ఎవరీ మంజువాణి? ఏమిటి ఆమె జీవితంలోని రహస్యాలు? ఎందుకు ఆమె ఇలా చేస్తుంది? కేవలం రాజారావులో ఏదో ప్రత్యేకతను చూసే ఇలా అయిందా? లేక అతని స్థానంలో ఎవడున్నా ఇదే జరిగేదా?
"మీరు లేనప్పుడు డాబా ఎక్కి కిటికీలోంచి మీ బల్లమీది మీ ఫోటోచూసి సంతోషిస్తూ వుండేదాన్ని. అప్పుడే మానసికంగా చెడిపోయానని చెప్పవచ్చు. మీ ముఖవర్చస్సు. అందులో సుధాకరుని పోలికలు నన్ను ఇలా దారి తప్పించాయి. ఇలా జరిగిపోయింది. దానికి నేను బాధపడను. పైగా సంతోషంగానే వుంది. వచ్చిన బాధల్లా ఏమిటంటే, ఇలా ఎంతకాలం సాగుతుందా అని. రాజా! ఎప్పటికైనా మనకు ఎడబాటు తప్పదు. బయటపడిందంటే నన్ను ఖూనీచేస్తారు ఆయన. ఎడబాటు... ఆ విషయం తలుచుకుంటూంటే నా గుండె బ్రద్దలైపోతోంది. ఇట్లా మిమ్మల్ని చూస్తూ... మీ చేతివ్రేళ్ళను నిమురుతూ, కొంటె మాటలని ఆలకిస్తూ గడిపే భాగ్యం ఎప్పటికీ నాకు వుంటుందా? మీకు ఎవరు నేర్పించారు ఇన్ని మాటలు?" అనేది మంజువాణి.
"నువ్వే. నువ్వు నా గురువ్వి."
"మీరు పెళ్ళి చేసుకోకుండా ఎప్పటికీ ఇలా వుండిపోతారా?" అనడిగింది ఒకరోజు.
"ఆహా! నీ చలవ వుంటే."
"నా చలవ ఏమిటి? నేను వద్దంటే మానుతారా?"
"ఏం చెయ్యను నీకోసం?" అంటూ మెల్లగా సత్యవతి విషయం చెప్పాడు.
"పాపం! ఆపిల్ల మిమ్మల్ని వెర్రిగా ప్రేమిస్తోంది" అంది మంజువాణి.
"ప్రేమించటం ఒక ఫ్యాషన్ అయింది మరి ఈ రోజుల్లో. ఎటు తిరిగీ అవస్థ మాకే."
"ఆ అమ్మాయి అందంగా వుంటుందా?"
"ఫర్వాలేదు. అందగత్తెలలోకే జమ."
"అయితే ఏమిటి మీ అభ్యంతరం?"
"ఊరుకో. నా పెళ్ళిమాటలు నీ నుండి రావడం నాకు నచ్చలేదు వాణీ! అన్నాడు రాజారావు.
"ఏం? నేను తగనా?" అంది ఖిన్నురాలై.
"మరి పెళ్ళిచేసుకుని మరో జీవికి అన్యాయం చేయమంటావా?"
"అప్పుడు నన్ను మరిచిపోండి."
"అప్పుడు నిన్ను మరిచిపోయినంత మాత్రాన ఆమెకు అన్యాయం చేసినవాడిని కానా?"
"కొంతవరకు ప్రాయశ్చిత్తం."
"ఓహో! ఈ త్యాగాలు చేసి చేసి అనాదినుంచి ఆడవాళ్ళు అలిసిపోయారు. నువ్వూ అదే ఆలపించకు ."
"మరి నన్ను అంత స్వార్థపరురాల్ని కమ్మంటారా?"
"స్వార్థం అంత చేటుకాదులే. ఆ మాటకొస్తే మనిషికి అవసరం కూడా. అసలు స్వార్థం పనిచేయందే మనిషి గొప్పవాడు కాడు తెలుసా?"
అలా ముగిసిపోయేది ఆ సంభాషణ.
* * *
ఓసారి అనుకోకుండా ఇంటినుంచి తల్లీ, అన్నలూ వచ్చిపడ్డారు. వాళ్ళు సరాసరి గదికి రాకుండా అతని మేనమామగారింట్లో దిగి, అక్కడ్నుంచి కబురు పంపారు. ఇది ఏదో విపరీత పర్యవసానానికే వచ్చిందనుకున్నాడు రాజారావు వెళ్ళాడు.
అనుకున్న పళంగా మర్యాదలు జరిగిపోయాయి. ఆ పూట అక్కడే భోజనం తర్వాత ఇహ అంతా చుట్టూచేరి ప్రారంభించారు.
పాట పాతదే. రాగం కొత్తది. ఒక్కొక్కరు ఒక్కోరాగం ఆలపించారు. వాళ్ళ కుటుంబం, ఆ ప్రాచీన సంప్రదాయాలు, రక్తసంబంధాలు, తోడునీడలు, బంధుప్రీతి, అనురాగాలు, కట్టుబడులు ఇవన్నీ ఏకరువు పెట్టారు.
"నాన్న పోయినప్పటినుంచి నిన్ను పెంచి - ఇంతవాడిని చేశానే! నా మాట కాదంటావుట్రా," అన్నాడు పెద్ద అన్నగారు.
"అమ్మ మనసు నొప్పించటం నీకు ఇష్టమా?" అన్నాడు రెండో అన్న.
ఇహ వదినలు "ఏమయ్యా! ఎవరినైనా ప్రేమించావేమిటి కొంపతీసి? సత్యవతి అందమైన పిల్లకాదా?" అని పరిహాసం చేశారు.
తల్లి స్వర్గలోకంలోవున్న ఆ మహానుభావుడిని గుర్తు తెచ్చుకుని వలవల ఏడ్చింది.
ఇహ మేనమామ, అత్తయ్య, బావ వీళ్ళ సూటీపోటీ మాటలు సరేసరి. ముసలమ్మగారి మూలుగు, అందరూ కలిసి బాధించి వదిలిపెట్టారు.
చివరకు రాజారావుకు తిక్కరేగి "నన్ను చంపకండి. నాకు ఇష్టం లేదంటూంటే బలవంతాన కట్టబెడతారా?" అన్నాడు.
"ఎందుకు ఇష్టంలేదోయ్. నీ అందానికి తగదా?" అన్నాడు అతని బావ రెచ్చిపోయి.
అంతా నిర్ఘాంతపోయి ఇద్దర్నీ వారించటానికి ప్రయత్నించారు.
"మీరూరుకోండే. ఇన్నాళ్ళనుంచీ చూస్తున్నాను కోపం చంపుకుని. ఏమిటి ఈయనగారి సుపీరియారిటీ? ఏమయినా డాక్టరా? కలెక్టరా? ప్రతివాడూ చదువుతున్నాడు బి.ఏ." అన్నాడతను మరింత పెట్రేగిపోయి.
"నా చదువు విషయం ఎత్తొద్దు చెబుతున్నా" అన్నాడు రాజారావు.
"ఏం ఎత్తితే? నీ పరువు పోతుందా? అసలు నీలాంటి అహంకారికి, నీతిమాలినవాడికి పిల్లను ఇవ్వబూనడం మా బుద్ధి తక్కువ."
రాజారావు పిచ్చివాడిలా "మాటలు జాగ్రత్తగా రానియ్యి. ఏమిటి తెలుసు నీకు నా నీతినిగురించి?"
"విన్నాంలే అంతా. ఎవడికి తెలియని సంగతులు! నీ ప్రేమకలాపాలు, కృష్ణలీలలు."
రాజారావుకి ఒళ్ళు తెలియలేదు. తల్లీ, అన్నలూ, వదినలూ వీళ్ళముందు ఈ ప్రవర్తన అతనికి మతిపోయింది. ఛీ! ఒక్క చెంపకాయ కొడదామనుకున్నాడు. కాని, ఓర్చుకున్నాడు. ఎవరో పిలుస్తున్నా వినిపించుకోకుండా గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు వచ్చేశాడు.