Previous Page Next Page 
గోరింటాకు పేజి 26


    ఇంకోసారి అర్థరాత్రి వచ్చి కోటు విడిచి... దూరంగా విసిరేసి "బ్రహ్మానందం! బ్రహ్మానందం!" అని ఏడిచేవాడు చక్రపాణి. "బ్రహ్మానందం! సన్నర్థంచేసుకోవేం? నన్నుచూస్తేనే ఈర్ష్యతో అలా మొహం  తిప్పేసుకుంటావేం? నేను పాడైపోలేదు బ్రహ్మానందం! నేను పాడైపోలేదు."

 

    "నువ్వు పాడైపోయావు" అనేవాడు బ్రహ్మానందం కసిగా. "నాశనం అయిపోయావు. నేనూ అంతే. కానీవద్దు. మనం అందుకోసం విచారించవద్దు."

 

    "లేదు బ్రహ్మానందం! నువ్వు నా ప్రాణస్నేహితుడివి. నన్ను నమ్ము. నేనిదంతా ఆనందంకోసం చేయటంలేదు. ఒక్క పిసరంతైనా నేను సుఖాన్ని బాపుకోవటంలేదు. నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను బ్రహ్మానందం! నాకు దుఃఖంలేదు. సుఖంలేదు. నిర్దుష్టమైన అనుభూతి లేదు. తన్మయత్వం లేదు. నన్నుచూసి అంతా జడుసుకుంటున్నారు బ్రహ్మానందం! నేనేం పాపం చేశాను? నాకెందుకీ శిక్ష?"

 

    "ఆపు అలా ఏడవకు. కళ్ళు అలా ఎర్రబడనీయకు. నువ్వేం పాపం చేయలేదా? చేశావు. నీ పాపాలకి అంతులేదు. నేనూఅంతే. కాని నేను విచారించను."

 

    "నేను చేశానే అని విచారించటంలేదు బ్రహ్మానందం! చేయనిదానికి ఎందుకు ఈ శిక్ష అని చింతిస్తున్నాను. నిజంగా నన్ను గాలించిచూడు. నేనెక్కడా చెడిపోనేలేదు. నిజమే! తాగుతున్నాను. కాని నాకు తాగుడు అలవాటు కాలేదు. ఎన్ని నెలలు, సంవత్సరాలయినా, తాగకుండా ఒక్క చుక్క ముట్టుకోకుండా వుండగలను. అసలు అదంటే నాకసహ్యం. తాగి నేనెప్పుడూ తూలలేదు. తాగాలన్న కుతితో నేనెన్నడూ తాగలేదు. ఇహ... అది! హాయిగా భోంచేసినప్పుడు ఉండే సుఖంకూడా లేదు అప్పుడు కీట్సు పద్యం ఒకటి చదువుతూంటే కలిగే ఆనందాతిరేకం అప్పుడు లేదు. నేను దాన్ని పరుచు అసహ్యించుకుంటాను. లోకంలో అన్నిటికన్న అసహ్యించుకుంటాను. అయినా... చెబుతున్నానుగా, నేనేం మడిగట్టుకుని కూర్చోలేదు. ఎందుకంటే నేను చెడిపోవటంలేదని నమ్మకముంది గనుక. నన్నెవరైనా చులకనగా చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది."        

 

    "చెడిపోయిన వాళ్ళందరికీ అలానే వుంటుంది."

 

    "ఏమో? చెడిపోవటానికి అర్థం ఇదికాదు బ్రహ్మానందం!"

 

    అతను చివరకు చక్రపాణి మాటలను నిర్లక్ష్యంచేసి "ఆ కబుర్ల అర్థం నాకు తెలియదు. అతీతమైన మనస్తత్వాన్ని గురించి నాకు చెప్పకు. అలాంటివాటిలో నాకు నమ్మకం లేదు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. బుద్ధిపుడితే చదువుకో" అంటూ అక్కడనుంచి లేచిపోయాడు.

 

    చక్రపాణి నేలమీద బోర్లాపడుకుని నిశ్శబ్దంగా ఏడిచాడు. మనశ్శాంతి లభించటంలేదు. జీవితం ఇదివరకు ఎలావుందో ఇప్పుడూ అలానే వుంది. తన మనసు పరిశుద్ధంగానే వుంది. రోత, కల్మషం, నీచంవున్న ఎలాంటి ముద్రా తనపై పడటంలేదు.  

 

    చాలాసేపటికి మనసు ఎందుకో ప్రశాంతంగా వున్నట్లు తోచింది. 'పరీక్షలు దగ్గరకొస్తున్నాయి' అన్నమాట మనసులో మెదిలింది. ఇంట్లోవాళ్ళు గుర్తుకు వచ్చారు.

 

    "నేను మారలేదు. నేను మామూలు మనిషినే. ఎప్పటి మీ మనిషినే."

 

    కళ్ళు తుడుచుకుని పుస్తకం చేతిలో పట్టుకున్నాడు. మరునాడు ఎనిమిదయినా చదువుతూనే వున్నాడు.

 

 

                                               7

 

    తాను చేయిజారిపోయానని గ్రహించాడు రాజారావు. మంజువాణి అతనికి సన్నిహితంగా వచ్చేసింది. అతడి పోకడలు, పవిత్రమైన ఆలోచనలు బుగ్గయిపోయినాయి. ప్రకృతి మంజువాణి రూపంలో అతనిమీద పగబట్టింది. ఎక్కడకుపోయినా ఆమెనీడ అతనిమీద ప్రసరిస్తూనే వుంది. భుజంగరావు నెలకు ఇరవైరోజులు క్యాంపుల్లో వుంటాడు. ఈ ఇరవైరోజులూ వీళ్ళది ఇష్టా సామ్రాజ్యం. అతను నిద్రపోతుంటే ఆమెవచ్చి లేపేది. తెల్లవార్లూ జాగరణ. అంతులేని కబుర్లు. ఎవరిమీద ఎవరు ఆధిక్యత సంపాదించారో ఇద్దరకూ స్పష్టంగా తెలియదు. మంజువాణి మాటల్లో చాతుర్యం వుంది. ప్రేమా, ఠీవీ రెండూ వున్నాయి. వాటిల్లో మొదటినాటి సంఘటనను ఇంచుమించు ఇద్దరూ మరిచిపోయారు. ఒకరికోసం ఒకరు పుట్టినట్లుగా ప్రవర్తించసాగారు... భుజంగరావు ఊళ్ళో వున్నప్పుడు రాజారావుతో సరదాగా మనసిచ్చి మాట్లాడుతూ వుండేవాడు. ఆయన్తో మాట్లాడుతూంటే రాజారావుకి చాలా కలవరపాటుగా వుండేది. ఆయన తన దగ్గరకు రాకుండావుంటే బాగుండును. అవును, ఆయనకు లేశమైనా అనుమానం లేదా తమ ఇద్దరిమీదా? మొదట్లో ఆయన ఊళ్ళో వున్నప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చేదికాదు. రానురానూ ఆయన ఇంట్లో నిద్రపోతూండగానే రాకపోకలు సాగటం మొదలుపెట్టాయి. రాజారావు నివ్వెరపోయి "ఇదేమిటి?" అన్నాడు. మంజువాణి నవ్వి ఊరుకుంది. అతనికి అనుమానం కలిగింది భర్తకు ఈవిషయం తెలిసివుంటుందా అని. ఎలా సాధ్యం? ఎలా సహించగలడు ఓ మనిషి? మొదట్లో తనలో తనే మదనపడ్డాడు. కొసకు ఓరోజున ఆమెను గ్రుచ్చి గ్రుచ్చి అడిగాడు.  

 

    "ఛీ! పాడుమాటలు. ఎలా తెలుస్తుంది?' అన్నదామె.

 

    "తెలియదేం? ఇంత పబ్లిగ్గా నా దగ్గరకు వస్తోంటే?"

 

    "అదేలెండి తమాషా... అనవసరపు అపోహలు పడబోకండి."

 

    కాని ఓరోజున తామిద్దరూ గదిలోవుండగా ఎవరిదో తలకాయ తొంగిచూసినట్లు అనిపించింది. అనిపించటమేమిటి? ఎవరో చూసేవుంటారు. ఆనాడు నిజం చెప్పమని మళ్ళీ ఆమెను వేధించాడు. "ఛా! అలాంటిదేమీ లేదండీ. ఆయన చండశాసనుడు. తెలిస్తే - బాబోయ్" అన్నది.

 

    తాను పవిత్రమైన భావాల్తో ఆరాధించటం మొదలుపెట్టిన స్త్రీ దగ్గర ఇప్పుడతను సిగ్గు పూర్తిగా విసర్జించాడు. కాని తన భర్తని ఏమయినా అంటేమట్టుకు ఆమె మెల్లగా మందలిస్తూ వుండేది. అతను ఎగతాళిగా నవ్వేశాడు. మళ్ళీ ఆయన్నిచూస్తే భయంగానే వుండేది. ఆయనకు తెలిసి వుండదు. ఎప్పటిలా మనసిచ్చి మాట్లాడుతూండేవాడు.  

 

    అతను ప్రస్తుతం మిగతా వ్యవహారాలన్నీ మరచిపోయాడనే చెప్పవచ్చు. పురుషుడి జీవితంపై స్త్రీకి ఎంత ప్రభావం! ఈ ఇరవయ్యో శతాబ్దాన్ని అసలు పరిపాలిస్తోంది స్త్రీయేనని ఏదో పుస్తకంలో చదివిన మాట అతనికి వంటబట్టింది. ఆమె ఒకరోజు కనిపించకపోయినా అతనికి వెర్రెత్తినట్లుండేది. కొన్నాళ్ళు పోయేసరికి ఇది మరింత లోతుకు దారితీసింది. భర్త ఇంట్లో వున్నప్పుడు ఆమె రాలేకపోతే, అతని దగ్గర ఆమెను ఊహించుకుని అసూయతో మండిపడుతూవుండేవాడు. తన వస్తువుని ఎవరో దొంగిలించినట్లు చికాకుతో నిద్రపట్టక నిశాచరుడిలా పచార్లుచేస్తూ వుండేవాడు. కొన్నాళ్ళు పోయాక ఈ సంగతి ఆమె ముఖంమీదే వ్యక్తం చేయసాగాడు. ఆమె అతని జుత్తులోకి చెయ్యి పోనిచ్చి ఓదార్చటానికి ప్రయత్నించేది. కబుర్లకి అంతు వుండేదికాదు. అతను అడగకూడనిప్రశ్నలు ఏవోవేసేవాడు. "ఛీ" అనేది ఆమె. క్రమక్రమంగా ఈ జీవితానికి అలవాటుపడిపోయాడు అతను. ఓ రసమయ ప్రపంచంలో కొట్టుకుపోతున్నాడు. ఇద్దరూ అతిసన్నిహితులైపోయారు. అంతటి రాజారావు చివరకు ఆమెకోసం ప్రపంచాన్ని త్యాగంచేసే స్థితికి వచ్చాడు. అతని కొంటెమాటలకు ఆమె పులకరించిపోతూ వుండేది. "అట్లా కూర్చుని కబుర్లు చెప్పండి. నాకింకేమీ అక్కర్లేదు. కాని - అదిగో, అదే వద్దనేది" అనేది.

 Previous Page Next Page