"నీకు ఎవరూ శత్రువులు లేరా?"
"లేకేం? ఉన్నారు."
"ఎవరు?"
"నేనే. నాకు నేనే శత్రువును. నేను ఈ భూమ్మీద సమస్తజీవరాసుల్ని ప్రేమిస్తాను. కాని నన్ను నేను ప్రేమించుకోలేక పోతున్నాను. నా ఉనికి అందరికీ ఆహ్లాదకరంగా లేదని తెలిసినప్పుడు. నేను మానవమాత్రురాలినే అని నా శరీరం, నా రక్తం అప్పుడప్పుడూ నాకు గుర్తు చేస్తున్నప్పుడు, నా మీద నాకు అపనమ్మకం కలిగినప్పుడు నన్ను నేను వంచించుకుంటున్నానన్న అపోహ నాకు ఏర్పడినప్పుడు, నేను సాధించలేనివి నాకు గుర్తువచ్చినప్పుడు, నా బలహీనతలు నా మీద తిరగబడినప్పుడు, నా భక్తిలో నాకే శంక జనించినప్పుడు నేనంటే నాకు అసహ్యం కలిగి, ఈ నా దుర్గుణాలన్నీ ఒక సమ్మేళనమై, ఒక సంపూర్ణ రూపమై, నూతన వేదితగా పెరిగినప్పుడూ ఆమెను నా శత్రువుగా పరిగణిస్తున్నాను ."
ఆమె సమాధానం విని సీత పులకితురాలయిపోయింది. "అక్కా! నీ ఆత్మ పరిశోధన చాలా గొప్పది. అది అందరికీ లభ్యమయ్యే సంపద కాదు" అంది పారవశ్యంతో.
"అది నాపట్ల నీకున్న అనురాగం అంతే, కీర్తించుకున్న వన్నీ నాలోని దుర్గుణాలే"
ఆకస్మికంగా సీత వీపుమీద ఎవరో చరిచినట్లయింది. తాను ఎందుకులా భ్రాంతిలో పడిపోతోంది? ఏమి చేయాలని వచ్చింది? ఏమిచేస్తోంది? ఎందుకు అసమర్థురాలిలా, బలహీనురాలిలా అయిపోతోంది? ఉహుఁ, తాను అధైర్య పడకూడదు. ఈ అవకాశం మళ్ళీ రాదు. తాను పాపిగా నిలిచిపోయినా తన భర్తకు అపకారం జరగకుండా చూసుకోవాలి.
"ప్రభూ! ఏ వేదితనైతే నీవు శిష్యురాలిగా స్వీకరించావో, ఏ మహనీయురాలినైతే నీవు సదా కాపాడుతున్నావో, ఆ మహాశక్తిని అంతమొందించటానికి నా చేతుల్లో తగిన బలం ప్రవేశపెట్టు, నన్ను పరమ కఠినురాలిగా, హంతకురాలిగా చెయ్యి. ఈ ఒక్క కోరికా చెల్లించు."
ఆమె చేతులు ఇంకా వేదిత భుజాలమీదే ఉన్నాయి. ఒక్కతోపు.... జీవం చాలటం లేదు.
"అక్కా! నీకు చావంటే భయంలేదా!" అన్నది అప్రయత్నంగా.
"ఉహుఁ. మనని గురించి మనకు తెలియకుండా చేసే దివ్యవరంఅంటే వెరుపు యెందుకు తల్లీ!"
"అది చనిపోయాక. కాని ముందు భయపడటం మానవ సహజంగా."
"అలా అని ప్రతిక్షణమూ మనం మరణాన్ని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటామా చెల్లీ! ముందేక్షణంలో ఏది జరుగుతుందో మనం చెప్పలేం కదా! ఇప్పుడు మనం ఈ కోనేటి గట్టున కూర్చుని ఉన్నాం. పట్టుతప్పి నేను నీటిలో పడిపోవచ్చు. లేకపోతే యేమీ అనుకోకు యిలా అంటున్నానని. నీకే ఏదయినా దుర్బుద్ధిపుట్టి నన్ను క్రిందకి తోసివేయవచ్చు. ఇలా మనం శంకిస్తూ కూర్చుంటే దీనికి అంతు ఎక్కడ చెల్లీ?"
సీతకు ఊపిరాడలేదు. ముఖం రక్తం లేకుండా పాలిపోయింది. ఆమె భుజాల మీది తన చేతులు చచ్చుపడినట్లు అయిపోయాయి.
"మీరు అన్నది నిజమే అయి, ఇక్కడ్నుంచి మిమ్మల్ని నీళ్ళలోకి తోసివేస్తే ఆ ఆఖరి క్షణాన ఏమనుకుంటారు?" అన్నది తడారిపోయిన గొంతుకతో
"ఏమనుకుంటారు! నీటిలో పడిపోయే ఆ చివరి క్షణాన నిన్ను శ్లాఘిస్తాను హృదిలో, ఇంత త్వరగా నాకు విముక్తి కలిగించినందుకు"
"ఒకవేళ నేనే పట్టుతప్పి కోనేటిలో పడిపోతే?"
"నేను కూడా నీ వెంటనే దూకి నిన్ను రక్షించటానికి ప్రయత్నిస్తాను. చేతకాకపోతే నీతోపాటు అశువులు విడుస్తాను.
సీత ఇహ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె విశాల నేత్రాల నుండి కన్నీళ్ళు జల జల రాలుతున్నాయి. గబుక్కున గట్టునుండి నేల మీదకి దూకి "అక్కా! త్వరగా దిగు క్రిందికి. పనివుంది" అంది ఉద్రేకంతో.
వేదిత క్రిందకి దిగి నిల్చుంటూ "ఏమిటమ్మా నీ ఆవేశం?" అంది వాత్సల్యంతో.
సీత చప్పున ముందుకు వొంగి ఆమె పాదాల్ని చేతుల్తో తాకి "నీ స్పర్శ మహత్తరమైనది. నీ ప్రభావం సోకితే పాపాత్ములు కూడా పుణ్యాత్ములవుతారు. నువ్వు సామాన్యురాలివి కాదు. నీ ఇష్టం లేకుండా నీకెవరూ అపకారం తలపెట్టలేరు. నువ్వు చిరకాలం జీవించాలని నా వాంఛ" అంది.
వేదిత ఆమె భుజాలను పట్టుకుని పైకి లేవనెత్తి, తన అక్కున చేర్చుకుని "నీ ప్రవర్తన నాకు అర్థం కాకపోయినా నీ సున్నిత మనస్తత్వం నా కెందుకో ఆనందదాయకంగా ఉంది" అంది ఆప్యాయతతో.
సీత ఆమె ముఖంకేసి చూసింది. సజీవమై, అందాలకు, నిలయమై అమాయకమై, నిష్కల్మషమై ఒప్పారుతున్న ఆమె ముఖం పాలభాగాన పవిత్ర జాహ్నవీ తరంగంలోని తుషార బిందువులవంటి స్వేద బిందువులూ, కనులు మిరుమిట్లు కొలిపే కాంతిపుంజం కనిపించింది ఆమె వాదన మండలంలో. ఆ నిముషాన సీతకు "అయ్యో, నా పతి ఎంత తుచ్చుడు? విషయలోలుడు? అనిపించింది.
ఆర్థ్రనేత్రాలతో "అక్కా! చాలాసేపయింది వచ్చి. ఇంక సెలవు తీసుకుంటాను" అంది.
"ఉండు. కాసిని ఫలాలు తీసుకుపోదువుగాని" అని వేదిత ఆమెను తీసుకుని ఇంట్లోకి వెళ్ళి రెండు మామిడి పండ్లూ, రెండు కమలాఫలాలూ చేతులోపెట్టి శిరస్సు నిమిరి అస్పష్టంగా ఏదో ఉచ్చరించింది. "అత్తయ్యగారికి నా నమస్కారాలు చెప్పు" అంది తర్వాత.
సీత సెలవు తీసుకుని బయల్దేరి ఇంటిముఖం పట్టింది.
ఇంచుమించు వారిరువురూ కలుసుకున్నప్పట్నించీ సీత వెన్నంటి వచ్చిన శేషశాయి ఆ పరిసరాలలో ఏ వృక్షం చాటునో పొంచి ఉన్నాడనీ, ఏ క్షణంలో వేదితకు హాని జరిగినా ముందుకు దూకి ఆమెను రక్షించే దృఢసంకల్పంతో సిద్ధంగా ఉన్నాడనీ, వేదిత భుజాలమీద సీత చేతులు బిగుసుకుంటున్నప్పుడు అక్కడ అతని నరాలు కూడా బిగుసుకుంటున్నాయనీ, సీత వెళ్ళిపోయాక కొద్ది క్షణాలు అక్కడే తచ్చాడి తర్వాత నెమ్మదిగా అతనుకూడా అక్కడ్నుంచి నిష్క్రమించాడనీ ఆ యిరువురిలో ఎవరికీ తెలియదు.