ఆ అల్లరంతా సర్దుమణిగి, అందరూ చదువులో పడిపోవడానికి చాలారోజులు పట్టింది.
సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి "ఫ్రెషర్సే" తర్వాత సీనియర్లు అయ్యారు. ఇదివరకు తాము అనుభవించిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు, కొత్తగా చేరిన జూనియర్లను ఉత్సాహంగా రాగ్ చేసేవాళ్ళు.
శతృఘ్న మాత్రం ఎప్పుడూ వాళ్ళతో కలిసేవాడు కాదు. కానీ, అతను ఫోర్త్ ఇయర్ లోకి వచ్చాక తనకు తెలియకుండానే ఆ రభసలో చిక్కుకోవలసి వచ్చింది, రంజన్ వల్ల.
రంజన్ శతృఘ్న వాళ్ళ బ్యాచే. అప్పట్లో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన కాబోయే మంత్రి. ఆ కాబోయే మంత్రికి కాబోయే అల్లుడు రంజన్. రంజన్ కి మెడిసిన్లో సీటు వచ్చేలా మేనేజ్ చేసింది ఆయనే అని ఆ ఊళ్ళో ప్రతి చిలక్కీ తెలుసు.
మోటుగా మొరటుగా ఉండేవాడు రంజన్. యమహాదూత్ మోటార్ సైకిలు మీద అతను వస్తుంటే యమదూత వస్తున్నట్లే అనిపించేది చూసేవాళ్ళకి. కాలేజీ పాలిటిక్సులో చాలా ప్రాముఖ్యం ఉండేది అతనికి. చదువంటే చాలా వైముఖ్యం కూడా ఉండేది.
"ఛిక్ ఛార్టులు" తయారు చెయ్యాలని "బ్రిలియంట్ ఐడియా" వచ్చింది రంజన్ కి. అతని ఆ దారుణమైన ఆలోచన, తర్వాత ఊహించలేనంత విపరీతమైన పరిస్థితులకు దారి తీసింది.
కొత్తగా కాలేజీలో చేరిన ఫ్రెషర్స్ ని పరమ అసభ్యంగా ఏడిపించడానికి రంజన్ కనిపెట్టిన సరికొత్త పద్ధతే ఛిక్ ఛార్టులు. జూనియర్ అమ్మాయిల "కొలతలూ" జూనియర్ అబ్బాయిల "కొలతలూ" ఒక ఛార్టులో తయారుచేసి, ఎవరికి ఎవరు బాగా "సరిపోతారో" నిర్ణయించి రాసి, ఆ ఛార్టులని నోటీసు బోర్డు దగ్గర తగిలించాడు.
తలకొట్టేసినట్లయింది ఆ కొత్త స్టూడెంట్లకి. అయినా భయం కొద్దీ ఎవరూ నోరెత్తలేదు.
ఒక్క మోహన అనే అమ్మాయి తప్ప!
మోహనకి ఇంటర్మీడియెట్ చదువుతుండగానే వాళ్ళ బావతో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మెడిసిన్లో చేరింది తను.
తక్కిన అమ్మాయిలందరూ ఒళ్ళు మండిపోతున్నా ఊరికే ఉండిపోయారు కానీ, పెళ్ళయిన మోహన మాత్రం తన పేరుని ఇంకో అబ్బాయి పేరుతో లింక్ చెయ్యడం సహించలేక పోయింది. ధైర్యంచేసి ప్రిన్సిపాల్ దగ్గరికెళ్ళి రాగింగ్ చాలా వల్గర్ గా, లిమిట్స్ దాటి పోతోందనీ, కంట్రోల్ చెయ్యమనీ అడిగింది.
అది విని శివమెత్తి పోయాడు.
ప్రిన్సిపాల్, "నువ్వెళ్ళు! నేను రంజన్ మీద యాక్షన్ తీసుకుంటాను" అన్నాడు అనునయంగా.
అదంతా ఉత్త "యాక్షన్" అని తర్వాత గానీ తెలియలేదు మోహనకి.
రంజన్ వెనక ఎంతెంత పెద్దవాళ్ళున్నారో ప్రిన్సిపాల్ కి బాగా తెలుసు. ఆయన భయాలు ఆయనకి ఉన్నాయి.
మోహన ప్రిన్సిపాల్ కి రిపోర్టుచేసి వస్తుండగా కారిడార్లో ఎదురుపడ్డాడు రంజన్, "ప్రిన్సిపాల్ ని మీట్ అయ్యావా?"
"అవును."
"ఎందుకు?"
"మీరు చేసిన పని చాలా ఇన్ డీసెంటుగా ఉందని చెప్పడానికి."
"తక్కిన అమ్మాయి లెవ్వరికీ లేని బాధ నీ ఒక్కదానికే వచ్చిందా? యాంగ్ పీపుల్స్ ఇలాంటివన్నీ సరదాగా తీసుకోవాలి. నువ్వు ముసలి ముత్తయిదువలా అలా గింజుకు పోతావేం? సరే వెళ్ళు! ఇవాళ నుంచీ నువ్వు నాకు తల్లిలాంటిదానివి!" అన్నాడు వెక్కిరింపుగా.
అతని ఫ్రెండ్సందరూ నవ్వారు.
చాలా కూల్ గా సమాధానం చెప్పింది మోహన "నేను మీకు తల్లినెలా అవుతాను? నాకు పెళ్ళయింది" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఆమె ఎంత పెద్దమాట అనేసిందో రంజన్ కి తెలియలేదు పక్కన ఉన్నవాడు చెప్పేదాకా.
"ఎంత పొగర్రా దీనికి ఎంత మాట అనేసిందో చూశావా?"
"ఏమంది?" అన్నాడు రంజన్. "తనకు పెళ్ళయిందని చెప్పింది, అంతేకదా?"
"అంతేకాదు! తనకు పెళ్ళయింది కాబట్టి తను నీకు తల్లి కాలేదుట! అంటే మీ అమ్మకు పెళ్ళి అయి-ఉండదని అర్థం! పెళ్ళి కాకుండానే నువ్వు పుట్టి ఉంటావని గూడార్థం! ఇన్ అదర్ వర్డ్స్, నిన్ను "బాస్టర్డ్" అంటే అక్రమ సంబంధం ద్వారా పుట్టినవాడా! అని తిట్టి వెళ్ళింది."
ఆ షాక్ నుంచి చాలా సేపటిదాకా కోలుకోలేక పోయాడు రంజన్. "ఈ పిల్ల నా కాళ్ళమీద పడి అపాలజీ చెప్పుకునే దాకా ఊరుకోను" అన్నాడు అందరి ముందూ ప్రతిజ్ఞ పూనుకున్నట్లు.
కొద్దిరోజుల తర్వాత కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉన్నది, లేడీస్ హాస్టల్ ఖాళీ అయిపోయింది. అందరూ ఫంక్షన్ కి వెళ్ళారు.
ఆ టైం కోసం కాచుకుని ఉన్న రంజన్, అతని ఫ్రెండ్సూ లేడీస్ హాస్టల్ మీద దాడి చేశారు. ఆడపిల్లల బ్రాసరీలు అన్నీ ఎత్తుకొచ్చి, మెన్స్ హాస్టల్ గేటుకి విజయ తోరణంలా కట్టారు.
ఆడపిల్లలు ఇతరుల కంట పడకుండా గోప్యంగా ఉంచుకోవాలనే వస్తువులు శానిటరీ నేప్ కిన్స్ ప్యాకెట్లూ, ఆన్ ఫ్రెంచ్ సీసాలూ ఎట్ సెట్ రా....ఎట్ సెట్ రా.... అన్నీ తీసుకొచ్చి అందరూ చూసే చోట కుప్పలా పడేశారు.
ఆ రోజు సరికొత్తగా వెలసిన ఛిక్ ఛార్టులో మోహన పేరు మరింత ప్రముఖంగా కనబడింది.