Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 26


    "గుడ్, వెరీగుడ్! మన కంపెనీలో కలిసే వ్యక్తి రాధగారే! గోపీగారు నన్నుముట్టుకోకు అంటారు"
    "కొత్త కదండి! కొత్త యింట్లో కొత్తరుచులు నేర్చుకుంటారు"
    "ఆ మాత్రం భరోసా యిస్తేచాలు!" అని "అబ్బ కడుపులో ఆకలి దంచేస్తూ వుంది. భోజనాలు కానిద్దామా" అన్నాడు ఫణి.
    ఆ రాత్రి వాళ్ళిద్దరూ అక్కడే గడిపారు. విడివిడిగా గదులు లేకపోవటంతో రోజీ, ఫణీ డాబాపై పడుకున్నారు.
    గదిలోకి వచ్చిన రాధ గాఢంగా నిద్రపోతున్న రామును చూసి "అంతా వీడి అదృష్టమే" అంది...
    "రాధా! ఇంటి విషయం అన్నయ్య ఏమంటాడో?"
    "ఏమీ అనరు. ఆ పల్లెటూళ్ళో మనకోసమని అంత అందమైన ఇల్లు కట్టారు. మనకిక్కడ ట్రాన్స్ ఫర్సా? బండలా? రిటైరయ్యేదాకా ఇక్కడేగా! తర్వాత అయినా మనం అవసరం అనుకుంటే ఇక్కడే ఉండొచ్చు."
    "అప్పటి మాట ఏమోలే! ఇంకా పాతికేళ్ళు అద్దె ఇళ్ళలో వుండాలనీ ఆ అద్దె డబ్బులకే ఇప్పుడు ఇల్లు వచ్చేస్తుందనీ చెపితే సరి."
    "అసలు అంత ఆలోచన అనవసరం. మీరు అడగ్గానే ఆయన ఊ అంటారు" అంది భర్త ఎదపై వాలిపోతూ.
    మంచి వాసన వస్తున్న రాధ పెదాల్ని అలాగే చుంబించాడు అతను.
    "మీరు కాస్త పుచ్చుకుంటే బావుండేదేమో! బీర్ తీసుకున్నాక నాకెంత హాయిగా ఉందని. అడపా దడపా వర్షాలు పడుతున్నా యింకా ఎండలు తగ్గలేదు. యూనివర్శిటీలో అప్పుడప్పుడు సరిత బీర్ పార్టీ ఇచ్చేది నాకు."  
    గోపీ జవాబు చెప్పలేదు.
    "పుచ్చుకుంటారా?"
    "ఇంత మత్తెక్కిస్తున్న నీకంటే ఆ మద్యం నాకెందుకు?" అని భార్యని కౌగిలిలో బంధించాడతను. అతన్ని హత్తుకుపోయింది రాధ.
    ఆ తర్వాత శనివారం రాత్రికి ఊరుకి బయలుదేరాడు గోపీ.
    అనుకోకుండా వచ్చిన తమ్ముడిని చూసి సంబరపడ్డాడు రమణయ్య, ప్రేమగా అడిగాడు. రాధ బావుందా? రామయ్య తండ్రి ఎలా వున్నాడు? వాడు కళ్ళల్లో కట్టినట్టుగా వున్నాడు."
    "నీవూ అక్కడికే వచ్చెయ్యకూడదా అన్నయ్యా! ఈ పొలాన్ని గుత్తకిచ్చేస్తే పోదా" అన్నాడు బూట్లు విప్పి పేంట్ విప్పి లుంగీ చుట్టుకుంటూ.
    "బావుందిది. మీరిద్దరూ వుద్యోగం చేసుకుంటూ అక్కడున్నారు న్యాయమే. నేనేం పని వుందని రావాలి? పైగా ఇక్కడ ఇంత ఇల్లు, పొలము ఎవరు చూస్తారు? భూమి అంటే స్వంతంగా పండిస్తేనే భూమి గుత్తలకీ, కౌలుకీ ఇస్తే ఎంత మంచిదయినా స్మశానం చేస్తారు."
    "లోకమంతా అలాగే వుందా? అందరూ స్వంతమే చేసుకుంటున్నారా ఒక్కడివీ ఇక్కడుండి ఎందుకింత కష్టపడాలి? మనకిప్పుడున్నది చాలదా?"
    "గోపీ! నేనీ పొలాన్ని వదిలి రాలేనయ్యా బాబూ" అని అప్పటికప్పుడు వేడి వేడి ఉప్మా తయారుచేసి పెట్టాడు ఎదురుగా.
    ఆ ఉప్మా తిని, కాఫీ తాగి "భోజనానికి నీకెంత యిబ్బంది? ఏదయినా ఏర్పాటు చేసుకోరాదా అన్నయ్యా" అన్నాడతను.
    బ్రతకటానికి తినటం కోసం, అంత ఆర్భాటం ఎందుకు గోపీ, ఎలాగో జీవితం వెళ్ళిపోతూ వుంది. నా అదృష్టమే బావుంటే మీ ఒదిన అలా అయ్యేది కాదు" రమణయ్య ముఖంపై తారట్లాడిన విషాదాన్ని చూసి కదిలిపోయాడు గోపీ.
    "ఏ శాపం వల్లో భూలోకంలో జన్మించిన దేవత ఒదిన" అన్నాడు గోపీ.
    చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు రమణయ్య.
    "ఇక్కడుంటే ఒదిన జ్ఞాపకాలు నిన్ను బాధిస్తూ ఉంటాయి. అక్కడికి వస్తే రామూతో కాలం గడిచిపోతుంది నీకు. ఈ అద్దెయిల్లు బాగా వసతిగా ఉండదనుకుంటే మరో పెద్ద యిల్లు తీసుకుందాం. లేదా స్వంతంగా ఓ ఇల్లు కొనుక్కుందాం"
    తమ్ముడికి తనపై గల అభిమానానికి ముగ్ధుడయ్యాడు రమణయ్య. "నేనీ ఇల్లు వదిలి రాలేను. ఇంకో రెండేళ్ళు ఆగి ఆ రామయ్య తండ్రినే నేను తెచ్చుకుంటాను ఈ ఇంటికి. ఈ పొలానికి హక్కుదారుడు వాడే! అందరూ చదువులూ ఉద్యోగాలూ అంటూ ఎగబడితే ఎలా? మనసి వ్యవసాయక దేశం. పండించాలి, బ్రతకాలి, బ్రతికించాలి, ఇక ఇల్లు అంటావా? యిల్లుదేముంది? అవసరమనిపిస్తే కొంటే సరిపోతుంది."
    అన్నగారు తనకై తను అన్నమాటలకి సంతోషించాడు గోపీ.
    "నీవు సరేనంటే ఇల్లు కొంటానన్నయ్యా"
    "కొనెయ్ గోపీ, మన అవసరాల కంటే మించిందేంముంది? ఎక్కడైనా మంచి పరిసరాల్లో, మంచి పొరుగులో కట్టిన ఇల్లు ఉంటే చూడు. స్థలం కొని శ్రమపడి కట్టించేదాని కంటే కట్టిన ఇల్లయితేనే బావుంటుంది."
    పని సులభంగా నెరవేరుతున్నందుకు ఆనందిస్తూ "ఓ ఇల్లు ఉందన్నయ్యా! మా తోటి లెక్చరరు ఉంటున్న కాలనీలో వుంది. అక్కడంతా మంచి మంచి భూస్వాములు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, భారీ వ్యాపారస్తులూ ఉన్నారు." అన్నాడు.
    "ధర ఎంతలేదన్నా పాతికవేలకి తక్కువ ఉంటుందా?"
    "ఉండొచ్చు పాతికంటున్నాడట. బేరం చేస్తే రిజిష్టరు ఖర్చుల మొత్తమయినా తగ్గొచ్చు."
    "తగిన వ్యక్తిని తీసుకెళ్ళి బేరం చెయ్యి" "స్నానం చేస్తావా? రంగమ్మని నీళ్లు తోడమంటాను" అన్నాడు రమణయ్య.
    ఇక ఇంటి విషయం ఖాయమైనట్లే అనుకున్న గోపీ తలూపాడు.
    మరురోజు ఉదయమే అన్నగారిచ్చిన డబ్బు తీసుకుని "నీవూ వస్తే బావుంటుందన్నయ్యా" అన్నాడు. కానీ అతనికతనికే ఆ మాటలు మొక్కుబడిగా అన్నట్లనిపించింది.
    "ఆఁ నాకెక్కడ తీరుతుంది గోపీ! పసుపు కొనటానికి వ్యాపారస్తులు వస్తామన్నారు, అరటి గెలలు తెంపి పంపాలి. వరిమడిలో కూడా పనులు వున్నాయ్. ఒక్కరోజు వదిలేసినా వ్యవసాయం చెడుతుంది" అన్నాడు రమణయ్య.
    "మరి నే వస్తాను, ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే జాబు రాస్తాను, ఇల్లు నీ పేరే పెడతాను" అన్నాడు గోపీ.
    "వద్దు! వద్దు! ఆ టౌన్ వ్యవహారాలూ అవీ నే చూసుకోలేను. మరదలి పేరో, నీ పేరో పెట్టించెయ్యి. అసలు రాముడి పేరే పెట్టించెయ్యాలని వుందికానీ మరీ నెలల కుర్రాడు ఎందుకులే" అన్నాడు.
    "ఇక వస్తాను అన్నయ్యా, బస్సుకి టైమ్ అవుతుంది. మళ్ళీ రేపు కాలేజీకి వెళ్ళాలి" అన్నాడు గోపీ.
    "జాగ్రత్త! దారిలో భద్రం" అని హెచ్చరించాడు.
    "మరేమీ ఫరవాలేదులే! కానీ ఇక్కడ పనులున్నాయంటూ వ్రాయకుండా గృహప్రవేశానికి తప్పకుండా రావాలన్నయ్యా! కావలిస్తే ఆ నాలుగు రోజులూ శీనయ్యనీ, రంగమ్మనీ చూసుకోమని చెప్పు" అని కదిలాడు.
    తమ్ముడికి, మరదలికి తనపై ఉన్న గౌరవానికి, ప్రేమకి ఆనందించాడు రమణయ్య తృప్తిగా ఉంది అతని మనస్సుకి.    


                                      12


    కనీసం వారంరోజులైనా ముందుగా రమ్మని గోపీ వ్రాసినా పొలం పనుల వల్ల తీరలేదు రమణయ్యకి. పసుపు అమ్మి, చెరుకు ఆడించకుండా టోకుగా అమ్మి, అరటిగెలలు అమ్మేసి పనులన్నీ తీరాయనుకునేసరికి గృహప్రవేశ ముహూర్తం రానే వచ్చింది.
    తెల్లవారితే కొత్త ఇంట్లో చేరతారని ఆ రాత్రే ఆఘమేఘాలమీద బయలుదేరి తూర్పు బండి అందుకున్నాడు రమణయ్య.
    అనుకోకుండా బాబూ, సరోజ గుర్తుకి వచ్చేరతనికి. మనస్సంతా కకావికలమై పోయింది. "తాను ఏం పాపం చేసుకున్నాడో చేజిక్కిన అమృత భాండం జారిపోయింది. మొదటినుంచీ తను గర్భదరిద్రుడే. బాల్యంలో తల్లిని పోగొట్టుకున్నాడు. వయస్సు వచ్చేవేళ తండ్రిపోయి, బాధ్యతలు తలపై బడ్డాయి. జీవితం కుదుట బడుతోందిలే అనుకునే సమయంలో ఆశ్రయమిచ్చిన వారు నిర్ధాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు.
    ఏటికి ఎదురీది జయించి తన బ్రతుకును తను దిద్దుకున్నాడు. ఇల్లు - ఇల్లాలు పిల్లలు అనుకునే సమయంలో అంతా నేలపాలయింది. జీవితం మోడుబారిపోయింది. తనకు నిండా ముప్పై ఏళ్ళు! నూరేళ్ళ జీవితం అనుభవించేశాడు. ఇక చాలు అనేంత వేసరికి వచ్చేసింది"
    గుంటూరులో రైలు దిగేసరికి బాగా పొద్దెక్కింది.
    స్టేషను దాటి బయటకు రాగానే పులి విస్తరాకుపై కుక్కల్లా విరుచుక పడ్డారు రిక్షావాళ్ళు. "బ్రతుకు తెరువుకింత పోరాటమా? టౌన్లో బ్రతుకు ఇంత దుర్భారమా? మరి ఈ జీవితంపై ఎందుకింత భ్రాంతి పడుతున్నారు జనం?" అనుకున్నాడు రమణయ్య.
    వెళ్ళాల్సిన చోటు చెప్పాడు అతనికి.
    "రెండ్రూపాయలివ్వండి" అని అడగ్గానే గుండె గొంతులోకి వచ్చేసింది రమణయ్యకి. 

 Previous Page Next Page