మల్లిబాబు ఏ బీరువామూల నుంచో ఓ పాతబంతిని పెకలించుకుని వచ్చాడు. దాంతో ఆడుకుంటున్నాడు. పిల్లలదగ్గర ఓ చిత్రమైన గుణముంది. ఒక ఆటవస్తువు బంతో, బొమ్మ తుపాకియో, విరిగిపోయిన బొమ్మకారో కళ్ళెదుట రోజుల తరబడి పడివున్నా దాన్నిగురించి ఎవరూ పట్టించుకోరు. ఖర్మకాలి అది బయటికితీసి ఎవరన్నా ఆడటం మొదలుపెట్టారో అది తమ చేతుల్లోకి వచ్చేవరకూ రాక్షసుల్లా చూసేవారి ప్రాణాలు విసిగి పిచ్చెక్కేలా ఏడిచి ఏడిచి రాగాలు పెడతారు. కొన్ని కుటుంబాలలో మరి ఎనమండుగురు, తొమ్మండు గురు పిల్లలున్న కుటుంబాలలో ఎలా భరిస్తారో, ఎవరూ ఊహించలేని సంగతి.
మల్లిబాబు చేతిలో బంతి కావాలని రాణి మంకుపట్టు పట్టింది. వాడుఇవ్వనంటున్నాడు. రాణి ఏడ్చి రాగాలుపెట్టింది. ఆ పిల్ల ఏడుపు మొదలుపెడితే ఒక పట్టాన వదలదు. గట్టిగా, ఇల్లెగిరిపోయేలా మొండిగా ఏడుస్తుంది.
ఒకటి రెండు నిముషాలు చూసి ప్రభావతి హాల్లోకి వెళ్ళింది. "మల్లిబాబూ! ఆ బంతి చెల్లికిచ్చేయి. అది నీకన్నా చిన్నది" అన్నది.
"నేనివ్వను, ఇది నాకు దొరికింది" అన్నాడు మల్లిబాబు.
"దొరికితే దొరికిందిలే. చూశాడు. ఆ ఆరేళ్ళ బాలుడి చూపులో ఎన్నో అర్ధాలు ప్రతిబింబించాయి. 'గాలిపటాలు ఆడుతుంటే వద్దంటారు, బొంగరాలు ఆడుతుంటే తీసిపారేస్తారు. ఏ ఆటలు ఆడుకున్నా ఏదో సాధిస్తారు. పాతబడిన బొమ్మేదో తీసుకుంటే అది ఇచ్చేంత వరకూ ప్రాణాలు తోడేస్తారు. ఇహ ఎట్లా మేము సుఖపడేది?...." అన్నట్లున్నాయి ఆ చూపులు.
ప్రభావతి లెక్కచెయ్యలేదు. 'ఇస్తావా ఇవ్వవా?' అంది గొంతు పెద్దది చేసి.
మల్లిబాబు ఇచ్చే ధోరణిలో వున్నట్లు కనిపించలేదు.
ప్రభావతి ముందుకువెళ్ళి వాడి వీపుమీద ఒకటి చరిచింది. "అమ్మో!" అని ఒక్క అరుపు అరిచాడు వాడు.
వాడిమీద దెబ్బ పడినప్పుడు ఆ చప్పుడు వంటింట్లోని శారదమ్మగారికి వినిపించింది. ఆవిడ వీపుమీదే దెబ్బ పడినంత కఠినంగా వుందది. చప్పున లేచి అడ్డుకుందామనుకుంది. కానీ అంతకుముందే ప్రభావతి తనతో అన్న మాటలు గుర్తుకొచ్చి కదలకుండా అలానే కూర్చుండిపోయింది.
అలాంటి దెబ్బలే దబ్ దబ్ మని వీపుమీద మరి మూడునాలుగు పడిపోయాయి.
మల్లిబాబు చేతులు చచ్చుబడిపోయినట్లు బంతిని నేలమీదకు వదిలేశాడు.
ప్రభావతి ఆ బంతిని తీసుకుని రాణి దగ్గరకొచ్చింది. 'ఇంద....తీసుకో...."
రాణి చేతులు జాచింది.
విమల ఎప్పుడొచ్చిందోగానీ రాణిని రెక్కపట్టుకుని అవతలకు లాగేసింది.
"భడవా! నీక్కొన్న బంతులన్నీ చాలక ప్రతీదీ దేబిరించే స్థితికి వచ్చావా? అంత గతిలేక ఛస్తున్నావా? గతిలేకపోతే నోరు మూసుకుని పడుండాలిగానీ అయినదానికీ, కానిదానికీ చెయ్యి జాపుతావా? నీకేమైనా బుద్దుందా అసలు?" అంటూ దాన్నిపట్టుకుని చావగొట్టసాగింది.
"ఊరుకో, పసిదాన్ని పట్టుకుని అలా చావగొడతావేమిటి? నీకేమైనా మతిపోయిందా ఏమిటి?" అని ప్రభావతి రాణిని ఇవతలికి లాగెయ్యబోయింది.
"ఊరుకోండి. నా పిల్లలను నేను చంపుకుంటాను, నరుక్కుంటాను, నా ఇష్టం. మీరేం కల్పించుకోనక్కరలేదు" అని ఒక్క అరుపు అరచి విమల రాణిని అలాగే రెక్కపుచ్చుకుని అవతలకు లాక్కెళ్ళింది.
"వెధవా! దీనికంతటికీ కారణం నువ్వే ఎక్కడోవున్న ఆ పాడుబంతిని బయటికెందుకు తీశావు నువ్వూ....?" అంటూ ప్రభావతి మళ్ళీ మల్లిబాబు మీది కెళ్ళింది.
* * *
హరి పన్నెండు గంటలకల్లా ఇంటికి వచ్చేశాడు. సుధాకర్ కూడా వచ్చాడు.
మరో అరగంట కల్లా రంగారావుగారూ, కుమార్ కూడా డిస్పెన్సరీనుండి వచ్చేశారు. భాస్కరం ఇంకా రాలేదు.
తండ్రీ, ముగ్గురు కొడుకులూ కలసి భోజనానికి కూర్చున్నారు. అప్పుడప్పుడూ ఆదివారం పూట అలా అవుతూ వుంటుంది.
అందరూ సీరియస్ గా వుండటం, విమల కనిపించకపోవటం, ప్రభావతి ముఖం ఎర్రబడివుండటం, కుమార్ చూసి ఏదో జరిగి వుంటుందని తీర్మానించుకున్నాడు.
"ఏదో జరిగివుంటుంది" అన్న భావన అతన్ని చాలా అశాంతిలో ముంచేస్తుంది.
అతనికిష్టం వుండదు - ఏదో జరగటం ఎందుకు జరగాలి? ఎందుకు ప్రశాంతంగా ఉండకూడదు? అనిపిస్తుంది.
రంగారారుగారు భోజనం చేస్తున్నంతసేపూ ఏదో మాట్లాడుతూనే వున్నారు. హరిణి బ్యాంకు విషయాలగురించి కాసేపు ప్రశ్నలువేశారు. కుమార్ తో కేసుల గురించీ, తమకు బిల్లు ఎగ్గొట్టినవారి గురించీ, ఇప్పటిరోజుల్లో డబ్బు సంపాదించటంలో డాక్టర్లకున్న సాధకబాధల గురించీ మాట్లాడారు. కుమార్ అన్నిటికీ ఊ కొడుతూనే వున్నాడు.
రంగారావుగారు చిన్న కోడలితోకన్నా పెద్ద కోడలితో ఎక్కువ మాట్లాడతాడు. ఇంటివిషయాలు ఎక్కువగా ఆమెతో చర్చిస్తాడు. "ఈ పటం ఇక్కడ కొడితే బాగుంటుందా? ఆ బీరువా అక్కడికి జరిపితే బాగుంటుందా? ఈ డ్రెస్సింగ్ టేబిల్ ఇక్కడికంటే అక్కడయితే భేషుగ్గా వుంటుంది కదూ?" అన్న విషయాలు ఆమెతో ఎక్కువగా చర్చిస్తూ వుంటారు. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం పూట సుత్తీ, మేకులూ పుచ్చుకుని గోడలపని పట్టించటం కద్దు.
ఈరోజు కోడలు సీరియస్ గా వుండటం ఆయన కనిపెట్టకపోలేదు. ఆయన కనిపెట్టిన విషయం కుమార్ కనిపెట్టాడు.
ఒక విషయం మనసులోకివస్తే అది బయటకు వెళ్ళగ్రక్కేయటంలో రంగారావుగారిని చెప్పి మరొకరిని చెప్పుకోవాలి. కోపంగానీ, ఆనందంగానీ, విచారంగానీ, అసహ్యంగానీ ముఖంమీద అనెయ్యకపోతే ఆయనకు తోచదు. వంటిమీద చీమలు ప్రాకినట్టుగా వుంటుంది.
ఆయన ప్రభావతిని 'అలా వున్నావేం?' అని అడుగుతాడేమోనని కుమార్ హడలిపోతున్నాడు.
భోజనాలదగ్గర ఎక్కడ రభస అయిపోతుందోనని కలవరపడిపోతున్నాడు.
చివరకు ఆయన అడగనే అడిగాడు "అలా వున్నావేమ్మా?" అని.
ఇహ ప్రభావతి పాఠం చదవబోతున్నదని కుమార్ యుద్దానికి సిద్దపడినట్టు కొంచెం నిఠారుగా కూర్చున్నాడు.
ఏ కళనుంచో ప్రభావతి "ఒంట్లో బాగాలేదండీ" అని ముక్తసరిగా సమాధానమిచ్చింది.
"బాగాలేదా? ఎందుకని? ఏమయింది?" అని రంగారావుగారు గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేశాడు.
"ఏం లేదండీ, తల నొప్పిగా వుంది."
రంగారావుగారు కుమార్ వంక తిరిగి "వీడు ఊళ్ళోవాళ్ళ రోగాలన్నీ నయం చేస్తాడుగానీ ఇంట్లోవున్నా పెళ్ళాంసంగతి పట్టించుకోడు. సాయంత్రం పరీక్ష చేసి చూడరా! అశ్రద్ద చేస్తే ఎవరికి నష్టం?" అన్నారు.
కుమార్ అలాగేనన్నట్లు తల ఊపాడు.
"అన్నట్లు ఇవేళ ఏదో ఇన్విటేషన్ వచ్చింది. నీక్కూడా వచ్చిందనుకుంటా. ఎవరో భార్యాభర్తలు క్రొత్తగా ప్రాక్టీస్ పెడుతున్నారటగా?"
"అవునండీ" అన్నాడు కుమార్.
"నెలకో క్రొత్త డాక్టరు పెట్టేస్తున్నాడేమిట్రోయ్! పాపం చాలామంది ఏదో ఊడబొడిచేద్దామని కొండంత ఆశతో బోర్డుపెట్టడం, ప్రాక్టీస్ లేక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటం చూస్తే జాలేస్తుందనుకో. నువ్వు గెటిన్ అవుతున్నావంటే ముప్పై, నలభై ఏళ్లనుంచీ నేను ఎస్టాబ్లిష్ అయి వుండబట్టీ, నేను ఇక్కడ పాతుకుపోయి వున్నవాడ్ని కాబట్టి కొట్టుకొచ్చేస్తున్నావనుకో. నొవ్వొచ్చేసరికి సమస్తం నేను సిద్దం చేసిపెట్టాను. నువ్వు ఆ సీటులోకి వచ్చి కూర్చున్నావంతే... లేకపోతే, ఎంత గడ్డురోజులివి? క్రొత్తగా ప్రాక్టీస్ పెట్టి నెగ్గుకురావటం, వెనకాల అండలేకపోతే మాటలతో అయ్యే పనేనా?"
కుమార్ ముఖం నల్లబడిపోయింది. అన్నం కలుపుతున్న అతనిచేతులు చచ్చుబడిపోయి నట్లయిపోయాయి.
"నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను. అష్టకష్టాలు పడి పైకొచ్చాను. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదనుకున్నాను. అందుకనే మీకన్నీ అమర్చిపెడుతున్నాను. అయినా నేను పడ్డ కష్టంలో మీరు వెయ్యోవంతు కూడా పడలేరు. మీ ముఖాలు, మీరు పడే శ్రమ ఎంత?"