లోకనాధం ఆ మాటకి వెంటనే స్పందిస్తున్నట్లు "అయ్యా అలా సౌత్ వాళ్ళ అందరిమీదా విరుచుకుపడకండి! ఈ పేదవాడ్ని కనికరించి, ఈ రాత్రికి నా రూంలో విశ్రమించండి" అని ప్రాధేయపడ్డాడు.
కుందన్ షా బుసలుకొడుతూ "నో మీకెందుకు ట్రబుల్!" అన్నాడు.
"మీరు అలా అనకూడదు. మీ దర్శనభాగ్యంవల్ల నా జన్మ ధన్యమయింది. ఈ రాత్రికి నా ఆతిధ్యం స్వీకరించి నన్ను అదృష్టవంతుడ్ని చేయండి" అంటూ లోకనాధం అతను 'సరే' అనే వరకూ బ్రతిమాలాడు.
చిట్టచివరకు కుందన్ షా "ఆల్ రైట్" అన్నాడు.
లోకనాధానికి ఏనుగు అంబారీ ఎక్కినంత సంతోషం కలిగింది. అంత భాగ్యవంతులతో తను పక్కన కూర్చుని మాట్లాడతానని కూడా ఎన్నడూ వూహించలేదు. ఓ రైసుమిల్లూ, సినిమాహాలూ, బట్టలకొట్లూ వున్న తనెక్కడా? పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళూ, బట్టలమిల్లులూ వజ్రాల వ్యాపారం చేసే అతనెక్కడా? తను ఈతాకయితే అతను తాటాకు అనుకున్నాడు. అటువంటి వ్యక్తితో తనీ రాత్రి ఒకే రూంలో గడిపినట్లు రేపే ప్రపంచానికి ఎలా చెప్పి నమ్మించాలి? అవి కూడా ఆలోచించాడు.
ఆ రాత్రి లోకనాధానికి కుందన్ షా ఆఫర్ చేసిన ఖరీదయిన మద్యం చూసేసరికి కళ్ళు తిరిగినంత పనయింది. నోట్లోంచి నీళ్ళు కారిపోతుండగా, లేచి కిటికీలవి సరిగ్గా మూసి వున్నాయో లేదో మరోసారి పరీక్షగా చూసొచ్చి కూర్చున్నాడు.
కుందన్ షా సీసా ఓపెన్ చేస్తూ చెప్పాడు. "ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ తో బిజినెస్ చేసే నేను ఎంత దురదృష్టవంతుడ్నో తెలుసా లోక్ నాధ్?"
లోకనాధం అతనిమాట పట్టించుకోకుండా "ఛ! ఊరుకోండి మీరు దురదృష్టవంతులంటారేమిటి?" అన్నాడు.
ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మౌనంగా మందుకొడుతూ కూర్చున్నారు.
మూడో రౌండ్ లో వుండగా కుందన్ షా ఎదురుగా వున్న సూట్ కేసు తెరిచి ఓ ఫోటోతీసి "ఈ ఫోటో చూడండి లోక్ నాధ్" అన్నాడు.
అందంగా, నూనూగు మీసాలతో వున్న పదిహేను సంవత్సరాల పిల్లాడి ఫోటో అది.
కుందన్ షా వైపు చూసాడు లోకనాధం. కుందన్ షా విరక్తిగా నవ్వి "బోలెడు ఆస్తి వుండీ అనుభవించే ఒక్కగానొక్క వారసుడ్నీ పోగొట్టుకున్న తండ్రి పరమ దురదృష్టవంతుడంటాను. నువ్వేమంటావు?" అని అడిగాడు.
లోకనాధం తన గ్లాసు మళ్ళా నింపుకుంటూ "అవును" అని ఒప్పేసుకున్నాడు.
"అటువంటి దురదృష్టవంతుడ్ని పట్టుకుని భాగ్యవంతుడంటావేం" పీక్ లోకొచ్చినట్లు అరిచాడు కుందన్ షా.
లోకనాధం అవాక్కయిపోయి "మీరూ...." అన్నాడు.
"అవును.... ఆ దురదృష్టవంతుడు వీడే.... నీ ఎదురుగానే వున్నాడు. ఒక్కగానొక్క కొడుకుని పదేళ్ళ క్రిందట కోల్పోయాను. విమానం కొనివ్వమని పేచీ పెడితే చిన్నపిల్లాడు కదా అని బొమ్మ విమానం కొనిచ్చాను.
అంతే! వాడింక స్కూల్ నుండి యింటికి రాలేదు. వాడ్ని మళ్ళీ నేను కళ్ళతో చూడలేదు. పాపిష్టివాడ్ని. తల్లిలేని పిల్లవాడ్ని నిజం విమానం కావాలా నాన్నా! అని అడగనయినా అడగలేదు. నా అంతటి పాపిష్టివాడు ఇంకోడు వుండడు లోక్ నాధ్" అంటూ కుందన్ షా వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టాడు.
లోకనాధం కుందన్ షా వీపుమీద చెయ్యివేసి "ఊరుకోండి మిష్టర్ షా, మీ అబ్బాయి తప్పక దొరుకుతాడు" అని ఓదార్చే ప్రయత్నం చేశాడు.
"ఆ ఆశ చచ్చిపోయింది మిత్రమా! పదేళ్ళనించీ చెయ్యని ప్రయత్నం లేదు. ఎవరయినా వాడ్ని తీసుకొచ్చి ఇదిగో నీ కొడుకు అనగానే సగం ఆస్తి వాళ్ళకి ఇచ్చెయ్యడానికి సిద్ధంగా వున్నాను. కానీ అంతటి అదృష్టమా నాకు. వాడేవుంటే ఈపాటికి నా బాధ్యతలన్నీ అప్పజెప్పేసి ఈ వ్యాపారాలన్నీ వదిలేసి కకృష్ణారామా అనుకుంటూ కూర్చునేవాడ్ని. కోడలు కూడా వచ్చేది. లోక్ నాధ్.... అచ్చమయిన ఆంధ్రా అమ్మాయిని కోడల్ని చేసుకోవాలనుకునేవాడ్ని. ఎందుకో తెలుసా? నాకు మీ ఆంధ్రా వంటలంటే మహా యిష్టం. అందులోనూ ఆవకాయా, గోంగూర అంటే మరీ మరీ యిష్టం. కానీ నాకు అంతటి అదృష్టం ఏదీ? ఇదిగో నీ కొడుకు అని తీసుకొచ్చి ఇచ్చే మహాత్ముడెవరు?" అంటూ వుండగానే అతనికి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చేసింది. "నుదిటిమీద సుడీ.... కుడిచెవి కాస్త వంగి వుంటుంది.... ఎంత అందగాడూ!" అన్నాడు.
లోకనాధం మొదట్లో సగం ఆస్తి రాసి ఇచ్చేసేవాడ్ని అన్న కుందన్ షా మాటలే గిరగిరా తిరగసాగాయి. ఆ పేపర్లో ఫోటోవంక రెప్ప ఆర్పకుండా చూస్తూ ఈ కుర్రాడు ఎంత దురదృష్టవంతుడూ! వీడ్ని పట్టుకోలేని నేను ఎంత దురదృష్టవంతుడ్నీ!" అనుకున్నాడు.
"గుండెలమీద కందిబద్ధంత పుట్టుమచ్చ ఉండేది. చాలా అదృష్టవంతుడు అనుకున్నా. వాడి పుట్టినరోజు రేపే ఫ్రెండ్! నా గుండె ఈ రంపపుకోతని తట్టుకోలేక పోతోంది" మళ్ళీ గ్లాసు నింపుకుంటూ అన్నాడు కుందన్ షా.
"ఏమో చెప్పలేం. మీ అబ్బాయి రేపే దొరకొచ్చు. నాకే దొరకొచ్చు" మందు నిషాలో ముద్ద ముద్దగా అన్నాడు లోకనాధం.
"అప్పుడు సగం ఏం కర్మ? నా ఆస్తంతా నీకే రాసిచ్చేస్తా లోక్ నాధ్" అన్నాడు కుందన్ షా.
లోక్ నాధ్ పెద్దగా నవ్వి "ఇప్పుడు అలాగే అంటారు, నిజంగా దొరికితే ఇలా అంటావా?" అని అడిగాడు.
కుందన్ షాకి పౌరుషం వచ్చినట్లుగా లేచి నిలబడ్డాడు. "నమ్మకం లేదా? ఈ షా మీదే నమ్మకం లేదా? అయితే ఇప్పుడే రాసిచ్చేస్తా కాయితం తెచ్చుకో!" అని అరిచాడు.
"షాంతి.... షాంతి!" అంటూ లోకనాధం అతన్ని కూర్చోపెట్టాడు. "ఓ పని చెయ్యి నీ కొడుకు దొరికితే నా కూతురుకిచ్చి పెళ్ళి చెయ్యి, ఎలాగూ ఆంధ్రా అమ్మాయిని కోడల్ని చేసుకోవాలనుకున్నావు కదా!" అన్నాడు!