తర్వాత కూడా శాయి భార్యతో ఆ విషయం ప్రస్తావించలేదు. ఏమీ ఎరుగనట్లే వూరుకొన్నాడు.
* * *
ఆ రాత్రి శాయికి ఓ కల వచ్చింది. తాను సీతను వెంటాడాడు. ఆమె వేదితను కోనేటి గట్టుమీదకు తీసుకువెళ్ళింది. ఆమెను మెల్లగా కబుర్లలో మభ్యపెట్టి, ఆమె మరోవైపుకు చూస్తూండగా గబుక్కున నీళ్ళలోకి తోసేసింది. తర్వాత ఒక క్షణమైనా తాత్సారం చెయ్యకుండా చెట్లకిందుగా పరిగెత్తుకుని వెళ్లి పోయింది. చాటుగా దాక్కొని చూస్తున్న తాను వెంటనే ఇవతలకువచ్చాడు. గబగబ కోనేటిగట్టుకు పరిగెత్తి ముందూ వెనుకా చూడకుండా నీళ్ళలోకి దూకేశాడు. మునుగుతూ నీటిలో తేలుతూవున్న వేదిత అతని చేతికి చిక్కింది. ఆమెని గట్టిగా పొదివి పట్టుకుని యీదుకుంటూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. 'వేదితా!' అని పిలిచాడు చెవిలో మృదువుగా. ఆమె జవాబు చెప్పలేదు. అప్పుడు చూశాడు ఆమె స్మృతివిహీనురాలై వుంది. అలాగే చేతుల్లో వేసుకుని ఆమె కుటీరంవైపు నడుస్తున్నాడు. అట్లా ఆమెను పట్టుకుని నడుస్తూంటే ఆమె వక్షస్థలం అతని ఛాతీకి తగుల్తోంది. కేశాలు ముడివీడి వ్రేలాడుతున్నాయి. తడిసిపోయిన ఆమె తెల్లటివస్త్రాలు అంతకన్నా తెల్లటి శరీరం మీద ఉల్లిపొరలా ఉండి, తరుచ్ఛాయల మధ్య అప్పుడప్పుడూ మీదపడుతున్న సూర్యకాంతికి యవ్వన కాంతికి మెరుస్తున్నాయి. ఈ ప్రకృతి సుందరికి యింత దగ్గరగా తాను, తన అదృష్టానికి తనకే ఆశ్చర్యంగా ఉంది. ఆమె స్పర్శ ధవళిమ వెదజల్లుతూ ప్రస్ఫుటమౌతున్న ఆమె యవ్వనం అతన్లో నూతన ఉత్తేజాన్ని రేకెత్తిస్తున్నాయి. "నువ్వు నాకు కావాలి" అతని అంతరంగం అలమటిస్తూ విలపిస్తోంది. ఆమెను కుటీరంలోకి తీసుకువెళ్ళి చాపమీద మెల్లగా పరుండబెట్టాడు. ప్రక్కన కూర్చుని ఉపచర్యలు చేస్తున్నాడు. ఆ సజీవసుందరి ఆచలనంగా మూతలుపడిన కనుదోయితో పడుకునివుంటే, తనలా ప్రక్కన కూర్చుని ఉపచర్యలు చేస్తూవుంటే ఈ అనుభూతి మధురంగా తోచి, అతని ఒడలంతా పులకరించింది. ఆమె ముఖంలో ముఖం ఉంచి తనివితీరా సేద తీరాలనిపించింది. చంద్రవంకలా సోయగాలు పోయిన ఆమె పెదవులను తన పెదవులతో స్పృశించాలనిపించింది. ఆమె ముఖంలోకి వొంగుతున్నాడు. అంత సమీపంలో తననిచూసి ఒక్కసారిగా ఉలికిపడి 'నువ్వా' అంది తిరస్కారంగా. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. 'ఎందుకొచ్చావు ఇక్కడికి?ఇది నీలాంటి వాళ్ళు రావలసిన ప్రదేశం కాదు. తక్షణం వెళ్ళిపో' అంది ఆజ్ఞాపిస్తున్నట్లు. తాను ఆమెకు వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు. 'నీవు నీటిలో మునిగిపోతున్నావు. నేను వెంటనే దూకి నిన్ను ఒడ్డున తీసుకువచ్చి ప్రాణాలు రక్షించాను. నీ కోసం కాదు. నాకోసం రక్షించుకున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మోహిస్తున్నాను, కామిస్తున్నాను. నువ్వు నాకు కావాలి వేదితా! నువ్వు నాకు కావాలి. నువ్వు లేనిదే నాకు జీవితం లేదు. జీవంలేదు. మనుగడలేదు. అంతా శూన్యం. రా, నాలో కలిసిపో. నన్ను తరింపచెయ్యి' అంటూ ఆమె దగ్గరకు జరుగుతున్నాడు. ఆమె చివాల్నలేచి నిల్చుని వెనక్కి వెనక్కి వెడుతోంది.'తుచ్ఛుడా! నన్ను ముట్టుకున్నావా? ఈ శరీరాన్ని కాల్చివేస్తేనేగాని నా కసితీరదు. నువ్వంటే అసహ్యం. నువ్వు తుచ్ఛమానవుడివి. నేను తపస్వినిని. దేవతను. నా జోలికి వచ్చావంటే నిన్ను శపిస్తాను నాశనం చేస్తాను' అని గర్జిస్తోంది. అయినా తను లెక్కచెయ్యలేదు. తనకి పిచ్చిఎక్కింది. "ఏమైనా సరే, నువ్వు నాకు కావాలి. నేను నాశనమైనా నా కిష్టమే. నీవులేని నా ఉనికిని నేను భరించలేను. దా వేదితా దా!" అని మీదకు వెడుతున్నాడు. ఆమె వెనక్కి వెనక్కి జరుగుతోంది. గోడ దగ్గర కృష్ణ విగ్రహం ఉంది. అనుకోకుండా ఆమె దృష్టి కృష్ణ విగ్రహాం మీదపడి అమాంతం నేలమీద వాలిపోయి చేతులు రెండు విగ్రహం చుట్టూ పెనవేసి "నల్లనయ్యా! నీవే నాకు దిక్కు" అంటూ శిరస్సు విగ్రహం పాదాలచెంత మోపి కళ్ళు మూసుకుంది. తను వికటాట్టహాసం చేస్తూ "నీ కృష్ణుడు నిన్ను ఎలా రక్షిస్తాడో చూస్తాగా" అంటూ దూకుడుగా ముందుకువెళ్ళి బరబర ఆమె చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు. అంతే, అతనికేదో విద్యుత్ ఘాతం తగిలినట్లయింది. పెద్ద వెలుగు! ఒక్క గావుకేకపెట్టి కళ్ళు మూసేసుకున్నాడు.
శాయి కళ్ళు విప్పాడు. అతని వళ్ళంతా చెమటలతో నిండిపోయింది. మనిషి వణికిపోతున్నాడు. "ఏమిటండీ? ఏమయింది?" అని ఆత్రుతగా ముఖం మీదకు వొంగి అడుగుతూన్న సీత ముఖము కనిపించింది.
తాను గదిలో పందిరి మంచం మీద పడుకుని ఉన్నాడు. ఇది తమ ఇల్లు తను కలలో పెట్టిన కేకకు సీత తృళ్ళిపడి లేచి, కంగారుపడుతోంది.
క్రమంగా తెప్పరిల్లి ఆమె వంక చూస్తూ "ఊఁ, యేమీలేదు" అన్నాడు పొడిగా.
"ఎందుకలా కేకపెట్టారు?"
"కేకపెట్టానా? నాకు తెలీదే!"
"పీడకల ఏమయినా వచ్చిందా?"
"ఊహుఁ ఏమీలేదు. నువ్వు పడుకో."
సీత నిట్టూర్చి "ఏమీలేదా? అయితే ఫర్వాలేదు. ఏమయినా జరిగిందేమోనని హడలిపోయాను. మంచినీళ్ళు కావాలా?" అని అడిగింది.
"అక్కరలేదు."
ఆమె అతని ప్రక్కన ఒత్తిగిలి పడుకుని అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని నిమురుతోంది. అతను వద్దని వారించలేదు. మెదలకుండా వూరుకుని కళ్లుమూసుకుని పడుకున్నాడు! ఆరాత్రి అంతా ఇద్దరికీ నిద్రలేదు. నిట్టూర్పులతో,ఆవేదనలతో గడిపేశారు. అయితే బయటకు ఒక్క మాటకూడా మాట్లాడుకోలేదు.
* * *
రెండు రోజులు గడిచాక శేషశాయి సాయంత్రం వేళ తూలుకుంటూ గంగరాజు పాకకు బయల్దేరాడు. అతని వాలకం మరీ పిచ్చివాడి మాదిరిగా ఉంది. ముఖంలో జీవకళ తగ్గిపోయింది. జుట్టు చెదిరిపోయి ముఖం మీదకు పడుతోంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి.
గంగరాజు అన్నం వండుకోవటానికని కుంపటి ముట్టించి, బాగా రాజుకోవటానికి పొగ గొట్టంతో వూదుతున్నాడు.
"గంగరాజూ!" అని పిలిచాడు శాయి. కొద్దిగా జీర ధ్వనిస్తూన్న కంఠంతో వొంగి లోపలకు అడుగుపెడుతూ.
అతను తలయెత్తి "ఓ, దొరగారా! రండి రండి" అంటూ లేచి మంచం వాల్చి "కూర్చోండి దొరా" అన్నాడు.