Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 26

    ఆలోచిస్తున్న సుధ వళ్ళు చల్లబడింది.
   
    తప్పదు. ఎలాగయినా తెల్లవారేవరకూ ఓపికపట్టాలి. అతని మాటలకు అడ్డుతగలకూడదు. అతను చెప్పినట్టే నడుచుకోవాలి.
   
    "రా! సుధా! ఇలా వచ్చి కూర్చో!"
   
    కంగారుగ భర్తను చూసింది.
   
    అతని గొంతు కొత్తగా వుంది.
   
    ముఖంలో ఏవేవో నీడలు పాకుతున్నట్టుగా తోచింది సుధకు.
   
    మౌనంగా వెళ్ళి భర్తకెదురుగా వున్న సోఫాలో కూర్చుంది.
   
    "జగన్మోహన్ రావు వీకు తెలుసా?"
   
    ఆ గొంతులో ఎన్నో అపస్వరాలు విన్పించాయి సుధకు.
   
    "జగన్మోహన్ రావా?"
   
    ఎక్కడో చూస్తూ అందామె.
   
    "అవును జగన్మోహన్ రావే! ఎం. ఏ. లో నీ క్లాసుమేట్!"
   
    సుధ ఓ క్షణం ఆలోచించి "ఏమో గుర్తురావడంలేదు" అంది.
   
    ఆమాట వింటూనే అదోలా నవ్వాడు కృష్ణ.
   
    ఆ నవ్వుకు ఆమె ఒళ్ళు జలదరించిపోయింది.
   
    "అవునవును! ఆ పేరుగల అతను ఒకడు మా క్లాస్ లో వుండేవాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది" సుధ తడబడుతూ అంది.
   
    కృష్ణ చివ్వున లేచి నిలబడ్డాడు.
   
    "సుధా! ఇహ ఆ డొంకతిరుగుడు సమాధానాలు మానెయ్. అడిగిన డానికి సూటిగా సమాధానం చెప్పు" కృష్ణ గొంతు తీవ్రంగ వుంది.
   
    "ఉన్నాడు. వుంటే?"
   
    భర్త కళ్ళలో కదులుతున్న ఎర్రజీరలు చూస్తున్న సుధ గుండెలు అవిసిపోయాయి.
   
    "అతడిని నువ్వు ప్రేమించావు."
   
    సుధ కనుపాపలు గుండ్రంగా తిరిగాయి.
   
    "నువ్వు పెళ్ళికాకముందే తల్లివయ్యావు!"
   
    సుధ కళ్ళముందు ఇనుపతెరలు తెగిపడ్తున్నాయి.
   
    చీకట్లు ముసురుకొంటున్నాయి.
   
    "మద్రాస్ లో జగన్మోహన్ కనిపించాడు. నీవు నా అర్ధాంగివని అతనికి తెలియదు. నువ్వు కాలేజీలో వేసిన మోనాలిసా వేషం దగ్గిరనుంచీ మీ ఊటీప్రయాణం, మీ ప్రణయం, మీ తండ్రి అతడిని తరిమేసి నీకెలా పెళ్ళిచేశాడోవరకు అన్ని విషయాలూ చెప్పాడు. నేను చెప్పిన కథలో హీరో, హీరోయిన్లు ఎవరో నీకు చెప్పనవసరంలేదనుకుంటాను. ఎటొచ్చీ ఈ కథలో విలన్ మీ నాన్నే! మీ ఇద్దరి తప్పూ లేదు. పరిస్థితులకు లొంగిపోయారు. ఓ క్షణం ఆగాడు. నిట్టూర్పు విడిచాడు.
   
    మళ్ళీ ప్రారంభించాడు__"జరిగిందేదో జరిగిపోయింది. నీ బిడ్డ మోనా అనాధలా హాస్టల్లో వుంది. ఆ బిడ్డకోసమైనా తల్లిగా....."
   
    సుధ వెర్రిగా అరిచింది.
   
    ఆ అరుపుకు కృష్ణ అదిరిపోయాడు-
   
    సుధ రెప్పవాల్చకుండా, నిలువుగుడ్లేసి భర్తకేసి చూడసాగింది.
   
    కృష్ణ ఆదుర్దాగా లేచివచ్చి ఆమెను పట్టుకున్నాడు.
   
    అతడి చేతుల్ని తోసేసి దూరంగా జరిగిందామె.
   
    "సుధా! ఇక ఈ నాటకం చాలించు. నాకంతా తెలిసిపోయింది. అయినా నీమీద సానుభూతేకాని ద్వేషంలేదు. మళ్ళీ మీ ఇద్దర్నీ కలపాలనే ఉద్దేశ్యంతోనే ఇదంతా చెబుతున్నాను. దైవసాక్షిగ చెబుతున్నాను. నామాట నమ్ము!"
   
    ప్రాధేయపడ్తున్న భర్త ముఖంలో ఓ క్షణం చూసి ముఖం పక్కకు తిప్పుకొంది.
   
    తన భర్త ఉన్మాదావస్థలో వున్నాడు.
   
    అతనిలో మానసిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్నట్టుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వెర్రిమొర్రి ఊహాచిత్రాలు అతని మనసులో కదులుతున్నట్టున్నాయి. ఈ స్థితిలో అతడిని తను ఆపగలదా? తన వల్లకాదు.
   
    అందువల్ల అతనిలోని ఈ మానసిక వైకల్యం మరీ తీవ్రరూపం కావచ్చును. తెల్లవారి సైకియాట్రిస్టు దగ్గిరకు తీసికెళ్ళవచ్చును. కనీ అంతవరకూ అతన్ని శాంతింపచెయ్యాలంటే మరోమార్గం లేదు. అతను చెప్పినదంతా వినాలి. అతను చెయ్యమన్నదల్లా చెయ్యాలి.
   
    "జగన్మోహన్ దృష్టిలో నువ్వు దేవతవు. ప్రేమమూర్తివి" ఆగి ఆమె ముఖంలోకి చూశాడు.
   
    సుధ తలవంచుకొని ఆలోచిస్తూంది.
   
    "నీ ఆరాధనలోనే అతను తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించేసుకొంటున్నాడు. నీకోసం తన జీవిత సర్వస్వం ధారపోయడానికి సిద్దంగా వున్నాడు."
   
    మురళీకృష్ణ చెప్పుకుపోతున్నాడు.
   
    సుధ కొయ్యబొమ్మలా చలనరహితంగా వింటూ కూర్చుంది.
   
    "పవిత్రమైన ప్రేమకోసం__కనీసం పాప మోనాకోసం అయినా నువ్వు అంగీకరించి తీరాలి."
   
    "కృష్ణ సుధ రెండుచేతులూ పట్టుకొని ఆమె సమాధానంకోసం ఆమె కళ్ళల్లోకి చూశాడు.
   
    "ఇంతకీ నన్నేం చెయ్యమంటారూ?"
   
    సుధ కంఠం వణికింది.
   
    "జగన్మోహన్ దగ్గిరకు వెళ్ళిపో. అతడిని పెళ్ళిచేసుకో."
   
    "పెళ్ళా?"
   
    "అవును! రేపే మనం డైవర్సుకు అప్లయి చేద్దాం. డైవర్సుకు కోర్టు అనుమతి పొందగానే జగన్మోహన్ ను పెళ్ళిచేసుకోవచ్చు."
   
    సుధ రెండుచేతులతో ముఖం కప్పుకొంది.
   
    ఆమె గుండెల్లో సూదులు గుచ్చినట్టుగా వుంది.
   
    కడుపులో పేగులు తెగిపడుతున్నట్టుగా వుంది.
   
    "ఇప్పుడు నీ బాధేమిటో నేను అర్ధంచేసికోగలను సుధా!" అంటూ కృష్ణ ఆమె చేతుల్ని తీసి ఆమె ముఖంలోకి చూశాడు.
   
    "నీ కడుపులో వున్న ఆ బిడ్డను గురించి నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. జగన్మోహన్ చాలామంచివాడు. నీకు పుట్టబోయే బిడ్డను తనబిడ్డగానే స్వీకరించగలడు. మోనాతోపాటే ఈ బిడ్డనూ తన బిడ్డగానే ఆదరిస్తాడనే నమ్మకం నాకుంది. లేదూ__మీ ఇద్దరికీ ఇష్టమైతే నా బిడ్డను నేనే తెచ్చి పెంచుకుంటాను...."
   
    సుధ వెర్రిగా అరిచింది.
   
    కిటికీపక్కనుంచి ఉత్త తీతూపిట్ట అరుస్తూ వెళ్ళిపోయింది.
   
    హాల్లో గడియారం రెండుగంటలు కొట్టింది.
   
    సుధ ముఖం పాలిపోయింది.
   
    వళ్ళంతా చన్నీళ్ళకుండలా అయింది,
   
    ఆమె చూపులు తేలిపోతున్నాయి,
   
    ఆమెను చూస్తూ కృష్ణ కంగారుపడిపోయాడు. అయినా ఒకందున సంతోషంగ వుంది అతనికి.
   
    తను చెప్పదలచిందేదో చెప్పాడు.
   
    మనసుల్లోని చిక్కు విడిపోయింది.
   
    గుండెల్లోని బరువు దిగిపోయింది.
   
    "సుధా! సుధా!" ఆమె తల నిమురుతూ అనునయించసాగాడు.
   
    ఐదునిముషాలకు సుధ తేరుకొంది.
   
    "భార్తకేసి కళ్ళు తిప్పుతూ చూసింది.
   
    "మీరు నిజంగా దేముడిలాంటివారు."
   
    "ఛ! ఛ! అంత పెద్దమాటలెందుకు సుధా? నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఇందులో నేను చేస్తున్న త్యాగం ఏమీలేదు."
   
    "మీరు....మీరు నన్ను ప్రేమించడంలేదా?"
   
    "ఒకప్పుడు ప్రేమించాను. వాంచించాను. కాని ఇప్పుడు కాదు."
   
    "అంటే ద్వేషిస్తున్నారా?"
   
    "లేదు. ఇప్పుడు ద్వేషించాల్సిన కారణంలేదు. నువ్వు జగన్మోహన్ దగ్గిరకు వెళ్ళడానికి అంగీకరించాక  నిన్ను ద్వేషించే ప్రసక్తే రాదు. పైగా గౌరవిస్తాను. మనం భార్యాభర్తలుగా బ్రతకాల్సివస్తే ఒకరినొకరు ద్వేషించుకొంటూ బ్రతకాల్సివుంటుంది. మనకు పుట్టబోయే బిడ్డ జీవితం కూడా దుర్భరమవుతుంది" ఓ క్షణమాగాడు ఆమెకేసి చూశాడు.
   
    మళ్ళీ అందుకొన్నాడు__"అటు జగన్మోహన్, మోనా, ఇటు మనిద్దరం-పుట్టబోయే బిడ్డా-అందరి జీవితాలూ నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడివున్నాయి. మరి నువ్వు ఏంచేస్తావో__జగన్మోహన్ కు ఇల్లాలివై అందరి జీవితాలకూ సుఖశాంతులు ప్రసాదిస్తావో__లేక - నాకు భార్యగానే వుండి అందరి జీవితాలనూ దుర్భర సంక్షోభానికి గురిచేస్తావో- అంతా నీ చేతిలోనే వుంది. నీ నిర్ణయంమీదే మనందరి భవిష్యత్తు ఆధారపడివుంది సుధా."
   
    భర్త ముఖంలోకి తేరిపార చూసింది.
   
    మౌనంగ ఎక్కడో దేన్నో చూస్తున్నట్లు వుండిపోయింది.
   
    "మాట్లాడవేం?"
   
    భర్త గొంతు వింతగా ధ్వనించింది.

 Previous Page Next Page