Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 26


    "బావుందమ్మా! ఏదో కలొచ్చి వుంటుంది. శాంతీ, నేనూ కథలు చెప్పుకుని పడుకుంటాం కదూ! ఏ రాక్షసుడో కలలోకి వచ్చి వుంటాడు" అన్నారు నవ్వుతూ.
    "అదేం కుదరదు. మీరు పరీక్ష చేయించుకోవలసిందే" అన్నారు జయరాం నవ్వుతూ.
    "తప్పదంటారా?"
    "ఉహూ...ఇది మా అమ్మాయి ఆజ్ఞ."
    "సరే పదండి" అందరూ లోపలికెళ్ళారు.
    జయరాంగారు రావుగారుని పరీక్ష చేసి ఏమీలేదని బలానికి టానిక్కులు రాసిచ్చారు. మాధవి కాఫీలు తీసుకొచ్చింది.
    "బావగారూ! మీరేమీ అనుకోనంటే ఒక చిన్న రిక్వెస్టు. మా ఆవిడ మాధవినీ, శాంతినీ తీసుకుని రమ్మని ప్రాణాలు తీసేస్తోంది. ఒక్కసారి పంపించండి. నాలుగురోజులుండి వస్తారు. ఎన్నిసార్లు అడిగినా ఏదో సాకు చెబుతోంది" అన్నారు జయరాంగారు.
    "నాలుగు రోజులే" అంది శాంతి.
    దిగులుగా చూశారు రావుగారు.
    "తీసుకెళ్ళండి" అన్నారు మెల్లగా.
    "ఇప్పుడెందుకులే మామయ్యా. మరోసారి వెళతాను" అంది మాధవి.
    "ఫరవాలేదమ్మా, వెళ్ళిరా" అన్నారు రావుగారు.
    "అయితే మామయ్యతో చెప్పండి బాబాయ్. టైంకి అన్నం తింటూ, ముందులు సరిగ్గా వేసుకోమని" అంది మాధవి.
    "లేకపోతే అతన్నీ తీసుకుపోదామమ్మా మనింటికి" అన్నారు జయరాంగారు నవ్వుతూ.
    "మేమంతా వున్నాం కద వదినా. నువ్వు దిగులు లేకుండా వెళ్ళు" అంది గౌరి.
    చిన్నసూట్ కేసులో శాంతివీ, తనవీ బట్టలు సర్దుకుని బయలుదేరింది మాధవి.
    "మాధవినీ, శాంతినీ చూసి ఎంతో సంతోషించింది రుక్మిణి. పండగలాగ పిండివంటలు వండించింది. దగ్గరుండి స్వయంగా వడ్డించింది. మాధవికీ, శాంతికీ పగలంతా కబుర్లతో గడిచిపోయింది. శాంతికూడా పాటా, పద్యం చెబుతూ రోజంతా గడిపింది.
    రాత్రి భోజనాల ముందు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారంతా. "మమ్మీ తొందరగా తిను పోదాం" అంది శాంతి.
    "నాలుగు రోజులు ఇక్కడే వుండాలి. ఆ తరువాత ఇంటికి వెళదాం" అంది మాధవి.
    "నాలుగు రోజులా?" బిక్కమొహంపెట్టింది శాంతి.
    అక్కడ రావుగారి పరిస్థితి కూడా అలాగే వుంది. సరిగ్గా అన్నం తినడం లేదు. మందులు వేసుకోలేదు. నాలుగు రోజులు శాంతి కూడా లేకుండా ఎలా వుండాలా అన్నదే అతని బాధ.
    "పోనీ శాంతిని తీసుకొచ్చెయ్యరా గోపీ" అంది గోవిందమ్మ.
    "ఆ...ఒద్దులే వుండనీ అన్నారు రావుగారు. మరీ తన బేలతనాన్ని బయటికి చెప్పడం నచ్చక.
    రాత్రి పన్నెండు కావస్తోంది. శాంతిలేచి నెమ్మదిగా టెలిఫోన్ తిప్పింది. "హలో" అన్నారు రావుగారు వెంటనే.
    "తాతయ్యా! నేనే శాంతిని మాట్లాడుతున్నా"
    "శాంతీ! నిద్దరపోలేదమ్మా?"
    "నాకు ఇక్కడ నిద్దర రావడం లేదు. నీకూ రావడం లేదు కదూ!"
    "పడుకోమ్మా! అమ్మ కోప్పడుతుంది."
    "ఏం భయం లేదు తాతయ్యా! అమ్మ పడుకుంది. నువ్వు భయంలేకుండా మాట్లాడు. నేను రాత్రంతా మాట్లాడుతూనే వుంటాను."
    "శాంతీ! వచ్చి పడుకో" పిలిచింది మాధవి.
    "తాతయ్యా! అమ్మ లేచింది."
    "అయితే ఫోను పెట్టెయమ్మా"
    "ఉహూ...నేను పెట్టను. నువ్వూ పెట్టెయ్యకు" ఏడుస్తున్నట్లుగా అంది.
    "ఆ గొడవకి అప్పుడే పడుకున్న జయరాం, రుక్మిణి కూడా లేచొచ్చారు.
    "ఏమిటమ్మా? ఏం జరిగిందీ?" అంది రుక్మిణి.
    "చూశావుగా పిన్నీ! ఇదీ వరస. రాత్రంతా మాట్లాడుతూనే వుంటారట తాతా మనమరాలూనూ. ఇప్పుడు తెలిసిందా పిన్నీ! అందుకే నేను రాననేది."
    "తాతయ్యా! నువ్వు ఫోను పెట్టెయ్యకు. నాకు కథ చెప్పాలి" ఫోనులో అరిచింది శాంతి.
    "అమ్మా మధూ! పదమ్మా మీ ఇద్దర్నీ ఇంట్లో దించి వస్తాను. లేకపోతే ఇవాళ మనందరికీ శివరాత్రే" అన్నారు జయరాంగారు.
    "ఇకముందు నుంచి పగలంతా వుందురుగానీ. కానీ రాత్రిళ్ళు ఉండమనంలే అమ్మా" అంది రుక్మిణి.
    "బాబాయ్! మీరు, పిన్నీ వచ్చి నాలుగురోజులక్కడుండకూడదూ!" అంది మాధవి.
    "అలాగేనమ్మా!" అంది రుక్మిణి.
    శాంతి ఫోన్ పెట్టేసి "డాక్టరు తాతయ్యా! నువ్వూ, అమ్మమ్మా వచ్చి అక్కడ ఫోర్ డేస్ వుండండి. అందరం ఆడుకోవచ్చు" అంది నవ్వుతూ.     

 Previous Page Next Page