Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 26

ఒక వంద గజాలు నడిచిన తర్వాత ముక్కు పీల్చింది స్వప్న. ఇందాక వచ్చిన పులి వాసన మళ్ళీ వస్తోంది ఘాటుగా. పులి దగ్గరలోనే వుందా?
పరిశీలనగా అటూ ఇటూ చూసింది.
తర్వాత ఆమె పెట్టిన కేక, అడవి అంతా మారుమోగింది. ఆ పక్కనే వున్న లోయలో ప్రతిధ్వనించింది. అలా అరుస్తూనే వుండిపోయింది తను.
కొద్దిసేపటి తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాడు సందీప్. "ఏమిటి? ఏమయింది?" అంటూ.
భయంతో నిలువు గుడ్లు పడ్డాయి స్వప్నకి. ఆపకుండా అరుస్తూనే వుంది తను.
చుట్టూతా చూశాడు సందీప్. స్వప్న అంతగా భయపడిపోవడానికి కారణం ఏమిటో అతనికి అర్థం అయింది.
చాలా పెద్దసైజు తాబేలు ఒకటి - దాదాపు మనిషి అంత ఎత్తు వుంది. నిమిషానికి ఒక అడుగు చొప్పున భారంగా నడుస్తూ వస్తోంది.
బెదిరిపోయిన స్వప్న, సందీప్ ని చేతులతో బలంగా చుట్టేస్తూ హత్తుకుపోయింది. ఆప్యాయంగా ఆమె వెన్ను నిమిరాడు అతను. "నో ఫియర్ బేబీ! ఐయామ్ హియర్!" అన్నాడు అనునయంగా. అతనికి ఆపుకుందామన్నా నవ్వు ఆగడంలేదు.
ఈ గొడవ అంతా చూసిన తాబేలు బెంబేలు పడి అతి ప్రయాస మీద దారి మార్చుకుని మరో దిశలో మొదలెట్టింది ప్రయాణం.
సందీప్ కౌగిట్లోని స్వప్న మళ్ళీ భయంతో బిగుసుకుపోయింది. అతని భుజంమీదనుంచీ కనబడుతున్న దృశ్యాన్ని చూస్తోంది కళ్ళార్పకుండా.
అతనూ అనుమానంగా వెనక్కి చూశాడు. "గాడ్!" అన్నాడు అప్రయత్నంగా.
నోటిని గుహలాగా తెరిచి వస్తోంది ఒక హిప్పో పొటామస్. నీటి గుర్రం అంటారు దాన్ని తెలుగులో. అయితే దానికి గుర్రం పోలికలు ఏమీ వుండవు. చూడడానికి పెద్ద సైజు సీమపందిలా వుంటుంది.
స్వప్న సన్నగా కంపించడం తెలుస్తోంది అతనికి. ఆమె మొహం నిండా పాదరసం బిందువుల లాగా స్వేదం చేరింది.
"భయపడకండి! అది శాఖాహారి! మనల్ని ఏమీ చెయ్యదు" అన్నాడు సందీప్.
"తను శాఖాహారినని దానికి తెలుసా?" అంది స్వప్న గాభరాగా.
నవ్వొచ్చింది సందీప్ కి.
మిడిగుడ్లు వేసుకుని జీపు దగ్గర నిలబడిపోయింది హిప్పో. స్పేరు టైరుని అంచనా వేస్తున్నట్లు కాసేపు చూసి, దానిని నోటితో కరిచి పట్టుకుంది.
"ఏయ్! వదులు! హోయ్! ఛేయ్!" అని అదిలించాడు సందీప్ కంగారుగా.
తనను డిస్టర్బ్ చేసినందుకు అతన్ని విసుగ్గా చూసి, స్పేరు టైరుతో సహా దగ్గరలోనే వున్న చిన్న మడుగులో బుడుంగున మునిగింది హిప్పో. తలకి పైభాగాన వుండే దాని కళ్ళు మాత్రం నీళ్ళ ఉపరితలంమీద నుంచీ బద్ధకంగా చూస్తున్నాయి.
'ఓహ్ షిట్!' అనుకున్నాడు సందీప్. దానిని పరీక్షగా చూశాడు.
పది నిమిషాల తర్వాత పైకి తేలింది హిప్పో. అది నీటి జంతువే అయినా కూడా, గాలి పీల్చుకోవడానికి అయిదు పది నిమిషాలకి ఒకసారి తల బయటికి పెడుతూ వుంటుంది.
ఒక్క నిమిషం పెద్ద పెద్ద గుడ్లతో సందీప్ వైపు చూసి, 'జగమంతా మిధ్య' అన్నట్లు ఒక గాలి బుడగ తెప్పించి, మళ్ళీ నీళ్ళలోనికి వెళ్ళిపోయింది.
దాని వీపుమీద కనబడినదేదో సందీప్ దృష్టిని ఆకర్షించింది. ఏదో స్ఫురించింది అతనికి. సాలోచనగా అటే చూస్తూ వుండిపోయాడు.
అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ తల బయటికి పెట్టింది హిప్పో, ఈసారి దాని నోట్లో టైరు తాలూకు పెద్ద ముక్క ఒకటి వుంది, మిగతా ముక్కలు చచ్చిపోయిన చేపల్లా నీళ్ళమీద తేలాయి.
నిస్పృహగా చూశాడు సందీప్. "పిశాచం స్పేర్ టైరుని కొరికి ధ్వంసం చేసేసింది. మరో టైరు లేదు, ఇంకేమిటి దారి?" అన్నాడు.

 Previous Page Next Page