Previous Page Next Page 
రక్తచందనం పేజి 25


    చివరిగా మరొక్క విషయం_ ఇకపి అతనికి సహకరించేవారిని గానీ, అతని డబ్బుకు లొంగిపోయేవారినిగానీ నేను క్షమించను. దారుణంగా శిక్షిస్తాను....గుర్తుంచుకోండి" అన్నాడు రంజిత్ శాసిస్తున్న ధోరణిలో.
    "ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సైడ్....? ఎనీ కామెంట్....?" శర్మ ప్రశ్నించాడీసారి.
    అంతా నిశ్శబ్దంగా వుంది.
    పరిస్థితి గంభీరంగా వుంది.
    అప్పుడు వినిపించిందో కంఠం ఒకింత హస్కీగా_ "వీరూ పిట్ట కాదు కాల్చిపడేయటానికి_ పిడుగు! పిడుగు మనమీదపడే ప్రమాదమే వుంటుంది తప్ప_ పిడుగుమీద మనం పడే అవకాశం లేదు. మృత్యువుతో పోరాడవలసి వున్నవాడు తన ప్రాణాల గురించి ఆరాటపడతాడే తప్ప అనుమానాల గురించి ఆలోచించడు"
    చటుక్కున అలా అన్నదెవరని రంజిత్, శర్మ పరిశీలనగా చూశారు.
    అందరూ నోర్లు మూసుకొని మౌనంగా చూస్తూ కనిపించారు. దాదాపు నాలుగొందలమంది అక్కడున్నారు. ఎవరూ కదలలేదు _ మెదలలేదు. శిలావిగ్రహాల్లా చూస్తున్నారు. ఎవరినని అనుమానించాలి....?
    లైట్స్ వెలిగాయి.
    అందరూ ఒక్కక్షణం రిలాక్సయ్యారు.
    "అఫ్ కోర్స్.... కానీ అది ఇదివరకు, ఇప్పటినుంచి కాదు....శత్రువును, నేరస్థుడ్ని పెంచి చూపే పిరికి మాటలు మాట్లాడకండి. ఏ క్షణంలోనయినా ఆపరేషన్ ఆరంభించటానికి సిద్ధంగా వుండండి. ఎవరు ఎటువేపు వెళ్ళాలో....ఎప్పుడు వెళ్ళాలో.... ఎలా వెళ్ళాలో ఆఖరిక్షణంలో మీకు తెలియజేయబడుతుంది.... లెటజ్ డిస్ పర్స్" అన్నాడు రంజిత్ ఒకింత కఠినంగా.
    శత్రు జాడలో....మృత్యు హేల....
    చిరుతపులి ఎరీనాపై వృత్తిధర్మ మీమాంస.
    ఇరువర్గాల సరిహద్దురేఖపై మరణమృదంగ ధ్వని.
    ఎకోలో వినిపించాబోయే ఉద్విగ్నక్షణాలు....
    నివురుగప్పిన నిప్పు ఏ క్షణంలోనయినా ప్రజ్వరిల్లవచ్చు. అందరూ భారంగా కదిలారు. ఆ టౌన్ ప్రజల గుండెల్లో రాయిపడింది.


                             *    *    *    *


    మలై మహదేశ్వరా హిల్స్ ఓ టీపాక ముందు_ అది కట్టేశాక, జనసంచారం సద్దుమణిగాక_ వీధులన్నీ నిర్మానుష్యమయ్యాక_ ఒక వ్యక్తి వడివడిగా వచ్చి ఆగాడు.
    పరిసరాల్ని ఒకసారి గమనించాడు. ఆ వెంటనే పాక వెనక్కి వెళ్ళాడు.
    అక్కడొక వృద్దురాలు కిరోసిన్ దీపం ముందు చిల్లర లెక్కపెట్టుకుంటోంది. అరవై పైనే వయస్సుంటుందామెకు.
    "కెంపమ్మ...." అన్నాడా వ్యక్తి నెమ్మదిగా.
    ఆమె తలెత్తి చూసింది_ఆపైన ఆమె కళ్ళు మెరిశాయి.
    "చిరుతపులికో సందేశం" గుసగుసలాడుతున్నట్లుగా అన్నాడు.
    "చెప్పు సామి" అందామె పరిసరాల్ని అప్రమత్తంగా గమనిస్తూ.
    "ఎస్.పి. రంజిత్_డి.సి.ఎఫ్.శర్మ స్పెషల్ డ్యూటీమీద వచ్చారు. మందీ, మార్బలం, కాల్బలం దిగిపోయింది. జాగ్రత్తని చెప్పు...." అన్నాడు.
    "వార్త నాదాకా వచ్చింది. వివరాల కోసమే ఆగాను. ఈ రాత్రికే తెలియజేస్తాను. నువ్వు జాగ్రత్త మీ డిపార్ట్ మెంట్ ఎత్తుగడల గురించి వెంట వెంటనే తెలియజేస్తుండు....ఇక వెళ్ళిరా...." అని బొడ్లో వున్న ఒక చిన్న మూటని తీసి అతనికిచ్చింది.
    అతను ఆ మూటని విప్పి అందులో వున్న డబ్బుని లెక్కపెట్టుకుంటుండగానే ఆ వృద్ధురాలు వడివడిగా నడుస్తూ చీకట్లో కలిసిపోయింది రాజుల కాలంనాటి వేగులా.
    చూడటానికి వృద్దురాలిలా, కాటికి కాళ్ళారజాపుకొని కూచున్నట్లుగా, నిస్సత్తువుగా కనిపించే ఆ కెంపమ్మ పగలు వేరుసెనక్కాయలు అమ్ముకుంటుంది, అదీ పోలీసు స్టేషన్, పోలీస్ క్వార్టర్స్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో.
    ఒక్కసారి బుట్టని పక్కన పెట్టి, చీకటిలో కలిసిందో....పాతికేళ్ళ యువకుడితోపాటు సమానంగా నడవగలదు. కన్నడం, తమిళం, తెలుగు మాట్లాడటం వచ్చినా కన్నడం తప్ప మరేమీ రానట్లుగా కనిపిస్తుంది.
    అప్పుడే పోలీస్ ఠాణాలో ఉండే గంట పదిసార్లు కొట్టింది. ఎమ్.ఎమ్.హిల్స్ ప్రజలు గాఢ నిద్రలోకి జారుకున్నారు.


                             *    *    *    *


    "అతని గురించి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎలా రియాక్ట్ అవుతారు?"
    రంజిత్ తన గెస్ట్ హౌస్ లో కూర్చుని ఎదురుగా చేతులు కట్టుకొని నించున్న ఒక సీనియర్ కానిస్టేబుల్ ని అడిగాడు. పక్కనే శర్మ కూడా ఉన్నాడు.
    ఆ కానిస్టేబుల్ ఒణికిపోతున్నాడే తప్ప నోరు విప్పటంలేదు. అడవితోపాటు ఊరు నిషి నిశ్శబ్దంలో కలిసిపోయింది. ఆ ప్రాంతంపై కప్పుకున్న చిక్కటి చీకటి దుప్పటిని ఛేదించే ప్రయత్నంలో వీధి లైట్లు నిస్సహాయంగా ఉన్నాయి.
    ఉండుండి ఓ కుక్క హృదయవిదారకంగా అరుస్తోంది.
    ఆ గెస్ట్ హౌస్ కి వంద గజాల దూరంనుంచే దట్టమయిన అడవి ప్రారంభమవుతుంది. అదెక్కడ అంతమవుతుందో.... ఎక్కడ తెరిపిస్తుందో తెలీదు....చుట్టూ అడవి....అడవి అంతర్భాగంలో ఆ ఊరు.
    రాత్రి ఏడు అయితే ఆ గ్రామానికి బయట ప్రదేశాల నుంచి వచ్చేందుకుగానీ ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నంగానీ ఎవరూ చేయరు.
    సాయంత్రమవుతూనే మృత్యువు ఆ ఊరికి గిరి గీస్తుంది. గిరి కావల మృత్యువు_గిరి లోపల బ్రతుకు.... "నువ్వీనెలలో రిటైరైపోతున్నావు_ ఇకపై నీవు నీ కొడుకులతో బెంగుళూరులో ఉంటావు _ ఇంకా భయపడటంలో అర్థంలేదు. కమాన్ టెల్ మీ.... నీకు అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చేస్తాను. నిన్ను క్షేమంగా బెంగుళూరు పంపిస్తాను. చెప్పు....రిటైరయ్యాక కూడా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను_ చెప్పు_ నా పరిశోధన సహకరించు" రంజిత్ తన స్వభావానికి విరుద్ధంగా, సౌమ్యంగా అడుగుతున్నాడు.
    "నన్ను రేపు రిలీవ్ చేస్తే...." అతను నసిగాడు.
    "ష్యూర్....ష్యూర్....ఈ నెలంతా నువ్వు డ్యూటీలోనే ఉన్నట్లు లెక్క_కానీ రేపే వెళ్ళిపోతావు" హామీ ఇచ్చాడు రంజిత్.
    "చెబుతాను సార్....అతనంటే భయం_అతన్ని చూస్తే యముడ్ని చూసినట్లు భ్రమపడతారు_అతని పేరు వింటే కలత చెందుతారు. అలా అతనెవరి జోలికి రాడు. ఎవ్వరికి కనిపించడు. కనిపించినట్లు అనిపిస్తాడు. అతని గురించి వినిపిస్తాడు _ చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలకు సహాయం చేస్తాడు. ఆపదలకు, అవసరాలకు, శుభకార్యాలకు డబ్బందిస్తాడు.
    అవసరమయినప్పుడు శారీరక శ్రమ రూపంలో ఈ గ్రామాల ప్రజల సహాయాన్ని పొందుతాడు. వారూహించనంత కూలిస్తాడు.
    అందుకే సార్ అతనంటే భయం_భక్తి_కృతజ్ఞతా ఉన్నాయి.
    వారికేదన్నా తెలిసినా చెప్పరు_
    వాళ్ళు మనల్ని చూసి భయపడరు_
    అతన్ని చూసే భయపడతారు.
    అతని గురించి మన డిపార్ట్ మెంట్ కెవరన్నా ఇన్ ఫర్మేషన్ ఇచ్చినట్లు తెలిస్తే అతనిక మరి బ్రతకడు. అతన్ని వీరూ అనుచరులు వెంటాడి, వేటాడి చంపేస్తారు. ఆ వైనాన్ని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు తెలిసేలా చేస్తారు. అది తెలిసి కూడా చూస్తూ చూస్తూ ఎవరు సార్ ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు....?" రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడతను.

 Previous Page Next Page