"మీ మనవరాలా అమాయకురాలు? మిమ్మల్ని, నన్ను బజార్లో పెట్టి అమ్మేస్తుంది!" అని వేళాకోళంగా అన్నాడు సుధాకర్. ఉష కోపంగా చూసింది.
అందరి దగ్గిర కన్నీళ్ళతో సెలవుతీసుకుని కారెక్కింది ఉష. రామం, శ్రీనివాసు స్టేషన్వరకు వెళ్ళి సాగనంపి వచ్చారు.
ఉష వెళ్ళిపోగానే యింట్లో సందడి అంతా ఒక్కసరిగా తగ్గి పోయింది. ఇల్లంతా బావురుమన్నట్టుంది అందరికి. రామం పిచ్చిపట్టి నట్టు యిల్లంతా కలయదిరిగి ఓ కుర్చీలో వాలిపోయాడు నీరసంగా, అన్నాళ్ళ శ్రమ పదింతలై అతన్ని కుంగదీసినట్లు.మాటిమాటికి కన్నీళ్ళు తుడుచుకుంటున్న కొడుకుని చూసి జగన్నాథంగారు మృదువుగా మందలించారు.
"తప్పురా! పెళ్లింట్లో అస్తమానం అలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు! ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటికీ వెళ్ళవలసిందే గదా! .....లే.......లే.....ఆ సామాన్లు, ఆ కుర్చీలు, జంబుఖానాలు అవీ ఎవరికీ పంపవలసినవి వాళ్ళకి పంపు, మనుషులు చేతిలో ఉండగానే...."
"అలాగే ఉంటుంది నాయనా. కడుపుతీపి. కాని ఆడపిల్ల అనగానే ఏనాటికైనా ఓ అయ్య చేతిలో పెట్టవలసిందేగదా!......అలవాటయేవరకు అలాగే ఉంటుందిలే ఓ నాలుగురోజులు!....."పార్వతమ్మ కొడుకుని అనునయిస్తూ అంది.
"ఉష లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉండనమ్మా!.....ఉదయం లేచిందగ్గిరనుంచీ 'నాన్నగారూ!' అంటూ వెనక వెనక తిరిగేది. పెద్దయిందగ్గిరనుంచీ నా పనులన్నీ అదే చేసేది....శీను కాలేజీకి వెడతాడు; ఇంత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఎలా వుండడం?"
"బాగుందిరా! అలాగే అనిపిస్తుంది మొదట్లో. తరవాత అదే అలవాటవుతుంది. నువ్వే కన్నావా పిల్లలని! అందరికీ ఉండే బాధే యిది!"
రామం నెమ్మదిగా లేచి, యింట్లో మిగిలిన పనులు చూడడానికి వెళ్ళాడు.
8
పెళ్ళి యిల్లు మళ్ళీ మామూలు యిల్లు అయిపోయింది. ఎవరి మట్టుకు వారు వెళ్ళారు. ఆ మధ్యాహ్నం భోజనంచేసి పడుకున్న తండ్రిదగ్గిరికివచ్చి, గోడకి చేరగిలబడి, ఆయాసపడుతూ కూర్చుంది శకుంతల.
"నాన్నగారూ! మీరు ఒకసారి అనూరాధని కాస్త పిలిచి చివాట్లు పెట్టండి. దానికి బొత్తిగా నామాట లక్ష్యంలేకుండా ఉంది. ఆయనసంగతి అలా ఉంది. ఇది ఇలా కాల్చుకు తింటూంది యింట్లో! నా ప్రాణాలు పోతున్నాయి. యీ సంసారం యీదలేక" పమిటతో ముఖం తుడుచుకుంటూ అంది శకుంతల, ఆవేదనగా.
"ఏం, ఏమయింది?" పక్కమీద లేచికూర్చుంటూ ఆశ్చర్యంగా అడిగారు జగన్నాథంగారు.
"ఏముంది, పెళ్ళిసంగతే!"
"ఏం ఇదికూడా ఎవర్నేనా ప్రేమించానంటూందా?" అని అడిగి, "ఏం ప్రేమలో. యీకాలం పిల్లలు యిలా తయారవుతున్నారేమిటి చెప్మా!" అనుకున్నాడు.
"అలా ఎవడినన్నా చేసుకుంటానన్నా నయమే కాస్త! అది అసలు పెళ్ళే చేసుకోదంట!"
"మరేం చేస్తుందంట?"
"ఉద్యోగంచేసి ఊళ్ళేలుతుందట!" విసుగ్గా అంది శకుంతల. "ఆయనకి ఆడపిల్లని యింతవరకు చదివించడం యిష్టంలేదు. మెట్రిక్ కాగానే చాలన్నారు ఆయన. చదువుకోవాలన్న నా కోరిక ఎలాగూ తీరలేదు. పోనీ నా కూతురునయినా చదివించి ముచ్చట తీర్చుకోవాలని ఆయన్ని బ్రతిమాలి ఎలాగో దాన్ని కాలేజీలో చేర్పించాను. నా కోరిక చెల్లిద్దామని కాకపోయినా యీ కాలంలో ఆడపిల్లలకి డిగ్రీలు లేకపోతే పెళ్ళికాదన్న భయంచేతనూ, అది చదువుతానని ఏడ్చి గోలచెయ్యడంవల్లనూ ఆయన ఒప్పుకున్నారు. బియ్యేకాగానే పెళ్ళి చేద్దామనుకుని ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదు. ఇంట్లో ఉత్తినే కూర్చుంటే తోచటం లేదని గోలచేసి మళ్ళీ కాలేజీలో చేరి ఎమ్మే చదివింది. అదయాక యిప్పుడు ఉద్యోగం చేస్తానంటూ ఆరంభించింది. ఆమధ్య ఏదో సంబంధం చూస్తేనే పెళ్ళి చేసుకోను, ఉద్యోగం చేస్తా'నంది. అప్పుడు ఆయన కోపం చూడాలి. అన్నింటికి నేనొకర్తిని దొరికానుగా! నన్ను చెడామడా తిట్టారు. 'నీవల్లనే అది అలా తయారయింది. వద్దంటే దాన్నంతవరకు చదివించాలన్నావు. ఆ చదువునుంచే అది అలా వేషాలు వేస్తూంది. ఈ వెర్రిమొర్రి వేషాలు నా దగ్గిర పనికిరావు. దానికి ఎలా నచ్చచెపుతావో చెప్పి ఒప్పించు!' అని నామీద ఎగిరారు."
"బాగానే ఉంది! తనే నచ్చచెప్పుకోలేకపోయాడా కూతురికి!"
"అలా ఎందుకు చెపుతారు? అన్నింటికి తిట్లుతినడానికి నే నున్నానుగా! నేనేం చేస్తాను? దాన్ని కూర్చోపెట్టుకుని చిలక్కి చెప్పినట్లు చెప్పాను. బ్రతిమాలాను. కోప్పడ్డాను. ఎన్ని చెప్పినా దని పంతం దానిదే! ఆయన కోపం ఆయనదే! ఇద్దరిమధ్య నేను నలుగు చస్తున్నాను. నా గొడవలన్నింటికి తోడు యిదో కొత్తగొడవ వచ్చి పడింది. ఇంట్లో మనశ్శాంతి లేకుండావుంది ఏ విషయంలోనూ!" దైన్యంగా అంది శకుంతల.
"చేసుకోలేకపోవడానికి కారణం ఏమన్నా చెప్పిందా?"
"పెళ్ళిచేసుకుని ఏం సుఖపడాలి? నువ్వేం సుఖపడుతున్నావు? అని అడిగింది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఏబాదరబందీలేకుండా జీవిస్తుందిట!"
"ఈ పిల్లలు ఇలా తయారవుతున్నా రేమిటి?"
"మొన్న వాళ్ళ నాన్నే పిలిచి గట్టిగా చివాట్లు పెట్టారు, నే చెపితే వినలేదని తెలిశాక. ఇది ఎదురుతిరిగి జవాబిచ్చింది. దాంతో ఆయన ఉగ్రులై, దాన్ని కొట్టినంత పనిచేశారు. మధ్యలో నే నడ్డు పడకపోతే అంతపనీ చేసి ఉండేవారు. ఆయన కోపం తెలియందేముంది! ఇది ఏడుస్తూ రెండురోజులు పస్తులు పడుకుంది. డిగ్రీ ఉంది. ఉద్యోగం చేసుకు బ్రతుకుతాను అంటూ యింట్లోంచి లేచిపోవడానికి తయారయింది. దానిని ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డాను ఆరోజు!....."