Previous Page Next Page 
అభయారణ్యం పేజి 26


    "మీ యిష్టం."

    "మీ ఫోన్ నెంబరివ్వండి. అది చాలు."

    అరనిమిషం మౌనంగా వుండిపోయింది.

    "మీకు అభ్యంతరమైతే వద్దు."

    "నేను తప్పు చేయడంలేదని నేను అకున్నంతకాలం నేను సంకోచించాల్సిన అవసరంలేదు."

    అనలేదు.

    అనుకుంది.

    ఫోన్ నెంబరిచ్చేసింది.

    పెళ్లయిన మూడేళ్లకాలంలో ఆర్చి చాలా ధైర్యంగా తీసుకున్న తొలి నిర్ణయమిది.
 
    ఇది సాహసమా....

    ఏమో.......

    ఆమెకీ తెలీదు.


                       *    *    *    *   

       
    అపరాత్రివేళ....

    నిద్ర రాక బడలికగా అటూ ఇటూ బెడ్ మీద దొర్లుతుంది ఆర్తి.
 
    ఆమె పక్కన ఓ నవల వుంది. తేజా రాసిందే....

    కొన్ని నిమిషాల క్రితందాకా అది ఆమె గుండెల పై వుంది.

    అందులో ప్రతి వాక్యమూ తను కోల్పోయిందెంతో తెలియచెప్పి గుండె లోతుల్లో చిత్రమైన ధ్వనికీ, ప్రతిధ్వనికీ కారణమవుతుంటే తేజా గుర్తుకొస్తున్నాడు పదే పదే.

    అతడ్ని కలుసుకోలేదు యింతవరకూ....

    కేవలం అతడి ఫోటో మాత్రం చూసింది.

    సాలోచనగా, జాలిగా, గంభీరంగా విచ్చుకున్న  పెదవులతో సమక్షంలో లేకపోయినా సరదాల అగవత్తుల సౌరభాన్ని వెదజల్లగలిగే శక్తి వున్నట్టు యింత స్వల్ప వ్యవధిలోనే ఎంతటి ప్రభావాన్ని చూపించగలిగాడు.

    ఎంత బాగా మాట్లాడతాడు.

    ఫోన్ లో అయితేనేం పక్కన కూర్చుని విస్పరింగ్ గా  ఏదో చెబుతున్నట్టు. తలపుల మొగలిపువ్వులా గుచ్చుకుంటూ మాట్లాడినంతసేపూ కంగారు పెడుతూనే వుంటాడు.

    నిస్పృహలో నీరసించిన మనుసుకి  అంతట వూరట కలిగించగల అతడిదా?అతనిలోని రచయితదా?

    దీన నయనాల్ని, మౌన విశ్వాసాల్నీ అర్దం చేసుకున్నవాడిలా ఎంతటి కరుణ - మరెంతటి ఆత్మీయత అతడి గొంతులో.

    ఫోన్ రింగయింది వున్నట్టుండి.

    ఆలోచనలనుంచి తేరుకుంటూ గభాలున రిసీవరు అందుకుంది.

    భాస్వంత్ అనుకుంది.

    కాదు అతడే... తేజా!

    "హల్లో!"

    ఉలికిపాటుగా లేచి కూర్చుంది.

    "మీరా!"

    "ఏం! ఇంత రాత్రివేళ ఫోన్ ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నారా?"

    "అవును" అనాలనుకుంటూనే ఆగిపోయింది  "అబ్బే! అదేం కాదు."

    "ఏం చేస్తున్నారు?" అడిగాడు. అతడు కనిపించకపోయినా కవ్వింపు లాంటి నవ్వు వినిపిస్తూంది. "ఇంకా నిద్రపోలేదా?"

    "నిద్రపోతే మీతో ఎలా మాట్లాడతాను."

    "నిద్రలేపానేమో అనుకున్నాను."

    "నిద్రపడితేగా" అసంకల్పితంగా నోరు జారింది. "అహ! మా వారింకా యింటికి రాలేదు. ఎదురుచూస్తున్నాను."

    "అంటే ఒంటరిగా వున్నారన్నమాట"

    ఇలా మాట్లాడుతున్నాడేం...." ఏం చేస్తున్నారు?" అంది గొంతు పెగల్చుకుని.

    "ఏదీ రాయలేకపోతున్నాను."

    "అదేం?"

    నిశ్శబ్దం.

    "మీ కెలాగుందో నాకు తెలీదు ఆర్తీ! కానీ మీ పరిచయం తరువాత...." ఆగాడు.

    "చెప్పండి."

    "రాయలేకపోతున్నా."

    "అదేమిటి?"

    "రచయితలు చాలామంది పాఠకుల్ని ప్రభావితం చేస్తుంటారంతా. కానీ ఒక అభిమాని రచయితని ఇంతగా ఇన్ ఫ్లూయెన్స్ చేయడం అరుదు."

    ఆర్తి నేత్రాలు అరమోడ్పులయ్యాయి. "మీరు అబద్దాలు కూడా చెప్పగలరన్నమాట."

    "అబద్దం చెప్పటానికి నేను అర్దరాత్రి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు."

    మనసు ఉద్విగ్నమౌతుంటే వారించకపోతూందేం.

    అతడిలా మాట్లాడ్డాన్ని తనూ కోరుకుంటూందా?

    "మీ శ్రీమతి నిద్రపోయిందా?"

    "కాబట్టే ఫోన్ చేశాను."

    ఆమె గుండె ఝల్లుమంది.

    "ఆమె మెలకువగా వుంటే ఫోన్ చేసేవారు కాదా?"

    జవాబు లేదు.

    "అంటే..." ఆర్తి గొంతు వణికింది. "అభిమానులతో మాట్లాడటాన్ని ఆమె యిష్టపడదా?"

    "ఇష్టపడుతుంది. కానీ నేనే ఓ అభిమానికి ఫోను చేయడాన్ని భరించలేదు. నిజం ఆర్తీ! ఇప్పటిదాకా అభిమానుల ఫోన్స్ చేసుకోవడం  తెలుసు నా భార్యకి. నా అంతట నేనుగా మాట్లాడ్డం తొలిసారి."

    "అదృష్టవంతురాల్ని" గర్వంగా అంది. "అవును తేజా! ఒక ప్రముఖ రచయితని యింతగా...."
 

 Previous Page Next Page