కర్మ! మీకు యిలా అర్ధంకాదు. డైరెక్ట్ గా అడగ వలసిందే. మీ అబ్బాయిని చూడటానికి పిలుస్తారని అలా అడిగాను."
గోపీ ముఖం వికసించింది.
"తప్పకుండా రండి యు ఆర్ క్వయిట్ వెల్ కం"
"ఎప్పుడు"
"ఎప్పుడైనా సరే! ఈరోజే రండి"
మళ్ళీ నుదురు బాదుకుందామె.
"అదికాదండి? ఏదయినా పంక్షన్ ఎరేంజ్ చేసి రమ్మంటే వస్తాం కానీ వూరికే రమ్మంటే ఎలా వస్తాను?"
"సారీ! వెరీ సారీ! రేపు సండే ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను" అని పేపరు తీసుకుని యిన్విటేషన్ రాసి "చూడండి" అన్నాడు గోపీ.
అది చదివిన రోజీ నిరుత్సాహంగా "ప్చ్" కాలేజీ స్టాఫ్ నంతా పిలుస్తూ నన్నూ మా వారినీ పిలవటంలో విశేషం ఏముంది?" అంది.
"మరి!"
"మాకు ప్రత్యేక ఆహ్వానం కావాలి."
"మీతో అన్నీ చిక్కే? పోనీ నాపై దయవుంచి మీరే చెప్పండి.
"ఎప్పుడు ఎక్కడ మీకు ఏర్పాటు చేయాలో?"
రుసరుసలాడింది రోజీ.
"ఇది బావుంది. నేనెంత సిగ్గులేని దానిననుకున్నారా? లేక పార్టీలకి ముఖం వాచాననుకున్నారా? ఈ కాలేజీకంతా మేమిద్దరమే ఉన్నాం. తోటి లెక్చరర్ కి కొడుకు పుట్టాడు కదా అని అడిగితే ఇలా అంటారా?"
అంతలో బెల్ రింగ్ అయింది. మిగతా స్టాఫ్ ఒక్కరొక్కరే రావటం ప్రారంభించారు. గోపీ రాసిన యిన్విటేషన్ పర్స లో పెట్టేసింది రోజీ. అంతటితో ఆ సంభాషణ వాయిదా పడింది.
రోజీ మాటలన్నీ రాధతో చెప్పాడు గోపీ.
గల గల నవ్వింది రాధ ఆ మాటలన్నీ విని
"నిజమే కదండీ! రోజీ మన కోవర్కర్. నా బెస్టు ఫ్రెండ్.
అలాగే ఫణి చక్రవర్తి మీ బెస్టు ఫ్రెండ్ పైగా మన ఫేమిలీస్ బంధువుల కంటే ఎక్కువగా కలిసి పోయాయి. మరి వాళ్ళని నలుగురితో పాటుగా కలిపేస్తే ఏం బావుంటుంది? నా మాట విని రేపు మొత్తం స్టాఫ్ కి టీ పార్టీ యివ్వండి. ఆదివారం నాడు వాళ్ళిద్దర్నీ డిన్నర్ కి ఆహ్వానించండి" అంది.
అలాగే చేశాడు గోపీ.
అనుకున్న ఆదివారం రానే వచ్చింది.
ఆ రోజు ఉదయమే వచ్చారిద్దరూ. ఉదయం కాఫీ టిఫిన్స్ ముగించి పేకాటలో పడ్డారు. మధ్యాహ్నం భోజనాల వేళ దాకా విసుగొచ్చేట్టు పేక ఆడారు, మంచి హోటల్ నుంచి తెప్పించిన భోజనం చేశారు. స్పెషల్స్, స్వీట్స్ అన్నీ పుష్టిగా తిన్నారు.
"టీ పార్టీ అన్నా డిన్నర్ పార్టీ అన్నా యిలా ఉండాలి. ఆడవాళ్ళ దుంప తెగేలా వంటలు చేయించి ఫ్రెండ్స్ కి పెడితే ఏం లాభం?" అంది రోజీ.
భోజనాలయ్యాక మళ్ళీ పేకకి తలపడ్డారు.
"ఊరికే ఆడితే మజా ఉండదు. కొంతయినా డబ్బు పెట్టి ఆడాలి. అందులో క్లబ్బులో ఆడే నాలాంటి వాళ్ళకి అసలు యింటరెస్టు వుండదు" అన్నాడు ఫణి.
"ఎస్! ఎస్!" అంది రోజీ.
"ఎవరంతకు వాళ్ళు సంపాదిస్తున్న తర్వాత భార్యనీ భర్తనీ లేదు. ఎవరయినా డబ్బు యిచ్చుకోవలసిందే" అన్నాడు గోపి.
"అలాగే" అంది రాధ.
పేక రంజు రంజుగా సాగింది.
సాయంకాలం అయింది.
"ఇక వెళతామని లేవ బోయారిద్దరూ"
"క్లబ్బు వేళయింది కాబోలు" అన్నాడు గోపీ.
నవ్వాడు ఫణి.
"సాయంకాలమైతే ఆయన కాలు ఇంట్లో నిలవదని, చీకటి పడేసరికి గొంతు తడుపుకోనిదే ఆగలేరు" అంది రోజీ.
అదోలా చూశాడు గోపీ.
"అవునోయ్! మందులోని మజా ఏం తెలుసు మీకు?" అన్నాడు ఫణి.
"వెళ్ళి తీరాలా?" అంది రాధ.
"సారీ!"
"పోనీ ఆయన యిక్కడికే తెప్పిస్తారు, ఉండి పొండి" అంది రోజీ.
"దెన్ యిటీజ్ ఆల్ రైట్" అన్నాడు ఫణి.
"ఎవరున్నారు వెళ్ళటానికీ?" అనుకుంటూ బయటికి వెళ్ళిన గోపీకి కాలేజి ప్యూన్ సింహాచలం కనిపించాడు, వాడిని కేకేసి పిలిచి ఫణికి కావలసిన వెరైటీ చెప్పి డబ్బిచ్చి పంపాడు గోపీ.
తిరిగి యింట్లోకి వచ్చి "సింహాచలం కనిపిస్తే పంపాను" అని చెప్పాడు గోపీ. ఫణి ముఖం వికసించింది ఆ మాటలు వినగానే.
మరో పది నిమిషాల తరువాత సరుకు వచ్చింది.
అది చూసి రాధ ముఖం ఇబ్బందిగా పెట్టింది.
"మనం మరో గదిలోకి వెళదామా?" అన్నాడు ఫణి.
డాబాపైకి వెళ్ళారిద్దరూ ప్రత్యేకంగా గది లేకపోవటంతో.
బాటిల్ ఓపెన్ చేశాడు ఫణి.
జీడిపప్పు పకోడీల పొట్లం విప్పాడు గోపీ.
గ్లాసులో పోసుకుని ఓ గుక్క తాగాడు ఫణి.
"నీరు. సోడా ఏమీ అక్కర్లేదా?" అన్నాడు గోపీ పకోడీలు నములుతూ.
"నీట్ గా కొట్టేస్తేనే రుచీ" అంటూ మరోగుక్క తాగాడు.
గంటకల్లా బాటిల్ ఖాళీచేసి క్రిందికి దిగి వచ్చారిద్దరూ.
"రాధా! ఇప్పటికి మనిషయ్యాడు నీ మగడు" అన్న ఫణి మాటలు విని అనుమానంగా చూసింది రాధ.
"ఆహా! నాతో చేయి కలిపాడని కాదు. నాకు తెప్పించి పోశాడని నా సంతోషం" ఆ మాట విని ఆమె మనస్సు తేలికయింది.
"అయినా అలా పార్టీ చేసుకోవాలంటే మీ ఇంట్లో చాలా యిబ్బంది.
"బాడుగ ఇంట్లో అన్ని సౌకర్యాలూ ఎలా వస్తాయి" అంది రోజీ.
హఠాత్తుగా ఏదో స్పురించినట్టయి అన్నాడు ఫణి "మిష్టర్ గోపీ! మా కాలనీలో ఓ అతను ఇల్లు అమ్మే ఉద్దేశంలో ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు. మొన్ననే నాతో చెప్పాడు. నీకు కొనే ఉద్దేశ్యం వుంటే చెప్పు బేరమాడతాను"
"అబ్బే! మాకు ఇల్లెందుకు ఏదో జరిగి పోతోందిగా."
"గోపీ! ఇల్లుచూసి ఇల్లాల్ని చూడమన్నారు. నెలకు దాదాపు రెండువేలు సంపాదిస్తూ ఇలాంటి ఇంట్లో వుంటే ప్రిస్టేజికి లోకువ. మీకేం తక్కువని ఇలా బ్రతకాలి. నా మాట విని ఇల్లు కొనెయ్యండి"
"వాళ్ళ అన్నయ్యని అడగాలేమో?"
"మా బావగారు మా విషయం అంటే దేనికి అడ్డు చెప్పారు. అయినా ఇప్పుడు స్వంత ఇల్లు అవసరం ఏమొచ్చింది?"
"స్వంత యిల్లో స్వర్గసుఖమో అన్నారు. ప్రతి మనిషికి కనీస అవసరం ఇల్లు. ఈ రోజుల్లో ఏది వున్నా ఏది లేకపోయినా స్వంత ఇల్లు అంటూ ఉండాలి."
"ఎంత ధరలో ఉంటుంది? అడిగింది రాధ. "పాతిక వేలకి అటూ ఇటూ."
"ఇంటిపై అంత ఖర్చు చేయటం శుద్ధవేస్టు. బ్యాంక్ లో వేసుకుని ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీతో అయినా బంగళాలో కాపురం చెయ్యొచ్చు."
"కాదనను. కానీ మన ఇల్లు మన మాట అన్నట్లుంటుందా?"
"ఫణిగారూ! మీరు బేరం చేయండి. మా బావగారేమీ అనరు. కొద్దిరోజులు టైమ్ తీసుకుంటే మొత్తం అంతా ఇచ్చేసి రిజిష్టర్ చేయించుకోవచ్చు."
"రాధా!"
"ఉండనీండి. వాళ్ళంతా చెపుతూంటే వినకపోవటం మంచిది కాదు."
"నీ ఇష్టం"
"గుడ్! భర్తంటే అలా వుండాలి" అంది రోజీ.
"నీకేం తక్కువైంది? కారు అడిగితే కారు కొన్నాను. ఇల్లు అడిగితే యిల్లు కట్టించాను. నగలడిగితే నగలు చేయించాను. రకరకాల చీరలు కొన్నాను. పిల్లల బాధ్యత లేకుండా కాన్వెంట్ లో చేర్పించాను" నవ్వుతూ అన్నాడు ఫణి.
"అష్టోత్తరం చదవకండి. ఇవన్నీ నా కోసమా? మన కోసం చేయించారు" అంది రోజీ.
"ఈ రోజు అష్టోత్తరమే అయింది. సహస్రనామార్చన అయితే కానీ నాకు తృప్తి లేదు. ఓరగా గోపీ వేపు చూశాడు ఫణి.
"మీదంతా అదొరకం! ఇల్లు కొన్నాక ఇంతకు మించిన గ్రాండ్ పార్టీ ఇస్తారులెండి. అప్పుడు మేమూ కలుస్తాం మీతో"
"ఆ మాట అంటే నే కాదంటానా?"
"ఫణిగారూ! ముందు ఇల్లు విషయం కుదరనివ్వండి. మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను స్వంత ఇంట్లో" అన్నది రాధ.
"అవునండీ! ముందు ఆ విషయం చూడండి. రాధ ఎడ్యుకసీ తెలిసిన వ్యక్తి. మీరు పైన పార్టీ చేసుకుంటున్నారని నాకు బీర్ తెప్పించింది పనిమనిషితో. చేయికలపమంటే ఓ చుక్క తీసుకుంది కూడా."