Previous Page Next Page 
హైజాక్ పేజి 25

రివాల్వర్ ని నిర్లక్ష్యంగా ఎడంచేత్తో పక్కకి తోసేశాడు రాజేందర్. "నో యూస్ బ్రదర్! నువ్వు నన్నింక బెదిరించలేవు. నిండా మునిగిన వాడికి చలేమిటి? ఈ విమానం ఎలాగూ ఇంకొద్ది సేపట్లో కూలిపోతుంది. విమానంలో ఉన్న ప్రతి మనిషీ, నీతో సహా, చావక తప్పదు. నన్ను ముందే చంపుతానంటావా? నీ యిష్టం! కొద్ది నిమిషాలముందే చావడానికి నాకేం అభ్యంతరమూ లేదు."
అతను చెబుతున్నది నిజమే అని తెలుసు శతృఘ్నకి. సందిగ్ధంగా చూస్తూ ఉండిపోయాడు.
"అంకుల్!" అని తల లోపలికి పెట్టి చూసింది స్మిత. "అంకుల్! లోపలికి రావచ్చా నేను?"
వెంటనే జవాబు ఇవ్వలేదు రాజేందర్. విమానం ఇలా ఎయిర్ టర్ బ్యులెన్స్ లో చిక్కుకుని ఒడుదుడుకులుగా వెళ్ళిపోతున్నప్పుడు అందరూ సీట్ బెల్టులు బిగించుకుని కదలకుండా సీట్లలోనే కూర్చోవాలి.
ఈ పాప తన ఇష్టం వచ్చినట్లు ఎలా తిరుగుతోంది? ఎలా ఊరుకుంటున్నారు ఎయిర్ హోస్టెస్ లు?
కానీ అంతలోనే మళ్ళీ అనిపించింది. విమానమే కూలిపోతున్నప్పుడు ఈ సీట్ బెల్టులూ, ఈ జాగ్రత్తలూ ఎవరిని రక్షిస్తాయి?
చనిపోబోయేముందు చివరి కొద్ది క్షణాలూ నిష్కల్మషమైన మనసుగల ఈ పాపతో మాట్లాడుతూ గడిపేస్తే, జీవితం సార్థకమైనట్లే.
అలా అనుకోగానే అతని మొహంలోకి కళ వచ్చింది.
"కమాన్ డార్లింగ్! కమ్!" అన్నాడు ఆప్యాయంగా.
కానీ వెంటనే లోపలికి రాలేదు స్మిత. పడిపోయి ఉన్న మూర్తినీ, సవ్యసాచినీ, వినోద్ రవినీ ఆశ్చర్యంగా చూస్తోంది.
"ఏమయింది అంకుల్ వీళ్ళకి?" అంది ఆదుర్దాగా.
"ఏం లేదు బేబీ! కొద్దిగా అప్ సెట్ అయ్యారు. అంతే! దేవిల్ బీ ఆల్ రైట్!" అన్నాడు రాజేందర్ తేలిగ్గా. పూర్తి నిజం చెప్పేసి ఆ పాపను బెదరగొట్టెయ్యడం అతనికి ఇష్టం లేకపోయింది.
స్మిత మొహం కొంచెం తేటబడింది.
అంకుల్! ఈ డయల్సు అన్ని ఏమిటి? నాకు చెప్పవా?" అంది తనకు సహజమైన కుతూహలంతో.
విషాదంగా నవ్వాడు రాజేందర్. ఆ డయల్సు అన్నీ ఏవి ఏమిటో తనకి నిజంగానే తెలిసివుంటే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా అయి ఉండేది కాదు.
అందుకని సులభంగా అబద్దమాడేస్తూ, "ఇది ఆర్టిఫిషియల్ హోరైజన్, విమానం స్ట్రెయిట్ గా, లెవెల్ గా ఎగురుతుందో, లేదా పక్కకి ఒరుగుతోందో చూపిస్తుంది. ఇది ఎయిర్ స్పీడ్ ఇండికేటర్, విమానం ఎంత స్పీడుతో వెళుతుందో చూపిస్తుంది. ఇది రాడార్..."
"రాడారా? ఏది?" అంది స్మిత ఉత్సాహంగా.
కంగారుగా ఆ ప్రశ్నని దాటవేశాడు రాజేందర్. ఇది అల్టిమీటర్, విమానం ఎంత ఎత్తులో ఎగురుతోందో చూపిస్తుంది.
ఎత్తు అంటే ఒక జోక్ గుర్తొస్తుంది. చెప్పనా డార్లింగ్?"
నవ్వుతూ అతనివైపు చూసింది స్మిత.
"ఒక పెద్ద మనిషికి విమాన ప్రయాణమంటే చచ్చేంత భయం. ఆయన కర్మకొద్దీ ఒకసారి విమానం ఎక్కాల్సి వచ్చింది. అది గాల్లోకి లేచీలేవగానే ఆయన ప్రాణభయంతో నీలుక్కుపోయాడు.
ఆ పక్క సీట్లో నాలాంటి వాగుడుకాయ ఎవడో కూర్చుని ఉన్నాడు. అసందర్భంగా ఏదేదో మాట్లాడేస్తూ గురూజీ! మనిషికి కాళ్ళు ఎంత పొడుగుంటే బావుంటుందని తమరి ఉద్దేశ్యం?" అన్నాట్ట.
అసలే బేజారెత్తిపోయి వున్న ఆ పెద్దమనిషి తక్షణం, "భూమికి తాకేంత పొడుగుంటే చాలు! అన్నాట్ట!" అని చెప్పి, పెద్దగా నవ్వాడు రాజేందర్.
స్మిత కూడా నవ్వింది.
రాజేందర్ ని నిశితంగా చూశాడు శతృఘ్న. అతని మొహంలో ఇందాకటి భయం కనబడటంలేదు. మృత్యువు మీదపడి కబళించబోతోందన్న సత్యం గ్రహించాక, మరణానికి మానసికంగా సిద్ధమైపోయాడా అతను? ఆ తెగింపు అందరికీ వచ్చేస్తుందా?
నెమ్మదిగా అక్కడనుంచి కదిలి పాసెంజెర్సు కేబిన్ లోకి వెళ్ళాడు శతృఘ్న.
పాసెంజెర్సులో చాలా మందికి తాము ఉన్న భయానకమైన పరిస్థితి ఇంకా పూర్తిగా అర్థమైనట్లు లేదు. విమానం హైజాక్ కాబడుతోందని మాత్రమే తెలుసు వాళ్ళకి. అంతే!
ఆ టెన్షన్ కే సతమతమై పోతున్నారు వాళ్ళు. బెదురు చూపులతో ఇక్బాల్ నీ, విక్టర్ నీ చూస్తున్నారు.
శతృఘ్నని చూడగానే మరింత ముడుచుకుపోయి కూర్చున్నారు అందరూ.
నిర్లిప్తంగా అందరినీ ఒకసారి పరికించి చూశాడు అతను.
ప్రశ్నార్థకంగా అతని మొహంలోకే చూస్తున్నారు ఇక్బాల్, విక్టర్.
నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి నడిచాడు శతృఘ్న.
"ఏమయింది?" అన్నాడు ఇక్బాల్ అనుమానంగా.
తగ్గుస్వరంతో జరిగిందంతా చెప్పాడు శతృఘ్న.
"దీన్తల్లి శిగదరగ!" అన్నాడు ఇక్బాల్.
"మైగాడ్! ఇప్పుడేం చెయ్యాలి మనం?" అన్నాడు విక్టర్.
నిస్పృహగా అన్నాడు శతృఘ్న. "ఇప్పుడింక చేసేదేమీలేదు. అవర్ గేమ్ ఈజ్ అప్! చావుని ధైర్యంగా ఎదుర్కోవడమే మనం చెయ్యగలిగింది."

 Previous Page Next Page