ఇంతలో వెనుకనుంచీ భుజంమీద చల్లగా చెయ్యిపడింది.
కెవ్వుమన్నాడు లక్ష్మణమూర్తి.
"అరవకు అన్నయ్యా! నీ భుజం మీద చెయ్యి వేసింది నేనే! భయపడ్డావా?" నవ్వుతూ లక్ష్మణమూర్తి వెనుకనుంచీ ముందుకు వచ్చాడు బోసుబాబు.
కళ్ళ ముందున్న తమ్ముడిని చూసినా కూడా. అరికాళ్ళలో నుంచి బయలుదేరిన భయం తాలూకా వణుకు ఇంకా తగ్గలేదు లక్ష్మణమూర్తికి.
"నువ్వు....నువ్వు....."
"నేను నేనే అన్నయ్యా! బోసుబాబుని. బాగా భయపడినట్లున్నావ్?" నవ్వుతూ అడిగాడు బోసుబాబు.
అప్పటికి తెలివి తెచ్చుకున్నాడు లక్ష్మణమూర్తి.
"ఏమిటిదంతా?" కోపంగా అడిగాడు లక్ష్మణమూర్తి.
"ఏముందీ నేను ముందు బయలుదేరాను. నువ్వు నా వెనుకనే బయలుదేరావు, దట్సాల్!"
"తెలివికి సంతోషించాం. ఏమిటిదంతా అని అడుగుతున్నాను."
"ఏమిటిదంతా అంటే ఏమని చెబుతాను? ఏదైనా ప్రశ్న సరీగ్గా వుంటే సమాధానం తిన్నగా వస్తుంది."
"నువ్వు యింట్లోంచి అర్ధరాత్రపుడు బయలుదేరావ్? నిజమే నీ వెనుకనే నేనుకూడా బయలుదేరాను. నీవేమీ కాని పనులు చేస్తున్నావో అని. నా అనుమానం ఎంతో నిజం అయింది.
నువ్వు ఒకింటిముందు బాంబు పెట్టావ్! ఆ లాయర్ గాడి యింటిముందు ఆగి వాడితో ఏదో పోట్లాడి, ఆతరువాత నీ బ్యాగ్ లోంచి ఏదో తీసి వాడికి యిచ్చావ్?
ఆ తరువాత ఇంకాస్త ముందుకివెళ్ళి ఓ పెంకుటింటి ముందు ఆగి తెరిచివున్న కిటికీలోంచి ఆ యింట్లోకి ఏదో పడేశావ్! ఇదంతా నేను చూడలేదు అనుకోకు చూశాను. ఇప్పుడు ప్రశ్న తిన్నగా వుంది కదా! ఇదంతా ఏమిటో సూటిగా జవాబు చెప్పు!" లక్ష్మణమూర్తి ఆవేశ పడుతూ అన్నాడు.
"నేను వచ్చిన పని అయిపోయింది. మనం ఇహ ఇప్పుడు ఇంటికి వెళ్ళవచ్చు. వెడుతూ మాట్లాడదాం పద అన్నయ్యా!" శాంతంగా చెప్పాడు బోసుబాబు.
ఏ కళనున్నాడో లక్ష్మణమూర్తి సరేనన్నాడు.
ఇరువురూ వచ్చిన దారినే వెనక్కి మరలారు.
"అన్నయ్యా! నీవు నా మీద నిఘా వేశావని, నేనెప్పుడో కనిపెట్టాను. నేనంటే మీ అందరికీ ఎందుకింత చులకన? ఉద్యోగం లేదనేకదా! నా కిష్టమయిన పని నేను చేస్తున్నపుడు యింట్లో వాళ్ళు అయితే మాత్రం అందరికీ చెప్పాలని ఏముంది?
నీవు నన్ను వెంటాడుతున్నావని తెలిసే, మారేడుకాయకి రంగుపూసి, వత్తిపెట్టి, 'బాంబు' లాగా కనిపించేలా తయారుచేసి ఆ యింటి ముందుపెట్టాను. దొంగలాయర్ ఇంటిముందు నిలిచి నేను యాక్షన్ చేస్తూ మూకాభినయం చేశాను. ఆ యింటి తలుపులు వేసే వున్నాయ్!
ఆ తరువాత పెంకుటింటి ముందు ఆగి, కిటికీలో చేయిపెట్టి పడవేసినట్లు యాక్షన్ చేశాను. అంతేకాని ఆ యింటిలో ఏమీ పడవేయలేదు...."
బోసుబాబు చెబుతూంటే మాటల మధ్యలో అడ్డుతగిలి "అయితే ఇదంతా నన్ను ఫూల్ చెయ్యటానికి చేశావా?" కోపంగా అడిగాడు అన్నయ్య.
"దీన్ని ఫూల్ ని చెయ్యటం అంటారో, ఆట పట్టించటం అంటారో నాకు తెలియదు. నా ప్రతిచర్యా వేయి కళ్ళతో పరిశీలించాలని చూస్తే మాత్రం ఇలాంటి చేదు అనుభవాలే మీకు ఎదురవుతాయని హెచ్చరించటానికి మాత్రమే నేనీ పని చేశాను.
ఇలా నా చేతిలో దారుణంగా మోసపోయానని ఇంట్లో చెప్పకు. వదినకి అసలే చెప్పకు. నా తెలివితేటలకి నవ్విపోరు గాని నువ్వు నవ్వులుపాలయినందుకు మాత్రం అందరూ నవ్వుతారు. లేదూ వాళ్ళు నవ్వితేనే బాగుంటుందీ అనుకుంటే చెప్పుకో నాకేమీ అభ్యంతరంలేదు. నేను చెప్పేది ఇంతే! నీ ప్రశ్నకి నా జవాబుకూడా ఇదే" తను చెప్పవలసింది ఏదో చెప్పేసి లక్ష్మణమూర్తికన్నా ముందుగా చాలా వేగంగా అడుగులు వేస్తూ ఇంటివైపుకి సాగాడు బోసుబాబు.
అన్నయ్య తేరుకోటానికి సరిగ్గా అయిదు నిముషాలు పట్టింది.
ఆ తరువాత.
కాళ్ళీడ్చుకుంటూ తను కూడా ఇంటివైపుకి సాగాడు అన్నయ్య. అడుగులు నీరసంగా పడుతున్నాయి.
19
అయిదురోజుల క్రితం.
తల్లికి జబ్బుచెయ్యటం, తనని తండ్రి లేపటం ప్రక్కన భర్త లేకపోవటం అప్పుడు అనుమానించ్చింది. భర్తని ఆ రాత్రికి ఊరుకొని మర్నాడు నిలదీసి అడిగింది నిజం చెప్పమంటూ.
భర్త చెప్పిన అసలు కథ నమ్మదగినట్లుగా లేదు.
"నేను ఎక్కడికి వెళ్ళలేదు. నీకు బాధ కలుగుతుందని అబద్ధం ఆడాను కానీ రాత్రిళ్లు నిద్ర పట్టక రిక్షా కానీ, ఆటో కానీ నడపటానికి వెడుతున్నాను. అంతకు తప్ప నేను బయటకి వెళ్ళి ఏం చేస్తాను. ఈ లోకంమీద నాకు చచ్చేంతకసిగా ఉంది. అయినా ఏమీ చెయ్యలేని అసమర్ధుడిని. ప్రస్తుతం నా పరిస్థితి అది" భర్త అలా బాధపడుతూ చెబుతూంటే కామాక్షి నమ్మింది. కాదు నమ్మినట్లు నటించింది.
"నిజానిజాలు తెలుసుకునే వరకూ తనిలా నమ్మినట్లే నటించాలి" అని ఒక దృడ నిశ్చయానికి వచ్చింది కామాక్షి.
"పిచ్చి కామాక్షి తన మాటలను తేలికగా నమ్మింది" అనుకున్నాడు పాండురంగం.
"తనకి తెలియకుండా రాత్రిళ్లు మాత్రమే భర్త బయటకి వెళుతున్నాడు. తను నిద్రపోతున్నట్లు నటించాలేకానీ నిద్రపోకూడదు" దృడ నిశ్చయంతో అనుకుంది కామాక్షి.
రెండురోజులు నిద్ర ఆపుకుంది కానీ ఆ తరువాత ఆపుకోలేకపోయింది నిద్ర.
అప్పుడు వచ్చింది కామాక్షికి అనుమానం.
"తను నిజంగా ఇంత మొద్దునిద్రపోతున్నదా? ఎందుకిలా జరుగుతున్నది?"
కామాక్షికి కొత్త అనుమానం వచ్చిన తరువాత. ప్రతిక్షణం అమూల్యమైనదిగా తలుస్తూ భర్తమీద అతనికి అనుమానం కలుగకుండా పరిశోధన చెయ్యటానికి నిర్ణయించుకుంది.
కామాక్షి తనని అనుమానించటం లేదని ధీమాగా వున్నాడు పాండురంగం. ఆటను ఆ పాడు పనులు చెయ్యకూడదనే ఓ పక్క అనుకుంటున్నాడు. అతని అణువణువునా ఆక్రమించుకున్న కసి ,ఆ సమయం రాంగానే రహస్యంగా ఆ పాడు పనుల్ని చేయిస్తోంది.
రాత్రి పదిన్నర దాటింది.
ఎప్పుడో తప్ప ఆ యింట్లో అందరూ రాత్రిళ్లు త్వరగా భోజనం చేసి మంచం ఎక్కటం అలవాటు.