Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 29

   

        ఆయన ముఖంలో స్వశక్తిమీద పైకొచ్చానన్న తృప్తి, గర్వం! ఇతరులకు ఆసరా చూపుతున్నానన్న ఆనందం, తనలా ఇతరులు సాధించలేరన్న ధీమా అన్నీ కనిపించాయి.
   
    కూరా, పచ్చడీ, పులుసు తినటం అయిపోయి మజ్జిగలోకి వచ్చాక హరిమీద పడ్డాడు రంగారావుగారు.
   
    "ఏరా! ఆ మధ్య ట్రాన్స్ ఫర్, అదీ ఏదో అన్నావు. ఏమయింది దాని విషయం?"
   
    "కేన్సిలయిపొయిందండీ" అన్నాడు హరి నెమ్మదిగా.
   
    "మంచిపని జరిగింది. కేన్సిల్ కాకపోతే నేనా డైరెక్టర్లతో మాట్లాడి కేన్సిల్ చేయించేవాడిననుకో అసలు నీకు మొట్టమొదట బొంబాయిలో వేస్తానన్నాడు పోస్టింగ్ ఏదయినా సరే ఇక్కడే వేయించాలని పట్టుబట్టి వేయించాను."
   
    ఆ విషయం హరికంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. తనకు బొంబాయిలో ఉద్యోగామైతే బాగుండునని అతను మనసులో ఉవ్విళ్ళూరటం, రంగారావుగారు గట్టిగా ప్రయత్నించి ఈ ఊళ్ళోనే పోస్టింగ్ అయేటట్లు చూడటం....అతనికింట్లో ఏదయినా గొడవ అయినప్పుడల్లా గుర్తువస్తూనే వుంటుంది.
   
    "అయినా సి.ఎ. పాసయినవాళ్ళెంతమంది లేరు? వాళ్ళందరికీ వెంటనే ఉద్యోగాలు వచ్చాయా? ఆ డైరెక్టరు నాకు తెలుసుకాబట్టి నేను గట్టిగా చెప్పబట్టి పని జరిగింది. ఏమో! నా తండ్రి నాకేమీ చేయలేదు. అందువల్ల నేను లైఫ్ లో మిజరబుల్ గా సఫర్ అయ్యాను. నా పిల్లలకు నేనన్నీ చేయగలగాలి. వాళ్ళు నాలా సఫర్ అవకూడదు. అదీ నా అభిమతం....."
   
    భోజనాలు పూర్తయిపోయాయి.
   
    కుమార్ చేయి కడుక్కున్నాక మెట్లెక్కబోతుంటే రాణి లోపల్నుంచి పరిగెత్తుకు వచ్చింది - "నేనూ వస్తాను పెదనాన్నా!"
   
    "రావే, రా!" అంటూ కుమార్ చెయ్యిజాచాడు.
   
    రాణి దగ్గరకు వస్తోంది.
   
    లోపల్నుంచి తుఫాన్ లా విమల దూసుకువచ్చింది. "నీకేమైనా సిగ్గుందిటే మొద్దూ? అందరూ చీదరించుకుంటున్నా ఊరికినే మీదిమీదికి ఎగబడతా వేమిటి? ఈసారి పైకి వెళ్ళావంటే కాళ్ళు విరగ్గొడతా" అని రెండు చేతులతో పసిదాన్ని లోపలకు లాక్కుపోయింది.
   
    కుమార్ ఒక్క నిముషం మెదలకుండా నిలబడి, తర్వాత పైకి వెళ్ళిపోయాడు.
   
    పది, పదిహేను నిముషాలు గడిచాక ప్రభావతి పైకి వచ్చింది. అప్పటికి కుమార్ నిద్రపోయే సన్నాహంలో వున్నాడు.
   
    ప్రభావతి వచ్చి మంచంమీద అతని ప్రక్కన కూర్చుంది.
   
    "విన్నారుగా, మీ ముద్దుల మరదలు మిమ్మల్నెలా తీసిపారేసిందో! ఇప్పటికైనా తెలివివచ్చిందా ఎవరెలాంటివారో!" అంది.
   
    కుమార్ ఏమీ జవాబు చెప్పలేదు.
   
    "మాట్లాడరేం? బెల్లంకొట్టిన రాయిలా, మా రాణి మా రాణి అని నెత్తికెక్కించుకున్నారు. మీ తిక్క బాగా కుదిరిందేం?"
   
    అతనేం మాట్లాడలేదు.
   
    "మాట్లాడరేం?"
   
    "ఇందులో మాట్లాడటానికేముంది?"
   
    "ఏమీలేదా? మీ మరదలు అలా అంటే మీకు కష్టం వెయ్యలేదా?"
   
    "వేసింది అయితే ఏం చేస్తాను? నీలా అరవమంటావా?"
   
    "అదిగో ఆ మాటే అనవద్దన్నాను. నేను అరుస్తున్నానా? పగలల్లా క్లినిక్ లో పనిచేసి ఏ రెండుమూడు గంటలో ఇంట్లో వుండేవారికి మీకేం తెలుస్తాయి మా బాధలు? నేనరవటమే కనిపిస్తుందిగానీ ఎందుకంటున్నానో ఒక్కరయినా అర్ధం చేసుకున్నారా?"
   
    కుమార్ మళ్ళీ మాట్లాడకుండా ఊరుకున్నాడు.
   
    "అదిగో ఏమీ చెప్పకుండా అలా ఊరుకుంటేనే నాకు మండుకొస్తుంది. మీరెన్నయినా చెప్పండి, మన పిల్లలంటే ఎవరికీ ఆపేక్షలేదు. వాళ్ళనెవరూ దగ్గరకు తియ్యరు. మీ తమ్ముడిపిల్లలు మనదగ్గరకొచ్చి, మన పక్కలుతొక్కి మనకి నిద్రలేకుండా చేసి ఇన్ని ఇబ్బందులు పడ్డాంకదా? వాళ్ళు మన పిల్లల్ని గదిలోకైనా రానిస్తారేమో చూడండి."
   
    "అయితే నన్నేం చెయ్యమంటావు? వాళ్ళు మన పిల్లల్ని చేరదియ్యకపోవటం నా తప్పంటావా?"
   
    "తప్పు, ఒప్పనికాదు. మనం ఆపేక్షగా వుంటున్నప్పుడు వాళ్ళెందుకుండకపోవాలి?"
   
    "దానికి నేనేం చెయ్యాలి?"
   
    "మీరేమీ చెయ్యరులెండి. అసలు మీతో చెప్పటంకన్నా ఏ గోడకైనా చెబితే ఉపయోగముంటుంది. ఇదంతా నా ఖర్మ. ఈ కొంపలో పడ్డందుకు నన్ననాలి. వెధవకొంప, వెధవకొంపా అని....."
   
    కుమార్ కి నషాళానికంటినట్లయింది. "ఇప్పుడేమంత విలయం జరిగిందని ఈ కొంపని నిందించటం" వెధవకొంప అని ఆమె అంటుంటే ఒక్క చెంపకాయ కొట్టాలన్నంత ఉద్రేకమొస్తుంది.
   
    ఆ గొడవగురించి ప్రభావతి గంటసేపు చెప్పింది. మధ్య మధ్య నెత్తి బాదుకుంది. చెబుతుంటే ఆమె ముఖం కందగడ్డలా అయింది. కంఠంమీద రక్తనాళాలు ఉబ్బాయి. ఆమె ఎంతచెప్పినా ఆమె సమస్యఏమిటో, ఎందుకు బాధపడుతుందో అతనికర్ధం కావటంలేదు. తన పిల్లల్ని వాళ్ళు చేరదియ్యలేదంటుంది. అది అతి ప్రచండమైన సమస్యా? పోనీ తనూ వాళ్ళ పిల్లల్ని చేరదియ్యటం మానేస్తే పోతుంది. దాన్నిగురించి అంత బాధపడటమెందుకు? అసలంత గడగడ గడగడమని మాట్లాడవలసిన అవసరం వుందా? మాట్లాడుతుంటే అవతలి వాళ్లకు తలనొప్పి వస్తుందనీ, వినేవాళ్ళకు కూడా సానుభూతి వుండదనీ ఆ మాత్రం ఊహించలేదా?
   
    పోనీ -చెప్పి చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుందేమోననుకున్నాడు కుమార్. ఉదయం తోడికోడలుకూ, తనకూ మధ్య జరిగిన రభస అంతా చెప్పింది. చెప్పి "నా తప్పేముంది చెప్పండి! తను అనవసరంగా ఎందుకు కల్పించుకోవాలి?" అని అడిగింది. ఆమెకిట్టే కన్నీళ్లు వచ్చాయి.
   
    "చెప్పండీ! మాట్లాడరేం?" అని అతని భుజాలు పట్టుకుని ఊపి అడిగింది.
   
    కుమార్ కి నిద్ర ముంచుకువస్తోంది. కళ్ళు మూసుకుపోతున్నాయి.
   
    "ఛీ! ఏం మనుషులు?" అని విసుక్కుంది ప్రభావతి.
   
    ఇంతలో మురళి పరిగెత్తుకుంటూ వచ్చి "అమ్మా! భాస్కరం మామయ్య వచ్చాడమ్మా! అన్నంపెట్టు" అన్నాడు.
   
    "వీడొకడు, నా ప్రాణానికి ఇది నా సొంతయిల్లు కాదన్న ఇంగిత జ్ఞానమన్నా లేదు వీడికి" అని సణుక్కుంటూ క్రిందికి దిగివెళ్ళింది ప్రభావతి.
   
                              * *  *
   
    భాస్కరం భోజనమైపోయాక తిరిగి పైకి వద్దామానుకుంటే వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడైతే చూసింది ప్రభావతి.
   
    రిక్షాలోంచి ఆమె పెద్ద ఆడపడుచు శకుంతలా, ఆమె పిల్లలూ దిగుతున్నారు.
   
    ప్రభావతికి సంతోషంతో ముఖం వికసించింది. ఇంటికెవరన్నా చుట్టాలొస్తే ఆమెకు ఉపద్రవమైన సరదా.
   
    "అత్తయ్యగారూ! పెద్ద వదినగారొచ్చారు" అంటూ గదిలో పడుకున్న శారదమ్మగారికి వినిపించేటట్లు అని తలుపు తీయటానికని వెళ్ళింది.
   
    రిక్షావాడికి డబ్బులిచ్చేసి పిల్లల్తో లోపలికొస్తున్న శకుంతలని కావలించుకున్నంత పనిచేసింది ప్రభావతి. 'ఉత్తరం రాయకుండా వచ్చేశారేం వదినగారూ? భలేవారే.....ఏరా రాజూ, ప్రకాశం బావున్నారా?" అంటూ పిల్లల్ని కుశలప్రశ్నలు వేసింది.
   
    శారదమ్మగారు లేచి ఇవతలకు వచ్చింది.

    శకుంతలగారి పిల్లలూ, ప్రభావతి పిల్లలూ, విమల పిల్లలూ అంతా కలిసి అప్పుడే అల్లరి మొదలుపెట్టారు.

    విమల గదిలోంచి బయటకు వచ్చింది.

    శకుంతల వుండేది దగ్గర ఊరే ఏలూరు. అందర్నీ చూడాలనిపించి వచ్చానని చెప్పింది శకుంతల.
   
    లోపలిగదిలో చదువుకుంటున్న సుజాతకూడా వచ్చి చేరింది.
   
    కుశల ప్రశ్నలయాక అంతా కబుర్లలో పడ్డారు.
   
                                                    * * *

 Previous Page Next Page