Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 25


    పెట్టె పట్టుకొని బయలుదేరింది.


    "బట్టలు మార్చుకోవూ?"


    "ఇవి చాల్లే" అన్నది.


    ఆమె చేతిలోని పెట్టెను లాక్కుని శ్రీధర్ గబగబా బయటికి వెళ్ళిపోయాడు.


    అమూల్య బయటికి వచ్చింది.


    "వదినా అమ్మ పెట్టిన చీర కట్టుకోవూ?"


    "మేచింగ్ బ్లౌస్ లేదు. ఆ చీర ఇక్కడే పెట్టాను. ఇక్కడకు వచ్చినప్పుడు కట్టుకుంటాలే" అంటూ వెళ్ళి టాక్సీలో కూర్చుంది.


    "అమ్మా వస్తాం" అంటూ శ్రీధర్ కూడా టాక్సీలో కూర్చున్నాడు.


    శ్రీధర్ టాక్సీలకు డబ్బు పోసే స్తోమత ఉన్నవాడు కాదు. అయినా మొదటిసారి అమూల్యను బస్ లో తీసుకెళ్ళడం ఇష్టంలేదు. అలా చేస్తే అత్తగారి దృష్టిలో తను మరీ వెలితి పడాల్సి వస్తుందని భయపడ్డాడు. అమూల్య కూడా చిన్నబుచ్చుకోవచ్చును. తాము క్రమంగా ఈ జీవితానికి అలవాటు పడాలి.


    టాక్సీలో అమూల్య మౌనంగా కూర్చుంది.


    శ్రీధర్ కూడా మాట్లాడాలనిపించలేదు. అమూల్యను చేసుకొని తాను తప్పుచేశాడు. కలలుగనే వయసు ఉన్న పిల్ల తనను ప్రేమించానన్నది. తనూ ఆమె సౌందర్యానికి ముగ్దుడయినాడు. ఆమెను సంతోష పెట్టగలనా లేదా అని లోతుగా ఆలోచించలేదు.


    టాక్సీ సడెన్ గా ఆగింది. ఎవరో అడ్డం వచ్చారు.


    శ్రీధర్ కూడా ఆలోచనల నుంచి బయటపడ్డాడు.


    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"


    "ఏమీ లేదు."


    "ఆ నగలు గురించేగా?"


    ఆమె మాట్లాడలేదు.


    "మేము బీదవాళ్ళమే కాని- దొంగలం కాదు."


    ఆమె చివ్వున తలతిప్పి చూసింది.


    "నేను అలా అన్నానా?"


    "అనకపోయినా...."


    "ఛా. నేను అలా అనుకోవడం లేదు. బయటివాళ్ళు ఎవరైనా..."


    "నువ్వు వాటి గురించి బెంగపడకు. నిజంగా పోతే నేను చేయిస్తాను."


    "వాటి ధర ఎంతో తెలుసా?"


    "ఎంత?"


    "పదివేలు" అంత డబ్బు పెట్టి నువ్వు నగలు చేయించగలవా?" అన్నట్టుగా అన్పించింది శ్రీధర్ కు.


    అతని ముఖం ఎర్రబడింది.


    "నగలు పోయాయని కాదు నా దిగులు. మమ్మీ మిమ్మల్ని ఎన్ని మాటలు అంటుందోనని భయం" అన్నది అమూల్య శ్రీధర్ చేతిమీద చెయ్యి వేసి.


    శ్రీధర్ మౌనంగా కూర్చున్నాడు. ప్రయాణం చేసినంతసేపు అన్యమనస్కంగానే ఉన్నాడు.


    టాక్సీ ఇంటి ముందు ఆగింది.


    ఆ ఇల్లును చూడగానే ఆమెకు సంతోషం దుఃఖం రెండూ ఉప్పొంగాయి.


    పరుగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని కౌగలించుకుంది.


    అమూల్య కంఠం విని కృష్ణారావు తన గదిలోనుంచి బయటికి వచ్చాడు.


    "డాడీ" తండ్రి మెడ చుట్టూ చేతులు వేసింది. తండ్రి కళ్ళలో నీరు తిరిగింది.


    "నాల్గురోజులు నువ్వు కన్పించకపోతేనే ఎలాగో ఉన్నదమ్మా" అన్నాడు.


    "నాకూ అలాగే అన్పించింది డాడీ. మమ్మీ ఇంకా నామీద కోపం పోలేదా?"


    "నాల్గురోజులకే అలా చిక్కిపోయావేమే? తిండి సరిగా తినలేదా" తల్లి మొదటిప్రశ్న.


    "వాకిట్లోనే నిలబడిపోయిన అల్లుణ్ణి చూసి కృష్ణారావు "రావోయ్. రా. అక్కడే నిల్చున్నావేం? అవంతీ బావకు కాఫీ తీసుకురా. రావయ్య" అంటూ అల్లుణ్ణి కృష్ణారావు గదిలోకి తీసుకెళ్ళాడు.


    ఆమె తల్లి శ్రీధర్ ను పలకరించలేదు. అది గమనించిన కృష్ణారావు అల్లుడికి అతిథి మర్యాదలు చేయసాగాడు.


    అమూల్య తండ్రికీ, భర్తకూ కాఫీ తెచ్చింది.


    "శ్రీధర్! ఆ నగలు ఇక్కడే వున్నాయ్. అమ్మ కావాలనే ఇవ్వలేదట" అన్నది.


    శ్రీధర్ అదోలా నవ్వాడు.


    "ఏం నగలు?"


    "ముత్యాల సెట్టు డాడీ. కన్పించకపోతే హడలి చచ్చిపోయాననుకో."


    "అక్కడ గొడవ ఏం చెయ్యలేదు కదా?" గాభరాగా అల్లుడి ముఖంలోకి చూస్తూ అడిగాడు.


    "అబ్బే అదేం లేదండీ" అన్నాడు శ్రీధర్.


    "అమూల్య గొడవ చెయ్యలేదంటే నేను నమ్మను."


    "పో డాడీ! మీరు ఎప్పుడూ అలాగే అంటారు. నేను అసలు ఎవరితోనూ ఆమాట అనలేదు. కావాలంటే ఆయన్ని అడగండి" అన్నది.


    "స్నానం చేస్తావా?"


    "వద్దండీ" అన్నాడు శ్రీధర్.


    "తల్లీ భోజనం వడ్డించు."


    "వద్దండీ. సూర్యాపేటలో భోజనం చేశాం"


    "నీ గదిలోకి తీసుకెళ్ళమ్మా. కాసేపు పడుకో బాబూ."


    "లేదండీ. బయట కొంచెం పని వుంది. అది చూసుకొని వెళ్ళిపోతాను."

 Previous Page Next Page