లోపల్నుంచి అస్పష్టంగా మాటలు వినబడుతున్నాయ్.
దీపకు ఆశ్చర్యం కలిగింది.
అంత రాత్రి సమయంలో ఆమె ఎవరితో మాట్లాడుతోంది?
శ్రీరంజని గొంతు వినిపించటం ఆగిపోయాక ఇప్పుడు ఓ మగ గొంతు వినిపించింది దీపకు.
ఆమెకు కుతూహలం కలిగింది.
ఎవరయి ఉంటారది?
అదీ ఇంత రాత్రిలో?
ఆమెలో అనుమానం ప్రారంభమయింది. ఒకవేళ శ్రీరంజని ఎవరితోనయినా ఎఫైర్ నడపటం లేదుకదా!
తన స్నేహితురాండ్రు ఆమెను చూడగానే చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయ్ దీపకి.
"మీ పిన్నిని చూస్తూంటే డౌట్ గా ఉందే! డ్రగ్స్ ఎడిక్ట్సు కూడా అలాగే డల్ గా ఉంటారు."
"అంతేకాదు ఆ స్టయిల్స్ చూస్తుంటే కొంచెం ఫాస్ట్ టైప్ అని కూడా అనిపిస్తోంది.
తను అప్పుడు వాళ్ళ మాటలు కొట్టిపారేసింది.
కానీ ఇప్పుడు.
ఆమె కిటికీ మీద ఎక్కి వెంటిలేటర్ లో నుంచి లోపలకు తొంగి చూసింది. అక్కడి దృశ్యం షాక్ కొట్టినట్లయిందామెకు.
నగ్నంగా ఓ వ్యక్తి కౌగిట్లో నలిగిపోతోంది శ్రీరంజని. ఆ దృశ్యం చూడలేకపోయిందామె.
చటుక్కున కిందకు దిగి నిలబడిపోయింది.
అప్పుడు వినిపించినాయ్ ఆ వ్యక్తి మాటలు నెమ్మదిగా, స్పష్టంగా.
"రేపే దీపను మర్డర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఉదయం ఆమెను నువ్వు బిర్లామందిర్ తీసుకెళ్ళు. నిరంజన్ కోసం ప్రార్థించడానికి వెళుతున్నామని చెప్పు. బయల్దేరేముందు నాకు ఫోన్ చెయ్. మీ కారు గుడికి చేరుకునేలోపల మా వాళ్ళ కారు ఓవర్ టేక్ చేస్తుంది. మీరు కారు దిగగానే కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో దారినపోయేవాళ్ళనేక మందితో పాటు దీపకు కూడా బులెట్ దెబ్బ తగుల్తుంది.
మిగతావారికి బులెట్స్ కాళ్ళల్లోనూ, చేతుల మీదా తగులుతాయి. దీపకు మాత్రం గుండెల్లో తగులుతుంది. ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. రెండు రౌడీ గ్రూప్ ల మధ్య జరిగిన యుద్ధంలో దారినపోయే అనేకమంది గాయపడినట్లు దీప మరణించినట్లు పోలీస్ స్టేట్ మెంట్ ఇప్పిస్తాను. దాంతో ఎవరికీ దీపను మనమే చంపించినట్లు అనుమానం రాదు. ఓకే?"
"ఓ.కే. డియర్"
దీపకు కాళ్ళూ చేతులూ వణకసాగినయ్.
తనను చంపేయడానికి ప్లాన్ వేస్తున్నారా? ఎందుకు? తనేం చేసిందని?
హఠాత్తుగా జ్ఞానోదయమయిందామెకి.
అవును! తనను చంపేస్తే మొత్తం ఆస్తికి శ్రీరంజనే వారసురాలవుతుంది.
అసలు తన తండ్రిని కూడా వాళ్ళే చంపేశారేమో!
కానీ డాక్టర్లు హార్ట్ పేషెంట్ అని ఎలా సర్టిఫికెట్ ఇచ్చారు?
తన తండ్రి హార్ట్ పేషెంట్ కాబట్టి ఇచ్చారా?
లేక నిజంగానే తండ్రికి రెండోసారి హార్ట్ ఎటాక్ వచ్చిందా?
ఒకవేళ హార్ట్ ఎటాక్ వచ్చేట్లు వాళ్ళు చేశారా?
దీపకు చెమటలు పట్టేసినయ్. తను వెంటనే ఈ ఇంటి నుంచి పారిపోకపోతే వాళ్ళు చంపేసేయటం ఖాయం. పరుగుతో మెట్లు దిగుతోంటే అడుగుల చప్పుడు పెద్దగా వినడుతోంది.
ఆ అడుగుల శబ్దం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది శ్రీరంజనికి, సిద్ధార్థకి.
"ఎవరయి ఉంటారు?" కలవరపాటుతో అడిగాడతను.
"ఏమో! పద చూద్దాం."
ఇద్దరూ ఒక్క ఉదుటున లేచారు.
ఆమె త్వరగా మాక్సీ తొడుక్కుని బయటకు నడిచింది.
అప్పటికే హాల్లోని మెయిన్ డోర్ తెరిచి వుంది.
ఇద్దరూ మెట్లు దిగి డోర్ దగ్గరకు చేరుకుంటూండగా స్కూటర్ స్టార్టయిన శబ్దం వినిపించింది.
పరుగుతో బయటికొచ్చేశారిద్దరూ.
అప్పుడే స్కూటర్ గేట్లో నుంచి వెళ్ళిపోతోంది.
సెక్యూరిటీ గార్డు దగ్గరకు పరుగెత్తారు వాళ్ళు.
"ఎవరు స్కూటర్ మీద వెళుతోంది?" అడిగింది శ్రీరంజని.
"దీపగారు మేడమ్"
"ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్ళింది?" అనుమానంగా అడిగిందామె.
"తెలీదు మేడమ్. గేటు తెరవమంటే తెరిచాను"
సిద్ధార్థ ఆమెను పక్కకు తీసుకెళ్ళాడు.
"ఈ రాత్రివేళ స్కూటర్ మీద వెళ్ళిందంటే ఇందాక మన మాటలు విందేమోనని నాకు అనుమానంగా వుంది.
ఆ మాట వినేసరికి శ్రీరంజని మొఖం వాలిపోయింది.
"అంటే మనం అనుకున్నది విని పారిపోయిందంటావా?"
"అనే అనిపిస్తోంది."
"ఒకవేళ అదే నిజమయితే మనం చాలా చిక్కుల్లో పడ్డట్లే కదూ!"
"అవును"
"ఇప్పుడేమిటి చేయటం?"
అతను కొద్దిక్షణాలు ఆలోచించాడు.
"ఆమెను ఎలాగయినా చంపేయాలి. నువ్విక్కడే వుండు." అంటూ అక్కడే పార్క్ చేసివున్న తన కారు దగ్గరకు పరుగెత్తాడు. నిద్రపోతున్న డ్రైవర్ని గట్టిగా తట్టి లేపాడు.
"త్వరగా పోనీ" అన్నాడు.
కారు శరవేగంతో రోడ్డుమీద కొచ్చింది.
చాలా దూరంగా స్కూటర్ ఎర్ర లైట్ కనబడుతోంది. ఖాళీగా వున్న బంజారాహిల్స్ రోడ్ మీద తోకచుక్కలా వేగంగా జారిపోతోంది.
కార్లో స్పీడో మీటర్ నీడిల్ నూట ఇరవై కిలోమీటర్లు చూపుతోంది.
స్కూటర్ పంజాగుట్ట మీదనుండి బేగంపేట వైపు వెళుతోంది. అప్పటికే కారు స్కూటర్ ని చేరుకుంది.
దీప వెనక్కు తిరిగి ఓసారి కారుని చూసింది.
ఆమె గుండె జల్లుమంది.
తప్పకుండా అది తనను చంపడానికే వస్తోందన్న అనుమానం కలిగింది.
ఓవర్ బ్రిడ్జి మీదకు వచ్చేసింది స్కూటర్.
ఆ వేగం ఆమెకే భయం గొలుపుతుంది.