయ.
పెద్దలంతా బతిమలాడారు.
అయినా సత్యనారాయణరెడ్డి ఒక్క మెట్టు కూడా కిందకు దిగలేదు.
జయ కూడా తన పట్టుదలను సడలనివ్వలేదు.
"పైసా పెంచను. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని విసురుగా వెళ్ళిపోయాడాయన.
అంత సులభంగా ఒప్పుకోడని జయకూ తెలుసు.
వాళ్ళు తిరిగి వచ్చేశారు.
ఎవరూ కూలీకి వెళ్ళడం లేదు.
ఊరికీ, హరిజనవాడకీ మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైంది.
చిన్న రైతులంతా తామే స్వయంగా నూర్పిళ్ళు చేసుకున్నారు. సత్యనారాయణరెడ్డి పొలంలో మాత్రం కొడవలి పడలేదు.
వరి పైరు బరువుగా కిందకు వాలిపోతోంది. వేరుశనగ వూడలు దిగడం ప్రారంభించింది. జొన్న కంకులన్నీ ముదిరిపోతున్నాయి. సజ్జల్ని గువ్వలు తెగ తినేస్తున్నాయి.
మరో వారం రోజులు పోతే పంట పూర్తిగా దక్కదు. సత్యనారాయణరెడ్డి కూలీలను పిలవలేదు. వాళ్ళూ వెళ్ళలేదు.
మరో రెండు రోజులకు రెండు వందల మందిదిగారు. వాళ్ళంతా పక్కఊరి కూలీలు.