Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 25


    ఇందర్ పెరటివేపు చూశాడు. అటు తలుపుకి తాళం వేసి వుంది. గబుక్కున లేచి బల్ల దగ్గరకు వెళ్ళాడు. బల్లమీద వున్నా పుస్తకం తీసుకుని పేజీలు తిప్పి చూశాడు.

    పేజీ పైన తారీకు సమయము వేసి వుంది. కింద తను ఊరికి ఏ కారణాన అర్జంట్ గా వెళ్ళవలసి వచ్చింది రాశాడు. నీవు రాంచీ నుంచి తిరిగి రావటానికి వారంపైనే పడుతుందని చెప్పావు. నేను కూడా తిరిగి రావటానికి వారం పైనే పడుతుంది. ఏ కారణం వల్లనైనా నీవు ముందే వస్తావేమోనని మా ఊరు ఎందుకు వెళుతున్నదీ వివరంగా రాశాను అంటూ చంద్ర వివరంగా రాసి తన పేరు కింద రాశాడు.

    అది చదివి ఆ అమ్మాయి చెప్పింది నిజమే అనుకున్నాడు ఇందర్.

    "చిన్న చిన్న నిజాలు పెద్ద అబద్ధాన్ని కప్పెడతాయి" అన్న సూక్తి అవంతికి బాగా తెలుసు. అందుకే ముఖ్యమైన విషయం దాచి మిగతా చిన్న విషయాలు పూర్తిగా చెప్పదలుచుకుంది.

    "నువ్వు చెప్పింది నిజమే. ఇంకా మిగతా కథ కానియ్యి. మా చంద్ర ఊరికి వెళ్ళాడు. ఆ తర్వాతేం జరిగింది?" ఇందర్ బల్ల దగ్గర నుంచి కదిలి వచ్చి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.

    "బైట తాళం వేసి వెళ్ళినట్టు గ్రహించి ముందు భయపడ్డాను. ఆ తర్వాత చాలాసేపు ఏడ్చాను. ఆ తర్వాత పక్క గదిలోకి వెళ్ళి లైటు వేసుకుని అన్నీ చూశాను. ముందు మంచినీళ్ళు తాగాను. ఆ తర్వాత బాగా ఆకలిగా వుంటే హార్లిక్స్ కలుపుకుని తాగాను.

    బాగా నిద్ర వచ్చింది. బాగా నిద్రపోయి తెల్లవారుఝామునే లేచి ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దాం అనుకున్నాను. వచ్చి మంచంమీద పడుకున్నాను. నిద్ర పట్టలేదు. బాగా భయం వేసింది. అలా ఆలోచిస్తుంటే తలనొప్పి వచ్చింది. ఆ తర్వాత కొద్దిగా జ్వరం వచ్చింది. ఎప్పటికో నిద్ర పట్టింది. మీరొచ్చి లేపారు. అంతే జరిగింది" అవంతి చాలా చక్కగా అవతలి వాళ్ళు నమ్మే విధంగా అమాయకంగా చెప్పింది. 

    ఇందర్ నమ్మాడు.

    "మీరు అంతా నిజమే చెప్పారని నమ్ముతున్నాను. మీ కథ చెప్పలేదు. పెళ్ళికూతురు వేషంలో పారిపోయిరావటం!"

    అతను ఒక్కసారి నీవు అనటం, మరోసారి మీరు అనటం అవంతి గుర్తించింది. ఏదో కట్టుకథ చెప్పేకన్నా అసలు ఏదీ చెప్పకుండా దాటవెయ్యటం మంచిదనుకుంది.

    ఇది వేషం కాదు, నాకు వేషాలు వెయ్యటం రాదు, మా బుచ్చికక్కి ఎప్పుడూ నాతో అంటుంటుంది."

    "ఏమని?"

    "క్షణానికో వేషం నిమిషానికో మోసం చేసేవారే ఈ కాలంలో హాయిగా బతుకుతారు. నోట్లో నాలుక లేని నీలాంటి దానికే నమ్మా అన్నీ కష్టాలు. ఎలా బతుకుతావో ఏమిటో! నా ఘటం ఉన్నంత వరకూ ఫరవాలేదు, ఆపై ఆ భగవంతుడే నిన్ను కాపాడాలి అంటుంది. అందరినీ కాపాడేది ఆ భగవంతుడే కదా! ఏంటో బుచ్చికక్కికి ఏమీ తెలియదు. నేను వేషం వేసుకోలేదు. నన్ను వాళ్ళు బలవంతాన పెళ్ళికూతురిని చేశారు" అవంతి కథ మాంచి సస్పెన్స్ పెట్టి చక్కగా అల్లింది.

    ఇందర్ కి కొద్ది కొద్దిగా అర్ధం అయింది. ఈ అమ్మాయిని బలవంతానా పెళ్ళికూతురిని చేస్తే ఎలాగో అలా పారిపోయి వచ్చింది. ఉత్త అమాయకురాలు బుచ్చికక్కి అనే ఆవిడ ఈ పిల్లని కాపాడుతున్నది.

    "ఇప్పుడు మీ బుచ్చికక్కి వుందా?" ఇందర్ అడిగాడు.

    "ఏమో!"

    "ఏమో అంటే నీకు తెలియదా!"

    "చీటి రాసి పెట్టి నాతో చెప్పకుండా యాత్రలకి వెళ్ళింది"

    "ఆహా, అయితే నిన్ను బలవంతానా పెళ్ళికూతురిని చేసింది ఎవరు?" ఇందర్ అసలు విషయం లాగటానికి అడిగాడు.

    అప్పటికే తను మరీ అమాయకంగా మాట్లాడుతున్నది. ఈ విషయం అతను కనిపెట్టాడంటే మొదటికే మోసం వస్తుంది, ఇంకా బ్రేక్ వెయ్యాలి అనుకుంది అవంతి.

    అవంతి మాట్లాడక పోవటంతో ఇందర్ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు.

    "నేను చెప్పను" అంది అవంతి.

    "ఎందుకని?"

    "ఏమో!"

    "మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా నాన్న...."

    "మీరు అలా అడిగితే నాకు ఏడ్పు వస్తుంది."

    "నా తల్లే." అనుకున్న ఇందర్, "మరి ఏదీ అడగకపోతే ఎలా!" అన్నాడు.

    "ఏమో!" అంది అవంతి.

    "రోజుకి ఎన్నిసార్లు ఏమో అంటావ్!" వళ్ళు మండి అడిగాడు ఇందర్.

    "ఏమో!" అంది అవంతి.

    "ఇప్పుడు ఏమి చేద్దామనుకుంటున్నావ్! మళ్ళీ ఏమో అంటూ అదే మాట వదలకు"

    అవంతి మాట్లాడకుండా తలవంచుకుంది అంటే అర్ధం ఏమోననే.

    "ఎక్కడికి వెళతావ్!"

    "ఏమో"

    "ఎక్కడికి వెళతావ్!" ఈ తఫా గట్టిగా అడిగాడు ఇందర్.

    అవంతి ఏడ్పు మొదలు పెట్టింది.

    "ఏడ్వకు ఏడ్వకు" కంగారుగా అన్నాడు ఇందర్.

    "బుచ్చికక్కి వస్తేగాని నేను వెళ్ళను. లేకపోతే చచ్చిపోతాను."  

 Previous Page Next Page