ఆశ్రిత వెంటనే "నేను థ్రిల్ కోసం అనడం లేదు. అతనిలో పట్టుదలా, అంతకు మించిన ఆలోచనా వున్నాయో లేదో చూడడానికే అంటున్నాను. పుట్టినప్పుడు ఎవరికి ఏమీ వుండదు. ఆ తర్వాత కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నించని వాడు పుట్టడమే వ్యర్ధం!" అంది.
శ్రీజ ఆసక్తిగా చూస్తూ రిషికి అందం, మంచి మనసూ, తెలివితేటలూ, తప్ప ఆస్తీ, అంతస్తూ లేదు కదా! మరి మీ నాన్న పెళ్ళికి ఒప్పుకోకపోయినా నువ్వు అతనితో వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటావా? ఆ లేమిలోనే ఆనందాన్ని వెతుక్కుంటావా?" అని అడిగింది.
"మంచి ప్రశ్న వేసావు శ్రీజా.... దగ్గరికి రా జవాబు చెవిలో చెప్తాను" అంది ఆశ్రిత.
శ్రీజ ఆమె దగ్గరగా జరిగింది. ఆశ్రిత చెప్పింది విని ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది!
* * * *
మధు స్కూటర్ భారత్ థియేటర్ సమీపించేసరికి మార్నింగ్ షో టైం అయిపోయినట్లుంది. కౌంటర్ లో రిషి కనిపించలేదు. మధు స్కూటర్ పార్క్ చేసి, ఆఫీసులోకి నడిచాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి అతనికి ఆశ్చర్యం కలిగింది.
వరసగా ఇరవైమంది దాకా ఆడపిల్లలు రిషిని చుట్టుముట్టి వున్నారు. రిషి వాళ్ళతో ఏదో బ్రతిమాలుతున్న స్వరంతో చెప్తున్నాడు. బహుశా టికెట్లు అయిపోయాయన్న వినిపించుకోవడం లేదేమో అని బోర్డు వైపు చూసిన మాధవ్ మళ్ళీ బోలెడు ఆశ్చర్యపోయాడు! కారణం అది చాలా పాత డొక్కు సినిమా.
"ఏవిట్రా! నువ్వు కాలుపెట్టిన వేళా విశేషం హౌస్ ఫుల్ అయిపోయిందా?" అడిగాడు మధు.
రిషి తల గోక్కుంటూ! "హౌస్ ఎంప్టీ అయిపోయింది. ఈ ఇరవై మందే టికెట్టుకొని సినిమా కొచ్చినది" అన్నాడు.
మధు ఈసారి ఆశ్చర్యపోకుండా, విసుగ్గా "మరి ఇక్కడేం చేస్తున్నారు? సినిమా బోర్ గా వుంది కాబట్టి మార్చి వేరేది వెయ్యమంటున్నారా?" అన్నాడు.
"అయ్య! ఈ మాటకి జవాబు నే చెప్తానుండయ్య! అంటూ ముందుకి వచ్చాడు ఓ వ్యక్తి.
"ఉష్.... ఉష్!" అంటూ రిషి అతని నోరు మూయించాలని చూసాడు. కానీ అతను వినలేదు.
"ఈయనగారు సినిమా మొదలుపెట్టింది మొదలు ఈ స్లైడ్ పదిసార్లు వేయించారండి" అంటూ ఓ కాయితం చూపించాడు.
"ఆశ్రితా ఎక్కడున్నావు? మేనేజర్ క్యాబిన్ దగ్గరకి వచ్చెయి, నీకోసం తపస్సుచేస్తున్న నీ రిషి" అని వ్రాసి వుంది అందులో.
మధు రిషి వైపు చూసేసరికి రిషి సిగ్గుగా తల వంచుకున్నాడు.
"తీరా వచ్చాక బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడడేమిటండీ?" ఓ అమ్మాయి రాగం తీసింది.
పైగా సీన్ కీ సీన్ కీ మధ్యన 'చెలియాకనరావా' అనే పాట ఒకటీ!" ఇంకో అమ్మాయి కసిగా అంది.
"క్షమించండమ్మా, మీరెవరూ వాడి ఆశ్రిత కాలేరు. వెళ్ళిరండి" అంటూ చేతులు జోడించాడు మధు.
వాళ్ళు మూతులు తిప్పుకుంటూ, విసుక్కుంటూ వెళ్ళిపోయారు.
"నీకిదేం పిచ్చిరా? ఉద్యోగం వుండాలా? ఊడిపోవాలా?" మందలింపుగా అడిగాడు మధు.
రిషి చిన్నపిల్లాడిలా తల ఆడిస్తూ "తప్పేం చేసాను! నా ఆశనాది" అన్నాడు.
"ఆశ్రిత ఇలాంటి సినిమాలకి ఎందుకొస్తుందిరా?" అన్నాడు మధు.
"ఏమో ఎలాంటి సినిమాలకి వస్తుందో నాకేం తెలుసు? అసలు ఆమె అభిరుచుల గురించీ, ఆమె గురించీ నాకేం తెలుసూ? మూడు రోజులు శాపవశాత్తూ భూమిమీద పడిన దేవకన్యలాగే మాయమయింది. ఒక్కమాట కూడా తనగురించి బైట పెట్టలేదు. ఎక్కడని వెదకను? ఎవర్నని అడగను?" బాధగా అన్నాడు రిషి.
"రిషీ!" మధు ఓదార్పుగా మీద చెయ్యివేసాడు.
"అసలు.... అసలు పేరు కూడా తెలియదురా! ఎంత ఘోరమైన పరిస్థితో చూడు!" జాలిగా చూస్తూ అన్నాడు రిషి.
"ఈ ఆడపిల్లలింతే, అనవసరంగా వచ్చి మనసు పాడు చేసిపోతారు. పోనీ పేరైనా చెప్పొచ్చుగా" అంటూ వుండగానే మధుకి తన సమస్య చటుక్కున గుర్తొచ్చేసింది. "ఒరే.... అసలు నేనెందుకొచ్చానో తెలుసా? నీ సమస్య లాంటిదే నాకూ ఎదురైంది. ఎవరో అమ్మాయి అమాంతం బావా అంటూ వూడిపడింది. నీ హీరోయిన్ కి మరుపు నటించి నిన్ను వూపేస్తే, ఈవిడగారు నాకు కూడా తెలియని, లేని చుట్టరికాలు జ్ఞాపకాలు జ్ఞాపకం పెట్టుకుని వచ్చి నన్ను ముంచాలనుకుంటోంది!" అన్నాడు.
రిషి విస్మయంగా "ఎవరు? పేరు చెప్పిందా?" అన్నాడు.
మధు నాలిక కరుచుకుని "నేను అడగలేదురా" అన్నాడు.
"ఎక్కడుందీ?" రిషి అడిగాడు.
"ఇంట్లోనే వుంది. నాకు చాలా భయం వేస్తోందిరా!" మధు మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అన్నాడు.
"భయమా! ఎందుకూ?" అడిగాడు రిషి.
"నన్ను.... నన్ను.... అనవసరంగా ముట్టుకోవడం, పట్టుకోవడం చేస్తోంది. చెప్పాలంటే సిగ్గుగా వుంది. కానీ ఇంకా చాలా చేస్తోంది! తల వంచుకుని చెప్పాడు మధు.
రిషి కళ్ళు చిట్లించి "ఎలా వుంది? ఎంత వయసుంటుంది?" అని అడిగాడు.
మధు తనకి చాతనైనట్లు వర్ణించాడు "ఆడపిల్లలా బిహేవ్ చెయ్యట్లేదురా! సిగ్గులేకుండా మాట్లాడ్తోంది" అన్నాడు.
"బ్రా హుక్ పెట్టమందా లేక స్నానంచేస్తూ వీపు రుద్దమందా?" రిషి నవ్వుతూ అడిగాడు.
మధు ఉలిక్కిపడి తల ఎత్తుతూ "నీకెలా తెలుసు?" అన్నాడు.
రిషి తలవూపి "తెలుసు" ఆ కోతి పేరు, శ్రీజ కంగారేం లేదు. నువ్వు ఆఫీసుకెళ్ళు అన్నాడు.