Previous Page Next Page 
నయనతార పేజి 25

   
                                            సత్యాగ్రహం
    
    "ప్రియా! పెసరట్లేస్తున్నావా? బాగా ఉల్లి, మిర్చి, అల్లం తగిలించి డబుల్ రోస్టు చెయ్యి!" ఎనిమిది గంటలకి సావకాశంగా లేచి పళ్ళు తోమి వంటింట్లో ప్రవేశించి అన్నాడు కృష్ణమూర్తి.
    "అదిగో అలా పిలవద్డన్నానా?" పెసరట్లు వేస్తున్న ప్రియంవద కోపం నటించింది.
    "ఏం పిలిస్తే ? నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చినట్లు పిలుచుకుంటాను! మధ్య నీకేం వచ్చింది?"
    "ఆ పెళ్ళాన్ని నేనే గాబట్టి నాకే వచ్చింది! ప్రియా! యేమిటి? నాటకాల్లో బుంగమీసాలు, గంపగిరజాల వాళ్ళూ పిలిచినట్టు! పిలిస్తే సరిగా పిలవండి పూర్తీ పేరు పెట్టి. లేకపోతే అసలు వద్దు! ... అదలా వుంచి , హోటల్లో సర్వర్ కి ఆర్డరు ఇచ్చినట్టు ఏమిటా చెప్పడం?"
    'అలవాటయిపోయింది! అయిదేళ్ళ సాంగత్య దోషం యివాళ ఓ పెళ్ళాం వచ్చిందని ఒక్కసారిగా వదిలి పొమ్మంటే పోతుందా?"
    'చాల్లెండి! మీతో మాట్లాడుతూ కూర్చుంటే పని అయినట్లే! వెళ్ళండిక్కడ్నించి!" నవ్వి నుదుట పడ్డ చిరువెంట్రుకలు మోచేత్తో తోసుకుంటూ కాఫీ కప్పు అందించింది ప్రియంవద.
    "ఆ!..... ఆ! ..... అలా వుండనీ! ....అలాగే బాగుంటావు!" కొంప మునిగినట్లు గాబరాగా వారించాడు కృష్ణమూర్తి.
    "అబ్బ! ..... హడలిపోయాను ఏమిటో అనుకుని! ఇంతా చేసి కధల్లో రసికత్వమా! .... సంతోషించాం గాని ఇదిగో , మీకు పెసరట్లు కావాలంటే బుద్దిగా డైనింగ్ టేబిల్ ముందు కూర్చోండి ఇలా వచ్చి మాటల్తో నా పని చెడగొడితే నావల్ల గాదు చెయ్యడం. వెళ్ళండి ఇక్కడనుంచి!"
    "అబ్బే! అదేం కుదరదు. పెసరట్లు అలా పెనం మీంచి ఇలా ప్లేటులో పడ్తుంటే ఎన్ని వేసిందీ నీకు తెలియకుండా, నేనెన్ని తిన్నదీ నాకు తెలియకుండా తింటుంటే అందులోనే వుంది అందం .... అనందం. టేబిల్ దగ్గిర కూర్చుని ఎవడో వూర్లో వాడిలాగ లెక్కపెట్టి మర్యాదకి మొహమాట పడ్తూ తినే ఖర్మ నాకేం పట్టింది ? .... ఊ..... రానీ వరస !" ఓ మోడా లాక్కుని కూర్చుంటూ ప్లేటులో అల్లం పచ్చడి వేసుకున్నాడు కృష్ణ మూర్తి.
    "ఉత్త తిండిపోతు!' కొంటెగా నవ్వింది ప్రియంవద.
    "అపచారం! లెంపలేసుకో! కళ్ళు పోతాయి. మొగుణ్ణి పట్టుకుని అలాంటి మాటలన్నావంటే! పతివ్రతా లక్షణాలు అసలు లేవు సరిగదా. మొగాడు, మొగుడు అన్న గౌరవం, భక్తీ కంచుకాగడా వేసి వెతికినా కనపడకుండా పోయింది! అబలలు, అసహయలు, అని కాస్త అలుసిస్తే నెత్తెక్కి తొక్కే రకం మీ అడజాతి! అందుకే బుద్దిమంతులు మన తాత ముత్తాతలు ఆడది వుండాల్సిన చోటు ఇదీ అని ఓ గిరిగీసి అందులో కూర్చోపెట్టారు! ఏదో పోనీ , సమానత్వామో, సమానహక్కులో అంటూ వూరికే ఇదవుతున్నారు గదా అని జాలిపడితే, మొగుడ్ని పట్టుకుని ఎంత మాటపడితే అంత అనేవరకు వచ్చింది......"
    "ఆపండింక ఉపన్యాసం! ఇదో పెద్ద ఫేషన్ అయి పోయింది ఈ మగాళ్ళకి ఈ మధ్య! సమానత్వం ఇస్తున్నాం, సమాన హక్కులు ఇచ్చాం, ఉద్దరిస్తున్నాం, ఊరేగిస్తున్నాం! ...... అని భుజాలు చరచుకోవడం! మీరేం మమ్మల్ని ఉద్దరించక్కరలేదు, ఊరేగించనూ వద్దు. మా దారిన మమ్మల్ని పోనిస్తే చాలు! కాబట్టి మహాశయా! పెద్ద స్త్రీ జనోద్దారకులలాగ పెద్ద ఫోజులు పెట్టకండి! ........  అన్నట్టు, హక్కులూ, గిక్కులు అంటే జ్ఞాపకం వచ్చింది సాయంత్రం మా "నారీ సంఘసదన్" లో అత్యవసర సమావేశం వుంది. నే వెళ్ళాలి! .... వచ్చేసరికి లేటవచ్చు. తమరు డూప్లికేట్ తాళం వుంచుకోడం మంచిది!"
    "ఏమిటో ఆ అత్యవసర సమావేశం! బీహారు కరువు వెనకట్టిందే! వరదలు కూడా లేవే?! ....... అటు పాకిస్తాన్ వాడు, ఇటు చీనావాడు కూడా బుద్దిగానే వున్నారు. మొరార్జీ దేశాయి మిగిలిన బంగారం కూడా ఒలిచి ఇచ్చేయ,మనలేదు! ఇంకేందుకో యీ అత్యవసర సమావేశం" కృష్ణ మూర్తి సావకాశంగా పెసరట్లు సేవిస్తూ విట్లు వేయసాగాడు.
    "మీకంతా వేళాకోళంగా వుందన్నమాట మా 'నారీ సంఘం' అంటే! ఈ మధ్య బీహారు క్షామనిధికి మేము పాతికవేలు పోగుచేసి పంపలేదా? ఆ మధ్య రక్షణ నిధికి యింటింటా తిరిగి ఎంత వసూలు చేశాం! ఆ మధ్య బంగారం కావాలంటే...!"
    "ఆ......చాలు ఈ .....మధ్యలు, ఆ మధ్యలు! మధ్య మధ్య ఈ పెసరట్ల ప్రియుడిని గుర్తుంచుకోమని మనవి!...... యింతకీ తమరు సాయంత్రం తమ మండలికి వేం చేస్తారన్న మాట. అయితే మేము రోజూ కంటే మరో రెండు గంటలు క్లబ్బులో వుండడానికి అనుమతి అయాచితంగా లాభించిందన్నమాట!"
    "ఆహా! పెద్ద భార్యా విధేయుడిలాగ ఇదో వేషం! ఎవరన్నా వింటే మిమ్మల్ని కొంగుకి ముడి వేసుకున్నా ననుకోడానికి! అది సరేగాని పేకాటలో యధాప్రకారం చేతులు కాల్చుకుని పెళ్లామనే ఓ అభాగిని రిక్షాలు, టాక్సీలు లాంటి పదార్దాలేవి దొరకని చోట యింటికి చేరే విధానమేదని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తుంటుందన్న సంగతి మర్చిపోక కాస్త అలా వచ్చి నన్ను పికప్ చేయండి.... అవును, ఇంక లేచేదేమన్నా వుందా లేదా? అలా ఒకటి తరువాత యింకోటి లాగించేస్తున్నారు. అరయ్యాయి ఇప్పటికి!" నవ్వుతూ గుర్తు చేసింది ప్రియంవద.
    "ఏదో అన్నపూర్ణ అంటారు చూడు. అలాంటి చేతితో నువ్వు నలుడు, భీముడు ఇంకా వాళ్ళ అన్నయ్యలు అంతా జాయింటుగా అసూయపడేట్టున్న యీ నేతి పెసరట్లు వేస్తుంటే ......"
    "ఇంక అబ్బాయిగారు పొగిడి సాధించేదేం లేదు! లేవాల్సిందే యివాళకి!"
    కృష్ణమూర్తి బలవంతంగా లేచాడు.


                                     *    *    *

    ఆ రోజు సాయంత్రం ఆరుగంటల కల్లా 'నారీ సంఘసదన్ ' అంతా రకరకాల చీరలతో , రకరకాల సైజు మనుష్యులతో కలకల్లాడుతుంది. అందరూ యెవరి మట్టుకు వారే ఆ నారీ సంఘం బరువు, భాద్యత అంతా తమ భుజాలపై వున్నట్టు మహా బిజీగా దేనికోసమో కంగారు కంగారుగా తిరిగేస్తున్నారు.
    అసలు యీ అర్ధాంతాపు సమావేశం యెందుకో అసలు కొంతమంది ముఖ్యులకి తప్ప తెలియనే తెలియదు. ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు వెలిబుచ్చుకుంటూ కార్యదర్శిని, అద్యక్షురాల రాకకోసం ఆత్రుతగా యెదురు చూడసాగారు.
    కాసేపటికి వాళ్ళు రావటం అయింది. పరామర్శలు, కుశల ప్రశ్నలు, మాములు సంబోధనలు అన్నీ అయ్యాక సెక్రటరీ శారదాదేవి , అద్యక్షురాలు రాణి విమలాదేవి ఇద్దరూ తమ ఆసనాల్లో అధిష్టించారు. అందరూ ఎవరికి అందిన ఆసనాల్లో వారు కూర్చున్నాక, సావకాశంగా లేచి గొంతు సవరించుకుని ఆరంభించింది సెక్రటరీ శారదా దేవి.

 Previous Page Next Page