Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 26


    "ఓ అయిసీ...." చిన్న జర్క్ తిన్న మనసుని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడతను_ "పేరు?"
    "మదన్.... మదన్ కుమార్ గంగూలీ"
    తన ఫాడ్ ని కనబడనివ్వలేదతను.
    "అదేంటీ? ఆయన గంగూలీ.... మీరు బెనర్జీ...."
    "వాట్స్ రాంగ్ ఇన్ దట్? మేరీడ్ లైఫ్ లో నేనూ అంకితా గంగూలీనే. విడాకులిచ్చాక నేను మా పుట్టింటి మనిషిని అవుతానుగాని ఆయన అతని మనిషిని కానుగా.... పోనిద్దురూ.... ఆ టాపిక్ ఎవంత బాలేదు.... మార్చేయండి."
    "మీరు తెలుగు భలే బాగా మాట్లాడతారు.... రాస్తారు పత్రికలలో_ ఎలా అలవడింది?"
    "మా ఫాదర్ బెంగాలీ.... మా మదర్ ఆంధ్రా.... లవ్ మారేజన్నమాట. నాకు బెంగాలీ, తెలుగు మాత్రమే రావాలి బాగా ఈ లెక్కన కదూ?"
    "కాదా?"
    "కానక్కర్లేదు. ఐనో.... లెక్కపెట్టుకోండి.... మళయాళం, తమిళ్, ఇంగ్లీషు, మరాఠీ, పంజాబీ, గుజరాత్, హిందీ, సింధీ, కష్మిరీ, అస్సామీస్ అండ్ ఉర్దూ...."
    "అంటే బెంగాలీ, తెలుగుతో కలిసి పదమూడన్నమాట" సిన్సియర్ గా లెక్కపెట్టి చెప్పాడు.
    "యూ ఆర్ గ్రేట్ అంకితా.... రిజైన్ చేసి మా పత్రిక్కొచ్చేయకూడదూ?"
    "నో థాంక్స్. ఐ యామ్ ఫైన్ యాజ్ ఇటీస్."
    "మీ సాగర్ గురించి ఏమన్నా చెప్పండి"
    బండెక్కిందగ్గర్నుంచీ బోరెత్తిచేస్తున్నా ఇంకా విసుక్కలగలేదా మహానుభావా?"
    "నేను కాదు మీరూ గ్రేట్."
    "నేనడిగిందానికి సమాధానం చెప్పలేదు."
    చాలాసేపు మౌనంగా వుండి అంది అంకిత....
    "డోంట్ ఆస్కే మీ వై.... బట్ ఐ లైక్ హిమ్ వెరీమచ్...." అని క్షణం ఆగి, "మేబీ టూ మచ్" అంది.
    కారు హైదరాబాద్ పొలిమేరలు దాటేసరికి తెల్లవారుజాము రెండున్నర అయింది.
    అక్కడ__ ఆ రెండంతస్థుల బంగళాలో.... "అయ్యగారికి ఏదయినా ఆపద ముంచుకొస్తుందా" అన్న ఆలోచనతో విపరీతమైన సంఘర్షణకి లోనవుతున్నాడు హబీబ్. సరిగ్గా అంకిత, సిద్ధార్థలు హైదరాబాద్ పొలిమేరల్లో ప్రవేశించిన క్షణంలో ఆ రోజుకి ముప్పయ్యోసారి. తన పాకెట్ లోంచి ఆ కర్చీఫ్ తీసి చూసుకున్నాడు హబీబ్.
                            "టు సాగర్,
                         విత్ క్రేజ్ ఎండ్ లవ్
                                శృతి."
    అని అందంగా ఎంబ్రాయిడరీ చేయబడి వుంది. ఆ గులాబిరంగు కర్చీఫ్ పైన....
    ప్రక్కనే.... తన పడక గదిలో....
    భరద్వాజకి నిద్ర పట్టడంలేదు. మనిషి మనసు చాలా చిత్రమైంది. కొన్నిసార్లు మరుక్షణం ఏం జరుగనున్నదో తెలియకపోయినా, కొన్నిసార్లు చాలా చిత్రంగా రాబోయే అపాయాన్ని స్పష్టంగా గుర్తిస్తుంది అది.
    సరిగ్గా భరద్వాజ స్థితి అలాగే వుందిప్పుడు. ఏదో తీవ్రమైన భీతికి లోనవుతోంది అతని మనసు.
    మాటి మాటికి అతనికి తన తమ్ముడు విజయ్ గుర్తొస్తున్నాడు. మనసు నిండా ఏదో అపరాధ భావన.
    విజయ్ భరద్వాజ.... తన అన్యాయాలకి బలైన మరో ప్రాణం.... ఆ పాపపు కోరలు తనని కబళించ బోతున్నాయా??? చాలాసేపు పక్కపైన పొర్లుతూ వుండిపోయాడు కేశవ్ భరద్వాజ....
    తెల్లవారుజమున క్రమంగా కలత నిద్రలోకి జారుకొంటూండగా అతని మనసులోంచి తమ్ముడు విజయ్ భరద్వాజను గురించిన ఆలోచన జారి, మరో రూపం నిండసాగింది....
    అది ప్రభాకరంది.


                                                   *    *    *    *


    జూన్ తొమ్మిది.... శుక్రవారం....
    శృతి హబీబ్ ని ఏలూరు పంపించింది. తన స్నేహితురాలి పెళ్ళికి.... ఓ నెక్లెస్ బహుమతిగానూ, క్షమార్పణలతో ఒక ఉత్తరమూ ఇచ్చి, పెళ్ళి అయ్యేదాకా వుండి ఆదివారం సాయంత్రం రమ్మని చెప్పిందతనితో. తరువాత సాగర్ దగ్గరకెళ్ళి సైలెన్సర్ అమర్చిన తుపాకీ వున్న ఓ బేగందించింది. దాన్నెలా ఉపయోగించాలో వివరిస్తూ మదన్ టైప్ చేయించిన ఓ కాగితం కూడా ఇచ్చింది.
    జూన్ పది.... శనివారం....
    మరో ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్నాననీ, రాత్రి ఆలస్యంగా వస్తాననీ భరద్వాజతో చెప్పి, అతను ఇల్లు కదలకుండా ఉండాలని, టిఫిన్ కారియర్ లో సర్ది, మధ్యాహ్నపు భోజనంలో ఓ నిద్రమాత్ర ఎక్కువగా కలిపి, ఫ్లయిట్ ఎక్కేసింది శృతి.
    హబీబ్ వుండడన్న సంగతి సాగర్ కి చెప్పింది. కాని తాను కూడా ఉండదని చెప్పలేదతనికి.... ఒకవేళ సాగర్ అంతదూరం రావడమంటూ జరిగితే, తనున్నా, లేకపోయినా పని పూర్తి చేయకుండా తిరిగి వెళ్ళడని ఆమె నమ్మకం.
    అయితే శృతి, మదన్ ల ప్లాన్ ప్రకారమే అంతా జరగలేదు. హఠాత్ గా శృతి తననలా పంపడంతో అనీజీగా ఫీలవుతున్న హబీబ్, శనివారం ప్రొద్దున్న తిరిగి ఏలూరు నుండి బయలుదేరి హైదరాబాద్ చేరి, నేరుగా ఎస్.పి. ఆఫీసుకి బయలుదేరాడు.
    ఇక్కడ భరద్వాజ మధ్యాహ్నం భోజనం చేయకుండా జూస్ మాత్రమే తాగడంతో మెలుకువగానే వున్నాడు.
    హబీబ్ ఎస్.పి. ఆఫీసులోకి అడుగుపెట్టే సమయానికి తుపాకితో బయలుదేరాడు సాగర్.
    మృత్యువు భరద్వాజ ఇంటి చుట్టూ తిరగసాగింది. ఇంకా ఒక నిర్ణయానికి రాని దానిలా...


                                                    *    *    *    *


    "నేను డి.యస్.పి. గారితోనే మాట్లాడాలి."
    గట్టిగా చెప్పాడు హబీబ్.
    అప్పటికి అయిదు నిమిషాలయింది అతను డి.యస్.పి. ఆఫీస్ దగ్గరికి వచ్చి. బయట ఇన్స్ పెక్టరూ, కానిస్టేబుల్స్ ఎంత ప్రయత్నించినా అతని నోటివెంట ఇన్ఫర్మేషన్ రాబట్టలేక పోతున్నారు. ఆరో నిమిషం విసిగి డి.యస్.పి.కి లోపలికి వార్త వెళ్ళింది. ఏడో నిమిషంలో డి.యస్.పి. గదిలోకి అడుగుపెట్టాడు హబీబ్.
    విశాలంగానే వుందా ఆఫీసు. ఏ.సి. చల్లగా మారుస్తోంది వాతావరణాన్ని. ఆ రోజు చాలా బిజీగా వుండటంతో సమయం ఆరున్నరయినా ఇంటికెళ్ళలేదు. ఆఫీసులో ఎవరూ లేరు.

 Previous Page Next Page