"అని ఎవరన్నారూ?"
"నువ్వే!"
"నేనా?"
"ఆఁ నువ్వే! నేను పిచ్చివాడినని మీ అంకుల్ తో చెప్పావటగా?"
"అలా అని చెప్పలేదు."
"ఏమని చెప్పావు మరి?"
అతను మీదమీదకు వస్తున్నాడు.
"పిచ్చివాడేం చేస్తాడో తెలుసుగా?"
తను అడుగులు వెనక్కు వేస్తున్నది.
తన కంఠంచుట్టు అతని వేళ్ళు బిగుసుకుపోతున్నాయి....ఊపిరి అందడంలేదు....
"సుధా! సుధా! ఏమైంది?" అతని చేతుల్లోనుంచి ఆమె జారిపోతున్నది.
ఆమెను మెల్లగా తీసికెళ్ళి మంచంమీద కూర్చోబెట్టాడు కృష్ణ.
"ఎందుకు సుధా వాకిట్లోనే నిలబడ్డావ్?"
"మీకోసమేనండీ!" నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా వుంది.
"అర్జంటు పనేదో ఉండి ఆఫీసులోనే ఉండిపోయాను. ఆలస్యమైంది."
"అంకుల్ చెప్పారా?"
"ఏమని?"
"అవును! ఆయనే చెప్పారు?"
"ఏమని?"
"లాబ్ రిజల్ట్సు వచ్చేదాకా వుండి వెళ్ళమన్నారు."
"అదికాదండీ! అంకుల్ మళ్ళీ మిమ్మల్ని కలవలేదా?"
"లేదే! నేను తిన్నగా ఆఫీసునుంచే వస్తున్నాను."
కొంచెం ఆగి "చౌదరి ఇక్కడికి వచ్చారా?" అన్నాడు సాలోచనగా.
"అవునండీ! ఇంతకుముందే వచ్చి వెళ్ళారు, ఆఫీసుకు వెళ్ళి మిమ్మల్ని కలుస్తానన్నారు.
హమ్మయ్య! అంకుల్ ఈయనను కలవలేదు. బ్రతికిపోయాను! అనుకుంది సుధ రిలీఫ్ గా.
"ఎందుకో? ఏమైనా చెప్పారా?"
సుధా మాట్లాడలేదు.
అతను మళ్ళీ అదే ప్రశ్న వేశాడు.
"ఏమో!" సుధ తల పక్కకు తిప్పుకుంది.
కృష్ణ ఆలోచనలో పడ్డాడు.
సుధ ఏదో దాస్తోంది. డాక్టర్ చౌదరితో అంతా చెప్పి ఉంటుంది. ఆమె రహస్యం అతడిక్కూడా తెలిసే వుండాలి. ఆ పోలీసాయనా, చౌదరీ ప్రాణస్నేహితులు. ఆ రహస్యం తనకు తెలిసిపోయిందని వాళ్ళకూ తెలిసిపోయింది.
"సుధా! నిజం చెప్పు! చౌదరి నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు?" కఠినంగా వుంది కృష్ణ కంఠం.
సుధా బేలగా భర్తకేసి చూసింది.
తను చెప్పేదాకా కృష్ణ వదలడు. అతడి పట్టుదల తనకు తెలియనిది కాదు. పైగా మనిషి మామూలు స్థితిలో కూడా లేడు.
"రేపు సైకియాట్రిస్టు దగ్గిరకు తీసికెళతానన్నాడు" భయం భయంగా చూసింది అతని ముఖంలోకి సుధ.
"సైకియాట్రిస్టు దగ్గిరకా?" అతని కనుబొమలు ముడిపడ్డాయి.
"అవునండీ!" నీళ్ళు మింగుతూ అంది సుధ.
ఓహో! అప్పుడే పథకం సిద్దం అయిందన్నమాట? ఇది మరో నాటకం అనుకున్నాడు కృష్ణ.
"నువ్వెళ్ళాల్సిందీ లేడీ డాక్టర్ దగ్గిరకు సైకియాట్రిస్టు దగ్గిరకు కాదు. ఏం? ఎందుకూ? మనసు బాగాలేదా?"
భర్తకేసి కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది సుధ.
"ఏం? మాటాడవేం? మనసు బాగాలేదా?"
కుందేలును తరుముతున్న తోడేలు గుర్తుకొచ్చింది సుధకు.
"నా మనసు బాగానే వుంది" ధైర్యం కూడదీసుకొని అంది.
"అంటే?" నొసలు విరిచాడు కృష్ణ.
"మిమ్మల్ని ఒకసారి సైకియాట్రిస్టుకు చూపించాలని అంకుల్ అంటున్నారు" ఎలాగో అనేసింది.
నెత్తిమీదనుంచి బరువు దించేసుకున్నట్టుగా అనిపించింది సుధకు.
"నన్నా? సైకియాట్రిస్టు దగ్గిరకా?"
అథదిఒ మస్తిష్కంలో ఉరుములు-మెరుపులు, సముద్రపు అలలు లేచి పడుతున్నాయి. చెవులు చిల్లులుపడే హోరు, ఒకటే హోరు.
కృష్ణ రెండు చేతులతో తల పట్టుకొన్నాడు.
18
కిటికీరెక్కలు టపటప కొట్టుకుంటున్నాయ్.
పల్చటి నైలాన్ తెరలు గాలికి ముందుకూ వెనక్కూ ఊగుతున్నాయి.
కృష్ణ లేచివెళ్ళి కిటికీరెక్కలు మూశాడు. బయట ఉరుములూ, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. ఓ పక్కకు తిరిగి పక్కమీద నిద్రపోతున్న సుధకేసి చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతుండే ఆమె ముఖంలోకి కన్నార్పకుండా చూస్తూ గది మధ్యలోనే నిలబడిపోయాడు.
ఆరోజు సాయంత్రం జరిగిన విషయాన్ని మననం చేసికోసాగాడు.
డాక్టర్ చౌదరి తనను కావాలనే ఆఫీసులో ఉండమని చెప్పి యిక్కడకు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆలోచించి ఈ ఎత్తు వేశారు. తనకు మతి సరిగా లేదనిచెప్పి సైకియాట్రిస్టు దగ్గిరకు తీసికెళ్ళడానికి నిర్ణయించుకున్నారన్నమాట!
తన మామ పోలీసాఫీసరైతే, అతనికంటే ఈ చౌదరి రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు.
తన మంచితనం, సభ్యత, సంస్కారమే ఇంతవరకు తీసికొచ్చింది. మొహంమీద కొట్టినట్టు సుధను నిలదీసి అసలు విషయం అడిగివుంటే ఇంతదూరం వచ్చేదికాదు. సుధమీద జాలితో, అభిమానంతో ఇన్ని రోజులు ఓపిక పట్టాడు. అసలు విషయం తిన్నగా చెప్పలేక డొంకతిరుగుడుగా మాటలాడటం తనదే పొరపాటు.
సుధ ఏమైతే తనకేం కావాలి?
వెళితే జగన్మోహన్ దగ్గిరకు వెళుతుంది....లేకపోతే తండ్రి దగ్గిరకు వెళుతుంది__
కృష్ణకు హఠాత్తుగా గుండె చిక్కబట్టినట్టు అయింది. సుధ మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి.
"ప్రియుడి దగ్గరకు వెళ్ళకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అంతేగాని ఆ మొగుడితో కాపురం చెయ్యదు."
సుధ ఆత్మహత్య చేసుకొంటే? ఆమె గర్భంలో జీవం పోసుకుంటున్న బిడ్డ__ఆ బిడ్డ తన బిడ్డ__అలా జరగడానికి వీల్లేదు. ఆ బిడ్డను తను పెంచుకొంటాడు.
జగన్మోహనూ, సుధా, మోనాను హాస్టల్ నుంచి తెచ్చుకొని తమ దగ్గిరే పెట్టుకొంటారు.
"ఏమిటండీ? గదిమధ్యలో అలాగే నిలబడిపోయారూ?"
కృష్ణ ఉలిక్కిపడ్డాడు.
దారం తెగిన గాలిపటంలా ఎటుబడితే అటే తిరుగుతున్న అతడి ఆలోచనలు ఆగిపోయినై.
కృష్ణ మెల్లగా భార్య దగ్గరకు వచ్చాడు.
మంచంమీద కూర్చున్నాడు.
సుధా లేచి బెడ్ రూంలోనుంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది.
ఆలస్యం అమృతం విషం అన్నారు.
తెల్లవారేలోపునే ఏదో ఒకటి తేల్చివెయ్యాలి.
చౌదరి తనను సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్ళడానికి వచ్చేలోపలే తేల్చివెయ్యాలి. కుండ బద్దలుకొట్టినట్టు అడిగెయ్యాలి.
కృష్ణ ఒకనిర్ణయానికి వచ్చాడు.
చివాలున మంచం దిగి డైనింగ్ హాలులోకి వచ్చాడు.
సుధ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని, ఫ్రిజ్ లోనుంచి తీసిన వాటర్ బాటిల్ లోని నీరు గ్లాసులోకి వంపుతున్నది.
"మీక్కూడా ఇవ్వమంటారా?" అంది గ్లాసు చేతిలోకి తీసికొంటూ.
"అవసరంలేదు. నువ్వొచ్చి ఇలా కూర్చో!" అంటూ కృష్ణ డ్రాయింగ్ హాలులోకి వచ్చాడు.
సోఫాలో వెనక్కువాలి సంభాషణ ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాడు - సుధకోసం ఎదురుచూస్తున్నాడు.
మంచినీళ్ళు తాగి, లైట్ తీసేసి, సుధ డ్రాయింగ్ హాల్లోకి వచ్చింది భర్త ప్రవర్తన గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోయినట్టు లేడు. ఉన్మాదావస్థలో ఉన్న మనిషిముందు నిద్రకు దూరమౌతాడట, సరిగ్గా ఆయనకు అదే జరుగుతోంది. ఈ అర్దరాత్రి ఏదో మాట్లాడాలంటున్నాడు. తను నిరాకరిస్తే అతని మానసిక స్థితి ఇంకా దిగజారిపోవచ్చు.
అతని ఆలోచనలకు అడ్డుతగలడం మంచిదికాదు, రేపిస్టు చెయ్యడానికి ప్రయత్నం వైలెంటుగా మారే ప్రమాదముండవచ్చు!