"ఊఁ...."
"రమ్మంటున్నాయి" ఆమె చెవుల్లో చెప్పి ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు మదన్.
"అబ్బా....మళ్ళీనా" గారంగా అడిగింది.
"ఊఁహుఁ....మళ్ళీకాదు!"
"మరి?"
"మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ...."
ఆమెను అమాంతం ఆక్రమించుకున్నాడు మదన్. అతని కౌగిలిలో కరిగిపోయింది శృతి.
* * * *
సరిగ్గా ఒంటిగంట సూచిస్తోంది గడియారం.
సిద్ధార్థ విసుగ్గా వాచీ చూసుకున్నాడు. ఒకటయ్యింది టైం. అప్పటికి అరగంట అయ్యింది ట్రాఫిక్ ఆగిపోయి, ఇరవయ్ నిమిషాలు చీకట్లో వెదికి విసిగిపోయాడు సిద్ధార్థ అంకిత కోసం. ట్రాఫిక్ కదలడం ప్రారంభము కావడంతో సిద్ధార్థ కారు వెనకాల కారు అదేపనిగా హారన్ మ్రోగించసాగింది.
ఇక లాభంలేదని కారుని ప్రక్కకి తీసుకొని ఆపుదామని వెనకొచ్చి కారు డోరు తీసి క్షణం అవాక్కయ్యాడు సిద్ధార్థ. ఏమీ ఎరగనట్టు నిద్రపోతోంది అంకిత సీట్లో.
కారు స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు.
ట్రాఫిక్ దాటి హైవే ఎక్కింది కారు.
అంకితను పదే పదే చూడసాగాడు సిద్ధార్థ.
ఆమెను చూసేకొద్దీ ఆమెను ఒకసారి ముద్దు పెట్టుకోవాలనే కోరిక తీవ్రంగా కలగసాగింది. నిద్రపోతోందిగా.... సున్నితంగా ముద్దు పెట్టుకుంటే ఏం తెలుస్తుందిలే అనే ఆలోచనని బలవంతంగా వెనక్కి నెట్టడానికి ప్రయత్నించాడు. లాభం లేకపోయింది.
క్షణాలు గడిచేకొద్దీ అతని మనసు ససేమిరా మొండికేయసాగింది.
జాగ్రత్తగా అంకితను చూసి నిద్రపోతోందని నమ్మకం కుదిరాక కారుని కాస్త పక్కకి ఆపాడు. నెమ్మదిగా అంకిత మొహం దగ్గిరకి తన మొహం చేర్చసాగాడు.
అడుగు....పదంగుళాలు.... ఆరంగుళాలు.... రెండంగుళాలే.... తృప్తిగా నిట్టూర్చి ధైర్యం కూడగట్టుకొని అంకిత పెదాల్ని తన పెదాల్తో తాకబోయాడు.
కళ్ళు తెరిచింది అంకిత.
"ఏం కామ్రేడ్! కారాపారేం? బయల్దేరిన దగ్గర్నుంచీ, నిద్రపోయేదాకా మీ బుర్ర తినేశానని ఎక్కడో దార్లో నన్ను కార్లోంచి తోసేసి వెళ్ళిపోదామనా?"
"అబ్బే లేదే....అదీ....నేనూ....సిగరెట్....నాకూ.... చెమట.... అదే గాలీ....సిగరెట్టూ గాలీ కాలుద్దామనీ...."
"అదేవిఁటండీ బాబూ.... నేనేమన్నా రాక్షసినా అలా భయపడిపోతున్నారు?"
"అబ్బే ఏంలేదు!"
"ఏం ఎందుకు లేదు? ఎందుకాపారు కార్?"
"సిగరెట్ కాలుద్దామని!"
"అది నిజంకాదు! ఎందుకాపారు కార్?"
"మిమ్మల్ని ముద్దుపెట్టుకొందామని...." గబుక్కున అనేశాడు.
"ఏం అంత ముద్దొచ్చానా?"
"........"
"మాట్లాడరేఁ?"
"అద్సరేగాని....ఇక్కడింత నిర్మానుష్యంగా వుందికదా? నేను మిమ్మల్ని ఏమన్నా చేస్తే ఏం చేయగలరు?"
కారు తిరిగి స్టార్ట్ చేస్తూ అన్నాడు సిద్ధార్థ.
"మీరు నన్నేం చేయరు."
"ఏవిఁటో అంత నమ్మకం?"
"పాయింట్ నెంబర్ వన్....ఏదో చేయాలనుకొనేవాడు కేవలం ముద్దు పెట్టుకుందామనిపించి కారాపడు. పాయింట్ నెంబర్ టూ.... ఇందాక కార్లో నేను కనిపించకపోయేసరికి మీ రియాక్షన్ స్పష్టంగా చూశాను....యస్....మీరలాగేం చూడక్కర్లేదు. మీ రియాక్షన్ చూశాకే నా పనిమీద వెళ్ళాను. పాయింట్ నెంబర్ త్రీ....ఎండ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్....ఓ బాధ్యతకల పత్రికా విలేఖరి ఇలాంటి_అసలెలాంటి ఇల్లీగల్ పనులూ చేయలేడు."
ఆ ఆఖరి మాట సూటిగా తగిలింది సిద్ధార్థ గుండెకి.
టాపిక్ మార్చాడు.
"ఇంతకీ ఎక్కడికెళ్ళిపోయారలా? హడలి చచ్చాను."
నవ్వింది.
"నవ్వండి_మీకు నవ్వులాటగానే వుంటుంది. నేనెంత కంగారుపడ్డానో మీకేం తెలుసు? చిరాకేసింది కూడా."
మళ్ళీ నవ్వింది.
"ఇంతకీ ఎక్కడికెళ్ళినట్టు?"
"చెప్తే ఇంకా చిరాకు పడతారు."
రిలాక్సయిపోయాడా మాటతో పూర్తిగా.
"లేదు....పడను....చెప్పండి."
"మరేంలేదు_ఏక్సిడెంట్ న్యూస్ కవర్ చేద్దామనీ.... వీలయితే ఫోటోలు తీసుకుందామని."
ఆశ్చర్యంగా చూశాడామె వంక.
"నాకూ చెప్పి వెళ్ళొచ్చుగా?"
"చెబితే ఇద్దరం సేకరిస్తామా న్యూస్....ఇద్దరి పత్రికల్లోనూ, త్వరగా హైదరాబాద్ చేరితే, రేప్రొద్దున్న....ఐ మీన్ ఈ రోజు ఎడిషన్ కే వీలుంటే రావచ్చు....నాకన్నా మీకు అధారిటీ ఎక్కువ కాబట్టి మీ పత్రికలో తప్పకుండా వస్తుంది....మా పత్రిక ఈవినింగ్ ఎడిషన్ మీ న్యూస్ కి కాపీలా వుంటుంది."
"ఇప్పుడు మాత్రం? నేను న్యూస్ వేయలేనా?"
"నాకున్నంత ఇన్ఫర్మేషన్, ఫోటోలు లేవుగా మీ దగ్గర?" మీకు చెప్పకుండా వెళ్ళడంతో నేను జర్నలిస్టునైపోయాను. డిటెక్టివ్ అయిపోయారు."
చిత్రంగా చూశాడామెకేసి_
కొంచెంసేపు నిశ్శబ్దం మళ్ళీ....
"మీ హస్బెండ్ కమ్ ఫ్రెండేం చేస్తుంటారు? ఐ మీన్ ఎక్స్...."
"యూ మీన్ ఎక్స్ హస్బెండ్ ఎండ్ ప్రెజెంట్లీ ఫ్రెండ్.... ఆయన....అతను.... పోలీస్ ఆఫీసర్...."