"ఇదిగో నీకోసం మిరపకాయ బజ్జీలు తెచ్చాను" ముసలాయన పొట్లం శ్రీజకి ఇచ్చాడు.
"వా! ఇవంటే నాకు ప్రాణం" అందుకుని ఆయన భుజం మీద కొట్టి "థాంక్యూ" అంది శ్రీజ.
"నో మెన్షన్" అంటూ ముసలాయన ముసిముసిగా నవ్వాడు.
"ఖర్మ!" మధు నెత్తి కొట్టుకున్నాడు. ముసలాయన గదంతా పరికిస్తూ "ఎక్కడ పడుకుంటారు? రెండే మంచాలున్నాయి పాపం!" అన్నాడు.
"ఎడ్జెస్ట్ అయిపోతాం లెండి. రిషికి ఒక్కడే పడుకోవడం అలవాటు కాబట్టి అతనికి సెపరేట్ గా ఇచ్చేస్తాం" అంటూ మధు వైపు కొంటెగా చూసింది.
రిషి నవ్వు ఆపుకోవడానికి తంటాలు పడ్డాడు.
మధు కంగారుగా "నాకూ అంతే!" అని అరిచాడు.
ముసలాయన నెమ్మదిగా "మా ముందు గదిలో మడత మంచం మీద పడుకోవచ్చుగా" అన్నాడు.
"అలాగేనండీ" శ్రీజ వెంటనే ఒప్పుకుంది.
"అన్నం తినగానే రిషి వచ్చి మీ ముందు గదిలో మడత మంచం మీద పడుకుంటాడు."
ముసలాయన ఇరుకున పడ్డట్లు చూసాడు.
"ఏం బావా అంతేనా?" శ్రీజ మధుని అడిగింది.
"ఎవరూ వద్దు నే వెళ్ళి పడుకుంటా!" మధు కంగారుగా అనేసాడు.
ముసలాయన ముఖం చిట్లించుకుని "వెళ్ళొస్తా" అని కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.
"పెద్దాయనతో ఆడకు. నీ దెబ్బకి తట్టుకోలేక ఆ గుండె కాస్తా ఆగిపోతే కష్టం. అసలే ఆ కొడుకు పీకలోతు అప్పుల్లో ఉన్నాడు. ఈ ఖర్చు కూడా వాళ్ళ నెత్తి నెయ్యకు" సీరియస్ గా చెప్పాడు రిషి.
బుద్ధిగా తలవూపింది శ్రీజ.
మధు పక్కబట్టలు తీసుకుని క్రిందికి వెళ్ళిపోయాడు.
* * *
"ఎవడో పిచ్చివాడులా వున్నాడమ్మా. ప్రియురాలు వ్రాసిన ఉత్తరాన్ని పేపర్లో ఇచ్చి ఎడ్రస్ తెలియజేయ్యమంటున్నాడు" లింగం దినపత్రిక ఆశ్రితకి చూపిస్తూ అన్నాడు.
ఆశ్రిత కళ్ళు అక్షరాల వెంట గబగబా పరిగెత్తాయి. ప్రతి అక్షరంలో అమాయకమైన రిషి మొహం దోబూచులాడింది. నాకు నువ్వు మిగిల్చిన ఆధారం ఇదొక్కటే! తప్పక చూస్తావనే నా నమ్మకం అని వ్రాసి రిషి ఎడ్రెస్ ఇచ్చాడు. ఆశ్రిత పెదవుల మీద చిరునవ్వు పరుచుకుంది.
"నీ మొహంలో పెళ్ళి కళ వచ్చేసిందమ్మా" లింగం నవ్వుతూ అన్నాడు.
"అవును" ఆశ్రిత కూడా నవ్వింది.
"ఆదివారమే తాంబూలాలట, వ్యవధి పెద్దగా లేదు. త్వరపడాలి" అన్నాడు లింగం.
"అవును త్వరపడాలి" ఆలోచనగా అంది ఆశ్రిత. ఆమెకి ఆ నిమిషంలోనే రిషి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తోంది. రిషి అడ్రెస్ తీసుకుని బయల్దేరుదామనుకుంటూ వుండగా ఫోన్ మ్రోగింది. లింగం హడావుడిగా మాట్లాడి పెట్టేసి "కొంప మునిగిందమ్మా! మళ్ళీ భారత్ ధియేటర్ దగ్గర అల్లరయిందట. కొత్తగా సినిమా వచ్చినప్పుడల్లా ఇంతే! పోయినసారి మేనేజర్ ఆ రౌడీ వెధవల బారి నుండి చావు తప్పి కన్నులొట్ట పోయి తప్పించుకున్నాడు. ఈ సారి ఏమౌతుందో? అయ్యగారు కూడా ఊళ్ళో లేరు" అన్నాడు గాభరాగా.
"నాన్న లేకపోతేనేం? మనం వున్నాంగా పద!" అంది వెళ్ళడానికి వుద్యుక్తురాలౌతూ ఆశ్రిత.
"పదండి" లింగం ఆమె వెనకాల నడిచాడు.
* * * *
ఆశ్రిత కారుదిగి వడివడిగా జనాన్ని తప్పించుకుంటూ ముందుకి వెళ్ళింది. ఆమె వెనకాలే లింగం పరుగులాంటి నడకతో వెళ్ళాడు. అక్కడ ఎదురైన దృశ్యానికి ఆమె స్థాణువే అయింది.
స్టాండ్ వేసిన సైకిల్ ఒకటి పైకి ఎత్తిపట్టుకుని దాంతోనే దొరికిన వాళ్ళని దొరికినట్లు చితకబాదేస్తూ స్వైరవిహారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, రిషి. ఆమె నోట్లోంచి ఆమె ప్రమేయం లేకుండానే "రిషీ" అన్న కేక వెలువడింది.
దిగంతాల ఆవల నుండి వినిపించినా, ఆ స్వరాన్ని పట్టుకోగల రిషి చెవులు ఠక్కున పట్టేసాయి. ఆశ్చర్యంగా వేణు తిరిగాడు. ఎదురుగా ఆశ్రిత కనిపించగానే శిలాప్రతిమే అయ్యాడు. అదే అదనుగా ఒకడు వెనుక నుండి ముందుకి పడదోసాడు. ఇంకోడు మీదెక్కి జుట్టు పట్టుకుని తల నేలకేసి కొట్టసాగాడు.
"రిషీ" ఆశ్రిత బాధతో విలవిలలాడుతూ అరిచింది.
రిషి అతికష్టం మీద వాళ్ళని తప్పించుకుని లేచి నిలబడ్డాడు. మొహం నుండి రక్తం కారుతున్న అతని కళ్ళల్లో ఆపుకోలేని ఆనందం కనపడింది.
"ఆ.... శ్రి...." అని అనబోతుండగా వెనుక నుండి ఒకడు పిడిగుద్దులు కురిపించాడు.
ఆ దెబ్బలకి రిషి మళ్ళీ ముందుకి పడిపోయాడు. ఈసారి అతని నుదురు రాయికి కొట్టుకుని చిట్లి రక్తం కారింది.
ఆశ్రిత ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించింది జనం ఆమెని పట్టి ఆపేసారు.
రిషి ఆమెనే చూస్తున్నాడు. కార్తీకపౌర్ణమి నాటి దీపాల్లా వెలుగుతున్నాయి అతని కళ్ళు. చుట్టూ చేరిన రౌడీల దెబ్బలు అతని మనసుని చేరటం లేదు. తన అన్వేషణ ఫలించి తన స్వప్న దేవత ప్రత్యక్షమైనట్లుగా ఎదురు నిలిచేసరికి అతనికి ఆనందంతో శరీరం దూదిపింజెగా మారింది. "ఆశ్రితా!" అతను ఆనందంగా కేకవేసి "హౌ లక్కీ ఐ యామ్" అంటూ వుండగా ముందుకి జరిగిపోయాడు. వెనుక నుండి ఒకడు చాకుతో భుజం మీద పొడిచేసరికి రక్తం జివ్వున పైకెగసింది. రిషి మొహంలో నవ్వు మాయలేదు. రిషి క్రింద పడిపోగానే ఎక్కడివాళ్ళు అక్కడ పరారయ్యే ప్రయత్నం చేసారు. కానీ ఈలోగా వచ్చిన పోలీసులు వాళ్ళ ప్రయత్నం సాగనివ్వలేదు. పట్టుకుని జీపు ఎక్కించారు.