"ధరమ్ హిందూజా దారి తప్పాడా?" ఆసక్తిగా అడిగాడు సిద్ధార్ధ.
"అన్ని విషయాల్లోనూ పకడ్బందీగా ప్లాన్ వేసుకునే హిందూజాలా ధరమ్ విషయంలో అతనో అమ్మాయిని ప్రేమించడం, పెళ్ళి చేసుకోవడం గమనించలేకపోయారు.
హిందూజాల బిజినెస్ ఎంటర్ ప్రయిజెస్ కావాల్సిన అన్ని అర్హతల్నీ సంపాదించడానికి బొంబాయికొచ్చి అబిన్ కె. దాస్ దగ్గర శిక్షణ పొందుతున్న ధరమ్ మారిషస్ లో కాలి, మాడి మసైపోవడానికి కారణం ఒక అమ్మాయి కావచ్చు.
కానీ గొప్ప హిందూజాల వ్యాపారం సైడ్ ట్రాక్ పట్టడానికి ఆ ఒక్క సంఘటన కారణమైంది" చెప్పాడు అనంతమూర్తి.
"నేనో మరో ధరమ్ లా మారకూడదనా... ఈ ఏర్పాట్లు?" నవ్వాడు సిద్ధార్ధ.
"కాదు... మరో మహంతలా తయారుకావడానికి" చెప్పి చేతి వాచీ చూసుకున్నాడు అనంతమూర్తి.
సరిగ్గా ఎనిమిది నలభై అయిదు నిమిషాలైంది.
"కమాన్ సిద్దార్ధా... ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ ఫాస్ట్" ముందుకి నడిచాడు. ఆయన్ని అనుసరించాడు సిద్ధార్ధ.
* * * *
సరిగ్గా తొమ్మిదీ పదిహేను నిమిషాలైంది.
డైనింగ్ హాల్ లోంచి బయటకు వచ్చాడు సిద్ధార్ధ. అదే సమయంలో టెలిఫోన్ మోగింది. హాల్లో టీపాయ్ మీదున్న కార్డ్ లెస్ టెలిఫోన్ ని అందుకున్నాడు అనంతమూర్తి.
"అనంతమూర్తి హియర్..."
"మిస్టర్ అనంతమూర్తీ! రాబర్ట్ మర్చంట్ ఫ్రమ్ న్యూయార్క్. అవర్ చీఫ్ మహంత... అరగంటక్రితం బ్రిటన్ వెళ్ళారు. సిద్ధార్ధకు బర్త్ డే గిఫ్ట్ ని పంపమని, బర్త్ డే గ్రీటింగ్స్ ను కన్వే చేయమని నాతో చెప్పారు. మీ ద్వారా నేను మిస్టర్ సిద్ధార్ధకు బర్త్ డే శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. మరో పదినిమిషాల్లో చీఫ్ అందజేస్తున్న బర్త్ డే గిఫ్ట్ మీకు అందుతుంది. సిద్ధార్ధకు అందజేయండి. బైదిబై... జో క్రిబ్ అనే వ్యక్తిని చీఫ్ పంపారు. ఆయన స్టోరీ ఆఫ్ మనీని డిస్కవర్ చేసిన సైంటిస్ట్... మానవ ప్రపంచంలోకి డబ్బెలా ప్రవేశించింది? ఎందుకు ప్రవేశించింది...? అన్న విషయంలో బాగా కృషి చేశాడు. ఆయనచేత సిద్ధార్ధకు ఒక లెక్చర్ ని ఏర్పాటు చేయండి ఓ.కె..."
"ఎస్ సర్" ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
"జో క్రిబ్ అనే ఆయన అమెరికా నుంచి వచ్చారట మీకు లెక్చర్ యివ్వడానికి... చీఫ్ మీకు బర్త్ డే గిఫ్ట్ పంపారు. ఒక పదినిమిషాలలో మనకు చేరుతుంది" చెప్పి అనంతమూర్తి వెళ్ళిపోయాడు.
తన తండ్రి తనకేం గిఫ్టు పంపించి వుంటారు? ఆలోచిస్తున్నాడు సిద్ధార్ధ. తనని గ్రీట్ చెయ్యకపోయినా బర్త్ డే మెసేజ్ పంపి, గిఫ్టు కూడా పంపినందుకు చాలా ఆనందంగా వుంది సిద్ధార్ధకు.
మరో అయిదు నిమిషాల తర్వాత సెక్యూరిటీ చీఫ్ స్వయంగా అందజేసిన ఆ గిఫ్ట్ అనంతమూర్తి ద్వారా సిద్ధార్ధకు చేరింది.
చిన్న పేకెట్, రెడ్ కలర్ ప్లాస్టిక్ కవరు, ఆ కవరుని విప్పి చూశాడు సిద్ధార్ధ.
భగవద్గీత...!!
ఆశ్చర్యంగా ఆ పుస్తకాన్ని తిరగేశాడు. అట్ట తిరగెయ్యగానే రెండో పేజీలో-
To... Dear siddharta, with warm kisses your daddy.
మహంత చేతిరాతతో రాసిన వాక్యాలు.
ఆ ఇంగ్లీషు అక్షరాల వైపే అలా చూస్తూ వుండిపోయాడు సిద్ధార్ధ!
జీవితాన్ని, జీవితంలో ప్రతి క్షణాన్నీ సైంటిఫిక్ ఎప్రోచ్ తో సరితూచుకునే గ్రేట్ బిజినెస్ మాన్ తన తండ్రి మహంత... భగవద్గీతను పుట్టినరోజుకానుకగా ఎందుకు పంపాడు?
చేతిలోని పుస్తకంతో తన పర్సనల్ రూమ్ లోకి నడిచాడు సిద్ధార్ధ!
* * * *
నిశాంత...
దూరంగా నల్లటి సముద్రంలోకి ఆకాశంలోంచి ఉల్క రాలిపడింది. అది ఉల్క కాదు- నిశాంత బ్రతుకు కన్నీటి చుక్క!
హోటల్ తాజ్ మహల్ ఇంటర్ కాంటినెంటల్ లో తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూట్లో...
కిటికీలోంచి నిద్రపోతున్న నగరాన్ని చూస్తున్న నిశాంతకు ఒక్కసారి ఎప్పుడూ జోగుతూ కనబడే తన పల్లెటూరు గంగిరెడ్డి తల్లి గుర్తొచ్చింది.
రెండు నెలల క్రితం తన తండ్రి రైల్వేస్టేషన్ దగ్గర కళ్ళల్లో నీళ్లు నింపుకొని బాధపడ్డప్పుడు, ఆ బాధ అప్పుడు అర్ధంకాలేదు. కుమారస్వామి, నర్సింహ హైద్రాబాద్, అక్కడ్నుంచి బొంబాయి తీసుకొచ్చినప్పుడు కూడా అర్ధంకాలేదు.
మునుస్వామి కుశాలికి తనని అప్పగించినప్పుడు డబ్బు చేతులు మారడం తన ఎదురుగా జరిగినప్పుడు మాత్రమే స్పష్టంగా నిశాంతకు అర్ధమయింది తను అమ్ముడుపోయిందని!
తన ఊరు నుంచి, చుట్టుప్రక్కల ఊళ్ళనుంచి అప్పుడప్పుడు ఆడపిల్లలు అకస్మాత్తుగా ఎందుకు మాయమైపోయేవారో స్పష్టంగా అర్ధమయింది.
మిగతా వాళ్ళలా తననెందుకు వ్యభిచార వృత్తిలోకి దించలేదో అచ్యుతముని తననెందుకు ప్రత్యేకంగా చూసుకున్నాడో అర్ధమయింది.
కన్నీటి జీవితానికి రక్తపు తెర!
మరి దేశ్ ముఖ్!?
తనని ఆయనెందుకు ఇష్టపడుతున్నాడు? అతనిది కూడా అమ్మాయిల బిజినెస్సేనా?
తన ద్వారా ఆయన ఏమాశిస్తున్నాడు? తన శరీరాన్నా? తన తెలివితేటల్నా?
ఆయనలాంటి వ్యక్తి ఆశ్చర్యపడే తెలివితేటలు తనలో వున్నాయా? నిశాంత మనసులో ఎన్నో ఆలోచనలు! అలా ఆలోచిస్తున్న ఆమె మెదడులోకి అకస్మాత్తుగా ప్రవేశించిన ఆలోచన-
"ఇక్కడ్నుంచి తప్పించుకొని పారిపోతే?" ఆ ఆలోచన రావడంతోనే ఆమె మనసు ప్రశాంతంగా తయారయింది.
అవును! అచ్యుతముని దగ్గరలా ఇక్కడ తనపై నిఘా లేదు... తనని ఎందుకో పూర్తిగా నమ్ముతున్నాడు దేశ్ ముఖ్.
పారిపోయి ఎక్కడికెళ్తుంది తను?
తన ఊరు...