Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 25

    హోటల్ నుంచి మకాం మేరీ యింటికి మార్చేశారు ఆరోజే.
    పిక్నిక్ నుంచి శాంతి, మేరీ యింటికి రాలేదని కాలుకాలిన పిల్లిలా లోపలికి, బయటికీ తిరుగుతున్నారు రావుగారు. కారూ, డ్రైవరూ వెళ్ళి చాలాసేపే అయింది. అయినా గోపీని పంపించారు. ఏడు దాటినా భోజనానికి వెళ్ళలేదు. "మామయ్యా! రండి భోంచేద్దురుగాని" అంది మాధవి.
    "శాంతి లేకుండా నేను తినను" అన్నారాయన.
    "శాంతి వస్తుందిలే మామయ్యా. పొద్దుపోయి అన్నం తింటే మీకు అరగదు, రండి" అంది.
    "నాకొద్దమ్మా...మాకేదో భయంగా వుంది. అక్కడ నీళ్ళూ అదీ...కాలు జారితే" అతనికి మాట రావడం లేదు.
    "ఏమిటి మామయ్యా మీరు మరీను. అన్నిటికీ భయపడితే ఎలా? గోపీ కూడా వెళ్ళాడుగా వస్తారు. కొంచెం ఆలస్యమై వుంటుంది. రండి, మీరు మందు కూడా వేసుకోవాలి" అంది.
    "అవును. నా మందూ, నా భోజనం ఇవేనా ముఖ్యం? శాంతి రానిదే నేను నీళ్ళు కూడా తాగను" అంటూండగానే కారు చప్పుడవుతుంది. కారులోంచి దిగుతూన్న శాంతిని చూసి రావుగారు గబగబా లోపలికెళ్ళి మంచం మీద పడుకున్నారు.
    "మమ్మీ! తాతయ్యేరీ?" అంది శాంతి.
    "నువ్వాలస్యంగా వచ్చావని తాతయ్య అన్నం తినకుండా అలిగి పడుకున్నారు" అంది నవ్వుతూ.
    "ఓ...అదా సంగతి. నేను తినిపించుతాను" అంటూ దగ్గరకెళ్ళింది "తాతయ్యా అన్నం తిందామా?" అంటూ.
    "ఉహూ...నేతిన్ను...నాకాకలిగా లేదు" అన్నారు.
    "నాకాకలేస్తోంది. నువ్వు తినకపోతే నేనూ తినను. నేనేడుస్తాను" అంటూ రాగం తీసింది.
    "ఒద్దమ్మా ఏడవకు తిందాం పద" అంటూ లేచారు.
    "ఆ... వెరీగుడ్ తాతయ్యా" అంటూ కిలకిలా నవ్వింది.
    మాధవి అందరికీ వడ్డించింది. శాంతి తన అన్నంలోంచి ముద్దలు చేసి రావుగారి నోటిలో పెడుతోంది. అతని కళ్ళలో నీళ్ళు నిండాయి.
    "ఎందుకేడుస్తున్నావు తాతయ్యా? చాలా ఆకలిగా వుందా?" అంది శాంతి.
    "కాదమ్మా. చిన్నప్పుడు మా మమ్మీ నీలాగే ముద్దలు తినిపించేది" అన్నారు.
    "అయితే నేను నీ మమ్మీని. ఇవ్వాళ నుంచి నువ్వు నేచెప్పిన పని చెయ్యాలి తెలుసా?" అంది మమ్మీలాగా ఫోజుంచి.
    "ఓ నువ్వు బంగారు తల్లివి" గబగబా అన్నం తినేశారు రావుగారు. తాతా, మనవరాల్ని చూస్తూ, వాళ్ళ కబుర్లు వింటూ అందరూ భోజనాలకి కూర్చున్నారు.
    "గుడ్ మార్నింగ్ అంకుల్" అంటూ చాక్ లెట్స్ తీసికెళ్ళి యిచ్చింది శాంతి.
    "గుడ్ మార్నింగ్ శాంతీ" అంటూ అందుకున్నాడు కుమార్.
    "మరి నాకో" అంది మేరీ.
    "ఇవి మీరు తీసుకోండి. నేను ఇంటికెళ్ళి తింటాను" అంది శాంతి.
    "ఒద్దమ్మా ఊరికే అన్నాను. నువ్వు తిను. ఆ పద... మరి స్కూలుకి టైమయింది కదూ?" అంది.
    "బై...బై...అంకుల్" అంటూ వెళ్ళిపోయింది శాంతి.
    ఇలా రోజూ ఏదో ఒకటి తెచ్చి కుమార్ కి పెడుతూనే వుంది శాంతి. దాంతో కుమార్ కి శాంతి కోసం ఎదురుచూడడం అలవాటైపోయింది. సెలవులూ, ఆదివారాలూ వస్తే శాంతి కోసం కలవరిస్తాడు కుమార్.
    ఆదివారం కోసం, సెలవు రోజు కోసం ఎదురుచూస్తుంటారు రావుగారు. ఆరోజు శాంతి రోజంతా తనతోటే వుంటుందని అతని సంతోషం. ఆరోజు దాగుడు మూతలు ఆడతారు. గచ్చకాయలాడతారు, క్రికెట్ ఆడతారు. ఒకటేమిటీ? అన్ని ఆటలూనూ, గోపీనీ ఒదలరు. ఆడి తీరవలసిందే. కళ్ళకు గంతకు కట్టుకుని దాగుడు మూతలాడుతున్నారు. శాంతి దొంగ.
    "రోజూ తేలిగ్గా పట్టేసేది. ఇవాళ ఇంకా పట్టుకోలేదేమిటబ్బా" అన్నాడు గోపి.
    "ఇవాళ నేను నిజంగా పూర్తిగా కళ్ళు మూసుకుని ఆడుతున్నాను. ఎప్పుడూ సగం కళ్ళు తెరిచే ఆడేదాన్నిగా" అంది.  

    "మామయ్యా! చూశావా, ఇన్నాళ్ళూ శాంతి సగం కళ్ళు తెరిచే ఆడేదిట" అన్నాడు గోపి మామయ్యకు ఫిర్యాదు చేస్తూ.
    "పోనీలేరా. నేను చేస్తున్న పనే అదీ చేసింది" అన్నారాయన నవ్వుతూ.
    "ఏమిటీ! మీరు అదే పని చేస్తున్నారా? మైగాడ్! చీటింగ్ చీటింగ్" గోపి గోలపెడుతున్నాడు.
    శాంతి పకపకా నవ్వుతూ పరుగెడుతుంది.
    "అవుట్" అని పట్టుకుని గంతలు తీసేసి "నువ్వా డాక్టర్ తాతయ్యా! ఎప్పుడొచ్చావ్" అంది.
    "ఇప్పుడే" అని ముద్దు ఇచ్చారాయన.
    "ఏం బావగారూ కులాసానా?" అంటూ పలకరించారు రావుగారు.
    "ఓ... అదిసరే గానీ, మీకేమో ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసింది మధూ. మీరేమో రన్నింగ్ రేస్ చేస్తున్నారు. ఏమిటిదంతా" అన్నారు డా. జయరాం నవ్వుతూ.
    వీరి సంభాషణ విన్న మాధవి బయటికొచ్చి "రాత్రంతా మూగులుతూ వున్నారు బాబాయ్. ఎందుకో తెలీదు. నిద్దట్లో ఒకటే మూలుగు. నేనూ, గోపీ, గౌరీ అందరం విన్నాం. అందుకనే ఫోన్ చేశాను" అంది.

 Previous Page Next Page