"చాలాదూరమే వచ్చిందన్నమాట వ్యవహారం!"
"ఇంట్లో పరిస్థితి, నా స్థితి తలుచుకుంటే నోటికి ముద్ద దిగడంలేదు. కంటికి కునుకులేదు. అన్నివిధాలా అందరూ కాల్చుకుతింటున్నారు! నరకం అంటే వేరే ఎక్కడుంది!" అంది కళ్ళు ఒత్తుకుంటూ.
జగన్నాథంగారి హృదయం ద్రవించింది. కూతురి తలమీద చెయ్యివేసి నిమిరారు ఓదార్పుగా.
"ఇది యిలావుంటే. ఆ వాసుగాడు తిన్నగా చదివిఏడవడు ఎంత చెప్పినా! మహామహా ఫస్టుక్లాసులు వచ్చినవాళ్ళకే ఏ కాలేజీ ల్లోనూ సీట్లు దొరకకుండా ఉన్నాయి! ఇంక అత్తెసరు మార్కులు వస్తే వీడి మొహం చూసేదెవడు? అసలు ఆ మామూలు పాసయినా అవుతాడా అనిపిస్తూంది. పద్దెనిమిదేళ్ళ కొడుకు, వాడైనా తిన్నగా చదివి ఏదో ఉద్దరిస్తాడన్న నా ఆశ అడుగంటుతూంది. వాడి చదువు వరస చూస్తూంటే!.....పైకివచ్చే లక్షణాలు ఏమి కనపడడంలేదు. ఎంతసేపూ చెత్తపుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, నీటుగా తయారయి తిరగడం తప్ప బొత్తిగా చదువుమీద ధ్యాసలేదు వాడికి. ఈ పిల్లలు ఎలా పైకివస్తారో?....ఎప్పటికి తేలతారో తలుచుకుంటే బెంగగా వుంటూంది......!" నిట్టూర్చింది శకుంతల.
"నువ్వు, వాళ్ళనాన్న చెపితే వినంది రాధ నా మాటమాత్రం వింటుందా?"
"మీరు పెద్దవారు. మీకు ఎదురుచెప్పలేక వింటుందేమోనని ఆశ. అస్తమానం మీ దగ్గిరికి రావడం, ఉండడం దానికి అలవాటు. మీరంటే కాస్త గౌరవం ఉంది దానికి. తాతగారు చెప్పా రననైనా వినవచ్చునని."
"చెప్పడానికేం, అలాగే చెపుతాను. దాన్ని పిలు. మాట్లాడతాను. రేపు నీ ప్రయాణం గదా. మళ్ళీ వీలుండదు. ఇప్పుడే రమ్మను. నువ్వు ఉంటే సరిగా చెప్ప దేమో, వెళ్ళు. నేను అన్నీ మాట్లాడతాలే!"
శకుంతల వెళ్ళి కూతుర్ని పంపింది. అనూరాధ వస్తూనే తాతగారి మొహంలో గంభీరత చూసి అసలుసంగతి పసిగట్టింది.
"అలా కూర్చో రాధా......నీతో కొంచెం మాట్లాడాలి!" కాస్త యిబ్బందిగా ముఖంపెట్టి, అయిష్టంగా కూర్చుంది అనూరాధ.
"ఆఁ.....ఈమధ్య నువ్వు చాలా పెద్దదానివయి పోయినట్లు న్నావు.....నీకు ఎంతతోస్తే అంతేగాని-"జగన్నాథంగారు సూటిగా రాధకేసి చూస్తూ ప్రారంభించారు.
రాధ తెల్లబోతూ, బెరుగ్గా చూసింది. "ఏమిటి......! నేనేం చేశాను?" అంది.
"అమ్మా, నాన్నల మాట లెక్కచెయ్యడంలేదట. అమ్మని యిలా కాల్చుకుతినడం ఏమన్నా బాగుందా? .....పెద్దదానివయావులే. కాని మంచి చెడ్డా తెలుసుకోవద్దూ?" కాస్త కఠినంగానే అన్నారు.
"అమ్మని నేనేం బాధపెడుతున్నాను?"
"ఇంకా ఏం బాధపెట్టాలి! బాధ అంటే ఏమిటి? కూతురి పెళ్ళిచేసి తమ బాధ్యత తీర్చుకుందామనుకుంటున్న తల్లిదండ్రులని ఎదిరించడం బాధపెట్టడంకాక మరేమిటి?"
రాధ జవాబీయలేదు.
"ఏం, మాట్లాడవేం?.....పెళ్ళి చేసుకోనన్నావుట?"
"నాకు ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉండాలని ఉంది. అందుకు చేసుకోనన్నాను!" నెమ్మదిగా అంది రాధ.
"ఏం పెళ్ళి చేసుకుంటే హాయిగా ఉండలేవా? హాయిగా ఉండడానికి ఉద్యోగమే చెయ్యాలా?"
"ఆ.....చూస్తున్నానుకాదూ, పెళ్ళిచేసుకున్నవాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారో!" ఈసారి గట్టిగానే జవాబిచ్చింది.
"అంటే?"
"అంటే ఏముంది? పెళ్ళి చేసుకుని ఆశలని, ఆశయాలని, వ్యక్తిత్వాన్ని చంపుకుని ఆ మొగుడికి బానిసగా మారి, పిల్లల్ని కంటూ, చాకిరీ చేస్తూ రోగాలతో, రొచ్చులతో బతికే బతుకు నా కిష్టంలేదు! అందుకే ఉద్యోగం చేసుకుంటూ, హాయిగా ఉంటానన్నాను" ఆవేశంగా అంది రాధ.
"పెళ్ళి చేసుకున్నవాళ్ళందరూ ఈదురోమంటూ ఉంటారనేనా నీ ఉద్దేశం?"
"ఎవరిదాకానో ఎందుకు? ఇంట్లో ప్రత్యక్షంగా అమ్మని చూస్తున్నానుకాదూ!"
"అందరూ మీ అమ్మలా దురదృష్టవంతురాళ్ళే అవుతారా అమ్మా?"
"ఆ కడుపునా పుట్టిన నేను అంతకంటే అదృష్టవంతురాలినని భయం!...."
"నువ్వు పొరపాటుపడుతున్నావమ్మా.....ఎవరి అదృష్టం వారిది! అందరు మగవాళ్ళు మీ నాన్నలాంటివాళ్ళే అనుకుని పెళ్ళిమీద విముఖత ఏర్పరచుకోవడం అవివేకం! ఈ రోజుల్లో మీ నాన్న లాంటి భర్తలు చాలా తక్కువ. అంచేత ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా ఉండడం లేదు!"
"ఆ.... అదంతా ఉత్త నటన! పెళ్ళాం అనగానే ప్రతీ మగాడికి ఏదో హక్కు, స్వతంత్రం వచ్చేసి ఆ పెళ్ళాన్ని గౌరవించనక్కరలేదనుకుంటాడు. బయట ఎన్ని ఆదర్శాలు వల్లించినా, యింట్లో పెళ్ళాం తన చేతికింద అణిగిమణిగి ఉండాలనే మనస్తత్వం మగాళ్ళందరికీ ఉంటుంది. ఎటొచ్చీ కాస్త పాళ్ళలో తేడా ఉండవచ్చు. మా నాన్నలాంటి వాళ్ళకి నూటికి తొంభైపాళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి కాత్ష తక్కువ ఉండవచ్చు. అంతేగాని, ఈనాడు మగవాళ్ళు పూర్తిగా మారిపోయారన్నది అబద్దం. ఆడదాని బతుకెప్పుడూ బానిస బతుకే! పుట్టినప్పటినుంచి జీవితాంతం మగవాడి చెప్పుచేతల్లోనే ఆమె అణగారి పోతూంది....."
ఉపన్యాసధోరణిలో మాట్లాడుతున్న రాధవంక ఆశ్చర్యంగా చూశారు జగన్నాథంగారు. ఎంత దయింది రాధ! ఇంకా 'తాతయ్యా' అంటూ ఒళ్ళో కూర్చుని కబుర్లు చెపుతూన్నట్లే ఉంది తనకి. అప్పుడే ఎంత దయింది! తనకే పాఠాలు చెపుతూంది కూర్చోపెట్టి. ఇన్ని సంగతులు తెలుసునా రాధకి? మెచ్చుకోలుగా ఒక్కక్షణం చూసి, వెంటనే తన కర్తవ్యం గుర్తుకువచ్చి, లేని చిరాకు తెచ్చిపెట్టుకున్నారాయన.