అతడితో మాట్లాడే సమయంలో తనను తాను మరిచిపోతూందన్న విషయం మరోసారి స్పురణకి రాగా వెంటనే అంది ఆందోళనని కప్పిపుచ్చుకుంటూ- "మీరు నాకిచ్చిన లిటరరీ పజిల్ సి నా రె విశ్వంభర కావ్యం లోదని చెప్పే ప్రయత్నంలో."
"గూడ్! సాధించారన్నమాట."
"మీరు ఆదేశించారుగా?"
నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నారు?" అడిగింది ఆర్తి.
"మన పరిచయం నేను ఆదేశించేటంత దూరందాకా వెళ్లలేదు."
ఉలిక్కిపడింది ఆర్తి.
"కంగారుపడకండి.. .నేనలా అన్నది ఒక స్నేహితుడిగా."
"కంగారు దేనికి?"
"పెళ్ళయిన ఆడది భర్త నుంచి మాత్రమే ఆదేశించబడాలని కోరుకుంటుంది."
"భర్తయితే మాత్రం ఆదేశించితీరాలా?"
"భర్తని మనస్పూర్తిగా ప్రేమించగల ఆడది ఆదేశించబడటాన్నీ యిష్టపడుతుంది."
ఆర్తి మొహంలో రంగులు మారాయి. "కానీ అలాంటి ప్రేమ గురించి ఆ భర్తకీ తెలియాలిగా?"
"భర్త ప్రేమిని అర్దం చేసుకోగల మనసు భార్యకీ వుండాలి."
ఆర్తికి ఈ చర్చ మింగుడుపడలేదు. అసలు ప్రేమించగల భర్త లభించినప్పుడు ఏ ఆడదయినా అర్దం చేసుకోకుండా ఎలా వుండగలదు? వ్యక్తం చేయడంలో భిన్న మార్గాలు వుండొచ్చు.
"మీ వుద్దేశ్యంలో ప్రేమంటే ఏమిటి?"అడిగింది సాలోచనగా.
"చాలా జటిలమైన ప్రశ్న వేశారు ఆర్తీ. బట్ .. నాకు తెలిసినంత వరకూ చెబుతాను." ఆర్తి ఉద్విగ్నురాలైంది.
"మనుషుల మధ్య బంధాల్నీ పెంచేది ప్రేమ... స్వార్దం, ద్వేషం, అసూయ, పగల్ని త్రుంచి అందర్నీ కలిపేది ప్రేమ... ఈ భూమిపై సమస్త జీవరాశుల్నుంచీ మనిషిని వేరుచేసి ఒక అత్యున్నత స్థానంలో బెట్టేది ప్రేమ.. .హృదయపు గాయాల్ని మాన్పేది - కవుల్ని, తత్త్వవేత్తల్ని దేశభక్తుల్ని ఇన్ స్పయిర్ చేసేది ప్రేమ... మనిషి మనో పుష్పంలో నుంచి వెలికివచ్చే గొప్ప సౌరభం ప్రేమ... లవీజ్ ట్రాన్స్ ఫిగరేషన్... గొప్పవాళ్లని చేస్తుంది. మహిమాన్వితులుగా మార్చుతుంది."
ఇట్స్ రివిలేషన్.. ఇట్స్ క్రియేషన్.. .న్యాయం, వైరాగ్యం, దాతృత్వం, దయా, కరుణలాంటిది పసిపిల్లలకి అమ్మలాంటిది ప్రేమ - మట్టి బొమ్మల్ని సైతం మహారాజుగా మార్చే దివ్యాస్త్రం ప్రేమ."
"మీరు విశ్వజనీనమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నారు."
"అఫ్ కోర్స్! ప్రేమకి మరోకోణం కూడా వుంది. సెక్స్, రొమాన్స్ లాంటి ఎమోషన్స్ తో కలిసినప్పుడు మనిషిని విజయపథంలోకి నెట్టి ఎటర్నల్ ట్రయాంగల్ ఆఫ్ అచీవ్ మెంట్ లా వున్నత శిఖరాలపై నిలబడుతుంది. వేరే లవ్వీజ్ దేర్ గాడీజ్ అంటాడు టాల్ స్టాయ్."
అరనిమిషం మౌనం.
"ఉన్నట్టుండి నిశ్సబ్దం దేనికి?"అంది కీర్తి.
"నా అంచనా తప్పుకాదని బోధపడింది ఆర్తీ!మీరు నిజంగా ఇంటల్లెక్చువల్ గా రుజువయిపోయింది."
"భలేవారే! నాలుగు కొటేషన్స్ చెప్పినంత మాత్రాన నేను ఇంటల్లెక్చువల్ ని ఎలా అవుతాను?"
"మీరేం చదువుకున్నారని నేను అడగను ఆర్తీ! కానీ మీరు చాలా చదివారని అర్దం చేసుకోగలను."
"మీ భార్య చాలా అదృష్టవంతురాలిగా నాకూ అర్దమైంది."
"ఎలా?"
"తెలివనేది ఓ గొప్ప సంపదయితే అది సంపాదించుకుంటే చాలదు రచయితగారూ... ఖర్చు చేయడం కూడా తెలియాలి. మీ మాటలు వింటుంటే మీ శ్రీమతి కోసం అలాంటి అపురూపమైన ఖర్చుని చాలా చేస్తుంటారనిపిస్తుంది."
ముందు తేజా నవ్వు వినిపించింది. "మీది ప్రేమ వివాహమా?"
ఊహించని ఈ ప్రశ్నకి వులిక్కిపడింది. "కాదు."
"మీవారేం చేస్తుంటారు?"
"జవాబు అంత అవసరమా?"
"మీకు అభ్యంతరమైతే చెప్పకండి."
"బాధపడుతున్నారా?"
"నాకు బాధ దేనికి?"
"మీ మాట కాదన్నందుకు."
"నేనెలర్నని..." నవ్వేశాడు తేజ.
"ప్లీజ్!" తేజాకి కోపం వచ్చినట్టు ఆందోళనపడింది - "మరికాస్త పరిచయమయ్యాక మొత్తం చెబుతాను."
"బెటర్! ఇలా అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే ఆనక చర్చించుకోటానికి ఏదీ మిగలదు. అది సరే! చివరగా మీకో ప్రశ్న."
"అడగండి."
"ప్రేమంటే మీ అభిప్రాయం చెప్పండి" అన్నాడు.
"ప్రేమించకుండా, ప్రేమనే అనుభూతిని అర్దం చేసుకోకుండా వుండటముకంటే,ప్రేమించటం తప్పనిసరైతే ప్రేమించి, ఆ ప్రేమలో విఫలమై కడతేరిపోవడం అన్నది నా అభిప్రాయం."
"ఖచ్చితంగా ఇలాంటి అభిప్రాయాన్నే ఓ ఇంగ్లీషు కవి రాశాడు."
"అవును టెన్నిసన్ 'ఇన్ మెమోరియమ్' లో."
"ఇంగ్లీషు లిటరేచర్ లో చాలాపరిచయం వుంది కదూ."
"ఉందని మీరు అనుకుంటే మీ దృష్టిలో నేను తెలివైన దానిగా మిగిలితే అదృష్టవంతురాల్ని మిస్టర్ తేజా!"మనసు లోయల్లో ప్రత్యుష పవనాల తాకిడి..... ప్రభాత పదాల అలికిడి... గాంధర్వ గలగలహోరు. .. అయిదు నిమిషాలు మాట్లాడాలనుకుంటే అరగంట అవకాశమిచ్చారు. థాంక్యూ! అప్పుడప్పుడూ ఈ మాత్రం అదృష్టాన్ని కలిగించండి. ఫోన్ పెట్టేయనా?"
"మరో పజిల్ కావాలా?"