Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 26

   

      "ఊరేగింపులూ, ఉత్సవాలూ మీలాంటివాళ్ళు చేస్తానంటే నేను పైసా ఇవ్వను. అనవసరంగా గొడవచెయ్యకుండా వెళ్ళండి. ఊ, వెడతారా? లేదా?" అని అరుస్తున్నారు రంగారావుగారు.
   
    "వెళ్ళిపోతామండీ, చందా యిప్పించండి, వెళ్ళిపోతాం."
   
    "చందాలేదు, గిందాలేదు, పొండి ఇక్కడ్నుంచి ప్రతివాడికీ తేలికగా సంపాదించి తగలెయ్యడానికి ఇదో ఆటయిపోయింది. చూస్తారేం ఇంకా? బయటకు నడుస్తారా లేదా?" అని రంగారావుగారు వాళ్ళకు దగ్గరగా వెళ్ళారు.
   
    "అలా మీదిమీదికి వస్తారేమండీ? చందాలడిగితే వెళ్ళగొడతారేమిటి? మాకూ పరువుంది" అన్నాడు దృఢమైనవాడు.
   
    "పరువు వున్నవాడివైతే ఇలాంటి పనులు చేయవు. నా ఇంట్లోంచి పో ముందు."
   
    "నా పరువుగురించి నీకేం తెలుసయ్యా? పెద్ద బడాయిలు చెపుతున్నావు గానీ...."
   
    "ఏడ్చావులే పో!"
   
    "ఏమయ్యోవ్! మాటలు సరిగ్గా రానీ."
   
    రంగారావుగారి శరీరం ఉద్రేకంతో వణికినట్లయింది. మాటలో జీర వచ్చినట్లయింది.
   
    "నా ఇంట్లోకి వచ్చి నన్నే దబాయిస్తావురా రాస్కెల్! తాగివచ్చి అల్లరి చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో?" అని ఇంకో అడుగు ముందుకు వేశాడు.
   
    "ఏం చేస్తావేమిటి?"
   
    "మెడబట్టి బయటకి గెంటుతాను."
   
    "ఏదీ గెంటు చూద్దాం?"
   
    కుమార్ ఇంకా ఆవేశం అణుచుకోలేకపోయాడు. మెరుపులా ముందుకు దూసుకువెళ్ళి ఆ వ్యక్తి మెడ పట్టుకున్నాడు. "దొంగరాస్కెల్! చూడు నిన్నేం చేస్తానో" అని రక్తం ఉడుకులెత్తుతుండగా ఒక్క గెంటు గెంటాడు.
   
    ఆ మనిషి వెనక్కితూలి క్రింద పడబోయి, గోడను ఆధారం చేసుకుని నిలద్రొక్కుకుని కుమార్ నీ, తండ్రినీ ఇద్దర్నీ తిట్టసాగాడు. రెండవవాడు చూస్తూ నిలబడ్డాడు గానీ ఏమీ మాట్లాడటంలేదు.
   
    కుమార్ వాడిని పిండిపిండిగా చితక్కొట్టేయాలన్నంత కోపంతో మళ్ళీ ముందుకు ఉరకబోయాడు.
   
    రంగారావుగారి బలమైన హస్తం అతన్ని బలవంతంగా ఆపింది.
   
    లోపలినుంచి ప్రభావతీ, విమలా, శారదమ్మగారూ చోద్యం చూస్తున్నట్లుగా నిలబడిపోయారు.
   
    "ఒరేయ్, వాళ్ళు అలగావాళ్ళు వాళ్ళు ఏదో వాగారని మనం తొందరపడకూడదు. అసహ్యంగా నలుగురూ మూగుతారు. మనం ఓ దెబ్బ వేశామనుకో, తిరిగి వాడూ ఓ దెబ్బ వేస్తే మనకెంత అవమానం? మనం పెద్ద మనుషులం, పెద్ద మనుషుల్లా ప్రవర్తించాలి. పోలీసులకి ఫోన్ చేస్తానుండు" అంటూ ఆయన టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు.
   
    కుమార్ లో రగులుతున్న కోపాన్ని ఉప్పొంగుతున్న ఆవేశాన్ని ఎవరో నిర్ధయగా నడుం విరగ్గొట్టినట్లయింది. కానిసమయంలో పసలేని నీతులు బోధించినట్లయింది. నిగ్రహం అవలంబించకూడని సమయంలో నిగ్రహంతో బంధించినట్లయింది.
   
    బయటినుంచి వాగుతున్న ఆ గూండాల్ని కసితీరా కొట్టాలని అతని అంతరంగం ఘోషిస్తున్నది. తండ్రి కిష్టంలేని  పని చేస్తున్నామన్న ఇంగితజ్ఞానం ఆ ఘోషని మూగక్షోభగా చేసింది.
   
    తండ్రి బాల్యంగురించి అతనికి తెలుసు. ఎంతో విన్నాడు. పచ్చిగా తిరిగాడు. ఎన్నో దెబ్బలాటల్లో ఇరుక్కున్నాడు. ఎంతమందినో పిచ్చిగా తన్నాడు. కానీ కొడుకు ఆవేశం చూపించాల్సిన సరైన సమయంలో అక్కడి థ్రిల్ నీ, సంఘటనల్లోని థ్రిల్ కాదు జీవితంలోని థ్రిల్ ని చంపేస్తున్నాడు.
   
    వాడు గేటుదగ్గర నిలబడి రోడ్డుమీద జనమంతా వినేటట్లుగా పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఇలాంటి అదనుకోసమే పుట్టినట్లు కనిపించే జనం అప్పుడే గుమిగూడటం మొదలుపెట్టారు.
   
    రంగారావుగారు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు. కంట్రోల్ రూం నెంబరు టెలిఫోన్ డైరెక్టరుమీద పెద్ద అంకెలతో వేసి ఎమర్జన్సీలో సహాయంకోసం ఫోన్ చెయ్యమని రాసివుంది.
   
    అటునుంచి ఎవరో ఎత్తారు. రంగారావుగారు ఎవరో త్రాగుబోతు వచ్చి ఇంట్లో దూరి అల్లరి చేస్తున్నారనీ, వెంటనే సహాయం కావాలనీ అడిగారు. అటువైపునుంచి రైటర్ పలికాడు. ఊళ్లోకి మినిస్టర్ గారు వస్తే పోలీసు బలగమంతా బందోబస్తుకోసం వెళ్ళారట. అక్కడ తను తప్ప ఎవరూ లేరట. ఆ పేట పోలీస్ స్టేషన్ కి ఫోన్ చెయ్యమని సలహా ఇచ్చాడు.
   
    రంగారావుగారు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు.
   
    అక్కడ్నుంచీ రైటర్ పలికాడు. మినిస్టర్ గారు వస్తే పోలీసులంతా ఏర్పాట్లకోసం వెళ్ళారట. తను ఒక్కడ్నే వున్నాననీ, కంట్రోల్ రూమ్ కి ఫోన్ చెయ్యమని సలహా ఇచ్చాడు.
   
    రంగారావుగారు కోపాన్ని దిగమింగుకుంటూ ఫోన్ పెట్టేసి నిస్సహాయంగా నిలబడిపోయారు.
   
    బయట త్రాగుబోతువాడి విజ్రుంభణ ఎక్కువయింది. చుట్టూరా గుమిగూడిన జనం ఎక్కువకాసాగారు. వాళ్ళకు వినోదంగా వుంది.
   
    వాడు మధ్య మధ్య బూతులు కూడా కూస్తున్నాడు.
   
    సుధాకర్ కి అప్పుడే మెలకువ వచ్చింది. బయట గలాభా ఏమిటా అని ముందు గదిలోకి వచ్చి చూసేసరికి పరిస్థితి అర్ధమయింది. అన్నగారి ముఖంలోకి, తండ్రి ముఖంలోకి చూశాడు. గేటులోంచి మాటలు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. అతని ఒళ్ళు వేడెక్కింది. రక్తం వేడెక్కింది. నరాలు ఇనుపతీగల్లా అయినాయి. ఒక్క ఉదుటున బయటకు దూకాడు.
   
    త్రాగుబోతువాడి కంఠాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. మెడ ఆధారంగా చేసుకుని గిరగిరమని త్రిప్పేశాడు.
   
    వాడు హఠాత్తుగా వచ్చిపడిన ఈ పిడుగుపాటుకు త్రుళ్ళిపడి, సర్దుకోడానికి ప్రయత్నిస్తూ సుధాకర్ ని కొడదామని చేయెత్తబోతున్నాడు.
   
    సుధాకర్ వాడికి అవకాశం ఇవ్వలేదు. వాడు చెయ్యిఎత్తేలోగా డొక్కలో బలంగా తన్నాడు. అతను పెద్ద స్పోర్ట్స్ మెన్. అతని కాళ్ళు ఉక్కుకడ్డీల్లా ఉంటాయి.
   
    అంత బలమైనవాడూ దభీమని నేలకూలాడు.
   
    వాడి మెడమీదా, మొహంమీద బండరాళ్ళతో మోదినట్లు తన్నులు పేలిపోతున్నాయి. కదలడానికి సందీయడంలేదు.
   
    లేవడానికి ప్రయత్నించినప్పుడల్లా, రెండు చేతులతో పట్టుకుని విసిరి పారేస్తున్నాడు.
   
    త్రాగుబోతువాడి పళ్ళు విరిగి, నోట్లోంచి రక్తంకారేదాకా తన్నాడు సుధాకర్.
   
    చుట్టూ చూస్తున్న జనంలోంచి ఎవడూ ముందుకు రాలేదు.
   
    ఆ రెండోవాడు ఎప్పుడు పలాయనం చిత్తగించాడో ఎవరికీ తెలియదు.
   
                                  7
   
    ఆ రోజు ఆదివారం ఆదివారం వచ్చినా, మరేదన్నా పండుగలు వచ్చినా ప్రభావతికి చచ్చే భయం. పిల్లలకు స్కూలు వుండదేమో ఇంట్లోనే వుండి ప్రాణాలు తినేస్తారు.
   
    తమ చిన్నప్పుడు తాము ఇంత అల్లరిచేశారా? ప్రభావతికి తెలియదు. కానీ ఆ రోజులకు, ఈ రోజులకూ ఏదో తేడా వున్నట్లు కనిపిస్తుంది. ఈ తేడా ఎక్కడ ఎట్లా వచ్చిందో తెలియదు.
   
    రంగారావుగారు, కుమార్ డిస్పెన్సరీకి వెళ్ళిపోయారు. హరి స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. సుధాకర్ ఇంట్లో లేడు.
   
    కుమార్ మొగపిల్లలిద్దరూ డాబాఎక్కి గాలిపటం మొదలుపెట్టారు. ఐదు పైసలు పెట్టి ఎక్కడినుంచో గాలిపటం తీసుకువచ్చారు. దానికి సూత్రం కట్టారు. తోక అంటించారు. దారపు వుండ తీసుకొచ్చారు. గాల్లో ఎగరేస్తున్నారు. అది కాస్త పైకి ఆకాశంలో ఎగరగానే అనందాతిరేకంతో కేకలు పెడుతున్నారు. వాళ్ళు ఎగరేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ ముఖాల్లో సీరియస్ నెస్, అది ఎగురుతున్నప్పుడు వెల్లివిరిసే తృప్తి, ఆనందం చూసితీరాలి.

 Previous Page Next Page