Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 26


    అలాగే నీ ఇష్టానుసారమే చేద్దాం. మీ బుచ్చికక్కి వచ్చిం తరువాతే వెళుదువుగాని. ముందా ఏడుపు ఆపు. నేను దేన్నయినా భరిస్తాను గాని ఆడపిల్ల ఏడిస్తే భరించలేను. అందుట్లో నీలాంటి అందమైన ఆడపిల్ల ఏడిస్తే అసలు భరించలేను" అన్నాడు ఇందర్.

    అవంతి కళ్ళు తుడుచుకుంది. "పిచ్చి నాయనా! నేను అందమైన ఆడపిల్లను కనుకే అమాయకంగా నేను చెప్పేది నమ్మావ్. అప్పుడే ఏమయింది ముందు ముందు చూద్దువుగాని" అనుకుంది.

    "ముందు ఈ అమ్మాయితో మంచిగా వుండాలి. తనవల్ల భయంగాని ప్రమాదం గాని లేదని నమ్మించాలి. ఉత్త అమాయకురాలి లాగుంది. మాటల్లో పెట్టి మధ్య విషయాలు లాగుతూ నిజం తెలుసుకోవాలి. బుచ్చికక్కి విషయం తనంతట తానుగా చెప్పింది. బలవంతానా పెళ్ళి కూతుర్ని చేశారని చెప్పింది.

    అలాగే నెమ్మదిగా ఒక్కొక్కటీ చెపుతుంది దాంతో జరిగిందంతా తనకి అర్ధమైపోతుంది. తను అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కరెక్ట్ గా తెలుసుకోగలుగుతాడు.

    తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళమంటే వెళుతుంది కాని బాగా బెదిరిపోయి ఉంది. భయంతో ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే? ఈ అమ్మాయి ఇక్కడ వుంటే తనకేమైనా ఇబ్బందా! ఓ విధంగా ఇబ్బందే. అయినా ఆపదలో వున్న అమ్మాయికి చేయూతనివ్వటం ధర్మం. ధర్మా అధర్మాలు తన వృత్తికి....ఉహూ ఇప్పుడు వృత్తి సంగతి దేనికి! ముందు తను చేయవలసింది....

    "బాబుగారూ!" అవంతి వినయంగా పిలిచింది.

    ఇందర్ ఉలిక్కి పడ్డాడు. ఆలోచనా స్రవంతిలోంచి బైటపడ్డాడు. తన చెవులకి ఇప్పుడేమైనా వినపడిందా!

    "బాబుగారూ" అవంతి మరోసారి వినయంగా పిలిచింది.

    "ఏయ్....ఏయ్ ఏంటా పిలుపు....బాబుగారా! ఇంకా నయం బాబాయిగారనో, తాతగారనో పిలవలేదు" ఇందర్ వ్యంగ్యంగా అన్నాడు.

    "నేనేమన్నా తప్పుగా మాట్లాడానా బాబుగారూ!"

    "మరోసారి అలా పిలిచావంటే వూరుకోను. నా పేరు ఇందర్. ఆ పేరుతో పిలువు."

    "ఇ, హి....మీ పేరు ఇంద్రుడా!" అవంతి ఓ నవ్వు నవ్వి అడిగింది.

    "నా పేరు ఇంద్రుడు కాదు. దేవేంద్రుడు కాదు.ఇందర్.... ఇందర్...." 

    "ఇందర్ ....బాగుంది."

    "రక్షించావ్, బాగుండకపోతే ఓ రాగం తీసే దానివా!" అనుకున్న ఇందర్ నెక్ట్స్ ఏమిటా  అని ఆలోచించాడు.

    అవంతి కొద్ది సేపు మౌనం వహించింది.

    కొద్దిసేపు తర్వాత ఇందర్ ఆలోచించుకొని "అపర్ణా" అని పిలిచాడు.

    అరచేతిలో గోరింటాకు చూసుకుంటున్న అవంతి అతను ఎవరిని పిలిచాడా అని తలెత్తి చూసింది.

    "చూడు అపర్ణా! నేనో నిర్ణయానికి వచ్చాను. నీకూ ఇష్టమైతే అలా చేద్దాం" అన్నాడు ఇందర్.

    అప్పుడు గుర్తుకు వచ్చింది అవంతికి. ఇందర్ కి తన పేరు అపర్ణగా చెప్పినట్లు. తను ఇహపై ప్రతి చిన్న విషయానికీ జాగ్రత్తగా వుండాలనుకుంది. "చెప్పండి" అంది.

    "నీ గతం ఏమిటో నాకు తెలియదు. నిన్ను నేను ఏమీ అడగను. మీ బుచ్చికక్కి వచ్చిందాకా ఇక్కడే ఉందువుగాని. కాని ఈ ఇంట్లో ఇద్దరు బ్రహ్మచారులు తప్ప నీకు తోడుగా ఆడమనిషి ఎవరూ లేరు. నా వల్ల నీకేం భయంలేదు. నీకు తెలియదుకాని నేను చాలా మంచివాడిని. నీకు ఇష్టమైతే ధైర్యంగా వుండు, కాదంటే ఏం చేయాలో నీవే చెప్పు" అన్నాడు ఇందర్.

    నెమ్మదిగా ఆ అమ్మాయి కథ ఏమిటో బయటకు లాగి క్షేమంగా వాళ్ళవాళ్ళకి అప్పగించాలని ఇందర్ ఆలోచన.

    "ఎవరైనా వస్తే ఏం చెప్పను" ఇక్కడికి ఎవరెవరు వచ్చిపోతారో తెల్సుకోవడానికి తెలివిగా అడిగింది అవంతి. ఎవరైనా వచ్చిపోతే జెండా వెంటనే ఇక్కడి నుంచి ఎత్తేయాలని అవంతి ఆలోచన.

    "ఎవరూ రారు. మా ఇంటివాళ్ళ కుక్కపిల్ల కూడా రాదు. చంద్ర వారందాకా రాడు. నేనొక్కడినే, నా వల్ల భయం వుండదని గట్టిగా మాట ఇస్తున్నాను. డ్యూటీ వున్నప్పుడు వెళ్ళి తర్వాత వస్తూంటాను" ఇందర్ చెప్పాడు.

    "మాటకు ముందు నావల్ల భయంలేదు, నేను మంచివాడినని ఈ ఇంద్రసేనుడుగారు ఎందుకు చెబుతున్నట్లు. గుమ్మడికాయల దొంగ భుజం తడుముకున్నట్లు వుంది" అనుకుంది అవంతి.

    ఒకరికి తెలియకుండా ఒకరు నాటకం ఆడుతున్నారు. ఇరువురు ఈ విషయంలో చాలా జాగ్రత్తపడ్డారు. ఎవరికివారే వారి వృత్తిలో ఆరితేరిన ఘనులు. ఏ విషయంలోనూ ఒకరికొకరు తీసిపోరు. ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చిం తర్వాత అప్పుడు డ్రస్ మార్చుకోవడానికి ఇందర్ లేచాడు.


                          *    *    *


    అప్పటికి పూర్తిగా తెల్లవారిపోయింది.

    అవంతి చాలా తెలివిగా మెలగటం మొదలు పెట్టింది. పెరటి వైపు సందులోకి వెళితే ఇంటివాళ్ళు చూస్తారని అటు వెళ్ళలేదు. ఆరోజు అవంతి అనుకుంది పెరటి తలుపు ద్వారా బయటకు వెళ్ళిపోదామని. చంద్ర అటువైపు తాళం వేసి వెళ్ళాడని, అటు నుంచి పారిపోయేమార్గం అసలులేదని....ఇంట్లోకి నీళ్ళు కావాలంటే అటు నుంచి తప్ప తెచ్చే మార్గం మరొకటిలేదని....ఈ విషయాలన్నీ తర్వాత తెలుసుకోగలిగింది. ఇందర్ రాకపోతే తన పని అల్లాబిస్మిల్లా అయ్యేదని కూడా అవంతి గ్రహించుకుంది. సమయం చూసుకొని వెళ్ళిపోవాలి. దానికోమంచి ముహూర్తం చూడాలి. 

 Previous Page Next Page