Previous Page Next Page 
నివేదిత పేజి 27


    శేషశాయి కూర్చున్నాడు.

 

    "దొరా! అలా ఉన్నారేటి? రానూ రానూ బొత్తిగా మీరు పాడయిపోతున్నారు బాబూ" అన్నాడు గంగరాజు అతని ముఖంకేసి పరిశీలనగా చూస్తూ దిగులుగా.

 

    "గంగరాజూ! ఈ భేషజపు కబుర్లు నాకు అక్కరలేదు. ఒకనాడు ప్రాణాపాయ దశలో వున్న నిన్ను చిరుతపులి బారినుంచి రక్షించి, ప్రాణాలు కాపాడాను అవునా?"

 

    "చిత్తం దొరా! నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి యిచ్చినా మీ రుణం తీరుద్దా?" అన్నాడతను వినమ్రంగా చేతులు నలుపుకుంటూ.

 

    "ఈ భేషజపు కబుర్లు నాకు అక్కర్లేదన్నాను. ఇప్పుడు నేను ప్రాణాపాయంలో ఉన్నాను. నన్ను నువ్వు రక్షించాలి."

 

    "దొరా? మీరు నన్ను బతిమాల్డమా? ఆజ్ఞాపించండి. నా ప్రాణాలు ఒడ్డి, నారక్తం ధారపోసి మిమ్మల్ని కాపాడతాను" అన్నాడు గంగరాజు ఆవేశంగా.

 

    "ఊఁ, అంత ఆవేశం వద్దు గంగరాజూ! తర్వాత పశ్చాత్తాప్పడతావు. నే నడిగేది ఎలాంటి కఠినమైన కార్యమైనా ఆచరిస్తావా!"

 

    "దొరా? మీరియాల కొత్తగా మాట్లాడుతున్నారు. ఈ గంగరాజు సొభావం, ఇశ్వాసం మీరింకా అర్థం చేసుకోలేదు. మీకు సంబంధించినంత మట్టుకూ నాకు కటినమనేది లేదు.

 

    శాయి తన కుడిచెయ్యి ముందుకు జాచాడు. "ఏదీ, అలా అని ప్రమాణం చెయ్యి" అన్నాడు.

 

    గంగరాజు తన విశాలమైన ఛాతి ఉప్పొంగుతూండగా ముందుకు నడిచి శాయి చేతిలో చేయి వేశాడు. దొరా! పమాణికం చేసి చెబుతున్నాను. మీ కోరిక ఎంత కటినమైనదైనా సరే, సంతోషంగా తీరుస్తాను . ఖూనీ చెయ్యమంటే చేస్తాను. అగ్గిలోకి వురకమంటే ఉరుకుతాను. ఏ ఆడదానికైనా మానభంగం చెయ్యమంటే చేస్తాను. ఏ ఆడదాని మీదయినా మీరు మనసుపడితే రెక్కలు విరిచి తీసుకువచ్చి మీ కాళ్ళముందు పడవేస్తాను" అన్నాడు. కుంపటిలో మంట చెలరేగి, ఆ కాంతి పాకంతా వ్యాపించి అతని ముఖం ఉజ్వలమైనదీప్తితో ప్రకాశించింది.  

 

    "గంగరాజూ! ఆ ఆఖరి హామీనే నువ్వు నెరవేర్చాలి . యీ గ్రామంలో ఒక సుందరి ఉంది. ఆమెను నేను ప్రేమించాను. ఆమెమీది మోహంతో పిచ్చివాడ్ని అయ్యాను. కాని ఆమె చుట్టూ పరిధి గీసుకుని కూర్చుంది. నయాన ఆమెను సాధించే ఉపాయం లేదు. బలవంతంమీద తప్ప, దౌర్జన్యంమీద తప్ప ఆమెను నేను పొందలేను. ఆమె... గంగరాజూ! ఈ వూరి దేవాలయంలో ఉండే వేదిత."   

 

    "దొరా!" అని గంగరాజు వెర్రికేక వేశాడు. తృటికాలంలో అతని ముఖం రక్తం లేకుండా పాలిపోయింది. శరీరంలో వొణుకు ప్రారంభించింది. "మీరు... మీరు..." ఏదో చెప్పబోయి తడబడుతున్నాడు.

 

    "ఏం? నీ ప్రగల్భాలు అయిపోయాయా? ఇహ నీటి పాఠాలు వల్లించబోతున్నావా ?"

 

    గంగరాజు అతని ముఖంకేసి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు.

 

    శాయి అదే జీర ధ్వనిస్తూన్న కంఠంతో అన్నాడు. "గోవిందాచార్యులుగారు గ్రామంలో లేరు. వేదిత ఆ ప్రాంగణంలో వంటరిగా ఉంది. ఈ దుస్సాహసం అక్కడనే ఎందుకు చేయకూడదని నువ్వు అడగవచ్చు. నాకు దేవుళ్ళన్నా, దేవాలయాలన్నా భయంలేదు. కాని ఆమెకు అక్కడ నైతికబలం ఉంటుంది. అదీగాక దగ్గరలో యిళ్ళు ఉన్నాయి. అల్లరై, అభాసుపాలు కావచ్చు. ఆమెను ఈ రాత్రి పన్నెండు గంటలవేళ బంధించి ఇక్కడకు తీసుకురావాలి. ఏం గంగరాజూ, మాట్లాడవు?"

 

    గంగరాజు కళ్లు మూసుకుని ఆలోచిస్తున్నాడు.

 

    శాయి లేచి నిలబడ్డాడు. "సరే. నీ ప్రతాపం, విశ్వాసం అర్థమయినాయి. నువ్వు పిరికివాడివి. వాచాలుడివి. నీలాంటి వాడిమీద ఆశ పెట్టుకోవటం నాదే పొరపాటు. ఇహ నీ ముఖం ఎప్పుడూ నాకు చూపించకు" అని అక్కడ్నుంచి కదిలాడు.

 

    "దొరా!" అని పిలిచాడు గంగరాజు. శాయి ఆగాడు.

 

    గంగరాజు ముఖంలో రకరకాల రంగులు మారుతున్నాయి. పళ్ళతో పెదవులుకొరుక్కుంటూ తననితానే సంబాళించుకుంటున్నాడు. బిగదీసుకున్న నరాలు సరి అవటానికి నరకయాతనపడుతున్నాడు. శరీరం స్వాధీనంలోకి రావటానికి, గతి తప్పిన గుండె సక్రమ మార్గంలోకి రావటానికి రక్తప్రసారం ఆగిపోకుండా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. క్రమంగా అతని ముఖంలోకి నెత్తురు ప్రవహించసాగింది. శాయి చిత్రంగా చూస్తున్నాడు. గంగరాజు మామూలు మనిషి అయాడు.

 

    "నా పామాణికానికి తిరుగులేదు దొరా! రాత్రి చెప్పిన వేళకు యిక్కడుండండి. అమ్మను తీసుకొచ్చి మీకు అప్పచెప్పుతాను" అన్నాడు నిశ్చలంగా.

 

    "అమ్మ" అతని నోట్లోంచి యీ శబ్దం విని శాయి ఒక్కక్షణం అదిరిపడ్డాడు. కాని ఒక్కక్షణమే. వెంటనే కోలుకున్నాడు. అతని ముఖం మీద సంతోష చిహ్నాలు వెలిశాయి. గంగరాజు భుజం తట్టాడు. "గ్రామాంతరం వెడుతున్నానని యింట్లో చెప్పి రాత్రికి పెందలకడనే యిక్కడకు వచ్చేస్తాను. నువ్వు లేకపోతే యీ మంచంమీద పడుకుని నీ కోసం ఎదురు చూస్తూంటాను" అని బయటకు వెళ్ళిపోయాడు.

 

                                           * * *

 

    తన కుటీరంలో చాపమీద వంటరిగా నిద్రపోతోంది వేదిత. గోడమీద చిన్న దీపం మాత్రం వెలుగుతోంది. తండ్రి తరుచు గ్రామాంతరంవెళ్ళటం, తను వంటరిగా పడుకోవటం ఆమెకు అలవాటే. చీకటి అంటే ఆమెకు భయం లేదు. వంటరితనం ఆమెకు వళ్ళు జలదరింప చెయ్యదు. అప్పుడప్పుడూ రాత్రుళ్ళు నిద్రపట్టకపోతే ఆ చీకట్లోనే దీపంకూడా లేకుండా తోటలోకి వెళ్ళి విహరించి వస్తూ ఉంటుంది ఆమె. యే చెట్టు క్రిందనో కూర్చుని కాసేపు తనలో తను కబుర్లు చెప్పుకుంటుంది. ఒక 'తను' తాను, రెండవ 'తను' తన ఆరాధ్యదైవం.

 

    కాని యీ మధ్య ఆమెకు శాంతి లేదు. తరుచు వళ్ళు దహించుకుపోతున్నట్టు అనుభూతి పొందుతోంది. తనలో ఏదో పాపం ప్రవేశించినట్లూ, తనను ఏదో దావానలం క్రమ్మివేస్తున్నట్లూ ఉలికి ఉలికి పడుతోంది. భగవద్గీత చదువుతూంటే యిదివరకటి తన్మయత ఉండటంలేదు. భజన గీతాలు పాడుకుంటూంటే మునపటిలా గొంతు లేవటంలేదు. యీ ఆశక్తి తలుచుకుని ఆమె తరచు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. "కృష్ణయ్యా నన్నెందుకిలా అల్లరిపాలు చేస్తున్నావు? చప్పున ఆశ చూపించి మళ్ళీ యింతలోనే దూరంగా పారిపోతున్నావేం? నాతోనా నీ పరిహాసాలు? నావంటి అమాయకురాలిమీదనా నీ పరీక్షలు? దారి తెలియక అంధకారంలో నేను కొట్టుకుంటూంటే నువ్వు వేడుక చూస్తూ నవ్వుతున్నావా కృష్ణా! నన్ను హాయిగా నవ్వనియ్యి. హాయిగా నిలవనియ్యి. ఈ చిత్రవధనుండి, మాధ్యమిక దశనుండి విడదీసి పరాకాష్ఠ ప్రసాదించు" అని నిరంతరం వ్యధితురాలవుతూ ఉంటుంది.

 Previous Page Next Page