Previous Page Next Page 
జయ - విజయ పేజి 26


    ఒకవేళ తన అనుమానమే నిజం అయితే తనిప్పుడేం చేయాలి?
    తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కిషోరే తండ్రి అని తనకు తెలుసు. ఆ విషయం చంద్రకాంత్ కి చెపితే అతను ఒప్పుకుంటాడా?
    తనను పెళ్ళిచేసుకోడానికి అంగీకరిస్తాడా?
    ఒకవేళ అతను పెళ్ళికి ఒప్పుకోకపోతే తన గతేమిటి? కిషోర్ దగ్గరకెళ్తుందా? కిషోర్ కూడా ఇంత జరిగాక తనను ఒప్పుకుంటాడా?
    తనకూ, చంద్రకాంత్ కూ సంబంధం వుందని తెలిస్తే అతనెలా ప్రవర్తిస్తాడు?
    అతని రూము నుంచే ఆఫీస్ కి బయల్దేరింది.
    లేడీ డాక్టర్ ధృవపరచింది.
    తను గర్భవతి.
    ఇంకా ఈ విషయం దాచటం శ్రేయస్కరం కాదు. విజయకూ, అమ్మకూ చెప్పెయాల్సిందే.
    తల్లికి చెపితే జరిగేదేమిటో తనకు తెలుసు. నానా హంగామా చేస్తుంది. తనను తిడుతుంది. కొడుతుంది. తను ఏడుస్తుంది. శాంతించాక ఏదొక సంబంధం అర్జంటుగా వెతికి తనకి ముడిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అంతే! అక్కడినుంచీ తను జీవచ్చవంలా బ్రతకాలి.
    ఏమీ పాలుపోవడం లేదు జయకు.
    తనకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం మాత్రం లేదు. అది తనకు నచ్చని పని.
    వెంటనే తమ వూరికి వెళ్ళి ఈ విషయం విజయకే చెప్పడం మంచిదనిపించిందామెకి.
    అలా చేస్తే తన తల్లి ఎదుటపడి ఈ విషయం చెప్పే పరిస్థితి ఎదురవదు. ఆ బాధ్యతంతా విజయే తీసుకుంటుంది. తనెలాంటి తప్పు చేసినా విజయ తనను క్షమిస్తుంది. తనకా నమ్మకం వుంది. ఇక తల్లి తనను నిందించడం, అసహ్యించుకోవడం భరించాల్సిందే!
    వెంటనే లీవ్ లెటర్ రాసి తన ఆఫీసర్ కి ఇమ్మని విమలకిచ్చి తమ వూరికి ప్రయాణమైంది జయ. ఇల్లు చేరుకునేసరికి బాగా ప్రొద్దుగూకిపోయింది. విజయ బయట మెట్లమీదే కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. జయను చూస్తూనే ఆశ్చర్యపోయిందామె.
    "అదేమిటే చెప్పా చెయ్యకుండా దిగావ్?" అడిగిందామె.
    "అనుకోకుండా వచ్చేశాను" చెప్పింది జయ.
    విజయకు ఆమె ప్రవర్తన ఏదో అనుమానం కలిగించింది గానీ ఆమెను వెంటనే ప్రశ్నల్తో ముంచెత్తడం ఇష్టంలేక ఊరుకుండిపోయింది.
    పార్వతి లోపలికొస్తున్న జయను చూసి నిర్ఘాంతపోయింది.
    "ఏమిటే? ఏమిటి హఠాత్తుగా వచ్చేశావ్?" అంది గాభరాగా.
    "తర్వాత చెప్తానమ్మా! ముందు నన్ను ఊపిరి తీసుకోనీ" అనేసి గదిలోకి చేరుకుని, బట్టలు మార్చుకుందామె. విజయ పార్వతికి సైగ చేసి తను జయ దగ్గరకు నడిచి ఆమె ఎదురుగా నిలబడింది.
    కొద్దిక్షణాలు మౌనంగా గడిచిపోయినాయి.
    నోరు మెదపాలంటే భయంగా వుందామెకి.
    "అక్కా..." వణుకుతోన్న గొంతుతో పిలిచింది.
    ఆమెవేపు ప్రశ్నార్థకంగా చూసింది విజయ.
    "నీతో మాట్లాడాలక్కా! కాసేపు డాబా మీద కూర్చుందామా?"
    "అంత రహస్యమా అది" చిరునవ్వుతో అంది విజయ తేలికగా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూ.
    "అవునక్కా!" సీరియస్ గా మాట్లాడుతున్న జయను చూసేసరికి విజయకు ఆశ్చర్యం కలిగింది.
    "పద!" అంది డాబా మీదకు బయల్దేరుతూ. డాబా మీద తెల్లని వెన్నెల అలుముకుని వుంది.
    ఇద్దరూ పిట్టగోడ నానుకుని కూర్చున్నారు. పార్వతి ఇంట్లో కూర్చుని పరిపరి విధాల ఆలోచిస్తుంది. ఆమెకెందుకో భయం గొలుపుతోంది జయ ప్రవర్తన!
    "ఏమిటో చెప్పు!" ఆత్రుతగా అంది విజయ.
    జయకు ఎలా చెప్పాలో తెలీటం లేదు. ఓసారి తలెత్తి జయ వంక చూసి తన దించేసుకుంది మళ్ళీ. ఆమె దీన స్థితి చూసి విజయ మరింత ఖంగారు పడింది.
    "ఏమిటో చెప్పవేమే! అసలేం జరిగింది?"
    "నేను పెద్ద తప్పు చేశానక్కా?" నెమ్మదిగా అంది జయ.
    "ఏమిటది?" విజయ గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయ్.
    "అదేనక్కా...ఆడపిల్లలు చేయకూడనిది."
    "అంటే..."
    "నాకు...నెల...తప్పింది..."
    విజయ ఉలిక్కిపడింది. జయ మాటలు నమ్మశక్యం కావడంలేదు.
    ఆ మాటలు పిడుగుపాటులా ఉన్నాయామెకి.
    "ఏమిటి నువ్వంటోంది?..." హీనస్వరంతో అడిగిందామె.
    "అవునక్కా!" తల వంచుకునే అంది జయ. కొద్దిసేపు మౌనంగా వుండిపోయింది విజయ.
    "ఎవరతను?" కొద్ది నిముషాల తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని అడిగింది విజయ.
    "మా క్లాస్ మేట్ సరిత అన్నయ్య!"
    "అంత తెలివితక్కువగా యెందుకు ప్రవర్తించావ్?"

 Previous Page Next Page