Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 27

    పదిన్నర దాటుతున్న సమయంలో కామాక్షి భర్త గదిలోకి వచ్చింది. మంచినీళ్ళ గ్లాసు ప్రక్కన వున్న స్టూలు మీద పెట్టి గ్లాసుమీద మూతపెట్టి, "అమ్మకి మాత్ర ఇవ్వటం మరిచిపోయాను. మాత్ర ఇచ్చి వస్తాను!" అని బయటకి వెళ్లింది.

    భార్య అటు బయటికి వెళ్ళగానే టక్కున స్ప్రింగ్ లాగా మంచంమీదినుంచీ లేచాడు పాండురంగం. అలమరాలో వున్న హోమియోపతి మాత్రలు వున్న చిన్నపెట్టె తీసి అడుగు ఎర్ర గుర్తు పెట్టివున్న సీసాలోని రెండు మాత్రలు చేతిలోకి తీసుకున్నాడు.

    అవి హోమియోపతి మాత్రలు కావు. గాఢంగా నిద్రపట్టే నిద్రమాత్రలు. పాండురంగం ఆ రెండు మాత్రలని నీళ్ళ గ్లాసులో పడేసి ఏమీ ఎరగనట్లు మళ్లీ మంచంమీద అటు తిరిగి పడుకున్నాడు.

    పది నిముషాల తరువాత కామాక్షి గదిలోకి వచ్చింది.

    "నేను రావటం ఆలస్యం అయింది కదూ!" కామాక్షి నవ్వుతూ అడిగింది.

    "ఫరవాలేదు అదేం మాట!" అన్నాడు పాండురంగం.

    భర్త ఏవో మాత్రలు తీసి తను త్రాగే మంచినీటి గ్లాసులో వెయ్యటం కామాక్షి చూసింది. అయితే ఆ విషయం అతనిని అడగలేదు.

    అతను నిద్రమాత్రలు లాంటివేవో నీటిలో కలుపుతున్నాడు. ఆ నీళ్లు త్రాగి హను గాఢనిద్రపోతోంది. తనని నిద్రపుచ్చి ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. 

    "ఇదేమిటి?" అని ఒకవేళ అడిగినా మళ్లీ అబద్ధం ఆడతాడు. భర్తచేత మరో అబద్ధం ఆడించేకన్నా, తను ఆ నీళ్లు త్రాగినట్లు నిద్రపోయినట్లూ నటించి, భర్త బయటికి బయలుదేరంగానే తనూ అతనిని వెంబడించి చూస్తే. నిజానిజాలు బయట పడతాయి. పదేపదే తను ప్రశ్నించడం ఆయన అబద్ధాలు ఆడటం ఇదంతా ఎందుకొచ్చిన గోల అనుకుంది కామాక్షి.

    భర్త పని చూసిన కామాక్షి ఆ రాత్రి ముచ్చటగా భర్తతో కబుర్లు చెప్పలేకపోయింది.

    పడుకోబోయే ముందు మంచినీళ్ళు తాగినట్లు నటించి, అతను చూడకుండా ఆ నీళ్ళని కిటికీలోంచి వేగంగా బయటకి పారబోసింది.

    భార్య చేసిన పనిని చూడని పాండురంగం ఆమె నిజంగానే మంచినీళ్ళు తాగింది అనుకున్నాడు.

    ఆ తరువాత.

    పడుకొన్న పది నిముషాలు పూర్తి కాగానే కామాక్షి గాఢనిద్ర పోతున్నదానిలా నిద్ర నటించడం మొదలుపెట్టింది.

    పాండురంగం భార్యని పిలిచి చూశాడు గట్టిగా కుదిపి చూశాడు.

    గాఢనిద్రపోతున్నట్లు నిద్ర నటిస్తున్న కామాక్షి అలాగే నిద్రపోతోంది.

    పాండురంగం భార్య నిద్రపోతున్న దానికి తృప్తిచెంది, మంచం మీది నుండీ నెమ్మదిగా లేచాడు. లుంగీ విప్పేసి, పాంటు షర్టూ ధరించి ఎప్పటిలా, పిల్లిలా నడుస్తూ పడక గది తలుపులు బాగా దగ్గరకి లాగి పెరటి మార్గం పట్టాడు.

    అతని వెనుకనే కామాక్షి కూడా లేచింది.

    భర్త గమనించకుండా జాగ్రత్తపడుతూ, అతని వెనుకనే బయలుదేరింది.

    "భగవంతుడా నా అనుమానం నిజమయింది. మాత్రలువేసి ఈయన నన్ను నిద్ర పుచ్చుతున్నారు. ఈయన, రిక్షా లాగటం లేదు. రాత్రిళ్ళు బయటికి వెళ్ళి ఏదో కానిపని చేస్తున్నారు.

    ఆయనచేసే ఆ కాని పని, నా కళ్ళపడ్డా, నాకు తట్టుకునే మనోధైర్యం ఇవ్వు! నిజం తెలుసుకున్న తరువాత ఆయనని మంచివాడిగా మార్చుకుంటాను" ఇలా అనుకుంటూ పాండురంగానికి తెలియకుండా, అతనికి కొంతదూరాన, తప్పుకు తప్పుకు నడవసాగింది.

    తనని తన భార్యే అనుమానిస్తున్నదని గ్రహించని పాండురంగం దీర్ఘాలోచనలో తలవంచుకుని ముందుకి సాగుతున్నాడు. ఆ సమయంలో అతని మనసు మనస్సులో లేదు. ఒక పిచ్చివాడిలాగా అన్యమనస్కంగా ఆలోచిస్తున్నాడు.

    చీకటి రాత్రిళ్ళు కావటం కూడా మంచిదే అయింది.

    పాండురంగం ఒక వీధిలోకి ప్రవేశించాడు.

    కామాక్షి అదే వీధిలోకి ప్రవేశించింది అక్కడ? 

   
                                        20


    సాయంత్రం అయిదు యాభై.

    ఆరోజు పార్కులో పెద్దగా మనుష్యులు లేరు. విసిరేసినట్లు చాలా దూరదూరంగా, వున్న ఆ కొందరూ ఒంటరిగా చదువుకోవటమో, ఇద్దరు ఇద్దరుగా కూర్చుని మాట్లాడుకోవటం చేస్తున్నారు.

    ఇప్పుడు ఇన్ స్పెక్టర్ మనోజ్ డ్యూటీలో లేడు.

    పార్కులో పచ్చగడ్డి మీద మేనువాల్చి, రెండు చేతులూ మడిచి తలక్రింద పెట్టుకుని ఆకాశం వైపు దృష్టి సారించి అంతులేని ఆలోచనలు చేస్తున్నాడు.

    వృత్తిపరంగా మనోజ్ పోలీసు ఇన్ స్పెక్టర్. మనస్సు అందరిలాంటిదే. అతని ఆలోచనలు అతనికున్నాయి. అతని బాధలు అతనికున్నాయ్.

    పార్కుకి రావడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది అనుకున్నాడు గానీ, మనస్సులో లేని ప్రశాంతత పచ్చగడ్డిమీద దొర్లితే వస్తుందా?

    ఇన్ స్పెక్టర్ మనోజ్ పడుకొని అలా ఆలోచిస్తూ వుండగా అనుకోకుండా అదే పార్కుకి బబిత వచ్చింది. ఆమె సరాసరి ఇటు పక్కకే రావటంవల్ల, మనోజ్ ని చూడటం జరిగింది.

    అల్లంతదూరాన బబిత నిలుచుండి పోయింది. అతడినే చూస్తూ.  

    మనోజ్ అసహనంగా కదులుతున్నాడు. దీర్ఘాలోచన చేస్తున్నాడు. అది గమనించిన బబిత అతని దగ్గరగా వచ్చింది.

    అతని మీదకి కాస్త వంగి "హాయ్!" అంది బబిత.

    వెంటనే స్ప్రింగ్ లాగా పైకిలేచి, బబితను చూస్తూనే "నువ్వా తల్లీ!" అని ఒక పోజు పారేసి తాపీగా మళ్లీ కూర్చున్నాడు.

    చేతులు గట్టుకుని తమాషాగా చూస్తూ "నేనిక్కడ కూర్చోవచ్చా? ఇన్ స్పెక్టర్ జీ!" అంది బబిత.

    "ష్యూర్! ఈ పార్కు నా సొంతం కాదు కదా! నాదో విన్నపం! డ్యూటీలో వున్నప్పుడు ఎలాగూ "ఇన్ స్పెక్టర్ జీ" అనే అంటున్నావు, మనిద్దరి వృత్తి విషయం వదిలేస్తే మా మావయ్య ఫ్రెండ్ కూతురివి నువ్వు.

    నేను ఈ ఊరు వచ్చిన తరువాత మా యింటికి ఏ పదిసార్లో వచ్చి వుంటావ్! ఇకపై మనం ఈ మన్నింపులు మానేసి, పేరుపెట్టి పిలుచుకుందాం. నీకేమన్నా అభ్యంతరమా బబితా?" అడిగాడు మనోజ్.

    "నాకేం అభ్యంతరంలేదు మనోజ్జీ!" తమాషాగా అంది బబిత.

    "మధ్యలో ఈ 'జీ' ఏంటి?" మనోజ్ అడిగాడు.

    "వద్దంటే మానేస్తాను జీ!"

    "మానేస్తే సంతోషిస్తాను బబితాజీ!"

    మనోజ్ నవ్వుతూ అనేసరికి బబిత కూడా అతనితోపాటు నవ్వేసింది.

 Previous Page Next Page