"అంతేనా?" అన్నాడు విక్టర్, పాలిపోయిన మొహంతో.
అవునన్నట్లు తల ఊపాడు శతృఘ్న. అతని మనసు వికలమై పోయింది. సో! తన జీవితం ఇలా ముగిసిపోతోందన్నమాట.
ఈ జీవితానికి ఎన్ని ఆశయాలతో పునాదులు వేసుకున్నాడు తను! వాటిపైన ఎన్ని ఆశల పందిళ్ళు అల్లించుకున్నాడు! వాటికోసం ఎంత ఆరాటం! ఎంత పోరాటం!
అన్నీ ఇలా ముగిసిపోతున్నాయన్నమాట!
తనకి తెలియకుండానే చిన్నగా నిట్టూర్చాడు శతృఘ్న. కొంచెం ముందుకు కదిలి, కాలికీ ఏదో తగలగా ఆగి కిందికి చూశాడు.
తన కాళ్ళదగ్గర జీవచ్చవంలా పడి ఉన్నాడు డాక్టరు.
డాక్టర్ రంజన్! తన ఎనిమీ నెంబర్ వన్! తన బతుకు బండలై పోవటానికి కారణమైన బాస్టర్డు!
అతని పెదిమలు బిగుసుకు పోయాయి.
వీడు తన జీవితాన్ని నాశనం చేసెయ్యకుండా ఉంటే తనుకూడా తన క్లాస్ మేట్స్ అందరిలాగే మెడిసిన్ పూర్తిచేసి, గౌరవప్రదంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడు.
వద్దు వద్దనుకుంటున్నా, వళ్ళు జలదరింప చేసే ఆ సంఘటనలని మనో ఫలకం మీద ఫ్లాష్ బ్యాక్ లా ప్రొజెక్ట్ చేసింది మనసు.
* * * *
చిన్నప్పటినుంచి చాలా పేదరికంలో పెరిగాడు శతృఘ్న. వాళ్ళ నాన్న ఒక హైస్కూల్లో జీతాలు కట్టించుకునే గుమాస్తా. అందరి పిల్లల దగ్గరా ఫీజులు కట్టించుకునే ఆయన, తన పిల్లలకి మాత్రం ఏ నెలా సరిగా స్కూలు ఫీజు కట్టలేకపోయేవాడు.
ఎప్పుడూ స్నేహితులతో ఆడుతూ ఉన్నట్లే కనిపించేవాడు శతృఘ్న. క్లాసులో బెస్టు స్టూడెంటు కాదుగానీ ఫస్టు మార్కులు మాత్రం ఎప్పుడూ అతనివే. ఏకసంథాగ్రాహి అతను. ఒకసారి చెవులతో విన్నదిగానీ, కంటితో చూసిందిగానీ తేలిగ్గా మర్చిపోడు.
చాలా సులభంగా మెడిసిన్లో సీటు సంపాదించుకోగలిగాడు శతృఘ్న.
మెడిసిన్లో సీటు వచ్చిందని తెలిసిన రోజున తన బతుక్కి ఒక గమ్యం ఏర్పడినట్లనిపించింది.
ఇది మొదలు!
తను డాక్టరవుతాడు. కుప్పలు తెప్పలుగా సంపాదించేస్తాడు.
డబ్బు కాదు!
పేద, పీడిత ప్రజల అభిమానం, అనురాగం, ఆశీర్వాదాలూ సంపాదిస్తాడు.
తనకి పేరొస్తుంది!
పెద్ద డాక్టరని కాదు ,పేదల డాక్టరని!
ఉరకలేస్తున్న ఉత్సాహంతో మెడికల్ కాలేజీలో అడుగుపెట్టాడు శతృఘ్న.
ప్రొఫెషనల్ కాలేజీల్లో, కొత్తగా చేరిన స్టూడెంట్సుని సీనియర్సు "రాగ్" చేసి ఏడిపించటం ఉంటుందని అతనికి తెలుసు.
కానీ అది మరీ అంత దారుణంగా, దానవ వినోదంలా ఉంటుందని ఊహించలేకపోయాడు.
కాలేజీకి వెళ్ళిన మొదటిరోజే సీనియర్సు అతన్ని మెన్స్ హాస్టల్లోకి లాక్కెళ్ళారు. అప్పటికే ఇంకొంతమంది జూనియర్సు ఉన్నారక్కడ. బాలి కాబోయే పశువుల్లా భయం భయంగా చూస్తున్నారు.
అసలు రాగింగ్ అనేది, కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన ప్రెషర్స్ ని సీనియర్సు సరదాగా ఆటలు పట్టించి, వేళాకోళాలాడి, వాళ్ళ బెరుకు పోగొట్టడానికీ, తమలో కలిపేసుకోడానికీ ఉద్దేశించబడింది మొదట్లో. అంతేగానీ కొత్త స్టూడెంట్లని అనాగరికంగా, అసభ్యంగా ట్రీట్ చేసి, వాళ్ళలో ఆత్మన్యూనతా భావం కలిగించడానికి కాదు.
శతృఘ్నది చిన్నప్పటి నుంచి రెగ్యులరుగా ఎక్సరుసైజ్ చేసి గట్టిపడిన శరీరం. బాక్సింగ్ కూడా వచ్చు అతనికి. సీరియస్ గా ఉంటుంది అతని మొహంలో ఎక్స్ ప్రెషన్. బహుశా అందుకేనేమో, అతన్ని మరీ వికృతంగా రాగ్ చేయకుండా తేలిగ్గానే వదిలిపెట్టారు సీనియర్సు.
కానీ పాపం తక్కిన జూనియర్సు అందరూ అంత అదృష్టవంతులు కారు.
ఆడపిల్లలా తెల్లగా, నాజూగ్గా ఉండి, మెల్లిగా నమ్రతగా మాట్లాడే ఒక కుర్రాడిని పట్టుకుని, డ్రాయరు తప్ప మిగతా బట్టలన్నీ విప్పెయ్యమని "ఆర్డరు" చేశారు సీనియర్లు.
వణికిపోతూ అలాగే చేశాడు అతను.
తర్వాత అతని వంటికంతా నల్లటి బూట్ పాలిష్ పులిమి పాత చెప్పులతో చేసిన దండ అతని మెడలో వేశారు. ఒక పాత డబ్బాకి తాడు కట్టి డోలులా అతని మెడకు తగిలించి, చేతిలో రెండు పుల్లలు పెట్టి ఆ డబ్బాని డప్పులా వాయిస్తూ లేడీస్ హాస్టల్ చుట్టూ ఒకసారి పరిగెత్తి రమ్మన్నారు.
కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతుండగా అలాగే చేశాడు అతను.
ఇంకో కుర్రాడి విషయంలో మరింత ముందుకి వెళ్ళిపోయారు సీనియర్సు. ఒక కూజాలో యూరిన్ పోసి, అతని చేత....
లేడీస్ హాస్టల్లోనూ అంత ఘోరంగానే జరిగింది.
సిగ్గుల మొగ్గలా ఉన్న ఒకమ్మాయిని జాకెట్టు, చీరే విప్పమని, పరికిణీ, బ్రాతో సిల్కుస్మితలా క్లబ్ డాన్సు చెయ్యమన్నారు.
సిగ్గుతో కొంకర్లు పోతూ, ఊరికే నడుం అటూ ఇటూ తిప్పుతూ నాలుగుసార్లు తన చుట్టూ తాను తిరిగింది ఆ అమ్మాయి.
చాలా భయస్తురాలైన మరో అమ్మాయి తల వంచుకుని వెళుతుంటే ఒక మొగ సీనియరు నిలేసి, వెయ్యరాని చోట చేతులు వేసి తడుముతూ, "దీని రేటెంత? ఈ చీరేది?" అన్నాడు మొరటుగా. జవాబు చెప్పకుండా పెద్దగా ఏడ్చేసింది తను.
అందరు సీనియరు స్టూడెంట్సూ అలా పైశాచికంగా ప్రవర్తించరు. కానీ ప్రతిచోటా, హద్దూ పద్దూ లేకుండా చెలరేగి పోయేవాళ్ళు ఉంటూనే ఉంటారు.