కృష్ణారావు, అమూల్య తెల్లబోయి చూశారు.
"ఇప్పుడే వెళ్తావా. అదేమిటి?" ఆశ్చర్యంగా అన్నాడు.
"అవునండీ. ఊళ్ళో అర్జంటు పనులున్నాయ్. కుప్పనూర్పిళ్ళు జరుగుతున్నాయ్. నాన్న కూడా ఊళ్ళో లేరు."
"పొలం మీరే చేస్తున్నారా?"
"రెండెకరాలేగా? అది కూడా కౌలు కిస్తే..." అంటూ ఆగిపోయాడు.
"అయినా ఇవాళ వెళ్లడం ఏమిటి?"
"మళ్ళీ వస్తాగా?"
కృష్ణారావు ఇప్పుడే వస్తానంటూ ఇంట్లోకి వెళ్ళాడు.
"ఇప్పుడే వెళ్ళిపోతారా?" దిగులుగా అడిగింది అమూల్య.
శ్రీధర్ సమాధానం ఇవ్వలేదు.
"మా అమ్మ పలకరించలేదనేగా?" దిగులుగా అన్నది.
"అదేమీ కాదు. నాకు పని వుంది."
"వెళ్లక తప్పదా?"
"తప్పదు ఈ ఇంట్లో నాకున్న స్థానం నాకు తెలుసు" అనాలనుకున్నాడు. కాని అమూల్యను చూస్తూ ఆమాట అనలేకపోయాడు.
"మళ్ళీ ఎప్పుడొస్తారు?"
"ఆషాఢమాసం వెళ్ళాక వచ్చి తీసుకెళ్తాను."
"అన్ని రోజులు?"
అంతలో కృష్ణారావు భార్యతో వచ్చాడు.
"ఏమిటయ్యా ఇప్పుడే వెళ్ళాలంటున్నావట?" ఏదో లాంచన ప్రాయంగా అన్నది కృష్ణారావు భార్య.
"అవునండీ?"
"అల్లుడుగారు అలిగారా? ఏమిచ్చి అలక తీర్చమంటారో చెప్పండి"
ఎంత దాచాలన్నా ఆమె కంఠంలోని వ్యంగ్యం బయటపడింది.
కృష్ణారావు భార్య ముఖంలోకి చురచురా చూశాడు.
అమూల్య శ్రీధర్ ముఖంలోకి బేలగా చూసింది.
"అమూల్యమైన అమూల్యనే ఇచ్చారు. ఇంకా ఏదో కావాలని కోరుకునేంతటి పేరాశ నాకు లేదు." శ్రీధర్ నవ్వుతూనే అన్నాడు.
మామగారి కళ్లలో గర్వం తొంగిచూసింది.
అమూల్య తల్లి లోపలకు వెళ్ళింది. ఆమె వెనకే కృష్ణారావు వెళ్ళాడు. తల్లి కంఠం పెద్దగా విన్పిస్తోంది. భార్యాభర్తల ఘర్షణ పడుతున్నట్టు అర్థం చేసుకున్నాడు.
"సారీ శ్రీధర్ కోపం వచ్చిందా? మమ్మీ ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది" దాదాపు ఏడుపు గొంతుతో అన్నది అమూల్య.
"పిచ్చిపిల్లా నీమీద నాకు కోపం రాదు. వస్తాను నాన్నగారితో చెప్పు."
"నేనూ వస్తాను" అమూల్య శ్రీధర్ చెయ్యి పట్టుకుంది.
"మళ్ళీ నాతో వస్తే అక్కడి వాళ్ళంతా ఏమనుకుంటారు?"
"అయితే మీరు ఇవాళ ఉండి రేపు వెళ్ళండి."
"అవును బాబూ. ఇవాళ్టికి ఉండి రేపు వెళ్ళు" అన్నాడు కృష్ణారావు.
శ్రీధర్ అంగీకరించక తప్పలేదు.
రాత్రిభోజనాల దగ్గిర "అక్కా మీ అత్తగారింట్లో నీకేం చీరలు పెట్టారు?" అడిగింది అవంతి.
"చాలా మంచి చీర పెట్టారు. అంతా జరీముద్ద. ఖరీదు పన్నెండు వందలు."
"నిజంగా? మరి నాకు చూపించలేదేం?"
"నలిగిపోతుందని అక్కడే దాచి వచ్చాను" అన్నది అమూల్య.
శ్రీధర్ భార్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"మమ్మీ మా అత్తగారు చాలా మంచిది. మా ఆడబిడ్డలయితే నన్ను ఒక దేవతలా చూస్తారు."
కృష్ణారావు ముఖం సంతోషంగా విప్పారింది. "అవునమ్మా పల్లెటూరి వాళ్ళలో ఉండే ఆప్యాయతలు ఈ పట్నాల్లో జీవించేవాళ్ళలో ఉండవు. ఇదంతా మరో లోకం ఎవరి గొడవలు వాళ్ళవే."
"కబుర్లు చెప్పుకోవడానికి చాలా సమయం ఉంది. ముందు భోజనాలు చెయ్యండి" అన్నది తల్లి.
"ఏమండీ బావగారూ? ఈసారి అక్కయ్యతో ఊరు రమ్మంటారా?" అడిగింది అవంతి.
"తప్పకరా" శ్రీధర్ ముక్తసరిగా అన్నాడు.
"అవును చెల్లీ? మా ఊరు చాలా బాగుంటుంది."
"మీ ఇల్లు?" అవంతి అడిగింది.
"మా ఇంటికేం? మండువా లోగిలి అంటారట. పల్లెటూళ్ళలో గొప్పవాళ్లకే మండువాలోగిళ్ళు వుంటాయి తెలుసా?" అమూల్య గర్వంగా చెప్పింది.
"చూశావా అమ్మా. అక్క అప్పుడే తన ఇంటినీ, తన వారిని ఎంత పొగిడేస్తుందో?" అవంతి మురిపెంగా అన్నది.
"మీ మురిపెం ముక్క చెక్కలినట్టే వుంది" మనసులోనే అనుకుంది కృష్ణారావు భార్య.
"అమూ"
"ఊ"
"నీలో మరో మనిషిని చూస్తున్నాను. ఈ రెండు రోజులలో నువ్వు చాలా ఎదిగావని ఇప్పుడే తెలుసుకున్నాను" అన్నాడు శ్రీధర్ ఆరాత్రి భార్యతో.
ఆమె హాయిగా నవ్వింది.
"నామీద కోపం పోయిందా?"
"నీ మీదా? కోపమా?"