Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 27

   

       ఋతువులు మారినట్లు పిల్లల ఆటపాటలుకూడా సీజన్ ని బట్టి మారుతుంటాయి. ఆ సీజన్ లో ఊరంతా ఏ పిల్లలుచూసినా అవే ఆటలు ఆడుతూ కనిపిస్తారు.
   
    కొంతకాలం గోలీకాయలు, కొంతకాలం బొంగరాలు, కొంతకాలం కర్రా బిళ్ళా, మరికొంతకాలం బెచ్చాలు, అదీ మారిపోయి గాలిపటాలు ఇలా సీజన్ని బట్టి మారిపోతూ వుంటాయి.
   
    పైన దబాదబీ చప్పుడవుతుంటే ఏమిటో చూద్దామని ప్రభావతి పైకి వచ్చింది.
   
    అక్కడి దృశ్యం చూసేసరికి ఆమెగుండె ఆగిపోయినంత పనయింది. పిల్లలు ఎగరేస్తున్న గాలిపటం దారంతెగి, ఎలక్ట్రిక్ వైర్ కు చిక్కుకుపోయింది. మురళి పొడుగాటి కర్రపట్టుకుని పిట్టగోడకానుకుని కాళ్ళెత్తి నిలబడి ముందుకు వంగుతూ ఎలక్ట్రిక్ వైరునుండి ఆ గాలిపటాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ క్షణాన్నయినా వాడు బ్యాలెన్సు తప్పి పిట్టగోడమీదుగా వీధిలో పడిపోయేలా కనిపించాడు.
   
    కేక పెడితే వాడు అంతపనీ చేస్తాడని ప్రభావతి వెనకనుంచి చప్పుడు చేయకుండా వెళ్ళి గబుక్కున వాడి రెక్కపుచ్చుకుంది. ఒక్కఉదుటున ఇవతలగా లాగి, చేతిలో కర్ర లాగిపారేసి, వాడు తెల్లబోయి చూస్తూండగా దబదబా రెండు బాదింది. అక్కడుంటే తల్లి తననికూడా తంతుందని మల్లిబాబు క్రిందకు దౌడుతీశాడు.
   
    "వెధవల్లారా! మీ స్కూలుకు సెలవుకాదుగానీ మా ప్రాణాలు తోడేస్తున్నారు. పుస్తకాలు పట్టుకోండర్రా అంటే ఒక్కనిముషం పట్టుకోటం చేతకాకుండా వుంది. పొగరెక్కి ఛస్తున్నారు. వెధవల్లారా!" అని మరి రెండు తగిలించి మళ్ళీ గాలిపటం ఎగరేస్తే చంపేస్తానని వార్నింగిచ్చి క్రిందకెళ్ళిపోయింది.
   
    వంటింట్లో అత్తా చిన్నకోడలు కలిసి వంట చేసేస్తున్నారు.
   
    ప్రభావతి పైకెళ్ళగానీ విమల "అక్కయ్యగారు మొదట పిల్లల్ని గారాబం చేసి పాడుచేసేవారత్తయ్యగారూ! ఇప్పుడేమనుకుని ఏం లాభం?" అంది.
   
    శారదమ్మగారు విమలవంక విస్మయంగా చూసి "ఏమిటి? మీకు గారాబం చేయటంకూడా వచ్చునా? పుట్టినప్పటినుంచీ మీరు పిల్లల్ని బాదటమే చూస్తున్నా!" అంది.
   
    "అదేమిటత్తయ్యగారూ! మీరుకూడా అలానే అంటారు? మేము ఊరికినే బాదుతున్నామా చెప్పండి? వాళ్ళు ఎంతెంత అల్లర్లు చేస్తున్నారో చెప్పండి? మా ప్రాణాలు తోడేస్తున్నారుకదా!"
   
    "అయితే మేము మాత్రం పిల్లల్ని పెంచలేదంటావా? నేను ముగ్గురు కొడుకుల్నీ, అయిదుగురు కూతుళ్ళనీ కన్నాను. ఎప్పుడూ ఎవర్నీ ఒక్క దెబ్బ వెయ్యలేదు. మరి మేము ఎలా పెంచామంటావు?"
   
    "ఆ రోజుల్లో పిల్లలు వేరు, ఈ రోజుల్లో పిల్లలు వేరు అత్తయ్యగారూ!"
   
    "అలా అని నేను అనుకోవటంలేదు. ఆ రోజుల్లో తల్లులువేరు, ఈ రోజుల్లో తల్లులు వేరు అని అనుకుంటున్నాను."
   
    "పొండత్తయ్యగారూ! మీరలాగే అంటారు."
   
    ఇంతలో ప్రభావతి వచ్చి మళ్ళీ పనిలో కలిసింది.
   
    ఆమెకెందుకో తను లేనప్పుడు వాళ్ళిద్దరూ తనగురించి గుసగుసలు చెప్పుకున్నారన్న అనుమానం వచ్చింది. వాళ్ళ ముఖాలలా కనిపించాయి.
   
    "వాడ్ని పట్టుకు బాదేశావా?" అంది అత్తగారు.
   
    ఆమె అలా అనేసరికి ప్రభావతికి మండుకొచ్చింది. "నా పిల్లల్ని నేను బాదుకుంటున్నాను గానీ ఇంకెవరి పిల్లల్నీ బాదటంలేదుగా అత్తయ్యగారూ! నేను కొట్టటం కనిపిస్తుంది గానీ వాళ్ళుచేసిన అల్లరి కనిపించదు. అందరికీ నేను గయ్యాళిదానిలా కనిపిస్తాను. నా ఖర్మ అది."
   
    "ఇప్పుడు నేనేమన్నానమ్మా అంత విరుచుకుపడిపోడానికి? మీరు పిల్లల్ని అయినదానికీ, కానిదానికీ ఇలా కొట్టుకుంటుంటే నాకు చూడటానికి కష్టంగా వుంటుంది. నీ పిల్లలే అనుకో. అయినా నాకు మనుమలూ, మనుమరాళ్ళూ అయిపోతారన్న విషయం మర్చిపోకు."
   
    "ఆ మాట నేనెప్పుడూ కాదననత్తయ్యగారూ! కానీ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నా పిల్లల్ని మీరుగానీ, మామయ్యగారుగానీ ఎప్పుడయినా ముద్దుకు చేరదీశారా? మామయ్యగారు వాళ్లకు తాతగారు కదా? ఎంతసేపూ మేము పిల్లల్ని తిట్టుకుంటున్నా, కొట్టుకుంటున్నా కల్పించుకుని సాధించటమే గానీ ఎప్పుడయినా సాయంత్రాలు వాళ్ళని బయటకు తీసుకునివెళ్ళటం, దగ్గరకు తీసుకుని కథలూ కబుర్లూ చెప్పటం ఎప్పుడయినా చేశారా? ఆయన చదువుకుంటున్న రోజుల్లో పిల్లలతో ఆయన చదువు సాగక నానా హైరానా పడిపోతుంటే, ఆ విషయం అప్పుడప్పుడూ నేను ఉత్తరాల్లో వ్యక్తంచేసినా, ఒళ్ళూ పైనా తెలియకుండా పిల్లల్ని కంటుంటే ఏమవుతుందని ఎద్దేవా చేశారు గానీ పోనీ నేను బామ్మని కదా, నేను తాతయ్యని కదా అనుకుని మీ దగ్గర అలవాటు చేసుకునేందుకు ప్రయత్నించారా? ఇప్పటికయినా ముగ్గురు పిల్లలూ మేమూ ఒకగదిలో పడుకుని అవస్థపడుతుంటే మీదగ్గర ఒకరినైనా పడుకోబెట్టుకోవాలన్న ఆలోచన మీకువచ్చిందా?" అంటూ ప్రభావతి విజ్రుంభించింది.
   
    శారదమ్మగారికి కూడా ఆవేశం వచ్చింది "అయితే మీ పిల్లలంటే మాకు ప్రేమ లేదంటావా?" అన్నది వంకాయలు తరగటం గబుక్కున ఆపేసి.
   
    "ఏమో, అది మీ మనస్సుకి తెలియాలి అత్తయ్యగారూ! నాకిలా జరగటం లేదే అని నేను బాధపడుతున్నాను గానీ ఒకర్ని వేలెత్తి చూపించాలని కాదు."
   
    ఈసారి విమల కస్సుమంది. "మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారో గ్రహించలేనని అనుకోకండి అక్కయ్యగారూ! నా పిల్లల్ని అంతకన్నా ఎవరూ చేరదియ్యటంలేదు. వాళ్ళంతకన్నా దిక్కులేని పక్షుల్లాగా పెరుగుతున్నారు" అంది.
   
    "ఇదిగో విమలా, నిన్నొకమాట అనలేదు నేను. నా బాధ నేను చెప్పుకుంటున్నాను గానీ నిన్నేమీ వేలెత్తి చూపించలేదే?"
   
    "చూపించనక్కరలేదు. మీ ఉద్దేశాలన్నీ నాకర్ధమవుతూనే వున్నాయి."

    "అర్ధమవుతూనే వున్నాయా? ఏమిటి ఆ ఉద్దేశాలు చెప్పు వింటాను?"
   
    "మీకు విడమరిచి చెప్పడానికి నాకంత తీరుబాటు లేదు. ఎవరి మనస్సును వాళ్ళే ప్రశ్నవేసుకుంటే తెలుస్తుంది. అయినా మీ వాదన నాకనవసరం" అని విమల అక్కడ్నుంచి తటాలున లేచిపోయింది.
   
    "చూశారా, చూశారా అత్తయ్యగారూ! ఇప్పుడు నేనేమన్నానని అంత దూకుడుగా వెళ్ళిపోయింది? నేనేమన్నానని అసలు? అవున్లెండి, నాదే తప్పు మనసులో వున్నది వున్నట్లుగా వెళ్ళగ్రక్కేస్తాను. తడి గుడ్డలతో గొంతులు కోయటం నాకు చేతకాదు" అంది ప్రభావతి.
   
    ఈ మాటలు వెళ్ళిపోతున్న విమలకు వినిపించాయి. ఆమె వెళ్ళిపోయినంత విసురులోనూ మళ్ళీ తిరిగివచ్చింది.
   
    "ఏమిటంటున్నారు? నేను తడిగుడ్డలతో గొంతులుకోసే రకమనేగా? అలాంటి బుద్ది మా ఇంటా వంటా లేదు. డొంకతిరుగుడు మాటలు మాట్లాడటం మాకు చేతకాదు. ఊరికినే అనవసరంగా నోరు పారేసుకోకండి" అంటూ కయ్యిమంది.
   
    "ఇదిగో విమలా! నేను నీతో ఏమీ మాట్లాడలేదు. అత్తయ్యగారితో ఏదో మాట్లాడుకుంటుంటే నువ్వొచ్చి అరుస్తావెందుకు?" అంది ప్రభావతి లేచి నిలబడుతూ.
   
    "అత్తయ్యగారితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా నా ఊసు వచ్చింది కాబట్టి అరుస్తాను. అంతు తేల్చుకుంటాను కూడా నా గురించి చెడ్డగా మాట్లాడటానికి మీకేం అధికారముందు?"
   
    "నాగురించి నువ్వు మాట్లాడినప్పుడో."
   
    "మీ గురించి నేను చెడ్డగా ఎప్పుడూ మాట్లాడలేదు."
   
    "బుకాయించగానే సరికాదు. లక్షసార్లు నేను చెవులారా విన్నాను."
   
    "అంత చెవులారా వింటే అప్పుడే ఎందుకు నిలదీసి అడగలేదు?"
   
    "అడిగేదాన్నే నువ్విప్పుడిలా మాట్లాడతావని తెలిసివుంటే అప్పుడు తప్పకుండా అడిగి వుండేదాన్ని."
   
    "అవునవును మీరు తడిగుడ్డలతో గొంతు కొయ్యనిరకం కదూ? అందుకని ఊరుకుని వుంటారు" అని విమల అక్కడ్నుంచి మళ్ళీ దూకుడుగా వెళ్ళిపోయింది.
   
    శారదమ్మగారు నిర్ఘాంతపోయి అలానే కూర్చుండిపోయింది. పదినిముషాల క్రితం ముగ్గురూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇంతలో ప్రళయం జరిగిపోయినట్లు బద్ధవిరోధుల్లా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలా గట్టిగా అరుచుకుంటుంటే ఆమెకు కాళ్ళుకూడా వణికాయి.
   
    హాల్లో పిల్లల గొడవ మళ్ళీ ఎక్కువయింది. ప్రభావతి ముగ్గురుపిల్లలూ ఒకచోట చేరారు. దానికితోడు విమల ఇద్దరు పిల్లలుకూడా అక్కడే తారట్లాడుతున్నారు.

 Previous Page Next Page