Previous Page Next Page 
జయ - విజయ పేజి 25


    అచ్చం కలలో జరిగినట్లే ఉంది.
    "నన్ను చూశారు కదా. ఇంక వెళ్ళిపోతారా మరి?"
    "వెళ్తాను! మీరు ప్రామిస్ చేస్తే?"
    "ఏమిటది?"
    "సాయంత్రం నాతో కొంత టైమ్ గడుపుతానని_"
    జయ నవ్వింది.
    తనూ అతని సాన్నిధ్యాన్నే కోరుకుంటోంది.
    సరే_"
    అతను ఆమె చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు.
    "థాంక్యూ. సాయంత్రం మీ ఆఫీస్ కొస్తాను."
    సాయంత్రం వరకూ అతని గురించిన ఆలోచనల్తో గడిపిందామె.
    తను చేస్తున్నది సరైన పనో, కాదో తెలీటం లేదు.
    దీనివల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో అర్థంకావటం లేదు.
    సాయంత్రం ఆఫీస్ నుంచి తడబడుతున్న అడుగుల్తో బయటకు నడిచిందామె.
    చంద్రకాంత్ ఆమె కోసం ఎదురుచూస్తున్నాడప్పటికే.
    "ఇవాళ మన కోసం ఎంత మంచి ప్రోగ్రామ్ సెలక్ట్ చేశానో తెలుసా?" అనడిగాడతను ఆనందంగా.
    "ఏమిటది?"
    "గజల్స్ ప్రోగ్రామ్_రవీంద్రభారతిలో."
    జయ థ్రిల్ అయింది.
    తనకు సాహిత్యం అంటే ఆసక్తి లేదుగానీ సంగీతం అంటే చాలా యిష్టం.
    "థాంక్యూ వెరీమచ్! గజల్స్ ప్రోగ్రాం నేనెప్పుడూ చూడలేదు. ఎప్పటినుంచో మనసులో దాచుకున్న కోరిక ఇవాళ నెరవేరుతోంది."
    ఇద్దరూ రెస్టారెంట్ కెళ్ళారు.
    చాలాసేపు మాట్లాడుకుంటూ గడిపారక్కడ.
    అతనితో మాట్లాడుతున్నకొద్దీ అతనిమీద ఆకర్షణ పెరిగిపోతున్నట్లనిపిస్తోంది.
    గజల్స్ ప్రోగ్రామ్ అతని ప్రక్కన కూర్చుని చూస్తుంటే సరికొత్త అనుభూతి ఆవహించిందామెని.
    రాత్రి పదకొండయిపోయింది ప్రోగ్రాం ముగిసేసరికి.
    అప్పుడుగానీ స్పృహలోకి రాలేదామె. రాత్రి పదకొండు గంటలకే హాస్టల్ లాక్ చేసేస్తారు.
    మళ్ళీ తెరవాలంటే వార్డెన్ ని నిద్రలేపాలి.
    "ఏమిటాలోచిస్తున్నారు?" అడిగాడతను.
    "హాస్టల్ కి ఈ టైమ్ లో వెళ్తే ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నారు"
    "పోనీ రాత్రికి మా ఇంట్లో ఉండండి! ఉదయం వెళ్ళవచ్చు.
    "మీ ఇంట్లోనా?"
    "అవును. ఏం?"
    "మీవాళ్ళు..."
    "మావాళ్ళిక్కడ లేరు కదా! నేను ఒక్కడినే ఉంటున్నాను. మీకేం అభ్యంతరం లేకపోతే రండి. రాత్రంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడపొచ్చు. ఎవరయినా ఏమైనా అనుకుంటారన్న భయం కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఎలాగో మనం పెళ్ళి చేసుకోబోతున్నాం."
    అతనితోపాటు అతనింటికి చేరుకుందామె.
    సింగిల్ బెడ్ రూము ప్లాట్ అది.
    పక్కపక్కనే మంచాల మీద పడుకుని మాట్లాడుతూనే వున్నారు చాలాసేపు.
    ఆ తర్వాత ఎప్పుడెలా జరిగిందో సరిగ్గా గుర్తులేదు. ఉధృతమైన ప్రణయం తర్వాత నిశ్శబ్దంగా స్పృహలోకొచ్చారిద్దరూ.
    చాలాసేపు నిశ్శబ్దంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు.
    ఎందుకో మొదటిసారి తనూ, కిషోర్ అనుభవించిన క్షణాలు గుర్తుకొచ్చాయి.
    తను ఈ విషయాన్ని ఎంత కాజువల్ గా తీసుకుంటుందో అన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మనసు హెచ్చరిస్తూనే వుంది.
    అయినా ఆ మత్తులో ఏమీ తెలీటం లేదు.
    అప్పటికే అతను మరోసారి ఆక్రమించుకుంటున్నాడు తన శరీరాన్ని.
    "చంద్రకాంత్"
    "ఊ!"
    "నీకో విషయం చెప్పాలి."
    "ఇప్పుడు మాట్లాడే టైము కాదు" అంటూ ఆమె పెదాలను తన పెదాలతో అందుకున్నాడతను.
    వరుసగా నాలుగు రాత్రిళ్ళు అతని ప్లాట్ లో గడచిపోయినాయి.
    అప్పుడు కలిగింది అనుమానం. తను గర్భావతేమోనని.

 Previous Page Next Page