తను ఉన్నది ఏసీ రూమని, ఎస్.పి. ఎదురుగానే ఉన్నానని తెలిసినా, ఆ గెస్ట్ హౌస్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉందని తెలిసినా, అతనంత చిన్నగా చెప్పినప్పుడే వీరూ ఆ ప్రాంత ప్రజల్ని ఎంతగా భయపెట్టి ఉంటాడో అర్థం చేసుకున్నాడు రంజిత్.
"మరెలా....? ఏదో ఒక ఇన్ ఫర్మేషన్ మనకు రాందే ఎలా ప్రొసీడ్ అవ్వగలం?"
"వీరూకి భయపడేవారేకాదు సార్_శత్రువులూ ఉన్నారు సార్...."
రంజిత్ కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు.
డొంక కదలబోతోందనుకున్నాడు స్వగతంలో.
"ఎవరు....?!" ఆత్రుతగా ప్రశ్నించాడు.
"కోటేయార్ మాదయ్య, తంగవేలు...."
చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం అలముకుందక్కడ.
"ఇప్పుడు వాళ్ళెక్కడ....?"
"చంపబడ్డారు సార్"
ఉత్కంఠ అంచుకు చేరుకున్న రంజిత్ చప్పబడ్డాడు.
"వాళ్ళు చచ్చినా వాళ్ళ వారసులు....అదే వాళ్ళ వారసులు, పిల్లలు, బంధువులున్నారుగా....?"
మరలా ఉత్సాహాన్ని పుంజుకున్నాడు రంజిత్.
"వాళ్ళెవరయిందీ, ఎక్కడుందీ ఎవరికీ తెలీదు. కాని అప్పుడప్పుడు మనకు ఇన్ ఫర్మేషన్ అందిస్తుంటారు సార్...." అని కానిస్టేబుల్ అంటుందడగానే పెద్ద శబ్దం వచ్చింది.
అంతా ఉలిక్కిపడ్డారొకసారి.
రంజిత్ స్ప్రింగులా లేచి రెండంగల్లో డోర్ ని సమీపించి, హోల్ స్టర్ లోని పిస్టల్ ని తీసుకొని తలుపు తీసి సిటౌట్ లోకి వెళ్ళాడు.
ఆ గది ఆ గెస్ట్ హౌస్ కి తూర్పు దిక్కున, చివరగా ఉంది. ఖాళీ సమయాల్లో అధికారులు అక్కడ కూర్చుని అడవిని తిలకించేందుకు ఆ సిటౌట్ ని ఏర్పాటు చేశారు.
రంజిత్ తేరిపార చూశాడు.
దూరంగా గెస్ట్ హౌస్ ముందు భాగాన వెలుగుతున్న లైట్ కాంతి అక్కడ అస్పష్టంగా కనపడుతోంది.
కొద్ది దూరంలోనే దట్టమయిన అడవి....
ఎవరూ కనిపించలేదు.
గాలికి చెట్లు ఊగుతూ కనిపించాయి.
ఆలోచిస్తూ, అనుమానిస్తూ వెనక్కి తిరుగుతున్నంతలో కాలికేదో తగిలింది. చటుక్కున వంగి దాన్నందుకున్నాడు. రాయిని మధ్యలో పెట్టి కాగితం చుట్టి వుంది.
చటుక్కున విప్పి చూశాడు.
తమిళంలో ఏదో రాసి వుంది.
ఆ కాగితాన్ని తీసుకొని లోపలకు వస్తూనే "నీకు తమిళం వచ్చా" అన్నాడు.
ఆ కానిస్టేబుల్ దాన్నందుకొని "పాలార్ బ్రిడ్జి...." అని అన్నాడు వారికి వినిపించేలా.
అంతే....రంజిత్ టేబుల్ మీదున్న వైర్ లెస్ సెట్ అందుకుంటూనే కాలింగ్ బెల్ నొక్కాడు.
మరుక్షణం ఎస్.ఐ. దినేష్ ఆ గదిలోకి వచ్చాడు.
"ఆపరేషన్ పాలార్....స్టార్ట్ ఇమ్మీడియట్లీ" అన్నాడు రంజిత్ ఉద్వేగంగా.
కొద్ది నిమిషాల్లో రెండు వందలమంది పోలీసులు, ఫారెస్ట్ గార్డ్స్, రేంజర్స్, నిద్రకళ్ళతోనే ఆయుధాల్ని టార్చిలైట్స్ ని చేతబూని వెహికల్స్ ఎక్కారు.
ఆ నిశీధి నీరవాన్ని బద్దలుచేస్తూ యుద్ధ వాతావరణాన్ని మరిపిస్తూ, దట్టమయిన అడవిలోకి దూసుకుపోయాయి మరుక్షణం.
* * * *
గెస్ట్ హౌస్ కి వంద గజాల దూరంలో ఉన్న చింతచెట్టు పైన అప్పటివరకూ కూర్చుని అటుకేసే చూస్తున్న ఓ ఆకారం వడివడిగా చెట్టు దిగి అడవిలోకి ప్రవేశించి అదృశ్యమైపోయింది.
* * * *
"మలై మహదేశ్వరా హిల్స్....చిన్నసైజు టౌన్....చుట్టూ పర్వతశ్రేణులు....ఆనుకొనే దట్టమయిన అడవి....ఆ అడవిలో గంధం చెట్లు విపరీతంగా వున్నాయి. కొల్లెగాళ్ నుంచి ఆ టౌన్ కి వెళ్ళవచ్చు. మైసూర్ నుండే డైరెక్ట్ బస్సులున్నాయి. సుమారు ఆరు గంటల ప్రయాణం.
గతంలో ఆ ప్రాంతమంతా రామాపుర పోలీస్ స్టేషన్ జ్యూరిస్ డిక్షన్ లోకి వచ్చేది. ఆ తరువాత ఎమ్.ఎమ్.హిల్స్ లో పోలీస్ స్టేషన్ పెట్టారు.
ఎమ్.ఎమ్.హిల్స్ కి తూర్పువైపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో వుందా గ్రామం_దాని పేరు గోపీనాథం. అదే వీరూ స్వగ్రామం. మైసూర్ జిల్లా, కొల్లెగాళ్ తాలూకా పరిధిలోని గ్రామమది...." విజయ్ చెప్పటం ఒక్కక్షణం ఆపి పక్కనేవున్న ప్లాస్క్ వైపు చూశాడు.
మహిమ చిరుదరహాసం చేస్తూ టీని రెండు కప్పుల్లోకి పంపింది.
అర్దరాత్రి దాటి అరగంటైంది.
గార్డెన్ సిటీ మైసూర్ గాఢ నిద్రలో ఉంది.
అద్దెకు తీసుకున్న డాబా టెర్రెస్ మీద చాప పరుచుకొని దానిమీద కూర్చున్నారిద్దరూ. విజయ్ చలిని తరిమేసే ప్రయత్నంలో టీని చప్పరిస్తూ, సిగరెట్ వెలిగించుకున్నాడు.
దూరంగా చాముండి హిల్స్ మీద వెలుగుతున్న లైట్స్ నే చూస్తూ అంది మహిమ_"ప్లీజ్.... ఆపకు విజయ్....నీకేదన్నా కావలిస్తే చెబుతూనే సైగ చెయ్....యూనో....యాజ్ ఏ జర్నలిస్ట్ గానే కాదు_ పర్సనల్ గా కూడా థ్రిల్లింగ్ గా ఫీలవుతున్నాను. జిమ్ కార్బెట్ హంటింగ్ స్టోరీస్ చదువుతున్నంత ఎగ్జెయిటింగ్ గా ఫీలవుతున్నాను...."
విజయ్ చిన్నగా నవ్వాడు.
"కర్నమలై, నాగమలై, శంకమలై, మైరుమలై అనే కొండల మధ్య ఆ గ్రామం వుంది. గుర్రపు డెక్కల షేప్ లో వున్న కొండల మధ్య ఆ గ్రామం ఉండటంతో ఆ గ్రామానికి రక్షణ ప్రకృతిపరంగా లభించింది. ఉత్తర, దక్షిణ, పడమర దిశలో కొండలుంటే _ తూర్పు దిశలో కావేరి నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తూ మరో రక్షణ దుర్గంగా వుంటుంది.
ఆ నదే కర్నాటక_తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుగా నిలుస్తుంది. నదికి పశ్చిమ దిశలోవున్న గ్రామాలు, అడవులు కర్నాటకకు చెందితే, నదికి తూర్పు దిక్కున తమిళనాడు గ్రామాలూ, అడవులూ ఉంటాయి.
దట్టమయిన అడవుల మధ్య వున్న ఆ గ్రామం ఓ మనోహర దృశ్యానికి ప్రతీక. ఆ గ్రామానికి ఆనుకొనివున్న అడవుల్లో క్రూరమృగాలు యధేచ్చగా సంచరిస్తుంటాయి.
అందుకే సాయంత్రం ఆరు గంటలకే ఆ గ్రామంలోని ఇంక తలుపులు మూసుకుంటాయి. పశువుల దొడ్లు రక్షణలోకి వెళ్ళిపోతాయి. తిరిగి తెల్లవారేవరకు అక్కడో గ్రామం ఉన్న ఆనవాళ్ళే ఉండవు.
ఆ గ్రామంలో ఆరొందల గుడిసెల్లాంటి ఇళ్ళున్నాయి. సుమారు 3,500 మంది జనాభా ఉంటుంది. ఆ గ్రామంలో కన్నడిగులు, తమిళులు, తెలుగు ప్రజలు అందరూ ఉన్నారు.
కొందరు వ్యవసాయం చేస్తే, ఇంకొందరు దగ్గర్లో ఉన్న బ్లాక్ గ్రెనెట్ గనుల్లో కూలీలుగా పనిచేస్తుంటారు. ఇంకొందరు ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ కింద, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ రోజు కూలీలుగా పనిచేస్తుంటారు.
ఎమ్.ఎమ్.హిల్స్ నుంచి గోపీనాధానికి వెళ్ళాలంటే పాలార్ దగ్గర డైవర్షన్ తీసుకోవాలి. పాలార్ నుంచి రోడ్డు దక్షిణం నుంచి తూర్పుకు వెళ్తుంది. మెటల్ రోడ్డే.... వెహికల్స్ స్లోగా వెళ్ళవచ్చు. గోపీనాధం నుంచి అలంబడి, హొగెనకల్ ఫాల్స్ కి వెళ్ళే మార్గంలో వెహికల్స్ వెళ్ళలేవు. అలంబడి, హొగెనకల్ ఫాల్స్ ప్రాంతంలో మకాం చేయటం వీరూకి చాలా ఇష్టం....నీటిపాయలు....జలపాతాలు.... లోయలు.... పచ్చటి తివాచీ పరిచినట్లుండే ఆ ప్రాంతాలు ఎంత మనోహరంగా ఉంటాయో_ అంత ప్రమాదకరం కూడా.