Previous Page Next Page 
నయనతార పేజి 26


    " సోదరీమణులారా!

    ఈనాడు యీ అత్యవసర సమావేశం యెందుకు జరుగుతుందో మీలో చాలామందికి తెలిసి వుండకపోవచ్చు. ఈ సమావేశంలోని అంశం అందరికీ తెలిసినటు వంటిదే! మామూలు సమస్యే! ఈ సమస్య యెన్నిసార్లు , యెన్ని చోట్ల, యెన్ని సభలు, సమావేశాలు, చర్చలు, తీర్మానాలు, సమాజాలు , సంఘాల ద్వారా పరిశీలించినా, పరిష్కరించబోయినా తేలని సమస్య! దీనికొక పరిమితి, అంతం అంటూ కనపడక యిదొక నిత్య పోరాటంగా రూపుదాల్చడం మూలాన్నే మళ్ళీ మళ్ళీ మనం ఇలా సమావేశాలు అవుతుండడం , మళ్ళీ మళ్ళీ కార్యాచరణకి పూనుకోవడం, చర్విత చరణం అన్నట్టు యెన్ని సార్లో యెంతో మంది చెప్పిన మాటల్నే పునశ్చరణ చేసుకోవడం జరుగుతూంది. ఇది మన దౌర్భాగ్యం! ఈ దేశంలో, ఈ మనుష్యుల మధ్య, ఈ వాతావరణంలో ఈ దౌర్భాగ్యం మనకి పట్టింది. ఇది మనం కోరి తెచ్చుకున్నది గాదు, మనం వాంచించింది కాదు! ఇది మన మీద రుద్దబడింది. కాబట్టి ఈ ఇబ్బంది మనం ఎలాగో భరించి, ఇవాళ ఇక్కడ సమావేశం అయి, చాలామంది చాల చోట్ల చాలాసార్లు చెప్పిన మాటల్నే మళ్ళీ చెప్పుకుని, ,మన పరిస్థితి పరిశీలించి క్రొత్త మార్గమేదన్నా వుందేమో ఆలోచించాలి.
    "ప్రకృతి స్త్రీ, పురుషుల్ని సమానంగానే సృష్టించింది. కాని మగవాడు, డబ్బున్న వాడు, ప్రభుత్వాన్ని చేపట్టి న్యాయ సూత్రాలు, ధర్మ సూత్రాలు, తయారుచేసి పేద వాళ్ళని అణగద్రొక్కినట్టు రకరకాల శాస్త్రాలు స్మృతులు, కోడ్ లు తయారు చేసి ఆడదాన్ని ఆబల అని , సుకుమారి అని వర్ణించి, వంట చెయ్యమనీ, పక్కలు వేయమని, చాకలి పద్దులు వ్రాయమని, పిల్లల్ని కని పెంచమనీ , ఊరగాయలు పెట్టమని, కుట్లు అల్లికలు చూసుకోమని అంతకు మించి దేనికీ పనికి రారని ఏకపక్షంగా నిర్ణయం చేసి కూర్చోపెట్టాడు. కొన్నిచోట్ల తమ పని సాగించుకోవడానికి ఆడది సౌందర్య స్వరూపిణి క్షమా, ఓర్పు గలదని, సుకుమారి అని పొగిడి ,ఈ గుణాలన్నింటి వల్లా కూడా ఆమె, ఇంటి నాలుగు గోడల మధ్య వుండాలని సిద్దాంతీకరించారు. ఇదంతా చూస్తె తమాషాగా వుంటుంది, నవ్వొస్తుంది! ఏడవలేని నవ్వు!
    "ఈ మగాళ్ళ ఉక్కు పంజరాలాంటి సిద్దాంతాలలో బంధింపబడి శిష్కించిన స్త్రీ చాలాకాలం వీటిని, ఈ దిక్కుమాలిన స్వార్ధ పూరితమైన నమ్మకాలని తను అనుసరించింది. గుమ్మం దిగితే పాపమనుకుంది. భర్తకి యెదురు తిరిగితే నరకమని, భర్త యెలాంటి వాడైనసరే అతని తోటిదే మోక్షమనీ, స్వర్గమనీ నమ్మింది. అతని కాళ్ళు పట్టింది, కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంది. అతను నీచమైన దుర్వసనాలకి అలవాటు పది హింసిస్తే నోరెత్తకుండా భరించింది. పైగా అతనే ప్రత్యేక్షదైవమని , అతనేం చేసినా దైవ ప్రసాదమని స్వీకరించింది, చివరకి అతను చస్తే అతనితో పాటు తనూ మంటల్లో మగ్గింది. ఆ తర్వాత ఆ ఆచారం పోయినా అంతకంటే హీనమైన నికృష్టమైన జీవితం గడిపారు పతి పోయిన స్త్రీలు. పదేళ్ళకి పెళ్ళి చేసి , పన్నెండేళ్ళకి వితంతువయితే గుండు చేసి , సైను పంచ చుట్ట బెట్టి స్నానాలు పూజాలు చేయాలని, ఉప్పుడు పిండి తిని పడుండాలని శాసించి రాచి రంపాన పెట్టారు, ఆనాటి వితంతు స్త్రీలని. ఈనాటికీ పతిపోయిన స్త్రీలకి మన సమాజంలో ఎటువంటి స్థానం వుందో అందరికీ తెలుసు!
    "ఇదంతా వింటుంటే మీకెలా వుంది! యెంత పాపం చేసుకు పుట్టామో యిలా ఆడవాళ్ళుగా అనిపిస్తుందా? అదే పనికి రాదంటున్నాను. ఈనాడు స్త్రీ , మగాడు పుక్కిట పురాణాల పేరిట, దిక్కుమాలిన ధర్మసూత్రాల పేరిట తన కళ్ళకి గట్టిన గంతల్ని విప్పుకుంది. ఈరోజు పురుషుడి గుప్పిట్లలో కీలుబోమ్మల్లా ఉండడం సహించదు. ఈరోజు కొద్దికొద్దిగా ఈ ఉక్కు పంజారాల ఊచలు విరుగుతున్నాయి. బయటి గాలులు వీస్తున్నాయి. స్త్రీ కాస్త ఊపిరి తీసుకుంటుంది. ఆమె మనస్సు మూత తెరచుకుని స్వేచ్చగా ఆలోచించగల్గుతోంది. మంచికి, చెడుకీ మధ్య, సత్యానికీ, అసత్యానికీ మధ్య నీతికీ, అవినీతికీ మధ్య, న్యాయానికి, అన్యాయానికి మధ్య సన్నని గీత చూడగలుగుతుంది.
    "కాని అంతటితో కధ మిగియలేదు. ఇంకా ఎంతో మిగిలిపోయింది. తరతరాలుగా జీర్ణించుకుపోయిన స్వార్ధం మగాడి పేగుల్ని వదలలేదు. పురుషుడి కబంధ హస్తం స్త్రీ గొంతుని వదిలినా ఇంకా ఎంతో దూరం పోలేదు. ఆ అహం ఇంకా చావలేదు. ఈనాడు మగవాడు రాజ్యాలు పోయిన రాజుల్లా చేతకాని వాడి కోపంతో కారాలు మిరియాలు నూరుతూనే వున్నాడు. ఇంకా ఎలాగైనా ఆధిక్యం తనదేననిపించుకోవాలనుకుంటూనే వున్నాడు. ఇంకా ఎప్ప టికో మళ్ళీ ఆ పాత కధ పునరావృతం చెయ్యాలని కలలు గంటున్నాడు. అందుకే ఆడది చదువుకుంటున్నధన్నా, ఉద్యోగం చేస్తున్నధన్నా యీ అసహనం, ఇలా ఉడుక్కోడం ఇలా కళ్ళల్లో నిప్పులు పోసుకోడం! అయినా మనం జడవం. తాటాకుల చప్పుళ్ళకి కుందేళ్ళు జడవవు! అలాగా యీ మగాళ్ళ పాత పాటలకి మనం లొంగి వశం కాము. మనకి ప్రకృతి ఇచ్చిన స్థానాన్ని మనం సాధించుకుంటాం. మన హక్కులు మనకి దొరికిందాక విశ్రమించం.
    "వీళ్ళు చిత్రించే దద్దమ్మలం కాదని నిరూపిద్దాం. స్త్రీని గౌరవించడం పురుషులకి నేర్పుదాం. తమలాగే ఆడదీ ఓ రక్తమాంసాల్తో మానవత మూర్తిభావించిన మనిషీ అనీ, తమకంటే ఏ విషయంలోనూ తక్కువ గాదని వాళ్ళకి తెలియ చెపుదాం. అందుకు మనం అందరం ఒకే మాట మీద నిలబడాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యేపని కాదు. ఇది ఒక్కరి సమస్య కాదు! మొత్తం స్త్రీ జాతి సమాస్య! అంచేత మనం అంటా ఈరోజు విషయం చర్చించి కర్తవ్యం నిర్ణయించుకోవాలి. ముందు కార్యక్రమం మీకే వదులుతున్నాను. మీలో ఏవరైనా సరే ముందుకు వచ్చి మీ మీ అభిప్రాయాలు తెలిపి ఏం చెయ్యాలో సూచిస్తారని ఆశిస్తాను!"

 Previous Page Next Page