Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 25

ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అగాధంలోకి ఓరగా చూశాడు భూతాలరాజు. భూమి దానిమ్మపండులా పగిలి, విచ్చుకున్నట్లు ఏర్పడి వుంది ఆ లోయ. అడుగున చిక్కటి అడవి. ఆ లోయ మీదుగా ఉంది బ్రిడ్జి.
భూతాలరాజుకి అరచేతుల్లో చెమటలు పోశాయి.
సందీప్ చెప్పింది నిజమే! జీపు టైర్లకీ, అగాధానికీ మధ్య ఒకే ఒక అంగుళం ఎడం ఉంది. అది దాటితే పాతాళ లోకానికి పాస్ పోర్టు తీసుకున్నట్లే!
చావుకీ, బతుక్కీ మధ్య తేడా ఒకే ఒక అంగుళం.
కళ్ళు గట్టిగా మూసుకుని కూర్చుని ఉంది స్వప్న.
జీపు మళ్ళీ స్టార్ట్ చేశాడు సందీప్.
"నీకేం పిచ్చా ? వెర్రా ? రిబ్బను ముక్కలా వున్న బ్రిడ్జిమీద నుంచీ ఎలా డ్రయివ్ చేస్తావ్? జీపు ఇక్కడే వదిలేసి, నడిచెళ్ళి పోదాం పట్టు!" అన్నాడు రాజు. కీచుగా వస్తోంది అతని గొంతు.
"జీపు మనకి అత్యవసరం! వదిలెయ్యడానికి వీల్లేదు." అని ముక్తసరిగా చెప్పి, ఫస్టుగేరు వేశాడు సందీప్. క్లచ్ వదిలి, యక్సిలేటరు మృదువుగా నొక్కాడు.
ఆకాశంవైపు చూసి, దేముడికి దణ్ణం పెట్టాడు రాజు.
అతి మెల్లిగా, అతి జాగ్రత్తగా ముందుకు దొర్లాయి జీపు చక్రాలు. నత్తలా మెల్లిగా జరుగుతోంది జీపు. ఒక్కొక్క సెకెండూ, ఒక్కొక్క యుగంగా గడుస్తోంది.
భయంగా కళ్ళు తెరిచింది స్వప్న. వెంటనే, "అది చూడు!" అంది బలహీనంగా.
వాళ్ళ ముందు వున్న బ్రిడ్జి కొన మెల్లిగా విరగడం మొదలెట్టింది.
ఇంక సందేహించలేదు సందీప్. తన సర్వేంద్రియాలనూ అద్భుతమైన కో ఆర్డినేషన్ లోకి తెచ్చుకుని, సర్వశక్తులనీ కేంద్రీకరించి, వరసగా గేర్లు మార్చి, టాప్ గేర్ లోకి తీసుకొస్తూ యక్సిలేటర్ ని పూర్తిగా అదిమి పట్టేశాడు. అతని దృష్టికి విరిగిపోతున్న బ్రిడ్జీ, దానికి అవతలవైపు ఉన్న అగాధపు అంచూ తప్ప మరేమీ కనబడటం లేదు. పూర్తి ఏకాగ్రతతో డ్రయివ్ చేస్తున్నాడు సందీప్.
ఎక్కుపెట్టి వదిలిన బాణంలా దూసుకుపోయింది జీపు. అయిదు సెకెండ్లలో ఆ బ్రిడ్జిని దాటేసింది. కాని సరిగ్గా నాలుగు సెకెండ్లకే ఆ బ్రిడ్జి కూలిపోయింది. నిజానికి చివరి సెకండులో అక్కడ బ్రిడ్జి లేదు, జీపు గాలిలో ప్రయాణిస్తూ, సురక్షితంగా అవతలివైపుకి దూకింది.
ఆ అదురుకి అందరూ సీట్లలో నుంచి ఎగిరి మళ్ళీ కింద పడ్డారు.
గాఢంగా శ్వాస తీసుకుంది స్వప్న. తర్వాత నెమ్మదిగా అంది. "ఇలాంటి స్టంట్ డ్రైవింగ్ సినిమాలలోనూ, సర్కసుల్లోనూ తప్ప చూడలేదు నేను."
తేలిగ్గా నవ్వి, సిగరెట్ అంటించాడు సందీప్!
"నువ్వు గడుసు పిండానివి!" అన్నాడు భూతాలరాజు, అతన్ని పరిశీలనగా చూస్తూ.
ఉన్నట్లుండి స్టీరింగుని గిరగిర తిప్పాడు సందీప్. జీపు బొంగరంలా వెనక్కు తిరిగింది రొదచేస్తూ. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. రోడ్డుకి అడ్డంగా ఒక బెల్టు లాంటిది పరిచి వుంది.
దానికి సూదిగా ఉన్న మేకులు అసంఖ్యాకంగా వున్నాయి. సందీప్ దానిని గమనించి, జీపుని పక్కకి కోసేసరికే నాలుగు మేకులు ముందు టైరుకి గుచ్చుకున్నాయి పంక్చరయింది.
"హెల్!" అంటూ జీపు దిగాడు సందీప్. 'మనకంటే ముందు మరొక బృందం వెళ్ళడమే కాదు - వాళ్ళు మానని ముందుకు సాగనివ్వ కూడదనే పట్టుదలతో కూడా వున్నారు. ఇకముందు మరింత జాగ్రత్తగా వుండాలి మనం. పంక్చరయిన టైరు తీసేసి స్టెప్నీ వేస్తాను" అంటూ స్పేర్ టైరు తీశాడు.
భూతాలరాజు సాయం చెయ్యడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా, అటువైపు తిరిగి పళ్ళు కుట్టుకుంటూ నిలబడ్డాడు.
సందీప్ కన్నుగప్పి, తప్పించుకు పోవడానికి ఒక్కసారి, చివరిసారిగా ప్రయత్నం చేసి చూడాలనుకుంది స్వప్న - అడుగులో అడుగేస్తూ నెమ్మదిగా చెట్ల చాటుకు జారుకుంది.

 Previous Page Next Page