ఆ స్పీడ్ లో మలుపులు తిప్పటం కూడా సాధ్యంకాని పని.
"కారు ఆ స్కూటర్ మీద నుంచి పోనీ" నెమ్మదిగా అన్నాడు సిద్ధార్థ.
యాక్సిలేటర్ బలంగా తొక్కాడు డ్రైవర్.
కారు గాలిలో తేలుతున్నట్లు స్కూటర్ ని సమీపించింది.
కారు వేగంగా డాష్ ఇవ్వగానే స్కూటర్ గిరి రోడ్డు పక్కకు జారిపోయింది.
దీప రోడ్డుమీద పడి దొర్లుతూ వెళ్ళి రోడ్డు పక్కనే వున్న కాంపౌండ్ వాల్ కి కొట్టుకుంది.
అప్పటికప్పుడే తల చిట్లి స్పృహ తప్పటం జరిగిపోయింది.
సరిగ్గా అప్పుడే దూరంగా మరో కారు హారన్ వినబడడంతో సిద్ధార్థ కంగారుపడ్డాడు.
"కమాన్! పోనీ వెనుక కారు వస్తోంది. వాళ్ళెవరో చూస్తే గొడవవుతుంది."
డ్రైవర్ మళ్ళీ వేగం పెంచాడు.
కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకున్నాడతను.
శ్రీరంజని అతనికోసమే ఎదురుచూస్తోంది ఆత్రుతగా?"
"ఏం జరిగింది?"
స్కూటర్ కారుతో డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేశాను. దీప చనిపోయి ఉంటుంది. లేదా తీవ్రమయిన గాయాలతో ఒకటి రెండురోజులు బ్రతకవచ్చు. ఈలోగా ఇంకో కారు రావటంతో అక్కడినుంచి వెంటనే రావాల్సి వచ్చింది."
శ్రీరంజనికి భయం వేసింది.
"ఒకవేళ ఆమె చావకపోతే?"
సిద్ధార్థ నవ్వాడు.
"పిచ్చిదానిలా మాట్లాడకు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన వాళ్ళెవరయినా ప్రాణాలతో బయటపడతారా?"
"ఆ మాట నిజమేగానీ ఒకవేళ ఆమెకు ప్రమాదకరమయిన గాయాలు తగలకపోతే?"
"ఇంపాజిబుల్! ఆమె బ్రతకడం కష్టమని చెప్తున్నాగా? ఒకవేళ బ్రతికినా ఫర్వాలేదు. హాస్పిటల్లోనే ఆమెను చంపేయవచ్చు. అది ఇంకా తేలిక. హాస్పిటల్లో చచ్చినవాళ్ళు గురించి కేస్ కూడా ఉండదు. మన మీద అసలే అనుమానం రాదు."
అతని మాటలు శ్రీరంజనికి సంతృప్తి కలిగించినయ్.
* * * *
దీపను కార్లో వెళుతున్న డాక్టర్ చూశాడు. వెంటనే ఆమెను తన కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించాడు.
ఆమెకు గాయాలు తగిలాయ్ గానీ మరీ ప్రమాదకరమయిన గాయాలు కాదని అర్థమయిందతనికి. కానీ తలకు తగిలిన దెబ్బే అతనికి కలవరం కలిగిస్తోంది. మరికాసేపట్లో పోలీసులు వచ్చి కేస్ నమోదు చేసుకున్నారు.
తెల్లారేసరికల్లా ఎక్స్ రేలు, ఇతర పరీక్షలు పూర్తయిపోయాయి.
ఆమె పరిస్థితి ప్రమాదకరం కాదని తెలిశాక ఇంటికి వెళ్ళిపోయాడతను.
ప్రయివేట్ హాస్పిటల్ ట్రీట్ మెంట్ అయివున్నట్లయితే దీప త్వరలోనే స్పృహలోకి వచ్చివుండేదేమోగానీ అది గవర్నమెంట్ హాస్పిటల్ అవడంతో ఆ మర్నాడు ఉదయానికి గానీ ఆమెకు స్పృహ రాలేదు.
కళ్ళు తెరుస్తూనే భయంకరమయిన మూలుగులతో వరుసగా బెడ్ మీదున్న పేషెంట్లు కనిపించారామెకి.
కొద్దిక్షనాలు ఆమెకేమీ అర్థంకాలేదు. మంచం మీదనుంచి లేచి కూర్చోబోయిందిగానీ చేయి చురుక్కుమంటూ నొప్పి పుట్టింది. అప్పుడు గమనించింది సెలైన్ బాటిల్స్ నుంచి ఒక్కొక్క చుక్క తన శరీరంలోకెక్కుతోంది. మళ్ళీ మంచంమీద వెనక్కు వాలిందామె.
తలంతా విపరీతమైన నొప్పి పుట్టటం ప్రారంభించేసరికి చేయి నెత్తిమీద పెట్టి తడిమింది. తలకు పెద్ద బాండేజ్ కట్టబడి వుంది.
అంటే తనకేదో ప్రమాదం జరిగి దెబ్బలు తగిలాయన్నమాట.
కానీ ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది?
ఎంత ఆలోచించినా ఆమెకేమీ అంతుబట్టలేదు.
తనిక్కడికి ఎలా వచ్చింది?
ఈ హాస్పిటల్లో ఎవరు చేర్చారు?
ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని తెలుస్తూనే ఉంది. చాలా సినిమాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసింది తను. అంత భయంకరమైన ప్రదేశాలు భూమ్మీద మరెక్కడా వుండవేమో! వరండాల్లో వార్డుల్లో కిక్కిరిసిపోయే పేషెంట్లు, వాళ్ళ చుట్టూ ఈగలు, బొద్దింకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, బల్లులు. ఇంచుమించుగా అదో విచిత్రమైన 'జూ' అనిపిస్తుంది తనకి.
ఓసారెప్పుడో తను మొదటిసారిగా ఆ ప్రయివేట్ హాస్పిటల్ కి వెళ్ళింది. ఎంత తేడా వుంది దానికీ, దీనికి! అది మనుషుల కోసం. ఇది పశువుల కోసం అనుకునేంత తేడా!
తననీ రిచెడ్ హాస్పిటల్లోకి ఎవరు చేర్చారసలు?
కలలో కూడా తనిలాంటి చోటకు రాకూడదే?
తనలాంటి కోటీశ్వరురాళ్ళ కోసం అద్భుతమయిన హాస్పిటల్స్ హైద్రాబాద్ లో వున్నాయ్.
తనవాళ్ళు మరి ఇక్కడెందుకు చేర్చారు?
తనవాళ్ళు....
అవును. తనవాళ్ళు...ఎవరు వాళ్ళు? తనవాళ్ళెవరు?
ఆమె ఆలోచనలు తన ఇంటివేపు మళ్ళినాయ్.
ఎంత ఆలోచించినా ఏమీ అర్థంకావటం లేదు. ఏమీ గుర్తుకురావటం లేదు.
నర్స్ వచ్చి ఆమెను చూసింది.
"ఓ! స్పృహలోకొచ్చారన్న మాట!"
"నాకేమయింది సిస్టర్?"
"హెడ్ ఇంజురీ, కాళ్ళకు దెబ్బలు, స్వెబ్లింగ్స్."
"ఎలా జరిగిందది?"
నర్స్ ఆశ్చర్యపోయింది.
"ఆ విషయాలు మీరు చెప్తారనే ఎదురుచూస్తున్నాం."
"నేనా?"
"అవును. లేకపోతే మాకెలా తెలుస్తుంది?"
"అసలు నన్నిక్కడ ఎవరు చేర్చారు?"
"డాక్టర్ జితేందర్!"
"ఆయనకెక్కడ కనిపించాను నేను?"
"బేగంపేట ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డు పక్కనే పడివున్నారట. ఆయన జాలిపడి తీసుకొచ్చి చేర్చాడు."
"బేగంపేట దగ్గర రోడ్డు పక్కన పడివున్నానా?"