Previous Page Next Page 
నయనతార పేజి 27

 

    కొంచెం సేపు ఆవేశంగా , కొంతసేపు జాలిగా వ్యంగ్యంగా ఉపన్యసించిన శారదాదేవి , ఓ గ్లాసుడు మంచి నీరు త్రాగి కూర్చుంది.
    "ఏమిటంటుంది యివిడా? మనం దేనికోసం దెబ్బ లాడాలంటారు? బియ్యం కోసమా?" కాస్త చేముడున్న సుబ్బలక్ష్మి ప్రక్కనున్న అంబుజమ్మ నడిగింది.
    "బియ్యామా కాదూ! బొగ్గులు కాదూ! హక్కులు, మగాళ్ళతో సమాన హక్కుల కోసం!" ఆమె అజ్ఞా నందకారానికి జాలి పడుతూ గట్టిగా జవాబిచ్చింది అంబుజమ్మ.
    "హక్కులు, బుక్కులు ఎందుకమ్మా! ఆ దెబ్బలాడేది గవర్నమెంటు వాళ్ళతో బియ్యానికో, పంచదార కోసమో అయితే కాస్త ఫలమైనా దక్కుతుంది. ఈ హక్కులు ఏం చేసుకుంటాం! దాని కోసం మగాళ్ళతో మనకి దెబ్బలాట ఒహటా?"
    "ష్!' అన్నారెవరో . ఈ పదో శతాబ్దపు అడివి మనిషి ఎవరన్నట్టు వింతగా చూశారు వెనక్కి తిరిగి కొందరు.
    ఈ మధ్యలో ఉపన్యసించడానికి వేదిక చేరిన ఊర్మిళ ఈ అవకాశాన్ని జారవిడవకుండా బిగించి పట్టుకుని ఉపక్రమించింది.
    "ఇదిగో ! ..... ఇలాంటి అమాయకులం మనం! అందుకే ఇన్నాళ్ళుగా మనని అణచిపెట్టి మన పురోగమనానికి అడ్డురాగలిగారు పురుషులు! కాని, ఇవాళ మనలో సుబ్బలక్ష్మమ్మలు , నర్సమ్మలు కన్నా, సునీతలు, సుచరితలు , సుప్రియలు యెక్కువ. చివరికి, రోజులు మారాయి మన విషయం లోనూ, ఇదివరకు లాగ చదువు సంధ్యలు లేకుండా ఏం తెలీని మూర్ఖురాలు కాదు స్త్రీ ఈనాడు! కేవలం వీధి పాచి, యింటి చాకిరి చేసుకుంటూ , మగాడి అవసరాలు తీరుస్తూ, పిల్లల్ని కనే యంత్రం కాదు యీనాడు ఆడది!   ఆడవాళ్ళ హక్కుల కోసం కూడా మగాళ్ళే పోరాడాల్సిన దౌర్భాగ్యస్థితిలో లేదు యీనాడు స్త్రీ! పురుషుల్ని యాచించి , మన హక్కులను సంపాదించాలనే ఆలోచన మనకి రాగూడదు! ఇవ్వడం , ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టా ఇష్టాల మీద ఆధారపడి లేదు, సాధించుకునేది మనం! ఎలా సాధించాలి అన్నది మనం యిప్పుడు ఆలోచించాలి.
    "దానికి ముందు ప్రస్తుతం పురుషుల దృష్టిలో స్త్రీలకి ఏమాత్రం గౌరవాదరాలు లభిస్తున్నాయన్నది మనం చూద్దాం! ఒకసారి సమకాలిన సంఘ పరిస్థితులు పరిశీలిద్దాం!
    "యీనాడు ఆడదనగానే అప్పడాల కర్రతో చిత్రిస్తున్నారు చిత్రకారులు. ఆడదాన్ని గయ్యాళిగా, రాక్షసిగా బొమ్మలలో చిత్రించి సంతోషించాల్సిందే గాని, నిజానికి మనమంటే పోనీ అలాగైనా భయం, వినయం వాళ్ళకి లేవన్న సంగతి వాళ్ళకీ తెలుసు! ఆడవాళ్ళనగానే కూరేం వందారు, చీరెంత -- మొదలైన అమ్మమ్మ కబుర్లు చెప్పుకోవడానికి తప్ప దేనికీ పనికిరాని కార్యశూన్యులు అన్న తేలిక అభిప్రాయం వాళ్ళలో పాతుకుపోయింది. మన క్లబ్బులు, మహిళా మండలులు , మన సమాజాలు ఏదో కాలక్షేపానికీ  పోచీకోలు కబుర్లు చెప్పుకోడానికి అని వాళ్ళ ఉద్దేశం! మన ఆయుధం కన్నీళ్ళని , దాంతోనే వాళ్ళని లోబరచుకుంటున్నామని, ఏడవడం మినహా ఇంకే చేతకాదని వాళ్ళ అభిప్రాయం! అందుకు పాపం మనమీద జాలిపడి మనల్నేదో ఉద్దరిస్తున్నామని సంస్కరిస్తున్నామని గప్పాలు చెప్పుకుంటున్నారు! చెప్పుకుని తమ హృదయ వైశాల్యాన్ని చాటుకుంటూ , వాళ్ళే పొంగిపోతున్నారు!"
    "ఇదొక పెద్ద ఫేషన్ అయిపొయింది ఈ మధ్య! ఆడవాళ్ళని ఉద్దరిస్తున్నాం, వాళ్ళ ఉన్నతి కోసం చెమటలు కక్కుతున్నాం అంటూ డంకా వాయించడం! ఏమిటో వీళ్ళు మనకిచ్చిన హక్కులూ , సమానత్వమూ! పైకి  అలా ఆశయాలు, ఆదర్శాలు, వల్లించడం తప్ప ఎవరింట్లో వాళ్ళ దగ్గరికి వచ్చే సరికి అవన్నీ యిట్టె ఎగిరి చక్కా పోతాయి! సుజాతా రవణ మూర్తి మధ్యలో అంది.
    "అక్కడికి పాపం వాళ్ళు మన చేతికింద అణిగిమణిగి పడి వున్నట్లు, మనం వాళ్ళ మీద జులుం సాగిస్తున్నట్టు క్లబ్బులో నలుగురూ చేరి ఒకర్నొకరు వోదార్చుకోడం కూడానూ! ఈ మొగాళ్ళందరికి యిదో వేషం అయిపొయింది. ఈ మధ్య!" పద్మావతీ శర్మ కూడా కలిసింది.
    "కధల్లో చూస్తె మనం తియ్యని మాటలు చెప్పి, వాలుచూపులతో లొంగదీసుకుంటామనీ, అంతగా ఇంకా లొంగకపొతే కన్నీళ్ళతో వశపరచుకుంటామనీ ఆ ఆయుధంతో మగాడి అట కట్టించి, మన ఇష్టం వచ్చినట్లు అడీస్తామనీ ఉత్తినే అడిపోసుకోవడం! మొన్నటికి మొన్న '...... పత్రిక ' లో .....'కధ చదివారా? ఎంత అన్యాయంగా వుందో"----- శ్యామలా సుబ్బారావు ఆవేశంగా అంది.
    "అవునూ మేమూ చదివాం"
    "వొళ్ళు మండుకొచ్చింది."
    "మహా దారుణంగా వుంది."
    "ఆడాళ్ళ మీద గాబట్టి సరిపోయింది! యిదే యే స్టూడెంట్స్ మీదన్నా అయితే ...."
    "రైలుస్టేషన్లు తగలబడేవి! టెలీఫోను వైర్లు తెగేవి! బస్సులు కాలేవి!"
    "స్కూళ్ళు , కాలేజీలు నిరవధికంగా మూసేయబడేవి!"
    "మనమూ ఓ కధ రాసేద్దాం."
    "మగవాళ్ళ దురన్యాయాల గురించి ఏకి పారేద్దాం!"
    "అసలు మనలో యింతమంది చేతులు తిరిగిన రచయిత్రులు వుండి, యింకా ఎందుకు రాయకుండా వూరుకున్నారా అని!...."
    "ఈ పాటికి ఆరంభించే వుంటారు, ఎవరో ఒకరు !....."
    అందరూ తలో మాట హడావుడిగా ఉత్సాహంగా అన్నారు.
    "నిశ్శబ్దంగా ఉండమని మనవి!" శారదాదేవి లేచి నిలబడి అంది. "ముందు నేను చెప్పేది విన్నాక మీ మీ అభిప్రాయాలు క్రమంగా వరసగా చెపుదురు గాని! నేనూ ఆ కధ చదివాను . నిజానికి యీ అత్యవసర సమావేశానికి కారణం ఆ కధే! ఆ కధ చదివిన మగవాళ్ళు మనల్ని ఎత్తి పొడవడం అవసరమున్న లేకపోయినా అందులో సంగతులు కొన్ని కోట్ చేసి మనల్ని ఉడికించ ప్రయత్నించడం చూశాక నా వళ్ళు మండింది. మొన్న మా యింట్లో మావారు ఇంకో నలుగురు పెద్దమనుష్యులని పోగేసుకుని ఆ కధ చాలా సహజంగా వుందనీ, తమ పాట్లూ సరిగ్గా అలాగే వున్నాయనీ, ఆడవాళ్ళ మహిళా మండళ్ళు, సమావెశాలూ, తీర్మానాల మీద వ్యంగ్యాలు, నలుగురు ఆడవాళ్ళు కలిసినపుడు జరిగే సంభాషణలు అన్న్జీ చాలా సహజంగా వున్నాయని పొగుడ్తూ , ఆడవాళ్ళు కలిసి చేసేదేం వుండదు. అచ్చమ్మ, పిచ్చమ్మ కబుర్లాడుకోడం తప్పించి అని వ్యాఖ్యానిస్తుంటే ఆవేశం ఆగింది కాదు.

 Previous Page Next Page